Others

‘బెల్టు’ తీస్తాం.. భరతం పడతాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమండీ.. కొత్తకోడలు కాపురానికి రానంటోందిట.’’
‘‘అదేంటి..? సంప్రదాయబద్ధమైన కుటుంబంలోని పిల్ల అని కోడల్ని చేసుకుంటే..!’’
‘‘సంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల గనుకనే రానంటోంది..’’
‘‘నువ్వేమంటున్నావో నాకర్థం కావడం లేదు.’’
‘‘ఇందులో అర్థం కానిదేముంది..? ఈరోజుల్లో ఆడపిల్లలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తున్నారు. వాళ్లు తమ ఆలోచనలను, అభిప్రాయాలను ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. అదేదోగ్రామంలో కొత్తగా పెళ్లయిన ఒక అమ్మాయి అత్తవారింట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి లేదని ‘ఆ ఇంటికి కాపురానికి వెళ్లనని’ కరాఖండీగా చెప్పేసిందట..! అలాగే మన కోడలు నవీన కూడా మన వీధిన మన ఇంటి చుట్టూ నాలుగైదు మద్యం దుకాణాలు వున్నాయని కాపురానికి రానంటోందట!’’ అంది లలిత భర్త వంక చూస్తూ.
‘‘అదేంటి..? మన ఇంట్లోని వాటికి మనం బాధ్యులం కానీ...!’’
‘అదేమాట నేనంటే.. సామాజిక బాధ్యత అనేది కూడా ఒకటి ఉంటుందని’ అంది.
‘‘ఇంతకూ ఎవరో ఎక్కడో మద్యం దుకాణాలు పెట్టుకుంటే తనకేంటట ఇబ్బంది..?’’
‘ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి కోడలు అక్కరలేదు. నన్నడగండి నేను చెబుతాను. ఆ బాధ ఆడవాళ్లమైన మాకే అర్థమవుతుంది. వెనకటి రోజుల్లోలా ఆడవాళ్లు ఇంట్లో కూర్చుని వండిపెట్టే రోజులు కాదుగదా ఇవి? వాళ్లూ జాబ్‌ల కోసమని బయటికి వెళుతున్నారు. ఇల్లాళ్లు కూరలకని, పాలకనీ, వంటింటి సరుకులకనీ బయటికెళ్లి స్వయంగా వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు. ఇక ఆడపిల్లలు స్కూళ్లకి, కాలేజీలకి, ట్యూషన్లకి వెళుతుంటారు. వీళ్లంతా ఎటువెళ్లినా ఆ దుకాణాల ముందునుంచే వెళ్లాలి.. అమ్మాయి కంటపడితే వెంటబడే మగాళ్లు.. ఇక మందు డోసుమీద ఉంటే చెప్పేదేముంది? వల్గర్ కామెంట్స్ చేస్తూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు. కోడలు నవీనకు ఇక్కడికొచ్చిన కొత్తలో అలాంటి అనుభవమే ఏదో అయి వుం టుంది. అందుకే కాపురానికే రానని భీష్మించుకకూర్చుంది..’’
‘‘ఇది మరీ బాగుంది.. ఎవరో మద్యం దుకాణాలు పెట్టుకుంటే మనమీద అలిగితే మనమేం చేస్తాం...’’
‘‘అలా అనకండి.. మనమ్మాయే అలా ఇబ్బంది పడుతుంటే.. అవునండోయ్.. మన అమ్మాయి శాంతికి కూడా ఇలాంటి అనుభవాలే ఏవో అయివుంటాయి... చిన్నపిల్ల గనుక నోట్లో నాలుక లేంది గనుక అది చెప్పడం లేదుగానీ నాకు డౌట్ వస్తోంది. ఈమధ్య ఎందుకో చిరాకుగా, కోపంగా ఉంటోంది. ఏ తాగుబోతు వెధవో దాన్ని ఏదో అని వుంటాడు..’’ అంది లలిత అనుమానంగా.
‘‘ఏదీ దాన్నిలా పిలువు.. ఎవడేమన్నాడో తెలుసుకుందాం.. వాడి సంగతి, ఆ షాపు సంగతి చెబుతాను..’’ అని ఆగ్రహంతో ఊగిపోయాడు శేఖర్.
‘‘తనదాకా వస్తే’ అన్నట్టు- ‘మీ అమ్మాయి విషయం వచ్చేసరికి ఆవేశపడి పోతున్నారు.. కోడలూ ఓ అమ్మాయి కదా.. ఆడపిల్లకాదా?’’ అని లలిత భర్త ముఖంలోకి సూటిగా చూస్తూ నిలదీసి అడిగేసరికి కంగుతిన్నాడు శేఖర్.
‘‘ఆ.. అదేం లేదు.. ఎవరైనా ఒకటే.. చెప్పందే ప్రోబ్లమ్ ఎలా తెలుస్తుంది..? పదేళ్ల క్రితం ఇక్కడ స్వంత ఇల్లు కట్టుకుని కాపురం వుంటున్నాం. ఏ సమస్యా రాలేదు.. ఊరిబయట ఎక్కడో ఒక్క మద్యం దుకాణం ఉండేది. ఇప్పుడు వీధికి నాలుగు బెల్టు షాపులు వెలిసాయి. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఆదాయంతోనే బతికి బట్టకడుతున్న ప్రభుత్వాలు యథేచ్ఛగా వాటికి పర్మిషన్ ఇస్తున్నాయి.. ప్రభుత్వాలే ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను, సుఖశాంతులను హరించివేస్తే ఎట్లా..?’’ అన్నాడు శేఖర్.
‘‘నాకూ అదే అనిపిస్తోంది..!’’ అంది లలిత దిగులుగా.
* * *
ఇంట్లో పనులు చేసుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది లలిత స్వగతంలా.
‘..ఇంతకుముందు కార్తీక సోమవారం అనగానే శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించుకునేదాన్ని.. ఇప్పుడు ఆ ఆలయం పక్కనే ఒక మద్యం దుకాణం వెలిసింది. దానిముందుగా వెళుతుంటే ఒకటే కంపు.. తాగి- తూలే జనం.. రోడ్డు పక్కన సోయి లేకుండా పడివుండే తాగుబోతులతో అసహ్యం పుట్టించే వాతావరణం. కడుపులో తిప్పుతుంది.. గలీజుగా వాళ్లు మాట్లాడే మాటలు చెవుల్లో పడి శూలాలు గుచ్చినట్లు అవుతుంది..’ అని అనుకుంటోంది లలిత. తల్లి మాటలు విన్న తరువాత కూతురు శాంతికి కూడా నోరు ఆటోమేటిక్‌గా పెగిలింది.
‘‘మా స్కూలు పక్కన కూడా ఇప్పుడు ఒక దుకాణం పెట్టారమ్మా.. పట్టపగలే జనం అక్కడ చేరి తాగుతూ వుంటారు. ఇంతకుముందు ఆ ప్లేస్‌లో పుస్తకాల షాపు వుండేది.. దాని పక్కనే స్టేషనరీ షాపు వుండేది. అవి తీసేసి ఇప్పుడు మద్యం దుకాణం పెట్టారు. మొన్న మా స్కూలు డే ఫంక్షన్ ఉంటే కూడా నైట్ కదా.. మరింత భయమేసి వెళ్లలేదు..’’ అంది. జాలిగా కూతురి వంక చూసింది లలిత. ఈసారి ఆ ఇద్దరి వంకా అలా చూడటం శేఖర్ వంతైంది.
‘దీనికంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వాలే..! ప్రజల జీవన నాణ్యత.. నైతిక విలువలు, సామాజిక భద్రత అన్నీ మర్చి ఎలాగైనా.. ఏ మార్గంలోనైనా రాష్ట్ర ఖజానా నింపుకోవటమే పరమావధిగా పెట్టుకున్నాయి. ‘తెలంగాణలో పండగంటే ఏముంది? గొంతులో ‘చుక్క’ దిగాల్సిందే.. యాట తెగి ముక్క నోట్లో పడాల్సిందే’ అని బహిరంగసభలోనే చెబుతాడు ఓ మంత్రి. రాష్ట్ర రహదారిమీద, వీధివీధిన ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు పెట్టించి ‘మందుబాబులూ బాగా తాగండి.. మీరు తాగితాగి ప్రభుత్వ ఖజానా నింపండి. మద్యం వల్లే రాష్ట్ర అభివృద్ధి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా తాగుబోతులకు నూరిపోస్తున్నారు. ఇక ఈ తెలుగు రాష్ట్రాలను ఎవరు రక్షించాలి?’ అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శేఖర్.
ఇంతలో- ‘‘ఏమండోయ్.. మన కొత్త కోడలు కాపురానికి వస్తోందట.. ఫోన్ చేసింది ఇప్పుడే!’’ అని ఆనందోద్వేగాలతో ఒక్క కేక పెట్టింది లలిత.
‘‘హమ్మయ్య.. మొత్తానికి సమస్య పరిష్కారం అయింది!’’ అన్నాడు.
‘‘ఇంకా కాలేదు.. అందుకే వస్తోంది..’’ అంది లలిత.
‘‘అదేంటి?’’
‘‘తను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిందట. సమస్యను ఎత్తి చూపి మిన్నకుండటం సరికాదనీ సమస్యకు పరిష్కారం కూడా కనిపెట్టాలనీ అనిపించిందట. ఇక్కడికి వచ్చి.. ఈ వీధిలో ఉండే ఆడాళ్లతోపాటు మహిళా సంఘాల వాళ్లందర్నీ కూడగట్టి పెద్ద ఉద్యమం లేవనెత్తి బెల్టు షాపులన్నింటినీ ఇక్కడి నుంచి తరిమితరిమి కొడుతుందట..!’’
‘‘ఓహో.. చీపుర్లు, రోకలి బండలు తీసుకుని యుద్ధానికి బయలుదేరుతారన్నమాట.’’
‘‘కాదు.. నేనూ ఆమాటే అంటే ఆ రోజులు మారిపోయాయి.. బెల్టు షాపులను వెళ్లగొట్టడానికి.. బెల్టులు తీస్తాం.. అంది ఆ జీన్స్ ప్యాంటు పిల్ల!’’ అని లలిత అనగానే తనూ నవ్వాడు శేఖర్..

- కొఠారి వాణీ చలపతిరావు