Others

ఈ దేశం ఏమైపోతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్లు తలుపులు మూసుకున్నారు. వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్‌కు ఫలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి, ఆ తర్వాత అసలు విషయం చెప్పారు. ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. పో లీసులలో ఏ మాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించక పోయినా ఏకాంబరం మాత్రం పల్లెత్తు మాట అనకుండా బతుకు జీవుడా! అని బయట పడ్డాడు. అదే రాజకీయ రక్ష రేకు ఉంటే.. మొత్తం కథే వేరుగా ఉండేది. ఈ దేశంలో చట్టాలు సామాన్యుల పట్ల ఒక రకంగా, అసామాన్యుల పట్ల మరోరకంగా అమల వుతాయి. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు...
ఒక కేసు విషయంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను ప్రధానమంత్రి మోదీ సీబీఐని అడ్డుపె ట్టుకుని వేధిస్తున్నారని ఆమె ధర్నాకు దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు దీదీకి సంఘీభావం తెలిపారు. దర్యాప్తులో సహకరించేలా పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని సీబీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పోలీసు కమిషనర్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు సీబీఐని అనుమతించింది. ఇవే అవస్థలు సామాన్యులకు ఎదురైతే ఇన్ని వ్యవస్థలు అంత వడిగా స్పందించడం జరిగే విషయమేనా? ఈ నేపథ్యంలో వ్యవస్థల పని తీరు పట్ల మరో మారు చర్చ మొదలయింది. వీటి పని తీరు, వాటిపై ప్రభుత్వ పె త్తనం గురించి చర్చోప చర్చలు జరుగు తున్నాయి. వర్తమానాన్ని సమీక్షించుకు నేందుకు గతాన్ని గుర్తుచేసుకోవడం కూడా అవసరం. ఓ ఎనిమిదేళ్లు వెనక్కి వెడదాం...
మోదీ అప్పుడు గుజరాత్ సీఎం. అంతకు ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గుజ రాత్ అల్లర్లను పురస్కరించుకుని మోదీని విచారించడానికి సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మోదీని తన ఎదుట హాజరు కావాలని కోరింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని సిట్ కార్యాలయానికి ఆయన వెళ్లగా, అధికారులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ రెండు తడ వలుగా మొత్తం పదిగంటల పాటు విచారణ జరిపారు. తమ ప్రశ్నలకు మోదీ నుంచి సమాధానాలు రాబట్టారు. ‘నాపై దుష్ప్రచారం చేస్తూ, నా గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న వాళ్లకు ఈనాటితోనైనా కళ్లు తెరిపిళ్లు పడతాయని నేను ఆశిస్తున్నాను’- అన్నారాయన తనను కలసిన విలేకరులతో.
‘మిమ్మల్ని ఏమని ప్రశ్నించారు?’.. విలేకరుల ఆరా!
‘ఆ సంగతులు మీతో పంచుకోలేను. ఎందుకంటే సిట్ తన నివేదికను నేరుగా సుప్రీం కోర్టుకు సమర్పిస్తుంది’ అన్నారాయన. అదే మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి. సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంటాయని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. గతంలో సీఎంగా పనిచే సినపుడు మోదీ మహాశయుడికీ సీబీఐ పట్ల అచ్చు అలాంటి అభిప్రాయమే ఉండేది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మ దాబాద్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్. సీబీఐ అధికారులు తమ ఢిల్లీ బాసులను మెప్పించడానికి మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రు లను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఈ అధికారులు ఒక విషయం మరచిపోరాదు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
మళ్ళీ ఓసారి ఆరేళ్లు వెనక్కి వెడదాం...
2013లో- సుప్రీం కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా ఉంది. జస్టిస్ ఆర్. ఎం. లోధా తీవ్ర స్వరంతో- ‘సీబీఐ అనేది ప్రభుత్వ పంజరంలోని చిలుక’ అన్నారు. కోర్టు హాలులో ఉన్నవాళ్ళంతా నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో. న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటా యింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఊతం చిక్కినట్టయింది. ‘కోల్‌గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ళ క్రితం సీబీఐ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏమన్నారో చూద్దాం. ఉత్తర ప్రదేశ్ లోని సిధౌలిలో ఓ సభలో మాట్లాడుతూ- ‘సమాజ్ వాదీ, బిఎస్‌పిలను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధాని మోదీ వద్ద ఒక తాళం చెవి ఉంది... దానిపేరే సీబీఐ’ అన్నారు.
ఓ అయిదేళ్లు వెనక్కి వెడదాం.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోంది. రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్. ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనను ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఇషత్ జెహాన్ కేసులో అమిత్ షాను ఇరికించడానికి సీబీఐ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవనీ, అయినా అమిత్ షా పేరు చార్జ్ షీటులో చేరిస్తే యూపీఏ ప్రభుత్వం సంతో షించి ఉండేదనీ సిన్హా పేర్కొన్నారు. ఆ ప్రకటన ప్రభుత్వాన్ని ఇబ్బందులలోకి నెడుతుందని భావించిన రంజిత్ సిన్హా తాను అలా చెప్ప లేదని అంటూ సమర్ధించుకోలేని విధంగా మరో వివరణ ఇచ్చారు. జోగీందర్ సింగ్ 1996లో పదకొండు మాసాల పాటు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఓ సమావేశంలో మాట్లాడుతూ తన అనుభవాలు తెలి యచేశారు. ‘‘సీబీఐ అంటే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ అనే అభిప్రాయం ఉంది. కానీ, అది నిజం కాదు. ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మ మాత్రమే’ ... ‘‘ఐకే గుజ్రాల్ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళళు ఉండేవి. చార్జ్ షీట్ వేయడంలో ఆలస్యం చేయాలనీ, కొన్ని కేసులలో ఉదారంగా వ్యవహరించాలనీ పైనుంచి ఆదేశాలు వస్తుండేవి. పశు దాణా కుంభకోణం కేసులో ఇలాగే ఒత్తిళళు వచ్చాయి. లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వండని కరాఖండీగా చెప్పాను. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా అనుకున్న విధంగానే చార్జ్ షీట్ దాఖలు చేశాను’’ అని చెప్పారు జోగీందర్.
జనం నోళ్ళలో బాగా నలుగుతున్న సీబీఐ కి మరకలు పడిన చరిత్రే కాదు, ఘన కీర్తి కూడా చాలా ఉంది. దేశం మొత్తంలోనే ప్రముఖ దర్యాప్తు సంస్థగా పేరు గడించింది. సీబీఐ పాలక పక్షం చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తుంటాయి. కానీ, ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా సరే, తక్షణం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ముందుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఆ పార్టీలే. కాలక్రమంలో అన్ని వ్యవస్థల మాదిరిగానే నిప్పులాంటి ఈ సంస్థకు కూడా చెదలు పట్టాయి. అయినా, సామాన్య ప్రజలకు ఈ వ్యవస్థ పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం, నమ్మకం మిగిలే ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సంస్థను వాడుకుంటున్నారని పాలకపక్షంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఎన్నికల్లో ప్రజలు తమ చేతికి అధికారం అప్పగించగానే అదే పని అవి చేస్తుంటాయి. ప్రతిపక్షంగా మారిన ఒకనాటి పాలక పక్షం నోటి వెంట ఇవే చిలుక పలుకులు వినీ వినీ జనాలకు విసుగు పుడుతోంది. ఇది మనదేశంలో చాలాకాలంగా సాగిపోతున్న ఒక వికృత రాజకీయ క్రీడ. చట్టబద్ధ వ్యవస్థల నడుమ, ప్రజాస్వామికంగా ఎన్నికైన వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసే ప్రభుత్వాల నడుమ ఘర్షణలు సహజం కావచ్చు కానీ అవి యుద్ధాల స్థాయికి పెరగడం వాంఛనీయం కాదు.
మనం నివసిస్తున్న ఈ భూగోళం కంటే అనేక వేల రెట్లు పెద్దవి అయిన వేలాది గ్రహాలు అనంత విశ్వంలో సెకనుకు కొన్ని వేల మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నాయి. ఈ అనంత విశ్వ పరిభ్రమణంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నఆ గ్రహాలు, మిల్లిమీటరులో వెయ్యో వంతు తేడా వచ్చినా పరస్పరం ఢీ కొనడం తథ్యం. అయినా అనేక వందల వేల సంవత్సరాల నుంచీ ఆ గ్రహరాశులు అన్నీ కూడా పరిధులు అతిక్రమించకుండా తమ తమ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తున్నాయి. అలాంటిది ఒక కేంద్ర ప్రభుత్వం, ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధులకు, పరిమితులకు లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేని పరిస్థితులు తలెత్తితే ఆ తప్పెవరిది? ఆ తప్పు కచ్చితంగా ప్రజలది కాదు. ప్రజాస్వామ్యం పేరుతో, ప్రజల పేరుతో తమ భవిష్యత్తును పదిలపరచుకోవడానికి అనుక్షణం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీల దంటారా? ఏమో కావచ్చు!

-భండారు శ్రీనివాసరావు 98491 30595 http://bhandarusrinivasarao.blogspot.com