విజయవాడ

ఒక చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్రానికి చైతన్యం వచ్చినట్లు
వసంతంలో ఉగాది రాకతో
వనాలన్నీ పచ్చదనంతో పరవశమై
గున్నమావి లేత చిగుళ్లు గడపలకు తోరణాలై
కోయిలమ్మకు ఆహ్వానం పంపాయి
వసంతుడు పెళ్లికొడుకై
సింగారించుకుని వస్తుంటే
సిగ్గుపడిన మోడులన్నీ చిగురాకులు కప్పుకుని
మధువనిలో ఆమనితో తుళ్లిపడి
మురిపెంగా ముద్దాడి
పూపొదిరిండ్ల రాలిన పుప్పొడలద్దుకొని
చైతన్య సౌరభాలతో
వసంతుని రాకకు నిరీక్షిస్తూ
ప్రకృతి రమణీయ సోయగాలన్నీ శోభిల్లుతూ
ఆగమనానికి సమాయుగమై
యుగారంభానికి శ్రీకారం చుట్టిన
యుగకర్త బ్రహ్మ సృష్టికి
విశ్వజనని మనుగడకు
పంచాంగ శ్రవణాలతో
లోకకల్యాణమై పరవశించే పండుగ రోజు
వసంతం నా సొంతమంటూ కోయిల
వనమంతా తిరుగుతూ మదినిండా
కోటి ఆశలు నింపుకొని
గున్నమావి గుబుర్లలో ఊయలలూగుతూ
కొత్త పాట పాడాలని గళం విప్పి కూసింది!
ఆ స్వర మాధుర్యంతో వసంతాగమనంతో
వేపచెట్టు పుష్పాభిషేకం చేసి దీవించింది
షడ్రుచుల సమ్మేళనంతో ఆస్వాదించిన
ఉగాది పచ్చడిలా కష్టసుఖాలను
కలిసి పంచుకోమని సందేశమిచ్చింది
ఆరు రుచుల ఉగాది పచ్చడిలో
అభిరుచులు కలవలేక తీపిని ఆస్వాదించలేక
చేదు అనుభవాలు వదలలేక
చీకటి గుప్పెట్లో నలిగిపోతున్న నాగరికత
వలస ప్రయాణంలో, ఒంటరి పోరాటంతో
దారి పొడవుగునా నిశ్శబ్దంగా
రాలి పడుతున్న పండుటాకుల సవ్వడిలో
కాలం సంలీనమయ్యే సమయాన
కొత్త ఉషోదయం కావాలని
శిశిరానికి వీడ్కోలు పలికి
సర్వం జీవన చైతన్యమయం కావాలని
సుఖశాంతులతో విశ్వమంత వీక్షించి
వసంతమై వచ్చి వాలింది
నవ వసంతారంభ పవమాన సౌరభాలతో
ప్రకృతి శృంగార విభ్రమారంభాలకు
కొమ్మమాటున చేరి దిక్కులు పరవశించగ
మధుమాస గీతమాలపించగ
ఆమని ఆగమనంతో అరుదెంచె
దుర్ముఖి నామ సంవత్సర ఉగాది
వగరు పులుపులోని చింత పొగరులన్నీ
చిరకాలముండవన్నట్లు
పగ, ద్వేషాలు పటాపంచలై
నరమేధ రుధిర జ్వాలల ధరిత్రిపై
వసంత పుష్పాలు పూయించాలని
దరాగతాలను, దుర్మార్గాన్ని పండుటాకుల్లా రాల్చి
కల్లోలమైన మనసుల్ని
కర్కశ రాక్షసత్వాన్ని శిశిరాగ్నిలో దహించేసి
మనుషుల్లోనూ మనసుల్లోనూ
మంచితనం విరబూసే చైతన్యగీతికలు పాడాలని
కవికోయిలలన్నీ కవితా గోష్టులతో
కాలాన్ని రమణీయంగా మలచి
భాషా భేదం, భావభేదం లేదని
నిన్నటితరానికి రేపటి వర్తమానమై
ఆరు ఋతువుల ఆమనిలో
తిథి, వార, నక్షత్రాల మేళవింపుతో
పంచాంగ శ్రవణ వీక్షణాలు
రాశి చక్రాల నడుమ గ్రహఫలాల సాక్షిగా
ఆత్మబలాన్ని నిగ్రహించుకోమని
అందానికి ఆనందానికి ప్రతీకగా
అరుదెంచె ఆమనిలో ఓ ఉగాది!
ఉగాదంటే ఒక చైతన్యం
నవజీవన సృష్టికి మూలం
ఆరు ఋతువుల ఐకమత్యం
షడ్రుచుల సమ్మేళనం
అన్నీ కలిసిన అదృష్ట ఫలాల జాతక చక్రం!

తాటికోల పద్మావతి,
గుంటూరు.
చరవాణి : 9441753376

--

నడత - నవ్యత

ఇద్దరు ఇష్టపడేలా
ముగ్గురు ముచ్చటించుకునేలా
నలుగురికి నచ్చేలా పదుగురిలో ఒకడిగా
పరోపకారం విధిగా
విధి నిర్వహణ నిజాయితీగా
సమాజ శ్రేయస్సునెంచి
నవ్యతతో కూడిన నడత
నిలబెడుతుంది దేశ భవిత
ఎనే్నళ్లు జీవించినా ఎంతగా సంపాదించినా
కాదేదీ శాశ్వతం
నడతే నిన్ను నిలబెడుతుంది జనుల మదిలో
నిక్కముగ ఇది సత్యం
మంచిగా.. నవ్యతగా నడవడమే ముఖ్యం

- బుర్రి కుమార్ రాజు,
గుంటూరు.
చరవాణి : 9848918141

--

రోజులు...!

కొన్ని రోజులను చూసి
గులాబీ ముళ్లురా బాబోయని
గగ్గోలు పెడతావు
ఈరోజు ఆదిలోనే హంసపాదంటూ
అరణ్యరోదనే చేస్తావు
ఇరవై నాలుగు గంటలే కానీ
అరవై నాలుగు యుగాల్లా ఉందేమిటని
నీలో నీవే మథనపడతావు.. వౌనివౌతావు
ఈరోజు జీవితం
తల్లకిందులైందని తల్లిడిల్లుతావు కానీ -
రోజులంటే గడిచిపోయే కాలమే కాదు
నీ గాయానికి మందురాసే వైద్యులు
నీ మనసులో ఆనందాలను పూయించే
కల్పవల్లులు
భవిష్యత్‌ను మోసుకొచ్చే రథచక్రాలు!
గడిచిన రోజుల్లో
ఎన్ని దెబ్బలు తగిలాయని చూసుకుంటే
సుఖమేముంది?
భూమీద నీకింకా ఎన్ని రోజులు
మిగిలాయో లెక్కేసుకో!
రోజుల విలువ తెలుసుకుంటే
నీ కర్తవ్యం.. నీ లక్ష్యం.. నీ ఆశయం..
పుష్పక విమానాలౌతాయి
విజయం సాధించిన నీ కళ్లు
గగనతలాన్ని చూస్తాయి
ఆరోజు నీ జీవితంలో మరుపురాని రోజు
మరొకరికి మార్గదర్శకమై వెలిగే రోజు!

- రాచమళ్ళ ఉపేందర్, ఖమ్మం.
చరవాణి : 9849277968

--

బింబ ప్రతిబింబాలు

ఎక్కడో నీవు నిలుచున్న చోటనే
నీ పాదముద్రలు భూమిలో నిక్షిప్తవౌతాయి
నీ స్వరూప రేఖాచిత్రాలుగా మారతాయి
నీ స్పర్శకు సాక్ష్యాలై స్పందిస్తాయి!
అప్పుడు నీ ఆలోచన్ల నిలువెత్తు దృశ్యాలు
గాలిని తాకి ఘనీభవిస్తాయి
నీ ఆశయాల పుటం మీద
బిందువులై నిలుస్తాయి
నీ శ్రమాంకిత జీవితానికి హారతులౌతాయి
ఎందుకో.. నీ హృదయ ప్రకంపనలు
ప్రగాఢ ఛాయల మధ్య
గాఢత్వం పులుముకుంటాయి
నీ అనంత ప్రయాణానికి ఊపిర్లౌతాయి
నీ అవకాశాల్ని నిలదీస్తుంటాయి
అందుకే.. నీ జీవన సరళిని
మెరుగులు దిద్దుకోవాలనుకుంటావు
నీ భావజాలాలు జావగారిపోతుంటాయి
నీ వేళ్లు నీ కళ్లనే పొడుస్తాయి
ఎవరెవరినో నీ అనంత మేధాసంపత్తి
ద్వారాల్లోకి ఆహ్వానిస్తావు
నీ ప్రవృత్తి అణువిస్ఫోటన వౌతుంది
నీ ఆశల కుంపటిని నెత్తిపై మోస్తూ వుంటావు
వీరికెందుకనో.. నీ నిగూఢ రహస్యాల
సమాధుల్ని తవ్విచూపిస్తావు!
నీ మనోగతాల శే్వతపత్రాన్ని
ఆవిష్కరించి అందిస్తావు
నీ నిరాశా నీడల్ని అవి వెంబడిస్తూనే వుంటాయి
చీటికీమాటికీ నీ ఆనంద సౌరభాల
హరివిల్లుల తోరణాల కింద
పురివిప్పి నడుస్తావు
నీ కాలమంతా కరిగిపోతోందనే
తపనల్లో తడుస్తావు
నీ విహ్వలత్వపు విచ్చుకత్తుల
నడుమ చిక్కుకుంటుంటావు!
ఎటూగాని నీ గమ్యం అగమ్యమై
సందిగ్ధంలో ఈదుతుంటావు
నీ తాత్సారపు అలసత్వాన్ని
నిండిపోయిన రహదారులు వెక్కిరిస్తాయి
నీ ఆలోచనా స్రవంతి
ఆనకట్టలా మారి అవహేళన చేస్తుంది
ఎప్పటికో నీ నిబద్ధత నీరుగారి పోతున్నప్పుడు
ఆత్మవిశ్వాసపు ఆలంబన కోరుకుంటావు
ఎవరిదో ఒక చేయి నీ చేతిని గట్టిగా
పట్టుకుని నడిపించుకుపోతుంటుంది
చీకటి నుంచి వెలుగులోకి..
నీ పయనం సాగిపోవటం
నీకు గుర్తుకొస్తూనే ఉంటుంది!

- బిఎస్ నారాయణ దుర్గ్భాట్టు,
బాపట్ల, గుంటూరు జిల్లా.
చరవాణి : 9346911199

--

రాలేను.. ప్రియసఖీ!

కోపము దెచ్చుకోకు నిను - గూడుటకై అరుదెంచలేనునే
నాపరమ ప్రియన్ మఱచి - నానని నొచ్చుకొనంగబోకు నా
ప్రాపున మండుచున్న బడబాగ్నిని ఆర్పక అన్యకార్యమున్
ఏ పగిదిన్ రచింపగల-నే ప్రియ నీవె వచింపవే కృపన్

ఇచ్చట ‘ఇండియా డవును’ ఇంకొకచోటను మానభంగముల్
మచ్చునకైన గన్పడని - మంచితనమ్ము సమాజమందు యిం
దెచ్చట జూచినన్ నిరత - దీన విలాపములార్తనాదముల్
చచ్చుట కుంకువైన మన - సంస్కృతినించుక జూడునెచ్చెలీ!

ఏదోరీతిని సంస్కరించవలెనే - నీరీతి దుర్మార్గముల్
ఈదేశమ్మున సాగెనేని మరలన్ - స్వేచ్ఛామరుద్వీచికల్
వ్యాదర్ణమ్మయి బానిసత్వము పునః-ప్రాప్తించు నా తల్లికిన్
ఆ దైవమ్ము మదీయ వాంఛితమవశ్య-మ్మాదరించున్ సఖీ!

ఇక్కడనే వసించి ప్రతి - యింటికి బోయి పదమ్ములంటి ఒ
క్కొక్కరికిన్ విధర్మియుల - కుత్సితముల్ విశదీకరించి నా
యక్కల కన్న దమ్ములకు - అమ్మను బ్రోచు విధిన్ వెలార్చి నే
చక్కని పూర్వవైభవము - సాధనసేయుట కుద్యమించెదన్

నన్ను క్షమించుమమ్మకు అ-నాదరణమ్ముగుచుండనెట్లు నే
నిన్ను రమించగాగలను - నిత్యము నాజనయిత్రి బాధలే
కన్నులలో మెలంగగక-కావికలైనది నాయెడంద ఆ
పన్నకు మాతృమూర్తికి శు-్భమ్మును గూర్చి యరుంగుదెంచెదన్

- డా. మాదిరాజు రామసుందర్రావు,
విజయవాడ. చరవాణి : 94410 26360

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com
email: merupuvj@andhrabhoomi.net