విజయవాడ

భోషాణం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూలు నుంచి వస్తూనే సుధాకర్ పరిగెత్తుకుంటూ నానమ్మ దగ్గరకు చేరాడు. వెళ్తూనే ‘నానమ్మా! మరే, భోషాణం అంటే ఏమిటి?’ అని అడిగాడు. ‘అందులో ఏమి ఉంటాయి?’ ప్రశ్నించాడు.
‘ఏమి? ఎందుకురా అలా అడిగావు’ అన్నది నాయనమ్మ.
‘ఏమీలేదు? ఈరోజు మాస్టారు మాకు ఒక కథ చెప్పారు. అందులో రాజుగారి ఖజానాలో భోషాణాలలో డబ్బులు, వస్తువులు, అన్నీ దాచి పెట్టేవారు అని చెప్పారు’ అందుకని. అది ఎలా ఉంటుంది? నువ్వు ఏమైనా చూశావేమో అని అడుగుతున్నాను’ అన్నాడు సుధాకర్.
‘ఓహో! అదా సంగతి. అవునురా! పూర్వం డబ్బులు, బంగారం దాచిపెట్టుకోటానికి ఇనప్పెట్టెలు, సామాను దాచిపెట్టుకోడానికి భోషాణాలు ఉండేవి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండేవిరా?’ చెప్పింది నాయనమ్మ.
‘మరి ఇప్పుడు అవి మనింట్లో లేవా?’ అడిగాడు.
‘లేవురా. మీనాన్నకే వాటి గురించి తెలియదు’ అన్నది నాయనమ్మ.
‘ఎందుకూ?’ అడిగాడు సుధాకర్.
‘ఎందుకంటే.. మనింట్లో లేవు కనుక’ అన్నది నాయనమ్మ.
‘అదే! మనింట్లో ఎందుకు లేవు? నీ చిన్నప్పుడు వున్నాయన్నావు గదా! అవి ఏమయ్యాయి?’ ప్రశ్నించాడు సుధాకర్.
‘మా చిన్నప్పుడు ఉండేదిరా? ఇప్పుడు లేదు’ అన్నది నాయనమ్మ.
‘ఓహో! సరే. అయితే భోషాణంలో ఏమేమి పెట్టేవారు?’ అని అడిగాడు సుధాకర్.
‘దాంట్లోనా? రోజూ వాడుకోని ఇత్తడి, రాగి సామానులు దాచిపెట్టుకునేవారు. దానిపైనేమో బట్టల పెట్టెలు, పరుపులు, దుప్పట్లు అలాంటివి అన్నీ పెట్టుకునేవారు. అంతేకాదురా! ఇంట్లో చుట్టాలు వస్తే పిల్లలు ఆ భోషాణం మీద పడుకునేవారు కూడా’ చెప్పింది నాయనమ్మ.
‘మరయితే బంగారం, డబ్బులు భోషాణంలో కాకుండా ఎక్కడ పెట్టుకునేవారు?’ అడిగాడు సుధాకర్.
‘బంగారం, డబ్బులు ఇనప్పెట్టెలో దాచుకునేవారు. ఎందుకంటే.. ఇనప్పెట్టె తాళాలు తియ్యాలంటే అందరికీ చేతకాదు. అందుకని విలువైనవి అందులో దాచిపెట్టుకునేవారు’ అన్నది నాయనమ్మ.
‘సరే! అయితే, మరి అవి ఇప్పుడెందుకు మనింట్లో లేవు?’ అన్నాడు సుధాకర్.
‘నాగరికత పెరిగిపోయి, ఫ్యాషన్లు ఎక్కువయి, అవన్నీ మోటయి పనికి రాకుండా పోయినాయి. వాటి స్థానంలో బీరువాలు వచ్చాయి నాయినా!’ చెప్పింది నాయనమ్మ.
‘మరి అవన్నీ ఇవాళ ఎక్కడ దాచిపెట్టుకుంటున్నారు?’ అడిగాడు సుధాకర్.
‘ఇవ్వాళా డబ్బులు బ్యాంకుల్లో, బంగారం బ్యాంకు లాకర్లలో దాచిపెట్టుకుంటున్నారు’ అన్నది నాయనమ్మ.
‘అలా ఎందుకు చేస్తున్నారు? మనవి మన ఇంట్లో బీరువాలోనే దాచిపెట్టుకోవచ్చుగా? అన్నాడు సుధాకర్.
‘ఎందుకంటే? మనం ఏదైనా ఊరికి వెళ్లామనుకో. ఇంటికి తాళం పెడతాము కనుక, దొంగతనాలు లాంటివి జరిగితే కష్టం కదా! అందుకు’ అన్నది నాయనమ్మ.
‘మరి మీ చిన్నప్పుడు దొంగతనాలు లేవా?’ అన్నాడు సుధాకర్.
‘ఉండేవి. కానీ ఇంత ఎక్కువగా ఉండేవికావు. అదీకాకుండా అప్పుడు ఇంట్లో నాయనమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయిలు, అత్తయ్యలు, మావలు, వాళ్ల పిల్లలు అందరూ చాలామంది ఉండేవారు. ఇప్పుడు ఇళ్లలో అంతమంది ఉండటం లేదుకదా! అందుకని ఎవరైనా ఊరికెళితే ఇంట్లో ఎవరో ఒకళ్లు ఉండేవాళ్లు. అప్పుడు అందరూ కలిసి భోషాణంలో వస్తువుల్లా కలిసి మెలిసి ఉమ్మడి కుటుంబాలు కదా!’ అన్నది నాయనమ్మ!
‘మరి! ఇప్పుడో? అన్నాడు సుధాకర్.
‘ఇప్పుడు అలా కాదుకదా నాన్నా. అమ్మా నాన్న, ఒకళ్లో ఇద్దరో పిల్లలు. అంతేకదా! పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందుకని భయాలు తక్కువ. ప్రేమలు ఎక్కువ’ అన్నది.
‘ఇప్పుడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఎవ్వరూ ఉండటం లేదు కదా! ఎక్కడికయినా వెళితే అందరూ కలిసి వెళతారు. ఇల్లు తాళం పెడితే భయం. అందుకని అలా బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటున్నారు’ వివరించింది నాయనమ్మ.
‘ఓహో.. అలాగా! అందరూ కలిసి ఉంటే ఎన్ని లాభాలో! అందరూ కలిసి ఆడుకోవచ్చు, ఎంత బాగుంటుందో అలావుంటే కదా, నాయనమ్మా!’ అన్నాడు సుధాకర్.
‘అవును నాన్నా! భోషాణం అంటే అన్నీ దాచుకునే పెట్టె. అలానే అందరూ కలిసిమెలిసి కలివిడిగా ఉండే ఉమ్మడి కుటుంబం కూడా ఒక భోషాణం లాంటిదే. అందరూ కలిసిమెలిసి కష్టసుఖాలు కలబోసి పంచుకునే అందమైన కుటుంబం. భోషాణం అంటే అర్థమైందా?’ అడిగింది నాయనమ్మ.
‘ఆఁ! ఇక నుంచి మనం అందరం కలిసి ఉందాం నాయనమ్మా’ అన్నాడు సుధాకర్. అన్ని వస్తువులని ఒకచోట కలిపేది భోషాణం అయితే అందరినీ ఒకచోట కలిపేది మన ఇల్లు కదా!’ అంటూ తనకు తోచిన అర్థం చెప్పాడు సుధాకర్.

- డా. మైలవరపు లలితకుమారి,
గుంటూరు.
చరవాణి : 9959510422

చిన్నకథ

ఎవరు ఉత్తముడు?
దాశరథీ నాయుడికి ముగ్గురు కొడుకులు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి వెళ్లిపోయింది గృహలక్ష్మి.
పెద్దాడికి అసూయ ఎక్కువ. ముఖంలో నవ్వు కనిపించదు. ‘మీ ఆస్తి వద్దు. మీ బాధ్యత నాదికాదు. నా అవసరం వచ్చినప్పుడు తెలియపరిస్తే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తాను పెద్దకొడుగ్గా’.. అన్నాడు. అయోధ్యనగర్‌లో ఇల్లు కట్టుకుని ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. రెండోవాడు శివం. దైవభక్తి ఎక్కువే. ఏడాదిలో పది నెలలు ఏ కొండమీదో అన్నవితరణ చేస్తూ, తానూ అదే భుజిస్తూ భార్యాపిల్లల బాధ్యతని తండ్రికి వదిలేసి దేశదిమ్మరిలా తిరుగుతుంటాడు. ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు వచ్చేలా, (ఒక ఫ్రెండ్‌కి తన సెల్ నంబరిచ్చి) కోలుకున్నాక మళ్లీ మాయవౌతుంటాడు. ఇక మూడోవాడికి ఒక్కడే కొడుకు. బిజినెస్ మేన్. లక్షల్లో ఆదాయం. ‘నన్ను చూడాలని వున్నప్పుడు ఫోన్ చెయ్యండి’ అన్నాడు. ‘నాకు వాడిని చూడాలని వున్నప్పుడు ఫోన్ చెయ్యాలట. వాడికి నన్ను చూడాలని అనిపించదా? వాడు అమ్మకూచి. చిన్నప్పటి నుంచి తల్లిచాటు బిడ్డ. ఇప్పుడు పెళ్లాం చాటు మొగుడైపోయాడు’ అనుకున్నాడు దాశరథీ నాయుడు. ఫ్రెండ్ ఫోనందుకుని వచ్చాడు రెండోవాడు శివుడు. తండ్రి అనారోగ్యం చూసి ఆందోళనపడ్డాడు. ‘నన్ను విడిచి ఇక వెళ్లకురా’.. అని వేడుకున్న తండ్రి వేదన కరిగించింది. అన్ని వైద్య పరీక్షలు చేయించి తండ్రిని కనిపెట్టుకుని ఉన్నాడు. ‘నేను కోలుకుంటే ఈ వెధవ మళ్లీ మాయమైపోతాడు. నా అనారోగ్యం కంటిన్యూ కావాల’ని దాశరధిగారి కోరిక! ‘నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో!’ అంటూ పాతిక వేలు అన్నగారి చేతికిచ్చి తండ్రిని పలకరించి వెళ్లిపోయాడు మూడోవాడు. ‘నాకు ఓదార్పులు, పలకరింపులు తెలియవు. నా బదులు కూడా నువ్వే ఆ పని చెయ్యి’ భార్యకు చెప్పాడు పెద్దకొడుకు. వారానికోసారి పిల్లల్ని తీసుకుని మామగారిని చూసి వస్తుంది. మామగారి పెన్షన్ రూ. 10వేలతో ఇల్లు నడుపుతూ ఇద్దరు కూతుళ్లతో వుంటుంది సుమిత్ర. ‘మీరిద్దరూ ధన్యులు. మామగారికి సేవ చేస్తూ నువ్వూ, శివుడూ’ అంటుంది పెద్దకోడలు లక్ష్మి.
- కొత్తపల్లి రాంప్రసాద్, కైకలూరు, కృష్ణా జిల్లా.

పుస్తక సమీక్ష

నానీలపై సాధికార విమర్శనా గ్రంథం

అత్యాధునిక కవితా రూప ప్రక్రియ.. నానీ!
ప్రతులకు:
అనేక ప్రగతిశీల పుస్తక కేంద్రం,
30-5-26/1, డా. నానయ్య హాస్పిటల్,
కోకా చలపతిరావు వీధి, ఏలూరు రోడ్,
విజయవాడ - 520002.
విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని బ్రాంచీలు

‘నా మనసులో మాట నుండి కృతజ్ఞతల వరకు’ చదివితే ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యుడుగా ఎదిగేందుకు కావలసిన శక్తిని ఎలా ప్రోది చేసుకున్నారో తెలుస్తుంది. చిన్న మర్రి విత్తనం చూసి ఇదేమిటనుకుంటే మొలకెత్తి దాని విశ్వరూపం చూపించినట్లు వామనావతారంలో వామన రూపం చూపించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించినట్లు, ధృవుని వలె పట్టుదలతో విష్ణువుని స్తుతించి వరాలు పొందినట్లు, ఉదయపు సూర్యునిలా వున్న చలపాక ప్రకాష్ గారు మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశించటానికి కారణం ఓర్పుతో, పట్టుదలతో సాగించిన సాహితీ ప్రయాణమని చెప్పక తప్పదు. అన్నం ఉడుకుతుంటే ఒక్క మెతుకు పట్టుకుని ఉడికిందో, లేదో చెప్తారు. అలాగే ఈయన సాహితీ ప్రయాణంలో తారసపడిన ప్రతివ్యక్తి వ్యక్తిత్వాన్ని గమనిస్తే జీవితానికి ఈయన ఒక మైలురాయి వంటివారే. ఎదగడానికి సహకరించి, అలా ప్రయాణించి ఒక గమ్యానికి చేరారు. కాసేపు విశ్రాంతి, మరలా ప్రయాణం సాగించవలసి ఉంది. ఇది చిరు గమ్యమే. ఇంకా గొప్పగొప్ప గమ్యాలు చేరవలసిన వయసు, పట్టుదల ఉన్న రచయిత చలపాక ప్రకాష్ గారు. చీకటిలో ఏమీ కనిపించవు. కానీ సూర్యకాంతి పడగానే ప్రకాశిస్తుంది. ఈమధ్యకాలంలో సృష్టించిన ‘నానీ’ల ప్రక్రియను చాలామంది కవులు అనుసరించారు. పుస్తకాలు ప్రచురించారు. కానీ వాటి సొగసులను ‘నానీ’ సృష్టికర్త గోపీగారికి కూడా తెలియనంతగా ఉన్నట్లు నిరూపించారు. చలపాక ప్రకాష్ గారు ఒక ఎంఫిల్ విద్యార్థో, పిహెచ్‌డి విద్యార్థో చేసినంతగా తులనాత్మక పరిశోధన చేశారు. దీన్ని వ్యాసం అనటం కంటే పరిశోధనాత్మక గ్రంథం అనవచ్చని నా భావన. నానీలతో 1998 నుండి ప్రచురణ పొందిన 157 పుస్తకాలను, 10 విమర్శనా గ్రంథాలు, రెండు నానీల సంకలనాలు, రెండు అనుబంధ నానీల పుస్తకాలు పరిశీలించి నానీల క్షీరసాగరాన్ని మేధామథనంతో చిలికి పుట్టించిన నవనీతమే ఈ ‘పరిశోధనాత్మక వ్యాసం’. ఈ పుస్తకం ముద్రణా సమయంలో 2014 వరకు దొరికిన 61 పుస్తకాలను పరిశీలించి, పరిశోధించి సమగ్ర వ్యాసం ప్రచురించిన ప్రకాష్ గారు అభినందనీయులు.
నానీల గురించి రాయాలంటే ముందుగా కవిత్వం గురించి చెప్పాలి. ఆంధ్ర సాహిత్య సీమలో వెలుగులు పంచింది పద్యమే. తరువాత గద్యం. నాటకం, నవల, నవలిక, నాటిక, వచన కవిత, గేయం, మినీ కవిత, హైకూ, నానీ, నానో, చిట్టీలు, తాతేలు, ఇలా చాలా ప్రక్రియలు ఈమధ్య, తరువాత కాలంలో వెలుగులోకి వచ్చినవి. కొన్ని మిణుకుమిణుకు మంటున్నాయి. కొన్ని వెనె్నల పంచుతున్నాయి. మినీ కవితల సృష్టికర్త డా. రావి రంగారావు గారు వారి కవితలో మినీ భావాలుండాలని, ఉంటాయని చెప్పి రాసి చూపించారు. మినీ కవితా సంపుటాలు కూడా చాలానే వచ్చాయి. నానీల సృష్టికర్త గోపీ గారు నానీల నాన్నగా ప్రసిద్ధులు. ‘మినీ కవితా ఉద్యమమే హైకూలు, నానీలకు ప్రాణం పోసిందన్నారు’ రచయిత. మినీ కవితకు ముఖ్యమైనది శీర్షిక. శీర్షిక చూస్తేనే కవిత బాగా అర్థమవుతుంది. చిన్న కవితలకు సాంద్రత ముఖ్యం. 1998 నుంచి ప్రచురితమైన పుస్తకాలు పోగు చేసుకొని, శ్రమించి వాటిలోని అంతఃసౌందర్యాన్ని గమనించి, ఆయా పుస్తకాలకు ముందుమాట రాసిన గోపీగారి భావనను అనుసరించి కొన్ని భాగాలుగా చేశారు. నానీ ప్రక్రియ నిర్మాణం, కొనసాగింపు, అనుబంధ నానీలు, నానీలలోని వస్తు వైవిధ్యం, ఏకవస్తు నానీలు, నానీల వినూత్న ప్రయోగాలు, వివిధ భాషల్లోకి అనువాదమైన నానీలు, నానీలపై కార్టూన్లు, అసెంబ్లీ నానీలు, సూక్తులు, సుభాషితాలు, హాస్యం, వ్యంగ్యం, చమత్కారం, నానీ పుస్తక సమీక్షలు, నానీల విమర్శా గ్రంథాలు, నానీలపై జనవాక్యాలు, వాదోపవాదాలు, అవార్డులు, అభిప్రాయాలు, స్ఫూర్తినిచ్చిన నానీలు.. ఇలా విభజించి ఒక్కో అంశాన్ని విపులీకరించి రాశారు ప్రకాష్ గారు. పూర్వరంగంలో భావ కవిత్వం, దానిమీద తిరుగుబాటు, అభ్యుదయ కవిత్వం, సాహిత్య వికాసం, వచన కవిత్వ వికాసం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, మినీ కవిత్వం, స్ర్తివాద కవిత్వం, దళితవాద కవిత్వం, మైనార్టీ కవిత్వం, హైకూ.. వీటిని వివరించారు. వీటి తరువాత వచ్చినదే ‘నానీ’. ఇది అత్యాధునిక ప్రక్రియ. దీని పుట్టుకకు కారణంగా వెంపల్లి శివప్రసాద్ గారు ‘్భవ వ్యక్తీకరణకు స్వేచ్ఛావాదికి హైకూల అక్షరనియతి అడ్డొచ్చిందనో ఏమో డా. గోపీ గారు ఈ నానీలకు ప్రాణం పోశారు’ అని అన్నారు. నానీల రూపశిల్పి నానీల్లో నాలుగు పాదాల నియమం పెట్టారు. ఇందులో మొదటి రెండు పాదాల్లో ఒక భావాంశం, చివరి రెండు పాదాల్లో మరో భావాంశం ఉంటాయి. మొదటిదానికి రెండోది సమర్థన. వేమన పద్యాల్లో కూడా ఇలాగే కనుపిస్తుంది. మొదట నానీ గోపీ గారి సంపుటిలో ప్రారంభమైంది. ఉదయ సూర్యకాంతిలా ప్రారంభమై నేడు మధ్యాహ్న సూర్యకాంతిలా ప్రసరిస్తోంది. ఈ ప్రక్రియ పాతతరం, కొత్తతరం అని తేడాలేకుండా అందరినీ ఆకర్షించి రచనకు ఉపక్రమింపచేసింది. ముందుగా వస్తువైవిధ్య నానీల గురించి చెప్పుకుందాం. ‘కవిత్వం/ చిరాయువంటావా/ దానికి కాలమే/ జీవనాడి కదా’! ఏ కవిత్వమైనా పాఠకుల స్పందనతోనే చిరాయువుగా నిలుస్తుంది. పాఠక స్పందన లేకపోతే జీర్ణాయువౌతుంది కదా! ‘నీవు తింటే/ నా కడుపు నిండుతుంది/ మాట్లాడితే/ నావౌనం పండుతుంది’! ఎదుటివాడి తృప్తితో తన కడుపునింపుకుంటాడు అనే భావన దయకు నిదర్శనంగా కనుపిస్తుంది. ‘వాస్తు చూడక/ పనిచేసుకుపో/ ఈ దేశమంతా/ అస్తవ్యస్తమే’! వాస్తు అనేది సంప్రదాయం. కాని ఇక్కడ ప్రాధాన్యతనివ్వాల్సింది పనికని చెప్పటమే కవి ఉద్దేశ్యం.
ఏకవస్తు నానీలు: ‘ఉన్నంతకాలం/ కలిసే ఉన్న/ లేనప్పుడే కదా/ వాటా అడుగుతున్న’! తెలంగాణా ఉద్యమకాలంలోది ఈ నానీ. ‘బువ్వకుండలు/ మూలన కూర్చున్నై/ గుండె కుండలు/ పాలులేకనే మండుతున్నాయి’! పేదవాడి బతుకు వ్యధను తెలియచేస్తుంది. ‘సింహాసనం/ గొప్పదే/ జనం మీదకు/ సింహంలా దూకనంతవరకు’! పదవి వ్యామోహం ప్రజలను పీడించనంతవరకు మంచిదే అనే అర్థం కనుపిస్తుంది. నానీ కవియిత్రులు ‘పిల్లలంతా/ అమ్మ కనుపాపలే/ పెద్దయినాక/ కంటిలో నలుసు ఆమె’! కనుపాపల్లా పెంచిన తల్లిని నిర్లక్ష్యం చేసే బిడ్డల గురించి ‘అమ్మ పోయింది/ నిజమే/ అమ్మతనం మాత్రం/ అనంతంగా వ్యాపించింది’! అమ్మకు మరణం ఉంటుంది కానీ, అమ్మతనానికి లేదనే సత్యం చెప్పారు.
నానీల్లో వ్యంగ్యం, చమత్కారం, హాస్యం చూద్దాం.
‘పంపులో/ నీళ్లు లేవేంటి/ సూర్యుడి దాహానికి/ సరిపోలేదేమో’! నీటి కష్టాలను వ్యంగ్యంగా చెప్పారు. ‘పచ్చిదొంగ/ వర్షం/ రెండు చినుకులు రాల్చి/ బిడాయించింది’! కురవని వర్షాన్ని దొంగగా చెప్పి హాస్యం మిళితం చేశారు కవి. ‘హాస్యానికా/ అపహాస్యానికా/ మాట ఈటెలా/ మనసులో నాటావ్’! హాస్యానికి, అపహాస్యానికి సంబంధం చమత్కారంగా చూపారు.
కొన్ని మాస, త్రైమాసిక పత్రికలలో నానీలు ప్రచురించి కవుల్ని బాగా ప్రోత్సహించారు. అంతేకాదు,నానీలపై వ్యాసాలు ప్రచురించారు. వివిధ పత్రికల్లో వ్యాసాల్లో నానీలు ప్రస్తావన తెచ్చారు పెద్ద కవులు. చాలామంది కవులు, రచయితలకు నానీలపై నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటిని కూడా చలపాక స్వీకరించారు. ఇలా ‘నానీ’కి సంబంధించిన ప్రతిదానినీ సమగ్రంగా పరిశీలించి, పరిశోధించి ఈ వ్యాసం ప్రచురించారు కవి, రచయిత, సంపాదకుడైన చలపాక ప్రకాష్ గారు. ప్రతిదీ చెప్పటం కంటే పుస్తకం చదివితే ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ పుస్తకం పరిశోధనాసక్తి వున్నవారికి మార్గం సుగమం చేస్తుందనటంలో అతిశయోక్తి లేదు. విస్తర భీతితో ఆపుతున్నానే కానీ, ఈ యువ రచయిత మరెన్నో సమగ్ర వ్యాసాలు రాయాలని, రాస్తారని ఆశిస్తూ..!

ఎం సీతారామమ్మ,
విజయవాడ.
చరవాణి : 9299303035

మనోగీతికలు ..

చేదు నిజం
కన్నుల్లో
వెనె్నల్లా విరిసిన ప్రేమ
చిరునవ్వులో
పూలవానలా కురిసే అనురాగం
మాటల్లో
మైమరపించి మత్తెక్కించే మాధుర్యం
ఇవన్నీ నాకోసమే!
అదృష్టం అంతా నాదే!
ఊహల్లో విహరించాను
పగటికలలే కన్నాను
భ్రమలో పడిపోయాను
వాస్తవంలో..
నా సొంతమనుకున్నవన్నీ
పలువురికి పంచగలవని
కనె్నమనసుల్ని మభ్యపెట్టగలవని
చేదునిజాన్ని
ఆలస్యంగానైనా
తెలుసుకున్నాను!

శాంతిశ్రీ బెనర్జీ,
కొత్త ఢిల్లీ.
చరవాణి : 9871989360

శ్రీమతినైన తత్‌క్షణమె..
ఉ. శ్రీమతినైన తత్‌క్షణమె-చెప్పగరాని యమోఘ శక్తి తే
జోమయవౌ ముఖద్యుతి ర-జోగుణ సంయుత చాకచక్య మెం
తో మృదువైన హార్దికత-ఉల్లము ఝల్లని గెంతునట్లు ఏ
దోమ హదుద్భుతమ్మగు ప-దోన్నతి యట్లనుభూతి గల్గెడిన్

ఉ. నిన్నటిదాక అమ్మకడనే నిదురించిన నేను నేడెదో
యున్నటులుండి నా మగనియొద్ద పరుండుటదేమి వింత ప్ర
చ్ఛన్న శరీర సంపదను-సాంతముగా విశదీకరించి నే
నెన్నక అన్యమానవుని-కిచ్చుట ఎంత విచిత్రమో గదా!

శా. ఏసూదంటు శిలాప్రభావమొననున్ ఎంతో విచిత్రమ్ముగా
మోసల్‌సేయుచు లాగుచున్నదిక దం-్భళీ సమానాశు గ
త్రాసత్రాణ మొనర్చువారెవరు చే-తశ్శాంతి జేకూర్చు పుం
వ్యాసంగమొక్కటే శరణ్యమిక మా-వారొక్కరే రావలెన్
శా. మా సంయోగ శుభక్షణమ్ముకయి ప్రామాణ్యం పుపౌరోహితున్
ప్రాసంగించగ పోయిరావలయు నె-వ్వారెట్లు భావించినన్
ఈ సంతాపము ఆరదించుకయు నే-డే మా నిషేకోత్స వో
ల్లాసార్ధమ్ము ముహూర్తముంచమని సంప్రార్థించగానేగెదన్

ఉ. సిగ్గుపడంగనేల నొక-జీవుడు దేవుని సంగమించగా
దగ్గఱజేరు వేళకయి-తత్పరతన్ శ్రమియించకున్న రుూ
అగ్గి శమించుటెట్లు తను-వంతయు హాయిని బొందుటెట్లు ఏ
ఎగ్గును లెక్కసేయను మ-దేయునితో గలియంగనేగెదన్!
(ఇటీవల దివంగతులైన ఈ కవికి ‘మెరుపు’ నివాళి)

- డా. మాదిరాజు రామసుందర్రావు,
విజయవాడ.
చరవాణి : 9441026360

జీవితం
ఆశల అవనిలో
ఆశయాల ఆకాశంలో
మెరిసే కిరణం
కురిసే వర్షం
పూసే పువ్వులు
విరిసే నవ్వులు
కదిలే నయనాల్లో
మెదిలే స్వప్నాల్లో
మధురమైన మాటల్లో
వౌనవౌతున్న భావాల్లో
వినోదమై సాగాలని
విహంగమై ఎగరాలని
కోకిలమ్మ గీతం
వసంతాల సంగీతం
కమనీయ కాంతులై
మమతల మల్లెలై
రసరమ్య రాగాలై
ప్రేమానురాగాలై
అందాల హరివిల్లై
ఆనందాల పొదరిల్లై
సెలయేటి పాటలా
సుగంధాల తోటలా
స్వచ్ఛమై మెలిగే
సత్యమై వెలిగే
పరిమళించే
సుగంధాల పుష్పం
జీవితం!

- బత్తుల బ్రహ్మయ్య
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
చరవాణి : 8885351472

నయనం
జన్మనిచ్చిన తల్లినైనా
నడక నేర్పే తండ్రినైనా
చదువుచెప్పే గురువునైనా
సూర్యోదయాన్నైనా
సూర్యాస్తమయాన్నైనా
పండు వెనె్నలనైనా
పారే సెలయేళ్లనైనా
కుహూకుహూ రాగాల కోయిలనైనా
పురివిప్పి నాట్యమాడే నెమళ్లనైనా
సప్తవర్ణాలనైనా
అందమైన హరివిల్లునైనా
దేవుడ్ని దర్శించాలన్నా
ప్రకృతిలోని అందాలను
తిలకించాలన్నా
అంతెందుకు.. మనల్ని మనం
అద్దంలో చూసుకోవాలన్నా
మనిషికి ప్రధానం నేత్రం
అందుకే పెద్దలంటుంటారు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం!
కనే్నకదాని నిర్లక్ష్యం చేస్తే
అంధకారంలో జీవిస్తారు
తస్మాత్.. జాగ్రత్త!

యేటూరి మురళీకృష్ణకుమార్,
విజయవాడ.
చరవాణి : 8374151566

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

email: merupuvj@andhrabhoomi.net

- డా. మైలవరపు లలితకుమారి