మంచి మాట

మనసు విప్పని మగవాడు - రక్తదానం చేసిన మగువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదేం మనిషి? ఎప్పుడూ యిలా వుంటాడేం? తన పెళ్లిలోనూ ఇంతే. ఆ ఈడువాళ్లు అందరూ ఉన్నట్టు సరదాగా వుండడు. పెళ్లిలో జరిగిన సరస వినోద కార్యక్రమాలలో ఏ ఒక్కటీ అతన్ని ఆనందపరచలేదు. అతని వాలకం సుమతి కనిపెడుతూనే వుంది. అతని ముఖం ఎప్పుడూ తల్లిని పోగొట్టుకున్న పిల్లవాడిలా ఆత్మేశ్వరిని పోగొట్టుకున్న ప్రియుడిలా వుంటుంది. ఏమిటి ఈయన బాధ? మనిషి స్వభావమే యిలా అయి వుంటుందా - ఇదే కొత్త పెళ్లికూతురు సుమతి అంతర్మథనం. శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి వ్రాసిన ‘రక్తపు చుక్కకు నీటిచుక్క’ అనే కథానికలో సన్నివేశం ఇది. ‘తన పెళ్లి అయిన వారానికే ఆడబడుచు పెళ్లంటే నడుం కట్టుకుని పెళ్లి పనులలో జొరబడ్డది సుమతి. అత్తగారికి కాళ్లు పట్టుకున్నాయి సమయానికి. సుమతి ఆ ఇంటికి పెద్దకోడలు. వంట పందిట్లోనూ అన్నింటికీ తానే అయి తిరుగుతోంది ఆమె. భర్త ఏ పనిలోనూ సహకరించడు. ఏదీ కల్పించుకు తిరగడు. తండ్రి పిలిచినా పేపరు చదవడం నుంచి గదిలోనుంచి బయటకు రాడు. సుమతి అన్ని పనులు సమర్థంగా సరిచేసుకుంటూ, ఆఖరుకు మగపెళ్లివారు విందు సమయంలో యువకులు చేసిన చిల్లర అల్లరిని కూడా ఆమే సరిపుచ్చి ఏమి గందరగోళం జరగకుండా నైపుణ్యంగా వ్యవహరించవలసి వచ్చింది. భర్త ప్రవర్తనకు ఆమె మనసు ఉడికిపోతోంది. వ్యధకు బదులు దొరకదు. అదేమిటో అసలు అర్థంకాదు. ఆమె జడ చివరనున్న ‘జడగంటలు’ చూసి త్రుళ్లిపడ్డాడు. అతని ముఖం అప్పటికప్పుడు మాడిపోయినట్లు అవడం ఆమె గమనించింది. అన్నం తినకుండా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
‘సుమతీ! నీవా జడగంటలు తీసివెయ్యి’ అని ఎంతో బాధపడుతూ చెప్పాడు. అతని ప్రవర్తనకు కారణం ఆమెకు సూచనగా అర్థం అయినట్లయి, అదేమిటో వివరంగా అతని ముఖతః చెప్పించి ఊరట పొందింది. అప్పటికిగాని ఆమెకు మనస్తాపం అంతరించలేదు. ఇంతకూ అదో పెద్ద కథ! అదేమిటో చెప్పడంలోనే భర్త రాఘవరావు- ఎందుకంత అస్తవ్యస్తంగా నడుస్తున్నాడో ఆమెకు అగాహన అయింది.
పెళ్లికి ముందు అతను ఒక స్నేహితుడి ఇంట అతని వివాహానికి అతిథిగా వెళ్లాడు. వేసవికాలం. స్నేహితులందరూ పందెం వేసుకున్నారు. మండు వేసవిలో నడుచుకుంటూ వాగుదాకా వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలి. రాఘవరావు తన బలప్రదర్శన కోసం రుూ పందేనికి అంగీకరించాడు. ఎంతో కష్టపడుతూ నడిచి నడిచి పందెం గెలవగలిగాడు గాని, చాలా అలసిపోయి జ్వరపడ్డాడు. ఆ సుస్తీలో అక్కడే చాలా రోజుల ఉండిపోవలసి వస్తుంది. అక్కడే అతనికి ఉపచారం చేసిన ఒక మామ్మగారు, ఆమె మనవరాలు ‘రుక్మిణి’ పరిచయం అవుతారు. ఆ సందర్భంలోనే రుక్మిణి దురవస్థ చూడగలుగుతాడు. మామ్మగారు గృహవైద్యంతో అతను తాత్కాలికంగా కుదుటపడినా, ఆస్పత్రిపాలు కావలసి వచ్చింది. అక్కడ అతనికి ‘రక్తం’ ఒంటికి పట్టించవలసి వచ్చింది. దగ్గరున్నవాళ్ల రక్తం ఏదీ సరిపోలేదు. ‘రుక్మిణి’ అతనికి తెలియకుండానే రక్తదానం చేసి అతను పూర్ణ ఆరోగ్యవంతుడు అవటానికి దోహదం చేసింది. ఆ అమ్మాయి ‘జడగంటలు’ వేసుకుని వుండడం అతని మనసులో ముద్రితం అయిపోయింది. ఆ అమ్మాయి తనకు చేసిన సేవలవల్ల, ఇతర ఆకర్షణలవల్ల ఆమెను వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. కాని విధి నిర్ణయం వేరొకరకంగా వుంది. అతని తండ్రి ‘అప్పటికే తాను అయిదెకరాల మాగాణి, ఆరువేల కట్నంతో వచ్చే పిల్లను చూసి అంతా నిశ్చయం చేశానని వివరాలతో సహా వ్రాశాడు’. రాఘవరావు తండ్రితో తన మనసు విప్పి చెప్పలేకపోయాడు. ‘నాది పిరికి గుండె’ అని గుండెమీద కొట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాడు. ఆ తరువాత అతనికి సుమతితో వివాహం అయింది.
‘మీకు అన్యాయం జరిగింది. సంబంధం నిశ్చయం అయినా మీ నాన్న గారితో ఆ మాట గట్టిగా చెప్పి వుండవలసింది’ అని పరమ శాంతంగా అన్న సుమతి మాటలకు అతను ‘చెప్పవలసిందే గాని చెప్పలేదు. చెప్పలేని పిరికివాడిని’ అని మొత్తుకుంటాడు. సుమతి అతని మనస్తాపాన్ని తగ్గించడానికి శ్రమపడకుండా పనిచేస్తుంది. ఇంతతో అవలేదు. తరువాత కొన్ని రోజులకు అతను మళ్లీ రుక్మిణిని కలుసుకునే సందర్భం తటస్థిస్తుంది. ఈసారి ఆమెకు ‘జడగంటలు’ లేవు. అస్తిపంజరం అయి చివరి క్షణాలలో ఆస్పత్రి మంచంమీద పడివుంది. అతను పరిచర్యలు చేశాడు. పైవారం ఆమె చనిపోతుంది. చివరిక్షణంలో ఆమెకు నీటిచుక్కలు మాత్రం పోయగలిగాడు.
అతను ఇంటికి వచ్చి సుమతితో ‘రక్తం ఇచ్చిన ప్రాణదాత రుణాన్ని నీటిచుక్కలతో తీర్చుకోజూసిన వ్యర్థుణ్ణి, పిరికివాడిని’ అని నుదురు కొట్టుకుంటాడు. ‘సుమతీ! జడగంటల రమణి వెళ్లిపోయింది. నేను చూస్తూ వుండగానే వెళ్లిపోయింది’ అని గొణుక్కుంటూ విలపిస్తున్నాడు. సుమతి అతన్ని చిన్నపిల్లవాడిలా సముదాయించి ‘బుజ్జగించి తల్లిలా ఒళ్ళోకి తీసుకుంది’ అని కథ అంతం చేస్తారు సరస్వతీదేవిగారు. శ్రీమతి ఇల్లిందుల సరస్వతీదేవిగారు అనేక కథలు, నవలికలు రాశారు. ‘స్వర్ణకమలాలు’ అనే కథల సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా సంపాదించారు. ‘ఒక మంచి రచన చదివిన తరువాత పాఠకుడికి కలిగేది ఆనందం మాత్రమే. ఒక మంచి రచన చేసిన తరువాత ఆ రచయితకు కలిగేది అలౌకికమైన ఆనంద రసానుభూతి. అటువంటి రచన(లు) చేయాలన్న ఆకాంక్షతో ఎదురుచూస్తూ వుంటాను’ అంటారు ఆమె తన సాహిత్య సేవను తలచుకుంటూ. జీవితం ధన్యం చేసికున్న మహారచయిత్రి ఆమె.

- శ్రీవిరించి, 09444963584