Others

తరాల అంతరం.. తగ్గితే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్లు, ఆధునిక ఫ్యాషన్లు, విలాసాలు, ప్రేమ వ్యవహారాలు వంటి విషయాల్లో తల్లిదండ్రులకు, టీనేజీ పిల్లలకు మధ్య తరచూ భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అనునిత్యం స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేసే టీనేజీ పిల్లల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య మాటల యుద్ధం తప్పడం లేదు. ఫోన్ల కారణంగా పిల్లల చదువు పాడైపోతుందన్నది పెద్దల మనోవేదన అయితే, కాసేపు ‘సెల్’తో గడిపితే జీవితమే వృథా అయిపోయినంతగా గొడవ చేస్తారెందుకన్నది పిల్లల వాదన. స్నేహితుల పుట్టినరోజు పార్టీకి వెళ్లాలని టీనేజీ పిల్లలు పేరెంట్స్‌ను అడుగుతారు. రాత్రంతా పార్టీ పేరుతో లేనిపోని అలవాట్లకు బానిసలుగా మారిపోతారేమోననే భయంతో- వెళ్లవద్దని తల్లిదండ్రులు వారిస్తే ఇక ఆరోజునుంచి ఇంట్లో వాతావరణం యుద్ధ మేఘాలను కమ్ముకొంటుంది. భోజనం మానేసి, ఏదో బ్రహ్మాండం బద్దలు అయినట్లుగా వౌనంగా ఒకమూలన పిల్లలు కూర్చోవడం చూస్తుంటాం.
పిల్లలు ఎప్పటికీ చిన్నవయసులోనే ఉంటేనే బాగుంటుందని అనుకుంటారు అమ్మానాన్నలు. పిల్లల వయసు పెరిగేకొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజమే.. టీనేజీ పిల్లలతో తల్లిదండ్రులకు కొన్ని సమస్యలు రావడం సహజమే. యుక్తవయసు పిల్లలు ఇలా ప్రవర్తించేందుకు చాలా కారణాలున్నాయి. పిల్లలు పెరుగుతూ పెద్దవాళ్లవుతున్నారంటే శారీరక మార్పులేకాక వారిలో మానసికంగా వచ్చే మార్పుల ఫలితంగా- తల్లిదండ్రుల మాటలకు ‘నో’ చెప్పడం ప్రారంభిస్తారు. అది పిల్లల తప్పుకాదు అని మనం గుర్తించాలి. ‘నేను ఎదుగుతున్నాను, నాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. నేను నా సొంత కాళ్ళమీద నిలబడుతాను..’ అనే ధోరణి వారిలో అలవడుతుంది. ఇలాంటి మార్పులన్నింటినీ చూసి ఏదో జరిగిపోతుంది, పిల్లలు పాడైపోతున్నారని ఆందోళన చెందడం, వారిపై మితిమీరిన అజమాయిషీ చేయడం సత్ఫలితాలను ఇవ్వదని పేరెంట్స్ గుర్తించాలి. చాలా సున్నితంగా, పిల్లల మనసులను హత్తుకునేలా మాట్లాడుతూ వారిని మార్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
ఇంట్లో తల్లిదండ్రులు చెబుతున్న విషయాలకు, బయటి ప్రపంచానికి, తాము పెరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రకాల ఆలోచనలను పిల్లల మనసులను తొలుస్తుంటాయి. ఇటువంటి సందర్భంలో వారు మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. స్నేహితులు, సమాజంలో మిగతావారు చేసే పనులు చేయాలా? తల్లిదండ్రులు కోరుకుంటున్న పనులనే చేయాలా? అన్న మీమాంసతో వారు సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కోరుకుంటున్నదానికి భిన్నంగా పిల్లల ప్రవర్తన కనిపిస్తుంది.
తరాల వ్యత్యాసం...
పాత తరానికి, కొత్త తరానికి ఉన్న వ్యత్యాసంలో సామాజిక పరిస్థితుల్లో, జీవనశైలిలో వచ్చిన మార్పులను తల్లిదండ్రులు గుర్తించాలి. అప్పుడు పిల్లలుచేసే ప్రతి పని తమ మనోభావాలకు విరుద్ధంగా చేస్తున్నారనే భావన వారిలో తగ్గుతుంది. పిల్లలు చేసే పనులపై ప్రదర్శించే కోపాన్ని, వారిపై తమకున్న ప్రేమను విడివిడిగా చూపగలగాలి. తల్లిదండ్రులకు, టీనేజీ పిల్లలకు మధ్య ఉన్న సంబంధాలు మంచిగా ఉన్నంతవరకే గౌరవం, భక్తి, భయం ఉంటాయి. పాత తరం, ప్రస్తుత తరానికి మధ్య ఆలోచన విధానం, జీవనశైలి, అభిరుచుల్లో తేడా ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకు హానిచేయని మార్పులను పేరెంట్స్ అంగీకరించే ప్రయత్నం చేయాలి.
సానుకూల దృక్పథం...
పిల్లలు మాట్లాడే మాటలకు విలువనివ్వక- ‘నా కడుపున పుట్టిన నువ్వు నాకు చెప్పేంత మొనగాడి వయ్యావా?’ వంటి మాటలు పిల్లల మనోభావాల్ని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. పిల్లల అభిప్రాయాల్ని గౌరవిస్తూనే అందులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో.. వాటివల్ల కలిగే అనర్థాలేమిటో వివరించే ప్రయత్నం చేయాలి. దీని ఫలితంగా తల్లిదండ్రుల పట్ల పాజిటివ్ దృక్పథాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారు.
మానసిక పరివర్తన...
టీనేజీ పిల్లలు కోరుకుంటున్న స్వేచ్ఛ, వారు వ్యక్తం చేసే అభిప్రాయాలు మానసిక పరివర్తనను సూచిస్తాయి. పిల్లల్ని నిర్దేశించడంలో, నియంత్రించడంలో, వారికి రక్షణ కల్పించడంలో, కాపాడుకునే ప్రయత్నం చేయటంలో సమతుల్యత కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
లక్ష్యం వైపు అడుగులు...
టీనేజీ వయసులోని పిల్లల్ని అదుపులో పెట్టడం అంటే రోజూ వాళ్లుచేసే పనుల పట్ల వ్యతిరేకత, బాధను వ్యక్తం చేయడం కాదు. వారి ప్రవర్తన గురించి ఎవరికిపడితే వాళ్లతో చెప్పడమూ కాదు. వాళ్లకు బాధ్యత కల్పించాలి. వాళ్లు ఏం చేస్తున్నారో, అందులో విజేతలుగా నిలబడేందుకు అవసరమైన విషయాలు వారితో చర్చించాలి. ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లల్లో బాధ్యత కలిగేలా చేస్తే ఆ తర్వాత స్వేచ్ఛను వాళ్లు ఏమాత్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. బాధ్యత లేని స్వేచ్ఛ వారి జీవితాన్ని ఎటైనా తీసుకువెళ్లచ్చు. బాధ్యతతో కూడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మాత్రం కోరుకున్న లక్ష్యం, గమ్యం వైపే అడుగులు వేయిస్తాయి.
స్నేహితులను ఆహ్వానించండి...
టీనేజీ పిల్లల స్నేహితుల్ని ఇంటికి రమ్మనాలి, స్నేహితుల ప్రవర్తనను తల్లిదండ్రులుగా గమనించి వారి ప్రభావం తమ పిల్లలపై ఎంతవరకు ఉంటుందో గుర్తించవచ్చు. స్నేహితులతో వారి ప్రవర్తననూ దగ్గర్నుంచి గమనించవచ్చు. ఇలా ఇంటికి పిల్లల స్నేహితులను పిలవడం వల్ల తల్లిదండ్రుల పట్ల స్నేహభావాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తుంది.
ఆకర్షించే అంశాలు...
మద్యం, డ్రైవింగ్, డ్రగ్స్, ఆకర్షణలు, సెక్స్.. ఇవన్నీ టీనేజీ పిల్లలను అమితంగా ఆకర్షించే అంశాలు. వీటివల్ల కలిగే పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పటం తల్లిదండ్రుల బాధ్యత. వీటి గురించి నిస్సందేహంగా పిల్లలతో చర్చించాలి, అనుమానాలను నివృత్తి చేయాలి. కంటికిరెప్పలా కాపాడుకోవాలి. స్వేచ్ఛాయుత ప్రపంచంలోనే వాళ్లని ఎదగనివ్వాలి. యుక్తవయసులో అడుగుపెట్టగానే ప్రత్యేక గుర్తింపు పొందాలని పిల్లలు తహతహలాడిపోతూ ఉంటారు. తమకంటూ ఓ ఐడెంటిటిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని, అందుకు తగిన స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలి. అలాగని చెడు స్నేహాలతో పక్కదారి పడకుండా కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మానాన్నలపైనే ఉంది.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321