Others

‘జ్ఞానం’ శరణం గచ్ఛామి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పాళి భాషలో బౌద్ధ సాహిత్యం వెలువడింది. బుద్ధుడు తన ప్రవచనాలను ఆ భాషలోనే చేశాడని చెబుతారు. అప్పటికి బహుళ ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత భాషపై చిన్నచూపు ప్రదర్శించారు. వైదిక ధర్మానికి, సంస్కృత భాషకు ‘ప్రచ్ఛన్నం’గా బౌద్ధ ధర్మాన్ని, పాళి భాషను పీఠంపైకి తీసుకొచ్చారు.
వర్తమానంలో పాళి భాష దాదాపు కనుమరుగైంది. దాంతో చాలా మంది బౌద్ధులు ఇపుడు ఆంగ్లభాషపై ఆధారపడుతున్నారు. ఆయా ప్రాంతీయ భాషలను సైతం అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఆ అనువాదాలు, పాళి భాషలోని పదాలు పలకడం చాలామందికి కష్టంగానే అనిపిస్తోంది. సుతపీటక, వినయ పీటక, అభిదమ్మ పీటక గ్రంథాలు పాళి భాషలో, పాళి పేర్లతో రాశారు. ధర్మం అనే సంస్కృత పదానికి పాళి మాట ‘ధమ్మ’. అందుకే ‘బౌద్ధ ధమ్మ’ అని వ్యవహరిస్తారు.
గత రెండున్నర వేల సంవత్సరాలలో అనేక భాషలు, సంస్కృతులు, మతాలు, తెగలు కనుమరుగయ్యాయి. అందులో పాళి భాష కూడా ఒకటి. అందుకే చాలామంది బౌద్ధం తన సహజత్వాన్ని, సారళ్యతను, ఒరిజినాల్టీని కోల్పోయిందని వ్యాఖ్యానిస్తారు. ఆ విషయం స్పష్టంగా అంతటా కనిపిస్తోంది. ఇతరులు బోధిస్తున్నట్టుగా ‘ ధ్యానం’ బోధించడానికే ఇప్పుడు బుద్ధిస్టులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘‘సంతోషాన్ని ఆర్జించాలంటే ధ్యానాన్ని నమ్ముకోవాల’’ని అంటున్నారు. సంతోషంగా జీవించడమే కీలకమన్న మాటను నొక్కిమరీ చెబుతున్నారు.
అయితే, వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్లను, స్మార్ట్ఫోన్లను వాడుతున్న వారి సంఖ్య అపారంగా కనిపిస్తోంది. దాంతో బౌద్ధ మత పవిత్రత క్రమంగా మసకబారుతోంది. ఆధ్యాత్మిక, అలౌకిక భావనలు గాక, ఆధునిక, భౌతిక, లౌకిక భావనలు, ఆలోచనలతో కాలం గడిపే వారే కనిపిస్తారు. దీంతో బౌద్ధంతో ఎక్కడ ‘లంకె’ తెగిపోతుందో..? అన్న ఆందోళనతో బౌద్ధ సన్యాసులు ధ్యానంతోపాటు ధమ్మ బోధ చేస్తున్నారు. ఈ బోధ- ప్రార్థనలు సైతం తమ పూర్వ రూపంలో గాక అనేక సంస్కరణలతో, ఆయా ‘యాస’లతో, ఆయా పద్ధతుల్లో పలుకుతున్నారు.
పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ‘అర్బన్ బుద్ధిస్టులు’ మోంజెస్ బుద్ధిస్టా పేర బ్రిటన్‌లో బౌద్ధ విగ్రహం ముందు గాయత్రి మంత్రాన్ని ఆంగ్ల యాసలో పలుకుతూ కనిపిస్తారు. ‘ఓం..’ అనే పదం పట్ల మక్కువ పెంచుకుని ఆ పదం అం దించే ప్రకంపనలకు, స్ఫూర్తికి ‘్ఫదా’ అవుతున్నారు.
ఏ సనాతన ధర్మా న్ని నిరసించి, వ్యతిరేకించి దానికి ప్రచ్ఛన్నంగా వ్యవహారాల్ని తీసుకొచ్చిన బౌద్ధమతం చివరికి ఆ స నాతన ధర్మానికి గుం డె కాయ లాంటి గాయత్రి మంత్రంతో అనుసంధానమై చక్క ర్లు కొడుతోంది. ఆగ్నేయాసియా దేశాలన్నిటా సనాతన హిందూ ధర్మంతో బౌద్ధం జమిలిగా కొనసాగుతోంది. మలేసియా లాంటి దేశాల్లో బౌద్ధం కన్నా ముస్లిం మతం అవలంబించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఆయా దేశాల్లో ముస్లింలకు- బౌద్ధులకు ఘర్షణలు కొనసాగుతున్నాయి, హింస చెలరేగుతోంది. అహింసను ప్రాథమిక అంశంగా బోధించే బుద్ధిస్టులు ఇప్పుడు ‘ఆయుధాలు’ చేబడుతున్నారు. ‘అగ్గి’తో ఆడుకుంటున్నారు.
మానవజాతి చరిత్రలో తొలిసారి ఒక వ్యక్తి రూపాన్ని విగ్రహంగా మలిచి పూజించడం, ఆరాధించడం బుద్ధుని విషయంలోనే జరిగింది. అతడినే భగవంతుడిగా కొలుస్తున్నారు. వాస్తవానికి దేవుడు లేడని గట్టిగా వాదించి, బోధించిన బుద్ధుడినే దేవుడిగా మార్చారు. కర్మకాండలను నిరసించిన బుద్ధుడి మాటల్ని విస్మరించి ఆయన అనుయాయులు మరో రూపంలో కర్మకాండలను చేపట్టారు.
ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఏ మతమైనా, ఏ ధర్మమైనా యథాతథంగా చిరకాలం నిలవదు, కొనసాగదని తేలుతుంది. ఈ సూక్ష్మ అవగాహనను, ఇంగిత జ్ఞానాన్ని పట్టించుకోకుండా ఇంకా బౌద్ధ సన్యాసుల సంఖ్యను పెంచి, వారిని ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా ‘్ధమ్మ’ అధ్యయనంతో కాలం వెలిబుచ్చమని నిర్దేశిస్తూ, భిక్షాటన చేయమని ఓ పాత్రను మెడలో వేయడం 21వ శతాబ్దంలో సబబుగా ఉంటుందా? సహజమైన దివ్యత్వం, పవిత్రత, ప్రాసంగికత, పరిస్థితులు లుప్తమవుతున్నాయని ఓవైపు వాపోతూ బలవంతంగా ఇలా మతాన్ని కాపాడుకునే ‘యావ’ను వ్యక్తం చేయడం అన్యాయం.
క్రీస్తుశకం 70వ సంవత్సరంలో కశ్మీర్‌లోని కుండల్ వనం ప్రాంతంలో రాజు కనిష్క ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ బౌద్ధ మహాసమ్మేళనంలో బౌద్ధం నిట్టనిలువునా చీలింది. బుద్ధుని ‘ఒరిజనల్’ బోధ కీలకమని, దేవుడు లేడన్న వాదనకు కట్టుబడి, పూజాదికాలను వ్యతిరేకించేవారు ‘‘హీనయానులు’’గాను, ‘లేదు-లేదు సంస్కరణలు అవసరం, బుద్ధుడు దేవుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఆరాధించాలని, పూజించాలని గట్టిగా పట్టుపట్టిన వారు ‘‘మహాయానులు’’గాను విడిపోయారు. ప్రతి వ్యక్తి తన ‘ముక్తి’కోసం సాధన చేయాలని బుద్ధుడు చెప్పింది, కోరుకున్నది అదేనని హీనయానాన్ని బలపరిచే వారంటే, ఆ విధానం కఠినమైనది, ఆ ప్రక్రియను సామాన్యులు అవలంబించలేరు కాబట్టి ‘బోధిసత్వ’తో సరిపెట్టాలంటే బుద్ధ భగవానుడిని పూజించి ‘‘ముక్తి’’పొందవచ్చునని మహాయానాన్ని బలపరిచేవారు సిద్ధాంతీకరించారు. విగ్రహారాధన కూడదని హీనయానులంటే, సామాన్యులకు స్పూర్తికలిగించి వారికి ‘జ్ఞానోదయం’ కలగాలంటే బుద్ధ విగ్రహారాధన తప్పనిసరని మహాయానులు వాదించారు. బుద్ధుడు కేవలం ఆచార్యుడని హీనయానులంటే, అతడు భగవానుడని మహాయానుల వాదన. సాధారణ ప్రజల భాష పాళికి ప్రాముఖ్యమివ్వాలని హీనయానులంటే, కాలం మారింది గనుక సుసంపన్నమైన సంస్కృత భాషను ఆశ్రయించాలని మహాయానులు అంటారు. అతి సాధారణ జీవితాన్ని జీవిస్తూ బుద్ధుని అడుగుజాడల్లో కొనసాగాలని హీనయానులంటే, బుద్ధుని తరువాత శతాబ్దాలు గడిచాయి, కాలంతోపాటు అనేక మార్పులు చోటుచేసుకున్నాయి కాబట్టి ఆ జీవనంలో సంస్కరణలు ప్రవేశపెట్టి కొన్ని తళుకు-బెళకులను అద్దాల్సిందేనని మహాయానుల వాదన.
ఇలా ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అనడం ప్రారంభమై రెండు వేల సంవత్సరాలైంది. ఈ రెండు వేల ఏళ్ళలో గంగానదిలో ఎంతో నీరు ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది. దాంతో చీలిపోయిన ఈ రెండు వర్గాలలోనూ అనేక వ్యత్యాసాలు పొడసూపాయి. దాంతో అసంఖ్యాక బౌద్ధ ‘‘్ఛయలు’’ నేడు అంకురించాయి. ఈ సంఘర్షణలో, కొట్లాటలో, వాదులాటలో అసలైన బౌద్ధ బోధనలు మసకబారిన మాట పరమ సత్యం.
ఒకానొక దశలో మద్యం, మిథునం, ధనం, బంగారం, అలంకరణ.. ఇట్లా బౌద్ధం వేటినైతే నిషేధించిందో వాటినే ‘పచ్చి’గా బౌద్ధంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఆ ధర్మాన్ని కాపాడుకునే తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో పెడ ధోరణులు శతాబ్దాలుగా బౌద్ధంలో కొనసాగుతున్నాయి. మానవ బలహీనతలన్నీ అందులో దర్శనమిస్తాయి. మయన్మార్, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లో బౌద్ధ సన్యాసులు మాదక ద్రవ్యాలు- తుపాకుల అమ్మకంలో మునిగి తేలినట్టు వార్తలు గుప్పుమన్నాయి. స్వలింగ సంపర్కులు బయటపడ్డారు, సెక్స్ రాకెట్లలో అరెస్టయ్యారు. హింసకు పాల్పడిన కేసుల్లో జైళ్ళ పాలయ్యారు. నిధుల కుంభకోణాల్లో, అక్రమ వ్యాపారాల్లోనూ బౌద్ధ సన్యాసులు కనిపిస్తున్నారు. వీటన్నింటినీ తలచుకుంటే బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలు ఎలా ఆవిరయ్యాయో, నిర్వీర్యమయ్యాయో తేటతెల్లమవుతుంది. జీవితంలో దుఃఖం, విషాదం, బాధ ఉన్నాయి. కాని వాటిని అధిగమించడానికి మార్గం మాత్రం త్రిరత్నాలలో లేదని తేలిపోయింది.
కొసమెరుపు ఏమిటంటే- బౌద్ధం లోకంలోని దుఃఖాన్ని తొలగించడానికి బయలుదేరి ‘శూన్యవాదం’లో తేలింది. ఇది పలాయనవాదం గాక ఏమవుతుంది? 21వ శతాబ్దంలో బుద్ధుని ‘జ్ఞానోదయం’ కోసం సాధారణ ప్రజలు పాకులాడాల్సిన అవసరం లేదు. కేవలం సమకాలీన సమాజపు ఆనుపానులు తెలిపే ‘‘జ్ఞానం’’- నైపుణ్యం, తెలివిడి కావాలి. అందుకు సరైన అవగాహనతో, ఆధునిక విద్యతో అడుగు ముందుకేయాలి. శీలం- విలువలు వాటిననుసరించే వస్తాయి. అందుకే బుద్ధం శరణం గచ్ఛామి బదులుగా ‘జ్ఞానం’ శరణం గచ్ఛామి అని నినదించే సమయమిది.

-వుప్పల నరసింహం 99857 81799