వరంగల్

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో 50వేల కోట్ల అదనపు వ్యయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 31: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ఖర్చుపెడుతోందని, ఇప్పటి వరకు ప్రాజెక్టులకు 38 వేల కోట్ల ఖర్చు అవసరం ఉండగా రీడిజైన్ పేరుతో మరో 50 వేల కోట్లు అధికంగా ఖర్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు రీడిజైన్ చేస్తే వ్యయం తగ్గాలే కానీ వేల కోట్ల వ్యయం ఎలా పెరుగుతుందని అన్నారు. రీడిజైనింగ్ పేరుతో కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మిస్తే రేపు ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాలమూరు టెండర్లలో 35 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడని బూచిచూపిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాయికి దిగజారి విమర్శలు చేస్తున్నాడని, ఇంకా ఉద్యమ నేతగానే ఆయన మాట్లాడుతున్నాడన్నారు. తాను మహానాడులో ప్రాజెక్టులకు విరుద్ధంగా మాట్లాడినట్లు సిఎం నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం అనుమతి తీసుకోవాలని చెప్పడం పొరపాటా? అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కోటి 10 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే 65వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని, మరో 35 వేల ఎకరాలకు నీరు అందాల్సివుండగా కోటి 10లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

బాలికపై అత్యాచారయత్నం
వర్ధన్నపేట, మే 31: బాలికపై అత్యాచారయత్నం జరిగిన సంఘటన మండలంలోని డిసితండా గ్రామపంచాయతీ పరిధిలోని తాళ్లకుంట తండాలో జరిగింది. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 13 ఏళ్ల చిన్నారి సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో సమీపంలోని భవానికుంట తండాలోని కిరాణా షాపులో వస్తువులు తీసుకోవడం కోసం సైకిల్‌పై వెళ్లింది. కిరాణా షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా అదే తండాకు చెందిన ముగ్గురు 16 సంవత్సరాల బాలురు శ్రీను, రాజేందర్, ప్రవీణ్ బాలిక వస్తున్న మార్గంలో ముళ్లకంప అడ్డంగా వేసి బాలికను అడ్డగించారు. సైకిల్ దిగిన బాలికను ముగ్గురు బాలురు పక్కన ఉన్న చెట్టుపొదల్లోకి తీసుకెళ్తుండగా ప్రతిఘటించింది. దీంతో బాలురు బాలికను కర్రలతో చితకబాదారు. ఈ క్రమంలో అందులో ఒక బాలుడు కర్రతో బాలికను తొడ బాగంలో తీవ్రంగా గాయపరిచాడు. రక్తం రావడంతో బాలిక కేకలు వేసింది. దీంతో బాలురు బాలికను వదిలి పారిపోయారు. దీనిపై స్థానిక ఎస్సై రవిరాజు వివరణ కోరగా ఈ సంఘటనపై విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
ఏటూరునాగారం, మే 31: ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన బొల్లె రాజేష్ (26), వరంగల్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రానికి చెందిన ముప్పిడోజు తేజశ్రీ (22)ల ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో మంగళవారం వివాహం చేసుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వివరాలలోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన బొల్లె రాంమ్మూర్తి-రమాదేవి (లేటు)ల కుమారుడు రాజేష్, భూపాలపల్లి మండల కేంద్రానికి చెందిన జెన్‌కో ఉద్యోగి ముప్పిడోజు సత్యం-సరోజనల కుమార్తె తేజశ్రీలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా తేజశ్రీ సూర్యాపేటలో ‘బిఫార్మసి’ చదువుతుండగా, రాజేష్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారివురు మంగళవారం భూపాలపల్లి మండలం చెల్పూర్‌గుట్ట వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకుని మంగళవారం సాయంత్రం ఏటూరునాగారం పోలీస్టేషన్‌ను ఆశ్రయించగా స్ధానిక ఎస్సై మోతె నరేష్ ఇరువురు మేజర్లు కావడంతో కౌనె్సలింగ్ నిర్వహించి పంపారు.

వడదెబ్బతో వృద్ధుడు మృతి
స్టేషన్ ఘన్‌పూర్, మే 31: మండలంలోని నష్కల్‌కు చెందిన మోడెం వెంకటయ్య (70) అనే వృద్ధుడు వడదెబ్బకు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. ఎండలు తీవ్రంగా ఉండడంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంటున్న వెంకటయ్య మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్ళారు. అప్పటికే నీరసించిన ఆయన మృతి చెందినట్లు తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ వాకాటి కరుణ
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మే 31: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవంను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. ఉదయం 7:30 గంటల నుండి 8 గంటల వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థలలో జాతీయ జెండా ఆవిష్కరణ, మిఠాయిల పంపిణీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 8 నుండి 8:15 నిమిషాల వరకు ప్రభుత్వ కార్యాలయాల నుండి అధికారులు, సిబ్బందిచే అమరవీరుల స్థూపం వరకు ర్యాలీలు నిర్వహించి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. 8:30 నుండి 8:45 వరకు అదాలత్ సెంటర్ నుండి పరేడ్‌గ్రౌండ్ వరకు ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలపై ప్రసంగిస్తారన్నారు. ఉదయం 9:15 గంటల నుండి 9:30 గంటల వరకు అమరవీరుల కుటుంబ సభ్యులకు సత్కారం, 9:30 నుండి 9:40 వరకు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఉపముఖ్యమంత్రి అందజేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9:40 నుండి 9:55 గంటల వరకు విద్యార్థినీ, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 9:55 నుండి 10:10 గంటల వరకు ప్రతిభ అవార్డుల ప్రదానం, 10:10 గంటల నుండి 10:30 వరకు పబ్లిక్ గార్డెన్‌లో ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుండి 10:45 గంటల వరకు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో వికలాంగులకు పరికరాల పంపిణీ, 10:45 గంటల నుండి 11 గంటల వరకు మల్లికాంబ మనోవికాస కేంద్రంలో స్వీట్ల పంపిణీ, 11 గంటల నుండి 11:30 వరకు ఆర్ట్స్ కాలేజ్, విద్యుత్ భవన్‌లో రక్తదాన శిబిరం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో కవి సమ్మేళనం, ముసాయిదా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా యంత్రాంగం, వరంగల్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్టేడియం వద్ద తెలంగాణ వంటకాల్లో భాగంగా ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు బహుమతి ప్రదానం, అనంతరం బి.సుధీర్‌రావు బృందం స్వాగత నృత్యం, మిట్టపల్లి సురేందర్‌చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాట, విజయ్ బృందంచే డాల్ డ్యాన్స్ - తెలంగాణ సంప్రదాయం, శ్రీమతి నివేదితచే తెలంగాణ నృత్య రూపకం, మిమిక్రీ రమేష్‌చే మిమిక్రీ, సిహెచ్ నవ్యజా తెలంగాణ లాస్య నృత్యం, మిట్టపల్లి సురేందర్ జానపద గీతం, వెంకటరామ్‌నాయక్ దీపాల గిరిజన నృత్యం, జి.రంజిత్‌కుమార్ బృందంచే పేరిణి శివతాండవం, శాండ్ ఆర్ట్స్ తెలంగాణ ఉద్యమం, పథకాలు, నరేందర్ బృందం తెలంగాణ నృత్యం, బంగారు తెలంగాణ లేజర్‌షో ముగింపు బాణసంచా కాల్పులతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 10వేల మంది ప్రేక్షకులు వీక్షించనున్నట్లు నగరంలో హోటళ్లు, కార్యాలయాలు విద్యుద్దీపాలతో అలంకరణ, సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. అవతరణ దినోత్సవ సంబరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

కాజీపేట రైల్వేస్టేషన్‌లో
ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభం
బాలసముద్రం, మే 31: కాజీపేట రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌లు ప్రారంభించారు. రూ.1.20కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి దయాకర్ మాట్లాడుతూ త్వరలోనే కాజీపేటలో పిఓహెచ్ (పీరియాడికల్ ఓవర్ హోలింగ్) పనులు ప్రారంభం అవుతాయన్నారు. అందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి 50 ఎకరాల స్థలం మంజూరైందని, మరో 50 ఎకరాలు కూడా త్వరలోనే కేటాయించే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. దీని ద్వారా దాదాపు 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుందన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ తరువాత రెండవ అతిపెద్ద జంక్షన్ కాజీపేటేనన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి జనార్ధన్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రైల్వే సేవలపై ప్రజల్లో అవగాహన
డోర్నకల్, మే 31: డోర్నకల్ రైల్వే జంక్షన్‌లో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఎడిఆర్‌ఎం టంకాతో కలిసి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతారాంనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టంకా మాట్లాడుతూ... ప్రయాణికుల సౌకర్యార్థం మే 26 నుండి జూన్ 2వ తేదీ వరకు హం సఫర్ హై కార్యక్రమంలో భాగంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖనుండి అందుతున్న సేవల గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతారాంనాయక్ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2003వ సంవత్సరంలో పాండురంగాపురం స్టేషన్ నుండి సారపాక వరకు 15కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మించడానికి బంగారు లక్ష్మణ్ రైల్వే శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకం అలాగే ఉన్నదని, పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదన్నారు. దేశంలో రైల్వే శాఖకు దక్షిణ మధ్య రైల్వే నుండి అత్యధికంగా ఆదాయం సమకూరుస్తున్న, దక్షిణ మధ్య రైల్వే పట్ల రైల్వే శాఖ ఎప్పుడు చిన్నచూపే చూస్తుందని విమర్శించారు. రైల్వేలో ఎవరు మంత్రిగా పనిచేసినా జాతీయ స్ఫూర్తిని మరచి వారివారి రాష్ట్రాలకే నిధులు, ప్రాజెక్టులు తరలించుకుపోతున్నారని, ఇందుకు ఉదాహరణగా లాలుప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉండగా బిహార్ వాసులకే రైల్వేలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని, నాయకులు సొంత రాష్ట్రం పట్ల అవలంబిస్తున్న పక్షపాతవైఖరే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు తెలంగాణ రాష్ట్రం పట్ల, అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి రైల్వే శాఖకు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న పనులను తక్షణమే చేపట్టి తమ చిత్తశుద్ధి కాపాడుకోవాలని ఆయన కోరారు. డోర్నకల్‌లో న్యూ నెహ్రు స్ట్రీట్ నుండి సుభాష్ స్ట్రీట్ వరకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించడానికి అనువైన ప్రదేశం ఉందని ఆయన ఎడిఆర్‌ఎంను వెంటబెట్టుకుని ప్రదేశాన్ని చూపించారు. తక్షణమే అట్టి ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల డోర్నకల్ ప్రజలకే కాక, పక్క జిల్లా అయిన ఖమ్మం జిల్లా వాసులకు కూడా అనుకూలంగా ఉంటుందని ఎంపి ఈ సందర్భంగా రైల్వే అధికారులకు సూచించారు. అలాగే, డోర్నకల్ నుండి గార్ల మధ్య నిర్మించబోయే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 59 కోట్లు మంజూరైనా.. రైల్వే శాఖ నుండి డిపిఆర్ పంపకపోవడం పట్ల ఎంపి సభలోనే రైల్వే శాఖపై అసంతృప్తి వ్యక్తం చేసారు. నిధులు మంజూరై సంవత్సరం గడుస్తున్నప్పటికీ రైల్వే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ తాము గతంలో ఇచ్చిన ప్రాజెక్టులపై రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోవాలని, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో పద్మావతి ఎక్స్‌ప్రెస్, హ రా ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్టింగ్ సౌకర్యం కల్పించాలని ఎడిఆర్‌ఎంను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మాద లావణ్య, జడ్పీటిసి స్వరూప, ఎంపిపి రమ్య, ఎంపిటిసి సునీత, విద్యాసాగర్, రాంబాబు, నాయకులు నున్న రమణ, సత్తిరెడ్డి, వాంకుడోత్ వీరన్న, స్టేషన్ మాస్టర్ హరిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.