Others

ఇది కాలాన్ని వెక్కిరించడమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్యూనిస్టు మేనిఫెస్టో (కమ్యూనిస్టు ప్రణాళిక) పుస్తకం మరోసారి ప్రచారంలోకి వచ్చింది. 1848 ఫిబ్రవరి 21న తొలిసారి జర్మనీ భాషలో ప్రచురితమై అనంతరం అనేక భాషల్లోకి తర్జుమా అయింది. తాజాగా వివిధ భారతీయ భాషల్లో లక్ష ప్రతులను ప్రచురించి ఫిబ్రవరి 21న అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వాస్తవానికిది ఓ పార్టీ మేనిఫెస్టో. ఆయా రాజకీయ పార్టీలు తమ అవగాహనను, ఆలోచనను, అభిప్రాయాల్ని, ఆకాంక్షల్ని పొందుపరిచి పుస్తకంగా ప్రచురించడం అందరికీ తెలిసిందే.. అదే తరహాలో కమ్యూనిస్టుపార్టీకోసం ఆ మేనిఫెస్టోను కారల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ 1848లో రాశారు. 172 ఏళ్ళ క్రితం తొలిసారి ప్రచురితమైన ఆ భావ సంచయం, ఆలోచనల గుచ్ఛం, అభిప్రాయాల మాల ఇప్పటికీ ప్రాసంగికమేనని తాజా పుస్తకావిష్కరణ సందర్భంగా ఢిల్లీ, హైదరాబాద్‌లో వక్తలు ఆవేశంగా మరోసారి ప్రకటించారు. ఓ పార్టీ ‘మేనిఫెస్టో’గా ఆవిష్కృతమైన ఈ ‘‘పుస్తకం వర్తమాన ఆర్థిక- రాజకీయ సంక్షోభాలకు పరిష్కారం చూపగలద’’ని సీపీఎం పార్టీ నాయకుడు రాఘవులు, సీపీఐ నాయకుడు నారాయణ తదితరులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనూ అనేకమంది కమ్యూనిస్టు నాయకులు ఇవే అభిప్రాయాల్ని గుడ్డిగా వల్లెవేశారు. వంద సంవత్సరాల క్రితం ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతే సానుభూతితో అర్థం చేసుకునే అవకాశముంది. కానీ 21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానం ఉచ్ఛదశకు చేరుకుని సమాజపు డైనమిక్స్ సంపూర్ణంగా మారిపోయి, సరికొత్త కక్ష్యలో సమాజం కొనసాగుతున్న సందర్భంలోనూ అవే చిలుక పలుకులు పలికితే అవెలా అద్భుత వాక్యాలు.. మహాద్భుత ఆలోచనలవుతాయి? ఈ మాత్రం ఇంగితజ్ఞానం లేకుండా ఒకరి తరువాత ఒకరు ఆ పాత పాటనే పాడితే ప్రజలకు ఒరిగేది ఏమిటి? కొత్తతరాలకు అందే ‘‘ఆదర్శం’’ ఏమిటి?
ప్రపంచంలో ఆర్థిక-రాజకీయ సంక్షోభాలు ఎదురైన ప్రతిసారీ వాటి పరిష్కారానికి కమ్యూనిస్టు మేనిఫెస్టో ఆయుధంగా ఉపయోగపడిందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు అన్నారు. ఈ విషయాన్ని గతంలోనూ అసంఖ్యాక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రణాళిక ప్రపంచ ఆర్థిక - రాజకీయ సంక్షోభాల పరిష్కారానికి ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎంత అశాస్ర్తియత దాగున్నదో ఏమాత్రం ఆలోచనాశక్తి ఉన్నవారికైనా అవగతమవుతుంది! ప్రస్తుతం నాల్గగ పారిశ్రామిక విప్లవం వెలుగులో ఆవిష్కృతమవుతున్న అనేక సాధనాల నేపథ్యంలో, అవి ప్రజాబాహుళ్యంలోకి పెద్దఎత్తున వచ్చాక వాటి సహాయంతో ప్రజలు సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్న వేళ సమాజం సంపూర్ణంగా ‘రీ డిజైన్’ అయి, సరికొత్త ‘ఎత్తు’లో నిలువగా తొలి పారిశ్రామిక విప్లవంనాటి ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ గూర్చి కలవరించడం ఏరకంగా సముచితం? వర్తమాన సమాజం 172 ఏళ్ళ క్రితం డైనమిక్స్‌తో కొనసాగుతున్నదన్న భ్రమలో బతుకుతూ ఇతరులను సైతం ఆ భ్రమల్లోకి లాగడం, ఆకర్షించడం పూర్తిగా అన్యాయం. ఓ రకంగా ప్రజలను మోసగించడమే తప్ప ఇది మరొకటి కాదు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు ఈ మేనిఫెస్టో గట్టి జవాబు ఇస్తుందని తాజాగా సిపిఐ నేత నారాయణ ఢిల్లీలో అన్నారు. ఇట్లా ఆయా నాయకులు తమతమ చైతన్యంమేరకు ఇలా అన్వయించుకుని ప్రవచనాలు చేస్తే అది శాస్ర్తియమవుతుందా? ఆర్‌ఎస్‌ఎస్‌కు కమ్యూనిస్టు మేనిఫెస్టోకు ఏ రకమైన సంబంధమున్నదో నారాయణకే తెలియాలి. ఆర్‌ఎస్‌ఎస్ ఓ సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థ లాంటిది. దాని పని విధానం... ఆలోచనాధారకు 172 ఏళ్ళ క్రితం రాసిన పత్రానికి ఎలా సంబంధముంటుందో ఆయనకే తెలియాలి. ఈ ఒక్క విశే్లషణతో వారి అవగాహన ‘పదును’ ఏమాత్రమో తెలుస్తోంది.
మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అన్న వాక్యాలతో ప్రారంభమయ్యే ఆ ప్రణాళికను కమ్యూనిస్టులు ఎంతో పవిత్రంగా భావిస్తారు, తలపై పెట్టుకుంటారు. మానవ పరిణామక్రమం గూర్చి పరిశోధనలుచేసిన డార్విన్‌తో సహా మానవ పరిణామ శాస్తవ్రేత్తలెవరూ మానవ జాతి చరిత్ర వర్గపోరాటాల చరిత్ర అని పేర్కొనలేదు. వేల సంవత్సరాల క్రమ వికాసం...అనుకరణ- అనుసరణతో మానవ గుంపులు, తెగలు, జాతులు, ఉప జాతులు, వీటిమధ్య ఆధిపత్యం, తమలో కలుపుకోవడం, బహిష్కరించడం కనిపిస్తోంది తప్ప మరొకటికాదు. తెగలు, జాతులు, ఆటవిక గుంపులమధ్య గల వైరుధ్యాలను... వేల సంవత్సరాలు కొనసాగిన ఈ జీవనాన్ని సైతం కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ వర్గపోరాటాల ‘ఖాతా’లో జమచేసి తమ అభిమానుల్ని, ఆరాధకుల్ని ‘అంధుల్ని’చేశారు. ఆ అంధత్వం శతాబ్దానికి పైగా కొనసాగడం, కొనసాగేలా చూడటం విడ్డూరం... విషాదంగాక ఏమవుతుంది? చరిత్రను నిరపేక్షకంగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా అధ్యయనం చేయడంలోనే సార్ధకత కనిపిస్తుంది. కాని కారల్‌మార్క్స్ ఆయన సహచరుడు ఏంగిల్స్ మాత్రం పక్షపాత వైఖరితో అధ్యయనం చేశారు. దాంతో ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది. కార్మిక వర్గ పక్షపాతం... శ్రమజీవులు, సంపద సృష్టి, పంపకం, అదనపు విలువ ఇలా అంతటా హ్రస్వదృష్టి తాండవమాడింది. ఆడమ్‌స్మిత్ మార్కెట్ల విశే్లషణకు మార్క్స్ పరిశీలనకు భూమి ఆకాశమంత వ్యత్యాసం కనిపిస్తోంది. అవే మార్కెట్లు, అదే శ్రమ, అదే ఉత్పత్తి, అదే పంపిణీ, అదే వినియోగం కాని ఆడమ్‌స్మిత్ సహజ దృష్టి కోణానికి, మార్క్స్-ఏంగిల్స్ ‘పక్షవాత’ దృష్టికోణానికి హస్తిమశకాంతరమున్నది.
ఈ అంతరాన్ని ప్రతిపాదించడంతోనే మార్క్స్‌ను చారిత్రక పురుషుడుగా, దార్శనికుడిగా, గొప్ప విప్లవకారుడిగా, దోపిడీని అరికట్టేందుకు తొలిసారి మార్గంచూపిన మార్గదర్శకుడిగా కొనియాడారు. కీర్తనలు అందుకున్నారు. మానవ పరిణామశాస్తజ్ఞ్రుల మాట, ప్రకృతి అధ్యయనకారుల ఆలోచనలు, తత్వవేత్తల వివేచన, అప్పటికే ఎంతో ఎత్తుకు ఎదిగిన మానసిక శాస్త్రం (సైకాలజీ), భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం అన్నింటిని ఎడమచేత్తో పక్కకుతోసేసి మానవ జాతి చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అన్న ఉపోద్ఘాతంతో వీరంగంవేస్తే అందులో కనిపించిన మెరుపులు, మిణుగురులకు తాదాత్మ్యం చెంది మూర్చనలు పోతే ఎలా? విజ్ఞత లేకుండా 170 ఏళ్ళకు పైగా ‘‘వర్గరహిత సమాజం’’ కలలు కనడమంటే కాలాన్ని వెక్కిరించడమే..
ఆ ఒక్కమాట ఎంత ప్రమాదకరమైనదో ఊహించకుండా తరాలకుతరాలను ప్రపంచవ్యాప్తంగా వంచించడం దారుణం. పైగా సమసమాజం (సోషలిజం) నిర్మిస్తామని వాగ్దానంచేస్తూ పొద్దుగడపడం, అబద్ధం పలకడం అత్యంత దారుణం వర్గరహిత సమాజం... సమసమాజం చరిత్రలో... ఎప్పుడూ లేదు... భవిష్యత్‌లోనూ ఏర్పడదు. మనిషి ‘ఆవరణం’ ఆవిధంగా నిర్మితం కాలేదన్న వౌలిక అంశం విస్మరించి కారల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్‌లు ఊహాగానం చేశారు. ఆ ఊహా కమ్యూనిజం శాస్ర్తియమైనదని, సైన్స్ అంత నికార్సయినదని, డైలెక్టిక్స్‌ను ప్రవచించి మోసగించారు. కమ్యూనిస్టు వ్యవస్థలో, పార్టీలో పైనుంచి కిందివరకు అసంఖ్యాక అంతరాలున్నాయి. అలా అంతరాల్లో జీవిస్తూ సమసమాజం కబుర్లుచెప్పడం విషాదం. నిజానికి మార్క్సిజం శాస్ర్తియమైనదైతే నామరూపాలు లేకుండా భౌగోళం నుంచి ఎందుకు తుడిచిపెట్టుకుపోతుంది? తొలిసారి కమ్యూనిజం ప్రయోగంచేసిన సోవియట్ యూనియన్ ఎందుకు కుప్పకూలుతుంది? చివరికి లెనిన్ విగ్రహాలను సైతం అక్కడి ప్రజలు ఎందుకు ధ్వంసం చేస్తారు? తూర్పుయూరప్ అంతటా ఎందుకు కమ్యూనిజం తెరమరుగైంది?
కృత్రిమమేధగల సోఫియోలాంటి హ్యూమనాయిడ్ రోబోలు పౌరసత్వం అందుకుంటూ, ప్రజాజీవనంలో కలిసిపోతున్న సందర్భంలో ఉత్పత్తి సంబంధాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నవేళ, మానవుని దృక్పథం సంపూర్ణంగామారి సమాజం పూర్తిగా ‘‘రీడిజైన్’’అయిన సమయంలో.. ఈ జీవితానికి, ఈ ఉత్పత్తికి, టెక్నాలజీకి, ఈనాటి ఆకాంక్షలకు ఎక్కడా ‘కనెక్ట్’కాని... సంబంధంలేని, కాలంచెల్లిన 172 సంవత్సరాల క్రితంనాటి అభిప్రాయాలకు కిరీటం తొడిగి ప్రదర్శించబూనుకోవడం అర్థరహితం... కాలానుగుణమైన ‘‘చర్య’’ అసలే కాదు. మరెందుకీ ఆత్మవంచన? ఓ భావజాలం ‘సమాధి’ కాకూడదని బలవంతంగా దానికి ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నించడంలో ఏమాత్రం మాన్యతలేదు. ఆడమ్‌స్మిత్ ఆయన సమకాలికులు కనుమరుగై కొత్త ‘‘సంయోగాలు’’, సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ బిహేవియరల్ ఎకనామిక్స్, డిజిటల్ ఎకనామిక్స్ పురుడు పోసుకున్న సందర్భంలో వర్గపోరాట సిద్ధాంతం, ‘రెడ్‌బుక్’ పేజీల ‘వనె్న’ తగ్గింది. ఆ విషయం పరిగణనలోకి తీసుకోకుండా చర్విత చరణంగా, మానవాళి ఉన్నంతకాలం కమ్యూనిస్టు ప్రణాళిక ఉంటుందని తమనితాము సంతృప్తిపరచుకునే వాక్యాలవల్ల మానవాభ్యుదయం విస్తృతమవదు. గత 50 ఏళ్ళకు పైగా ప్రపంచమంతటా ఇది రుజువైయ్యాక కూడా లక్ష కాపీల ప్రచురణతో కమ్యూనిస్టు ప్రణాళికకు పూర్వవైభవం తెస్తామనుకోవడం ఎంతటి అమాయకత్వం? ఇప్పుడు జ్ఞానం కమ్యూనిస్టు మేనిఫెస్టోలో కాదు సూపర్ కంప్యూటర్‌లో ఉందని గ్రహించనంత కాలం ఇలా ‘సింక్’కాని పదాల ముసుగులో వాళ్ళు తల దాచుకోవలసిందే!

- వుప్పల నరసింహం, 9985781799