వరంగల్

జాతీయ పండుగగా మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 23: దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మేడారం జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువేల్ ఓరాయ్‌ని ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆమె తెలిపారు.
ఏర్పాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వాలు మేడారం జాతరను విస్మరించాయని, జాతరకు ముందే కొద్దోగొప్పో నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జాతరకు ముందుగానే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నామన్నారు. మేడారం జాతరకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో ఇద్దరు గిరిజన విద్యార్థినుల అనుమానస్పద మృతిపై దర్యాప్తు జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. విలేఖరుల సమావేశంలో వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలి

ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ సంతృప్తి
స్టేషన్ ఘన్‌పూర్, జనవరి 23: ప్రతి విద్యార్థి విధిగా మొక్కలు నాటాలని రాష్ట్రప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో మండలంలోని చిన్నపెండ్యాలలో చేపట్టిన వివిధ పనులను శనివారం ఆయన పరిశీలించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మించిన ఇంకుడు గుంతతో పాటు పాఠశాల ఆవరణలో పెంచుతున్న టేకు మొక్కలను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విధిగా మొక్కలు నాటాలని కోరారు. తద్వారా రాబోయో రోజుల్లో వర్షాభావ పరిస్థితులు అనుకూలించడమే కాకుండా కాలుష్యాన్ని తరిమి కొట్టిన వారవుతారన్నారు. గ్రామ శివారులోని కీర్తి సత్యం, ప్రభాకర్ వ్యవసాయ భూముల్లో ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పెంచుతున్న టేకు మొక్కలను పరిశీలించిన ఆయన.. పెంపకందారులకు వెయ్యి రూపాయల చెక్కుతో పాటు కలెక్టర్ అందించిన మొక్కల పెంపకం వివరాల బ్రోచర్‌ను రాజీవ్‌శర్మ అందించారు. గ్రామంలోని కోతి గట్టుస్వామి ఇంటి ఆవరణలతో నిర్మించిన మరుగుదొడ్డిని పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసే విధంగా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.

రంగయ్య చెరువు రిజర్వాయర్
రీసర్వేకు ప్రభుత్వ ఆదేశాలు
నర్సంపేటకు గోదావరి జలాలు * టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, జనవరి 23: నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు రిజర్వాయర్ రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం రంగయ్య చెరువును రిజర్వాయర్‌గా మలిచేందుకు ఉత్తర్వులు ఇచ్చిందని, ఈక్రమంలో 1836 ఎకరాల భూమిని ముంపుకు గురవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారని చెప్పారు. తాజాగా ముంపు ప్రాంతాన్ని తగ్గించి, రైతుల భూములను కాపాడాలనే సంకల్పంతో ప్రభుత్వం రీసర్వే కోసం జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశించిందని తెలిపారు. నర్సంపేటలోని డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ఇరిగేషన్ సర్క్యూట్‌గా తీర్చిదిద్ధేందుకు ఈనెల 11న రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ప్రణాళికను ఇచ్చామని, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఈ ప్రణాళికను సూత్రప్రాయంగా ఆమోదం లభించిందన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని మళ్లించేందుకు అనువుగా డిపిఆర్ తయారు చేయాల్సిందిగా మంత్రి హారీశ్‌రావు ఆదేశించారని చెప్పారు. మల్లంపల్లి నుండి పైప్‌లైన్ ద్వారా గోదావరి నీటిని రంగయ్య చెరువుకు మళ్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సారెస్సీ కాల్వల ద్వారా మాధన్నపేట చెరువుకు నీటిని మళ్లించి, డివిజన్‌లోని 114 గొలుసు కట్టు చెరువులకు నీటిని మళ్లించే లక్ష్యంతో ఇరిగేషన్ సర్క్యూట్‌ను తయారు చేసామని వెల్లడించారు. నియోజకవర్గంలో 1.70లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీప్ సీజన్‌లో, 70 లక్షల ఎకరాలకు రబీ సీజన్‌లో సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
చెరువులు తవ్విన తర్వాతే కాల్వల పునరుద్దరణ జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. గోదావరి, ఎస్సారెస్సీ కాల్వల ద్వారా 3.5 టిఎంసిలు నీటిని నర్సంపేటకు తీసుకవచ్చి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు పెద్ది వివరించారు. ఈవిలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్, గుంటి కిషన్, నంద్యాల క్రిష్ణారెడ్డి, నాగెల్లి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సదస్సుకు
తరలివచ్చిన నారీమణులు
శ ఏర్పాట్లలో నిర్వాహకులు విఫలంఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 23: వరంగల్‌లో జరిగిన అఖిల భారత మహిళా ఉద్యోగిణుల 5వ జాతీయ సదస్సుకు ఊహించినకంటే ఎక్కువగా మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. మొత్తం 23 రాష్ట్రాల నుండి 700 మంది ప్రతినిధులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పది జిల్లాల నుండి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలిరావడంతో వేదిక పూర్తిగా నిండిపోయి మహిళలకు కూర్చోడానికి సీట్లు లేకుండా పోయాయి. నిట్ ప్రాంగణమంతా మహిళా ఉద్యోగిణులతో కిక్కిరిసిపోయింది. దాదాపు 10వేల మందికి పైగా ఉద్యోగులు ఈ సదస్సుకు తరలిరావడంతో అందుకుసరిపడా ఏర్పాట్లు, సౌకర్యాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ సదస్సు కావడంతో అందుకు తగినట్లుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిట్ ప్రాంగణం మొత్తం మహిళా ఉద్యోగినులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఉద్యోగిణులే కనిపించారు. అయితే సదస్సుకు ఎక్కువ సంఖ్యలో హాజరుకావడం వల్ల తాము అంతగా ఏర్పాట్లు చేయలేకపోయామని, మన్నించాల్సిందిగా నిర్వాహకులు పదేపదే అభ్యర్థించారు.

ముద్దునూరు చెరువును
పరిశీలించిన సిఎస్ రాజీవ్‌శర్మ
నర్సంపేట, జనవరి 23: దుగ్గొండి మండలంలోని ముద్దునూరు చెరువును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం పరిశీలించారు. మిషన్ కాకతీయ చెరువు కింద ముద్దునూరు చెరువును పునరుద్దరించారు. ఈ క్రమంలో చెరువులోని నీటి సామర్ధ్యం, కట్ట బలోతం, తూముల నిర్మాణాలను సిఎస్ పరిశీలించారు. మిషన్ కాకతీయ పనుల పట్ల సిఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా సిఎస్ రాజీవ్‌శర్మను టిఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కలిశారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ఇరిగేషన్ సర్క్యూట్ కింద తీర్చిదిద్దాలని కోరుతూ తగిన ప్రతిపాదనలతో కూడిన నివేదికని సిఎస్‌కు అందజేశారు.