Others

ఆ ‘నరమేధాని’కి నూరేళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం నాటి మాట.. అది- ఏప్రిల్ 13, 1919 ఆదివారం ‘వైశాఖి’ పర్వదినం రోజు. అమృత్‌సర్ నగరంలో జనమంతా నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహవంతంగా జరుపుకొంటున్నారు. అక్కడి స్వర్ణ దేవాలయానికి కూతవేటు దూరంలో జలియన్‌వాలా బాగ్ మైదానంలో సభ జరుగుతోంది. పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చిన సిక్కు, హిందూ మతాలకు చెందిన పురుషులు, స్ర్తిలు, పిల్లలూ ఆ మైదానంలో గుమిగూడారు.
బ్రిటిష్ పాలకుల ‘రౌలట్’ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సైఫుద్దీన్ ఖిచ్లూ, డా.సత్యపాల్‌లను అరెస్టు చేసినందుకు నిరసనగా ప్రజలు ‘జలియన్‌వాలా బాగ్’ మైదానంలో శాంతియుతంగా సభ జరుపుతున్నారు. నాయకుల ప్రసంగాలు ఉద్వేగంగా సాగుతున్నాయి.
అదే సమయంలో సైనికాధికారి జనరల్ డయ్యర్ నాయకత్వంలోని సాయుధ మిలటరీ దళం అక్కడకు చేరుకుంది. ఆ మైదానానికి ఐదు ఇరుకైన ప్రవేశద్వారాలు మాత్రమే ఉన్నాయి. ఒక ద్వారానికి అడ్డంగా తన సాయుధ బలగాన్ని డయ్యర్ మోహరించాడు. లోపల గుమిగూడిన ప్రజానీకంపై ఎలాంటి హెచ్చరిక చెయ్యకుండా ఆయన కాల్పులకు ఆదేశాలిచ్చాడు. దాంతో ప్రజల్లో హాహాకారాలు చెలరేగాయి. ఎటుపోవాలో తెలియని స్థితి. అనేకమంది వృద్ధులు, స్ర్తిలు బుల్లెట్లకు నేలకొరిగారు. కొందరు తమను తాము రక్షించుకోవడానికి అక్కడే వున్న బావిలోకి దూకారు. నిరాయుధులైన ప్రజలపై ఇంత దారుణానికి ఒడిగట్టినా ఆ నరహంతకుని రక్తదాహం తీరలేదు. తమ దగ్గరున్న తూటాలు పూర్తయ్యేవరకూ కాల్పులు జరిపించాడు. క్షతగాత్రులను కనీసం ఆసుపత్రికి తీసుకెళ్ళే ఏర్పాట్లు చేయలేదు.
స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళదామనుకుంటే ‘కర్ఫ్యూ’ అమలులో ఉంది. ఈ దుర్ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, వేలాదిగా గాయపడ్డారని తెలిశాక దేశం యావత్తు ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ప్రతిఘటన మొదలైంది. కాల్పుల్లో 350 మంది మరణించారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ కాంగ్రెస్ జరిపిన స్వతంత్ర దర్యాప్తులో మృతుల సంఖ్య 1100 అని, సుమారు 1500 మంది గాయపడ్డట్లు తేలింది. తొలుత ఈ సంఘటనను సమర్ధించిన బ్రిటిష్ ప్రభుత్వం తరువాత వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు నరహంతకుడు డయ్యర్‌ను విధులనుండి తప్పించింది.
జలియన్‌వాలా బాగ్ ఘటన దేశ ప్రజల్లో తీవ్ర ఆవేశానికి దారితీసింది. అనేక మంది యువకులు జాతీయోద్యమంలో దూకారు. భగత్ సింగ్, ఉధం సింగ్ లాంటి యువకులు దేశం కోసం సర్వస్వం అర్పించేందుకు అడుగులు వేశారు. ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగోర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన ‘నైట్ హుడ్’ను వెనక్కిచ్చారు. ఈ సంఘటన జరిగిన 21 ఏళ్ల తర్వాత ఉధం సింగ్ లండన్‌లో ఒక సమావేశానికి వచ్చిన డయ్యర్‌ను కాల్చిచంపాడు. నేటికీ దేశభక్తులకు ‘జలియన్‌వాలా బాగ్’ ఒక తీర్థ స్థలం. ఈ దుర్ఘటన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులైన నాటి వీరులకు, తల్లులకు శ్రద్ధాంజలి ఘటించడం నేటి తరం బాధ్యత. ఆ వీరుల త్యాగాలు నేటి యువతలో నిరంతరం స్ఫూర్తి రగిలిస్తాయి.

-వడ్డాది వెంకట సుబ్బారావు