విజయవాడ

దుర్ముఖీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భానుడి భగభగల నడుమ
‘దుర్ముఖి’ ఆగమనం
నేనెళ్లొస్తానంటూ ‘మన్మథ’ పయనం
కొమ్మకొమ్మలో నవజీవన శోభ
పువ్వుపువ్వులో అంతులేని సౌకుమార్యం
పచ్చచీర కట్టుకున్న పల్లెలో
అరముద్దుల తొలిపొద్దుల కవ్వింత
చైత్రమాస మొస్తుందంటేనే
ఏదో తెలియని పులకరింత
గ్లోబలైజేషన్ తాకిడికి
కానరాని వసంత శోభ
అయినా తన ఉనికిని
కాపాడుకునేందుకు ఉగాది ఆబ
చెట్లు చిగురించకున్నా ఆశల చిగుళ్లు ఆగవు కదా
కోయిల కుహూరవాల బదులు
కర్మాగారాల మోతలు
ఎలక్ట్రానిక్ పరికరాల కూతలు
మధుమాసం ఉనికేమో గాని
ఏడాదంతా మధువుల మాసమే
మామిడి తోరణాలకు కొదవున్నా
కాముడి వికృత వికటాట్టహాసాలకు
కొరత లేదు
షడ్రుచుల ఉగాది పచ్చడిలో
రసాయనాల కంపునే నింపుతున్నాం కదా
పంచభూతాలను పరిహసిస్తూ
భావితరాలకు ఉషస్సు లేకుండా చేస్తున్నా
ఏటేటా ఉగాదులు వస్తూనే ఉన్నాయ్
ప్రకృతి శోభను గుర్తుకు తెస్తూనే ఉన్నాయ్
దారితప్పిన మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాయ్
ఆంధ్రావనిలో కనిపించే ఉగాది సంబరాలు
సంస్కృతీ, సంప్రదాయాల పట్టుగొమ్మలు
కర్షక సోదరుల పాలిట కాంతిరేకలు
మరిపించి, మురిపించే
మన ప్రాచీన స్మృతులు
ఆవరించిన అంధకారం అంతమవ్వాలి
చుట్టుముట్టిన నిశిరాతిరిలో
వెలుగు నింపాలి
పచ్చపచ్చని చెట్లతో
ప్రపంచం హరితమవ్వాలి
విశ్వమంతా శాంతికుసుమం
వెల్లివిరియాలి
దుర్ముఖి నామం చెడు తలంపులకు
దుర్బేధ్యమవ్వాలి
అణగారిన వర్గాలకు అభయమివ్వాలి
ఆడపడుచుల రక్షణలో అజేయమవ్వాలి
దుర్ముఖి ఉగాదిలో రావాలి నవచైతన్యం
శ్రమైక జీవనమే మానవాళికి శరణ్యం
ప్రకృతిమాత చూపించాలి
మనపై కారుణ్యం

- మద్ది పుల్లారావు, నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి: 9951287113

మన ఉగాది

బ్రహ్మ సృష్టికి ప్రభవ దినం
వసంతుని వలపు కాలంలో
కొత్త చిగురుల గాలానికి
చిక్కిన పరువపు కోయిలమ్మల
గండు మేళాల నిండు ఉగాది

ఉత్తర, దక్షిణాయనాల
సంగమ ‘యు(క్)గా’ది
తైలాభ్యంగన స్నానాల తరుణమిది
కొత్త పనుల ఆరంభానికి తగునది
పురాణ శ్రవణ,
పుణ్యకార్యాల విధి ఈ ఉగాది

నక్షత్ర గమన పునాది
‘చేదు’ అనుభవాల ‘తీపి’ జ్ఞాపకాల
పులకరింతల ‘పులుపు’ చిలకరించే ‘ఉప్పు’
వికారాల సాకారపు ‘వగరుల’
షడ్రుచుల సమ్మేళనపు
చప్పరింతకు నాందియైన ఉగాది

పూర్ణకుంభ దానాల సన్నిధియై
మరాఠీల గుడిపడ్వా
తమిళుల పుత్తాండు
మలయాళుల విష్ణు
సిక్కుల వైశాఖీ
బెంగాలీల పొయేలా బెశాఖ్
వివిధ పేర్లతో పిలుస్తున్న
పనె్నండు నెలల ఏడాదికి
పురుడు పోసుకున్న అచ్చతెలుగు ఉగాది!

- పెరుగుపల్లి బలరామ్,
గుంటూరు.
9676636816

దుర్ముఖినామ వసంతమా..!

జరిగే కాలపు ఆవర్తనముతో
కదిలే సమయపు ఆగమనమున
మూడు పదుల ముప్పది సంఖ్యన
దుర్ముఖినామ వసంతమా
అధిష్టింపుము నీ సింహాసనమున
నీ నామం అలా వున్నా
నీ ముఖం ఎలా వున్నా
నీ మనస్సునుంచుము మల్లెలమాలగా
మనోగతం సంపెంగల సౌరభంలా
చల్లని చూపుల గంధం పరిమళం
చైత్రశుద్ధ పాడ్యమినాడు
నూతన సమయం నీ ఆగమనం
ఋతు ధర్మాలను సమతూకాన
అనునయమును ఆరాధనగా
నాట్యము చేయుచు ఆమని వచ్చె
అరువదేండ్లకు ఒక్కమారున
ఆగమనాన జీవకోటిని
అభయహస్తమున ఆదుకొనుము
మంచి మనసు ప్రాబల్యమున
సమయపాలున వృష్ట్ధిరలను
పంటశిరులను పంచిపెట్టుము
పాడి పసరముల నాదరింపుము
మధురమైనదా ఆశల పాశం
వసంతకాలం దేవుని రూపం
ఆరు ఋతువుల రాణివసంతం
వసంత శోభతో చైత్ర దర్శనం
శిశిరం తరలె ఆకులు రాలె
వసంతమొచ్చె చివురులు పూచె
ధరణి పులకించె వసంత శోభతొ
మానులు మొక్కలు లేత చివురులు
కువకువ స్వరముల పక్షిజాతుల
చివురులు మరిగిన కోయిల కూతలు
కొంటె పిల్లల అనుకర స్వరములు
రెచ్చిపోయిన చిన్నారి కోయిల
తెగబడి, కూసెను తెంపరితనమున
అందరి నవ్వులు ఆనందముగా
పర్వదినమున ప్రకృతి శోభ
నూతన ఉగాది ఆచరణాలు
పరువపు శిరుల కనె్నపిల్లలు
అంది పుచ్చుకునే అలంకరణలు
ఆరు రుచులతో ఉగాది పచ్చడి
పంచాంగాన రాశిఫలములు
మెరుపు రంగుల కుసుమ జాతులు
స్వాగత ప్రియమున సుగంధ సమీరం
తుమ్మెద దాడుల తుంబుర నాదం
తెల్లని తనువున మల్లె సుగంధం
జీవుల జిహ్వకు ప్రకృతి వరము
మామిడి పిందెల వగరు పులుపున
వేప పువ్వుల చేదు మధురము
నూతన కాలపు వనరుల సొబగులు
సంబాళింపుము సన్మార్గాన
పాడ్యము నుండి నవము వరకును
వసంత దినములు నడయాడంగా
సస్యశ్యామల పాడిపంటలు
ఆపాదించుము అవని జనులకు
అరువది వసంతాల తెలుగు ఆమనీ
అనుకూలించుము ఆశల వరములు
రా! రమ్ము! నవ చైతన్యమున
నవ్య చరితమును అందలంబున
నీ చల్లని చూపుల దీవెనలకై
ఎదురుచూడును కోటిప్రాణులు
తెలుగు సంవత్సరాల సహోదరీ
దుర్ముఖినామ నవ్య ఉగాదీ
స్వాగతమూ సుస్వాగతమూ!

- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. స్థిరవాణి : 08654-224726

నవ ఉగాదికి శుభోదయం
సకాలంలో చినుకు రాలక
చినుకుల్లేక పంటలు పండక
కర్షకుడు కష్టాల పాలయ్యాడు!
గొంతు తడుపుకునేందుకు
చుక్కనీరు లేక
‘పానీ’పట్టు యుద్ధాలకు
సిద్ధవౌతున్నారు జనాలు!
ఒకవైపు కరవు కాటకం
మరోవైపు భానుడి ప్రతాపం
ఇంకోవైపు ఆకాశాన్నంటే ధరలు
వీటితో భీతిల్లుచున్నారు జనాలు
జయజయధ్వానాలతో
వచ్చి వెళ్తున్న విజయమ్మా..
అరవయ్యేళ్లకు మళ్లీ వచ్చేప్పుడు
శాంతి, సౌఖ్యాలతో రావాలి సుమా!
అందాకా సెలవందుకో మరి
ఉదయభానుని వోలె
ఉదయించే నవ ఉగాదీ..
స్వార్థంతో నిండిన
మానవతా విలువలు మరచిన
దానవ మానవ మనసుల
స్వరూప స్వభావాలను మార్చి
కులమత దురహంకారాలను హతమార్చి
శాంతిసుమాలను వికసింపచేసేందుకు
దుఃఖాలను తుదముట్టించి
విజయదుందుభి మోగిస్తూ
అరుదెంచుతున్న ‘దుర్మిఖి‘ నామ వత్సరమా!
నీకిదే మా శుభాహ్వానం
అందుకో మా శుభోదయ శుభకామనం!

- ఆళ్ల నాగేశ్వరరావు,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 7416638823

దుర్ముఖీ.. ఇమ్ము సన్మతి!

అవినీతి మానుడీయంచు మావిచివుళ్లు
ఆగ్రహావేశాన అరుణమయ్యె
తప్పుడు కూతల నొప్పుకొననటంచు
కీరాలు కారాలు నూరుచుండె
రాని రాగాలు వలదిటుపైని నటంచు
కోకిలమ్ములపిండు కూయుచుండె
మనసులో స్వచ్ఛత మచ్చుకు లేదంచు
పరిహసించుచునుండె పడతిమల్లె
పండిపోయిన ఛాదన మెండిరాలి
పనికిమాలిన వారిని పంపుడనియె
క్రొత్త ఛదనాల కుజములు కొమరుమిగిలి
యువతకాహ్వాన పత్రాల నొసగుచుండె

వేపపువ్వేమనె? విమల సత్యమ్మునే
చేకొన మనసార చేదుయనియె
బెల్లమేమని చెప్పె? కల్లలె పల్కుచో
అమృతమ్ము కంటె నాహ్లాదమనియె
చింతయేమని పల్కె? శీల సద్గుణముల
చింతయే పూర్తి నిషిద్ధమనియె
లవణమేమని వాగె? అవలక్షణమ్ములే
అసలైన వృద్ధికి పొసగు ననియె
కారమును మరి మామిడి కసరులనియె
ఘన రజస్తమస్సులె కూర్చుకాసులనియె
ఈ విలోమ సంస్కృతి హెచ్చెనిపుడు, ప్రోత్స
హించకే దుర్ముఖీ! యిట్టి హీనగుణము

- కలవకొలను సూర్యనారాయణ,
గుంటూరు.
చరవాణి : 9849268659

ఏమన్నది?
ఏమన్నది?

గున్నమావిపై విరిసిన
కొసరు చిగురు ఏమన్నది?
తెలుగుదనము, బిగువు, తెగువ
ఎరుపై మెరవాలన్నది!

కుహుకుహు రాగాలొలికే
ఎలకోయిల ఏమన్నది?
తెలుగువారు ప్రగతి గీతి
కలనిటు పాడాలన్నది!

కడు పసందు చిందించే
రసాలమ్ము ఏమన్నది?
తెలుగుభాష తియ్యదనము
ఇట్టులె వెలగాలన్నది!

సుమములందు వెల్లివిరియు
సుగంధమ్ములేమన్నవి?
మానవతా గంధమిటుల
మంచిగ వెలయాలన్నవి!

పంచాంగం జాతకాల
ఫలశ్రవణమేమన్నది?
నవ్యాంధ్రుల రాజధాని
నవనవలాడాలన్నది!

పండుకొరుకు చిలక చెవుల
పండువగా ఏమన్నది?
పుష్కరాల కృష్ణాశ్రీ
మనకిక పుష్కలమన్నది

అలరులపై జుంజుమ్మని
మ్రోగెడు అళులేమన్నవి?
‘దుర్ముఖి’యును కృషితో
జయ ‘దుందుభి’ నిశ్చయమన్నది!
- రామడుగు వేంకటేశ్వర శర్మ,
గుంటూరు.
9866944287