తూర్పుగోదావరి

పెల్లుబికిన అసంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెల్లుబికిన అసంతృప్తి!
కలెక్టర్, రెవెన్యూ అధికారులపై ఎంపి, ఎమ్మెల్యేల ఆగ్రహం: రచ్చకెక్కిన పెట్రో వర్సిటీ తరలింపు వ్యవహారం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 23: జిల్లా కలెక్టర్ సహా రెవెన్యూ యంత్రాంగంపై ప్రజాప్రతినిధుల్లో ఇంతకాలం నివురు గప్పిన నిప్పుగా దాగివున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకు పెల్లుబికింది. ముఖ్యంగా అధికారిక కార్యక్రమం కాకపోయినా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం సాక్షిగా అధికారులపై జిల్లాకు చెందిన ఎంపిలు ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెట్రోలియం విశ్వ విద్యాలయం తరలింపు వ్యవహారాన్ని అజెండాగా చేసుకుని, కలెక్టర్ సహా ఇతర అధికారులను టార్గెట్‌గా చేసుకుని తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటువంటి కలెక్టర్, రెవెన్యూ అధికారులు మనకు అవసరమా? అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీంతో జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు-స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య అగాధం ఏర్పడినట్టు రూఢీ అవుతోంది.
జిల్లా కేంద్రం కాకినాడలోని మెహర్‌నగర్‌లో శనివారం సృష్టి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు అధ్యక్షత వహించారు. పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అనివార్య కారణాల వలన ఈ సమావేశానికి హాజరుకాలేకపోయినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. సమావేశంలో రాజమండ్రి, అమలాపురం ఎంపిలు ఎం మురళీమోహన్, పి రవీంద్రబాబులు కలెక్టర్, రెవెన్యూ అధికారులను కార్నర్ చేస్తూ మాట్లాడారు. పెట్రో వర్సిటీకి ముందుకు కేంద్రం 500 ఎకరాలు అవసరమని అడిగిందని, రాజమండ్రిలో తాము స్థలం చూపించగా అది 100 ఎకరాలు మాత్రమే ఉండటంతో మరో ప్రాంతాన్ని పరిశీలించాల్సి వచ్చిందన్నారు. కనీసం 150 ఎకరాలైనా జిల్లాలో అధికారులు చూపించకపోవడంతో విశాఖ జిల్లాకు ఈ వర్సిటీ తరలిపోయిందని వాపోయారు. మండపేట నియోజకవర్గంలో అవసరమైన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు చూపినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం ఎంపి డాక్టర్ పి రవీంద్రబాబు మాట్లాడుతూ సుమారు 900 కోట్ల పెట్టుబడులతో తూర్పు గోదావరి జిల్లాలో పెట్రో వర్సిటీ ఏర్పాటు కావల్సి ఉన్నప్పటికీ కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల నిర్వాకం కారణంగా పక్క జిల్లాకు తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా అధికారులపై ధ్వజమెత్తారు. పెట్రో వర్సిటీ విశాఖ తరలిపోయేందుకు కలెక్టర్, రెవెన్యూ అధికారులే కారణం అనే కన్నా అధికారులు మన మాటలు వినటం లేదని ఎందుకు గ్రహించడం లేదని ప్రశ్నించారు. పెట్రో వర్సిటీపై ఎంపి, ఎమ్మెల్యేలతో కలెక్టర్ ఎప్పుడైనా సమావేశం పెట్టారా? ఒకవేళ పెట్టి ఉంటే వర్సిటీ తరలిపోయి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అధికారుల అసమర్ధత, నిర్లక్ష్యం ప్రభుత్వంపై కూడా పడే ప్రమాదం ఏర్పడిందని సమావేశానికి హాజరైన ఇతర ప్రజాప్రతినిధులు వాపోయారు.
ప్రజాప్రతినిధులపై అసంతృప్తి...
సమావేశంలో అంతకు ముందే కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలు అధికారులను టార్గెట్ చేస్తే, కార్యకర్తలు నేతలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం గమనార్హం! జిల్లాలో దేవాదాయ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తదితర నామినేటెడ్ పదవులను ఇంతవరకు భర్తీ చేయకపోవడాన్ని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహ రుణాలు అందడం లేదని, రేషన్ డీలర్లు, అంగన్వాడీల పోస్ట్‌లను భర్తీ చేయడం లేదని విమర్శించారు. పార్టీ సమావేశాలకు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు సీరియస్‌గా హాజరుకావడం లేదని కార్యకర్తలు వాపోయారు. తమ బాగోగులు పట్టించుకునే నాయకులే కరవయ్యారంటూ జిల్లాలోని ఏజన్సీ మండలాలకు చెందిన కార్యకర్తలు ఆరోపించారు. ఏజన్సీ విలీన మండలాలను రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలపాల్సిందిగా కోరారు. అక్కడి పార్టీ ఇన్‌ఛార్జి కొమరం ఫణీశ్వరమ్మను మార్చి, ఆమె స్థానంలో శీతంశెట్టి వెంకటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. గడచిన 18నెలల కాలంలో ఆమె ఎక్కడా అందుబాటులో లేరన్నారు. ఇసుక విక్రయాలలో దొంగ బిల్లులు సృష్టించి, సుమారు 2 కోట్ల రూపాయలను స్వాహా చేసిందని ఆరోపించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉద్యమాలతో కాపులకు రిజర్వేషన్లు రావని, ఇటువంటి చర్యల వలన కాపులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కాపులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, 100కోట్లు కేటాయించిందన్నారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు 9నెలల కాల పరిమితితో నివేదిక వచ్చేలా చంద్రబాబు కమీషన్ నియమించారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, పులపర్తి నారాయణమూర్తి, పెందుర్తి వెంకటేష్, వేగుళ్ళ జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీలు కె రవికిరణ్‌వర్మ, బొడ్డు భాస్కర రామారావు, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నాయకులు కలగా శివరాణి, వావిలాల సరళాదేవి, బండారు సత్యానందరావు, జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా టిడిపి యువనేత నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్‌ను టిడిపి జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు తదితరులు కట్ చేశారు.
లోక్‌సభ సభ్యులకు సమాచారం అందించరా?
విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపిల ఆగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జనవరి 23: జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని లోక్‌సభ సభ్యులకు అధికారులు అందించటం లేదని లోక్‌సభ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. శనివారం రాజమహేంద్రవరంలోని రహదారులు, భవనాలశాఖ అతిథిగృహంలో జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి కమిటీ అధ్యక్షుడు రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ అధ్యక్షతవహించారు. తన లోక్‌సభ నియోజకవర్గంలో ఇపిడిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఇవ్వటం లేదని అమలాపురం ఎంపి పండుల రవీంద్ర ఎస్‌ఇ ప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తంచేసారు. అసలు ఇంత వరకు తనను ఎస్‌ఇ కలవలేదని, కనీసం తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందో, కేంద్రప్రభుత్వ నిధులతో జరుగుతున్న దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం కింద జరుగుతున్న కార్యక్రమాలను కూడా తనకు సమాచారం లేదన్నారు. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పనుల సమాచారాన్ని గానీ, తాను అడిగిన సమాచారాన్ని గానీ అధికారులు ఇవ్వటం లేదని అరకు ఎంపి కొత్తపల్లి గీత అసంతృప్తి వ్యక్తంచేసారు. మహిళా పొదుపు సంఘాలకు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీ ఇప్పటికీ మహిళా పొదుపు సంఘాల ఖాతాలకు జమకాలేదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధికారులను నిలదీసారు. మండపేట మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలకు మాత్రమే, అది కూడా తన కృషితోనే వడ్డీ రాయితీ జమయిందన్నారు. దీనిపై అమలాపురం ఎంపి పండుల రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అధికారుల తీరు వల్ల సరిగా అమలుకావటం లేదని, దీనివల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. లోపం ఎక్కడుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు.
మహిళా పొదుపు సంఘాలకు రాష్ట్రప్రభుత్వం విడుదలచేస్తున్న నిధులను కొన్ని బ్యాంకుల మేనేజర్లు తమ వద్దే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుని మూడు నెలలు తరువాత మహిళా సంఘాల ఖాతాలకు జమ చేస్తున్నారని, ఇలాంటి విధానాలకు పాల్పడుతున్న బ్యాంకు మేనేజర్లపై చర్యలు తీసుకోవాలని ఎంపిలను కోరారు. టాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరాచేస్తున్నట్టు కాగితాలపై లెక్కలు చూపిస్తున్నప్పటికీ, వాస్తవంగా అమలుకావటం లేదని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సర్పంచులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలకు అందించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. జిల్లాలో అధిక సంఖ్యలో మొక్కలు నాటినట్టు ప్రచారం చేస్తున్నారని, ఈ మొక్కలన్నీ పెరిగి ఉంటే ఈపాటికే మనం అడవి మధ్యలో ఉన్నట్టు ఉండాలన్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదన్నారు. మత్స్యకారుల గ్రామాల్లో ఉప్పునీటిని మంచినీరుగా మార్చే యూనిట్లను ఏర్పాటుచేసి తీర గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అమలాపురం ఎంపి పండుల రవీంద్ర సూచించారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తన ఎంపి నిధులతో తాగునీటి అవసరాలు తీర్చటానికి బోర్లు ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్లు, ఇతర కార్యక్రమాలపై విచారణ జరిపించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేసారు. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధికారులపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తంచేసారు. ఈ సమావేశంలో కలెక్టర్ అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్, చిర్ల జగ్గిరెడ్డి, ఆనందరావు, ఎమ్మెల్సీ రత్నాభాయి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రప్రభుత్వంలో బాగా పెరిగిన దుబారా
* ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం* లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జనవరి 23: రాష్ట్ర విభజన తరువాత ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం మాత్రం తీవ్ర దుబారా చేస్తోందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అసంతృప్తి వ్యక్తంచేసారు. శనివారం రాజమహేంద్రవరంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఉన్న కొద్దిపాటి నిధులతో రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సి ఉందని, కానీ ఆ పని జరగటం లేదన్నారు. పనికొచ్చే పనులకు డబ్బుల్లేవంటున్న రాష్ట్రప్రభుత్వం అనవసర కార్యక్రమాలకు నిధులను వృథాగా ఖర్చుచేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా నిధులను ఖర్చుచేయటం లేదన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోను లేని విధంగా ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు అవకాశాలు ఉన్నాయని, కానీ ప్రజలకు మాత్రం సరయిన వైద్య సహాయం అందటం లేదన్నారు. తక్కువ ఖర్చుతో మందులను తయారుచేయగల సత్తా కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఉందన్నారు. అయినా సరే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. పోలియో మందు బాగానే పిల్లలకు అందుతున్నప్పటికీ, ఇతర వ్యాధి నిరోధక టీకాలు 50శాతం మంది పిల్లలకు అందటం లేదన్నారు. పౌష్ఠికాహార లోపం, రక్తహీనతతో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని జెపి ఆందోళన వ్యక్తంచేసారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ, ఈ పథకాలు ప్రజలకు అందటం లేదన్నారు. ఇప్పటికీ 90శాతం మంది ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారని, ప్రయివేటు ఆసుపత్రికి వెళితే సగటున రూ.800, ప్రభుత్వాసుపత్రికి వెళితే సగటున రూ.400ఖర్చవుతోందన్నారు. ఈ సమస్యను చాలా తేలికగా పరిష్కరించేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోందన్నారు. 1లక్ష కోట్ల బడ్జెట్ ఏమవుతోందో ఎవరికీ అంతుబట్టకుండా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఆందించలేని రాజకీయాలు, అధికారం, ప్రచారం ఎందుకని జెపి ప్రశ్నించారు. అమెరికా వంటి సంపన్న దేశంలోనే ఇపుడు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతోందని, రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశమవుతోందన్నారు. వైద్యం, విద్య, స్థానిక సంస్థలు బలోపేతంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జెపి సూచించారు. వచ్చే బడ్జెట్‌లోనైనా వీటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
త్వరలో వెండి తెరకు మోక్షజ్ఞ
-వెల్లడించిన బాలకృష్ణ
రాజమహేంద్రవరం, జనవరి 23: తన కుమారుడు మోక్షజ్ఞ త్వరలోనే వెండితెరకు పరిచమవుతారని ప్రముఖ సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఆయన హీరోగా నటించిన డిక్టేటర్ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి నగరానికి వచ్చిన బాలకృష్ణ శనివారం ఉదయం టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ ఇంట అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ మరిన్ని మంచి చిత్రాల్లో నటించేందుకు డిక్టేటర్ చిత్రం స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఈచిత్ర విజయం నటుడిగా తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. అంచనాలకు మించి తన చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంపై పార్టీ నాయకులతో చర్చించిన తరువాత వెల్లడిస్తానన్నారు. ఈకార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీవాస్, నటులు పృధ్వీ, సీతారామ్, రచయిత శ్రీ్ధర్, ఎంపి మురళీమోహన్, మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్, డిప్యుటీ ఫ్లోర్‌లీడర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను శనివారం గన్ని కృష్ణ నివాసంలో ఘనంగా నిర్వహించారు. లోకేష్ మామగారు బాలకృష్ణ సమక్షంలో ఈవేడుకలు జరగడం విశేషం. ఈసందర్భంగా జన్మదిన కేకును కత్తిరించారు. స్వర్ణాంధ్ర మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి మణి ఆధ్వర్యంలో లారీడ్రైవర్లకు దుస్తులు పంపిణీ చేశారు.
కాపులను బిసిల్లో చేర్చాలి
కాపులను బిసిల్లో చేర్చేలా కృషిచేయాలని కాపు సామాజిక నేతలు బాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు. శనివారం గన్ని కృష్ణ ఇంటి వద్ద ఆయనను కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు.
వృద్ధునిపై కుక్కలు దాడి
రాయవరం, జనవరి 23: వృద్ధులపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మండలంలోని వి సావరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రజకపేటకు చెందిన వృద్ధుడు కొండపల్లి పల్లయ్య ఉదయానే్న ఇంటికి పాలు తీసుకునేందుకు వెళుతుండగా కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. వృద్ధుని కాలు వెనుక భాగంలో తీవ్రంగా గాయమైంది. బాధిత వృద్ధుడికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. సుమారు నాలుగు నెలల క్రితం కుక్కదాడిలో గాయపడిన పల్లయ్య చికిత్స పొందుతున్న తరుణంలో తిరిగి కుక్కల దాడిలో గాయపడడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో కుక్కలు గుంపుగుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయని, అధికారులు వీటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆధునిక పద్ధతిలో బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ
కాకినాడ, జనవరి 23: అత్యాధునిక పద్ధతిలో కోస్తాలో మొదటిసారిగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు నిర్ధారణ చేశారు. శనివారం అపోలో వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన 50 ఏళ్ళ తలారి చిన్నమ్మాయి అనే మహిళ తలనొప్పితో విపరీతంగా బాధపడుతూ చికిత్స నిమిత్తం తమను సంప్రదించిందని అపోలో న్యూరో వైద్యుడు ఎంవి కిరణ్‌కుమార్ తెలిపారు. ఆమెకు పరీక్షలు నిర్వహించి తలను ఓపెన్ చేయకుండా చిన్న సూది ద్వారా రంధ్రాన్ని చేసి స్కాన్ చేసి మత్తు ఇవ్వకుండా ముక్కను తొలగించినట్టు చెప్పారు. ఈ ముక్కను పరీక్షకు పంపగా ఎనాప్లాస్టిక్ ఎస్ట్రో సైటోమా అని నిర్ధారణ చేశారని చెప్పారు. ఈ వ్యాధిని కీమో థెరపీ చికిత్స ద్వారా నయం చేసినట్టు కిరణ్ తెలిపారు. ఈ చికిత్స తమ అపోలో అసుపత్రిలో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో అపోలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి సూర్యప్రకాశరావు, డాక్టర్ కామరాజు, ఎఓ ఐవి రమణ పాల్గొన్నారు.
ఆత్రేయపురం ఇసుక ర్యాంపులో విజిలెన్స్ దాడులు
‘్భమి’
వార్తకు స్పందన
ఆత్రేయపురం, జనవరి 23: ఆత్రేయపురం ఇసుక ర్యాంపులో శనివారం విజిలెన్సు శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నెల 21న ఆంధ్రభూమి జిల్లా అనుబంధంలో ‘గోదారమ్మకు గర్భశోకం!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విజిలెన్స్ అధికారులు స్పందించారు. విజిలెన్స్ బృందం శనివారం స్థానిక ఇసుక ర్యాంపును నిశితంగా పరిశీలించింది. శనివారం సాయంత్రం 5గంటల నుండి రాత్రి పది గంటల వరకూ ఈ పరిశీలనా ప్రక్రియ కొనసాగింది. విజిలెన్స్ డిఎస్పీ రాజేంద్రకుమార్, సిఐ గౌస్‌బేగ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన ఈ దాడులు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. ర్యాంపులో రికార్డులు పరిశీలించి, నిర్వాహకుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఇసుక లోడుతో ఉన్న రెండు లారీలు, వేబిల్లు లేకుండా ఉన్న మరో లారీని అధికారులు సీజ్ చేసి, ఆ వాహనాలను స్థానిక మండల మెజిస్ట్రేట్ (తహసీల్దార్) సత్యనారాయణకు అప్పగించారు. ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించి విజిలెన్స్ అధికారులు ఈ దాడులు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విజిలెన్స్ అధికారుల బృందం వెంట ఆత్రేయపురం తహసీల్దార్ ఎ సత్యనారాయణ, విఆర్వో కోమలి తదితరులు ఉన్నారు.

రెండో పంటకు
పూర్తిస్థాయిలో సాగునీరు!
కలెక్టర్ అరుణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 23: జిల్లాలో ప్రస్తుతం రెండో పంటకు నాట్లు పూర్తయిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు. ఇందుకు 550 క్రాస్ బండ్స్ కోసం 6 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసిందని, 10 రోజుల్లోగా ఈ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ నుండి శనివారం మండల, డివిజన్ అధికారులతో కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవ పంటకు సాగులో ఉన్న అన్ని ఎకరాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇంకా ఏ ప్రాంతంలోనైనా రైతులు నాట్లు వేయని పక్షంలో వారిని ప్రోత్సహించి, తక్షణం నాట్లు వేసేలా చూడాలని ఆయన సూచించారు.
పొలాలకు వంతుల వారీ విధానంలో సాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మార్చి 31కి గాని, ఏప్రిల్ 15కు గాని కాలువలను మూసివేయడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాదగయను సందర్శించిన సిఎం వ్యక్తిగత కార్యదర్శి
పిఠాపురం, జనవరి 23: ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయను ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వెంకటరాజు వౌళి శనివారం ఉదయం దర్శించారు. ఆయనకు ఇఒ చందక దారబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పురుహూతిక, కుక్కుటేశ్వర, రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకుని పాదగయ క్షేత్ర విశిష్టను అడిగి తెలుసుకున్నారు.
రామచంద్రపురంలో భారీ పేలుడు
మహిళకు
తీవ్ర గాయాలు
రామచంద్రపురం, జనవరి 23: పట్టణంలోని ముచ్చిమిల్లి రోడ్డులో శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ సమీపంలో ఒక నివాస గృహంలో శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించి ఆ ప్రాంత ప్రజానీకాన్ని ఉలిక్కిపడేటట్టు చేసింది. స్థానిక ఫైర్ స్టేషన్‌కు సమాచారమందించిన ప్రజానీకం ఏం జరిగిందోనన్న భయాందోళనలకు గురయ్యారు. ముచ్చిమిల్లి రోడ్డులో సాయిబాబా గుడి పక్కన నివాసముండే త్రిపురారి వెంకటేశ్వరరావు పోర్షన్‌లో జరిగిన ఈ బాణాసంచా పేలుడులో వెంకటేశ్వరరావు మరదలు త్రిపురారి వాణి తీవ్ర గాయాలకు లోనయ్యింది. పడక గదిలో ఉన్న మొత్తం సామాగ్రి పరశురామప్రీతి అయ్యింది. ఫైర్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్ సంఘటనా స్థలికి చేరుకునే సమయానికి కూడా క్రాకర్స్ పేలుతూనే ఉండటం గమనార్హం. 2 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తినష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనాగా ఫైరాఫీసర్ నాగేంద్రప్రసాద్ వెల్లడించారు. కాగా ఈ ప్రమాదం గ్యాస్ సిలెండర్ ద్వారా జరిగిందనే అపోహను సృష్టించేందుకు ఆ ఇంటికి సంబంధించిన యజమానులు ప్రయత్నించారు. అయితే వంటగదిలో ఉన్న సిలెండర్, స్టౌ చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. ఈ ప్రమాదంలో గాయపడిన త్రిపురారి వాణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డ్యూటీ డాక్టర్ స్పష్టం చేశారు. సంఘటన వివరం తెలుసుకున్న ఆర్డీవో కె సుబ్బారావు ఆసుపత్రికి హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. కాగా త్రిపురారి వాణి నుండి స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ జి రామకృష్ణ వాంగ్మూలాన్ని సేకరించారు. సిఐ పచ్చా కాశీవిశ్వనాధ్, ఎస్సై లఖావతు శ్రీనునాయక్‌లు పోలీస్ శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ చేపట్టారు. కాగా ఈ సంఘటనపై ఆ ప్రాంత ప్రజానీకం తీవ్రంగా స్పందించారు. క్రాకర్స్, సీమటపాకాయలు తయారుచేయడం తాము గమనించామని, ఇంత ఉపద్రవం కలుగుతుందనుకోలేదని, దీనిపై శాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పేరు మార్పు ఫైళ్లకే పరిమితమా?
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జనవరి 23: రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ఫైళ్లకే పరిమితమా? జిల్లా అధికారులకు ఇది వర్తించదా? అనే అనుమానం జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం బుక్‌లెట్‌ను చూస్తే కలుగుతోంది. శనివారం రాజమహేంద్రవరంలోని రహదారులు, భవనాల అతిథిగృహంలో జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు అందించిన బుక్‌లెట్‌పై ఇప్పటికీ రాజమండ్రిగానే అధికారులు ముద్రించారు. జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరును సమీక్షించే అత్యంత కీలకమైన జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులకు అందించిన బుక్‌లెట్‌పైనే ఇలా ‘రాజమండ్రి’ అని పేర్కొనటం విమర్శలకు తావిస్తోంది. బుక్‌లెట్‌లో కొన్ని శాఖల అధికారులు ఇచ్చిన నివేదికలు, సమాచారంలో కూడా రాజమండ్రిగానే పేర్కొన్నారు. కొన్ని శాఖల అధికారులు రాజమహేంద్రవరంగా పేర్కొంటే, మరికొంత మంది అధికారులు రాజమండ్రిగా పేర్కొనటాన్ని అంతా తప్పుపడుతున్నారు. రాజమండ్రి నగరం పేరును రాజమహేంద్రవరంగా మార్పు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను జిల్లా స్థాయి అధికారులే అమలుచేయకపోతే ఎలా? అని అంతా ప్రశ్నిస్తున్నారు.
రాష్టస్థ్రాయి శాస్ర్తియ నృత్య పోటీల్లో
రాజమండ్రి విద్యార్థులకు ద్వితీయస్థానం
రాజమండ్రి, జనవరి 23: కాకినాడ జెఎన్‌టియులో క్రియా పిల్లల పండుగ పేరిట శనివారం వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఎస్‌ఐ రైటింగ్, డ్రాయింగ్, శాస్ర్తియ నృత్యం, జానపద నృత్యం ఇలా అనేక పోటీలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికితీశారు. జానపదం, కోయ, కూచిపూడి, భరతనాట్యం విభాగాల్లో విద్యార్థులు పాల్గొని వీటిని విజయవంతం చేశారు. శాస్ర్తియ నృత్య పోటీల్లో భాగంగా భరతనాట్యం, కూచిపూడిల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా భరతనాట్యం సీనియర్స్ గ్రూప్ డ్యాన్స్ విభాగంలో రాజమండ్రి గాయత్రి నృత్య కళా నికేతన్‌కు చెందిన సిహెచ్.లలితా శ్రీవర్ష(8వ తరగతి, సెయింట్ ఆన్స్), కీర్తిప్రియ(కేశవరెడ్డి, 8వ తరగతి), శర్వాణి (8వ తరగతి, కెకెఆర్ గౌతమి)లు ప్రదర్శించిన థిల్లానా పాటకు ద్వితీయ బహుమతి లభించింది. రాష్టస్థ్రాయి భరత నాట్య పోటీల్లో రాజమండ్రి బాలికలు ద్వితీయస్థానం సాధించండం హర్షణీయమని పలువురు వారిని అభినందించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కాకినాడ జెఎన్‌టియులో నిర్వహించిన సభలో నిర్వాహకులు వారు ముగ్గురికీ షీల్డు అందజేసి అభినందించారు. కాగా సీనియర్స్ సోలో విభాగంలో వీరు కన్సోలేషన్ బహుమతులు కూడా సాధిం చారు.
ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతం
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
సామర్లకోట, జనవరి 23: రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. సామర్లకోట మండలం పిబి దేవం గ్రామంలో రూ. 2.4 కోట్లతో నిర్మించిన పిబి దేవం-3 ఎత్తిపోతల పథధకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రెండోపంటకు నీటి ఎద్దడి ఉన్నందున ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు సీలేరు, బలిమెల ప్రాజెక్టు నుంచి జలాలను గోదావరిలోకి మళ్ళించడం ద్వారా రైతులకు సాగునీటిని అందించే కాక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. రైతులు లాభసాటి వ్యవసాయానికి ఉద్యానవన, సెరీకల్చర్, ప్రాన్ కల్చర్ వ్యవసాయాలను చేసుకునేందుకు ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీ అందిస్తోందని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. మహిళలు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ముందుకు వస్తే వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగు సదుపాయం కల్పించేందుకు చర్యలు చేడుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపిలు గొడత మార్త, జి సూర్యకుమారి, ఇరిగేషన్ ఎస్‌ఇ జి త్రివిక్రమరావు, ఇఇ వి పూర్ణచంద్రరావు, డిఇ విజయబాస్కరరావు, సర్పంచులు దడాల నాగరాజు, మైనర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తోటకూర శ్రీనివాసు, ఎఎంసి ఛైర్మన్లు పాలకుర్తి శ్రీనుబాబు, ముత్యాల రాజబ్బాయి, డిస్పీ ఎస్ రాజశేఖరరావు, సిఐ శ్రీ్ధర్‌కుమార్, ఎస్‌ఐలు ఎ మురళీకృష్ణ, కెవి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.