ప్రార్థన

సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును (ఇమ్మానుయేలను మాటకు రూపాంతరమున దేవుడు మనకు తోడని అర్థము) -యెషయా 7:14.
దేవుడు బలహీన విశ్వాసంలో ఉన్నవారిని బలపరచుటకు కొన్ని సూచనలు చేయడానికి సిద్ధమే. ఆహాజుతో దేవుడు చెప్పిన మాట - నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంతైన లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే దేవుడు సవాలు చేస్తున్నాడు. ఏదైనను సరే నేను చేయగలను.
నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? -యిర్మియా 32:27.
వృద్ధ దంపతులైన అబ్రహాము శారాలను దేవుడు ఆశీర్వదించి, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. అయితే వారు బహుకాలము గడిచిన వృద్ధులు గనుక ఆశ్చర్యపోయారు. వాస్తవానికి శారమ్మకు స్ర్తి ధర్మము నిలిచిపోయింది. బలము ఉడిగిన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో తాను నవ్వుకొనెను. అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ‘యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా?’ అని. నిజమే, ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎక్కడా లేదు. సర్వసృష్టికర్త గనుక సర్వం ఆయనకు సాధ్యమే.
ఈ సంగతి జరిగి వేల సంవత్సరాలు జరిగినవి గనుక అబ్రహాము వంశము వారు కూడా ఈ అద్భుతాన్ని మరచిపోయి ఉండవచ్చు. కొంతమందికి గుర్తు ఉన్నా అది ఒక కథలాగానే అనుకుంటున్నారు. అలానే జకర్యా అను యజకుడు హేరోజు రాజుగా ఉన్న దిములలో ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకరు. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. దేవుని దృష్టికి నీతిమంతులై యుండుట అనేది ఎంతో కష్టమైనది. ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో ఒకరు మంచిగా ఉంటే ఒకరు లోకపరంగా ఉంటారు. అయితే వీరిరువురిది ఒక మాదిరి కుటుంబం. ఈ దినాలలో కూడా భార్యాభర్తలిరువురు నీతిమంతులుగా ఉన్నవారు లేకపోలేదు. వాస్తవానికి వీరిద్దరు సకలమైన ఆజ్ఞలు న్యాయ విధుల విషయములో నిరపరాధులట. ఎవరి ఆజ్ఞలు వారు పాటించారు. భార్య భర్తకు లోబడి ఉండటం, భర్త భార్యను ప్రేమించటం ముఖ్యమైనదిగా పౌలు భక్తుడు వ్రాశాడు. అయితే ఇది ఒక క్రమమే గని ఇద్దరికి చెప్పింది ఒకరిని ఒకరు ప్రేమించుమని. లోబడి ఉండటమంటే చెప్పింది చేయమని, ప్రేమించుట అంటే చెప్పింది చేయమని.
మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందరు. - యోహాను 14:15.
మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆజ్ఞ - 2 యోహాను 6
ఒకరినొకరు ఇలా ప్రేమించుకోవటమే నూతన ఆజ్ఞ. అయితే నూతన ప్రేమ ఎలా ఉండాలంటే, క్రీస్తు మనలను ప్రేమించి సిలువ మీద తన ప్రాణం పెట్టినంతగా ఉండాలి. ఆయన మనలను ఎంతగా ప్రేమించాడో అంతగా మనము ప్రేమించాలి. అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి.
ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఒక సేవకునిలా మామూలు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు ఇక్కడ బాధలనన్నిటిని ఓర్చుకున్నాడు. దూషించబడ్డాడు. హేళన చేయబడ్డాడు. కొట్టబడ్డాడు. ఇంకా ఎన్నో బాధలను ఓర్చుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరకు తన ప్రాణానే్న బలిగా అర్పించాడు. చిత్రహింసలు పెట్టారు. అయినా నోరు తెరువలేదు. మనలను ఎంతగా ప్రేమించాడో చూడండి. ఈ ప్రేమను ఒకరిపట్ల ఒకరు చూయించండి. నేను ప్రేమించినట్టు మీరును ప్రేమించుడి అనే ఆజ్ఞను ఇచ్చాడు.
వివాహము అన్ని విషయాలలో ఘనమైనది గనుక ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఒక మాదిరి కుటుంబముగా సాక్ష్యపు కుటుంబముగా ఉంటుంది. ఒకరి తప్పులు ఇంకొకరికి కనపడవు. అలా ఉంటే గౌరవమే ఉంటుంది. ఘనత ఉంటుంది.
అయితే ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, అంతేగాదు వారిద్దరు బహుకాలము గడచిన వృద్ధులు అయినా వారిని దేవుడు దర్శించి వృద్ధాప్యములోనే వారికి కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి నిన్న నేడు ఏకరీతిగానే ఉంది. అబ్రాహామును ఆశీర్వదించి సంతానమిచ్చాడు. జకర్యాను ఆశీర్వదించి సంతానమిచ్చాడు. ఇప్పటికీ అలానే ఆశీర్వదించగలడు. దీనికి మనకు కావలసినదల్లా దేవుని పట్ల ప్రేమ నమ్మకము. నమ్ముట నీవలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ప్రభువు సెలవిస్తున్నాడు.
అయితే మనుషులు దేవుని పట్ల నమ్మకము రానురాను సన్నగిల్లుతున్నట్టు ఉంది. లోకముపై ఉన్న మోజు ఎంతో తెలియటం లేదు గానీ దేవుని నమ్మవలసినంతగా నమ్మవలసిన పరిస్థితులలో నమ్మటం లేదు. జకర్యా సంగతి ఆలోచిస్తే, ఈయన యాజకుడు. అనుభవం కలిగినవాడు. ఎంతోకాలం నుండి యాజక ధర్మము జరిగిస్తున్నవాడు. ఎన్నో విషయాలు చూసినటు వంటి వాడు. తాను ధూప సమయమందు పరిశుద్ధ స్థలములో ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా, జకర్యా అతని చూసి, తొందరపడి, భయపడిన వాడాయెను. అప్పుడు దూత సెలవిచ్చిన మాట.
జకర్యా భయపడకుము. నీ ప్రార్థన వినబడినది. నీ భార్యయైన ఎలీసబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువనెను. ఇక్కడ ఒక సంగతి గ్రహించాలి. నీ ప్రార్థన వినబడినది అనే మాట. ఈయన ప్రార్థిస్తున్నాడు. సంతానము కావాలని. అదీ కూడా మగపిల్లవాడు కావాలని. ఎప్పటి నుండి ప్రార్థిస్తున్నాడు అంటే వివాహమైనప్పటి నుండి ప్రార్థిస్తూనే ఉండవచ్చు. ఎంత కాలమైంది? సుదీర్ఘకాలము. బహుకాలము గడచిన వృద్ధులైనంత వరకు. ఇక్కడ మనము కూడా నేర్చుకోవలసినది ఒక సంగతి. ఏదైనా ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తే అది తప్పక నెరవేర్చగలడని ముందు నమ్మాలి. నమ్మకము లేకుండా ప్రార్థనలు చేయుట మంచిది కాదు. అయితే ఇంకొక సంగతి కూడా ఉంది. ప్రభువు ఇచ్చే జవాబు రావటానికి ఎన్ని ఏళ్లయినా పట్టవచ్చు. అది అవసరమనుకుంటే ప్రార్థించే లోపలనే జవాబు ఇవ్వవచ్చు.
వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను - యెషయా 65:24.
నాకు మొఱ్ఱపెట్టుము. నీకు ఉత్తరమిచ్చెదను అని సెలవిచ్చిన ప్రభువు, తప్పక మన ప్రార్థనలు ఆలకించటానికి సిద్ధమే. అడుగుడి మీకియ్యబడునని సెలవిచ్చి అలాగున ఇప్పటికీ చేస్తున్న ప్రభువుకు మహిమ కలుగును గాక.
దీనిని బట్టి చూస్తే విశ్వాసముతో ప్రార్థించటమే మన పని. జవాబు తగిన సమయములో ఇవ్వటం అనేది ఆయన ఇష్టం.
అయితే దేవుడు వారికి ఇచ్చే బహుమానము ఎటువంటిదంటే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తంత్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును. గనుక నీకు సంతోషము మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. ఎటువంటి బహుమానమో చూడండి. సంతోషము మహా ఆనందము ఇచ్చేటువంటి బహుమానము. అంతేకాదు అతనిని బట్టి అనేకులు సంతోషిస్తారట.
ఇంత గొప్ప బహుమానము దేవుడు సిద్ధపరచి ఉంచితే, జకర్యా యాజకుడు ఎన్నో ప్రార్థనలు ఎంతోమందికి చేసినటువంటి వాడు. వార్తను తెచ్చిన దూతను ప్రశ్నించాడు. ఇప్పుడు కూడా ఈ శుభవార్తను అందిస్తున్న వారిని కూడా అనేక ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతున్నారు. నీవు తెచ్చిన వార్త ఎలా సాధ్యము? నా భార్య వృద్ధురాలు నేను ముసలివాడను అని ప్రశ్నించినపుడు, దూత - నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సవార్తమానమును నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక వౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఇది ఒక సూచన.
జాగ్రత్త! ఇది ఎలా సాధ్యమగునని అడిగిన ప్రశ్నకు జవాబు. జకర్యా మూగవాడయ్యాడు. మరి మనకు వచ్చే ప్రశ్నలకు ఎటువంటి శిక్ష ఉంటుందో గదా? ఇంకొక సంగతి ఏమిటంటే దేవుని వాగ్దానము నమ్మలేదు అంటే వాగ్దానము కంటే లేక బహుమానము కంటె, లేక నీవు అడిగిన దానికంటె దేవుని శక్తిని తక్కువ చేస్తున్నావన్నమాట. ఇఏ విషయములోనైనా భయపడుతున్నావంటే ఆ విషయములో దేవుని తక్కువ చేస్తున్నావన్నమాట. ఆలోచించండి. దేవుని దూత జకర్యాకు ఇచ్చిన మూగతనం ఇది ఒక సూచన. తనకు కుమారుడు కలిగేవరకు కూడా జకర్యా మాటలాడలేక వౌనిగానే ఉండాల్సి వచ్చింది.
అతని సేవ చేయు దినములైన తరువాత ఇంటి వెళ్లినప్పుడు, వారిని బలపరచి ఆశీర్వదించిన దేవుడు ఎలీసబెత్ గర్భము తెరిచెను. అందుకు ఆమె నన్ను కటాక్షించి మనుషులలో నాకుండిన అవమానము తీసివేసేనని ఎరిగి ఐదు నెలలు ఇతరుల కంటబడకుండెను.
గొడ్రాలును ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. - కీర్తనలు 113:9.
అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలేకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. - ఆదికాండం 20:17.
ఏలయనగా అబ్రాహాము భార్యయైను శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. - ఆదికాండం 20:18
యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను - ఆది.21:1,2
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతియాయెను - ఆది.25:21.
హన్నా కుమారుడు కావాలని ప్రార్థించగా దేవుడు ఆమె మనవి ఆలకించి మంచి ప్రార్థనాపరుడైన సమూయేలును ఇచ్చెను. అతడు ప్రార్థన వీరుడేగాదు ప్రవక్తగా, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు.
ఈలాగు అనేక మంది భక్తుల ప్రార్థనలు కూడా ప్రభువు ఆలకించి గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు కూడా నమ్మి ప్రార్థించిన వారి ప్రార్థనలు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి మనము ఒక్కొక్కసారి దేవుని కొరకు చేయవలసిన పనులు చేయకపోవచ్చు గాని ప్రభువు మాత్రం మరచిపోడు. మనలను కంటికి రెప్పవలె కాపాడుతాడు.
అయితే పాత నిబంధనలో చాలామంది ప్రభువును కొన్ని సూచనలు అడిగారు. వారిలో గిద్యోను ఒకడు. గిద్యోనును దేవుడు దర్శించి మీద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపమని అడిగినపుడు, చిత్తము దేవా! దేని సహాయము చేత ఇశ్రాయేలీయులను రక్షింపగలను? ఎన్నిక లేనివాడనే, చాలా చిన్నవాడనే అని విన్నవించాడు. అయితే ఏంటీ నేను నీకు తోడై ఉంటాను. ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని చెప్పెను. అందుకు గిద్యోను - నా యెడల నీకు కటాక్షము కలిగిన యెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని తెలుసుకొనునట్లు ఒక సూచన కనపరచుమనెను.
ఇక్కడ ఇంకొక సత్యము తెలుసుకోవాలి. మనతో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవటం చాలా ముఖ్యం. దేవుడు మాట్లాడుతున్నాడా, సాతానుడు మాట్లాడుతున్నాడా అనేది చాలా ముఖ్యం. ఇద్దరూ మనతో మాట్లాడుతూ ఉంటారు. చూడండి. యేసయ్య శిష్యులతో మాట్లాడుచు నేనెవరనుకుంటున్నారు అనే ప్రశ్నకు పేతురు చక్కని ఉత్తరమిచ్చాడు. ‘నీవు సజీవుడగు దేవుని కుమారుడగు క్రీస్తు’వని. అందుకు యేసు మెచ్చుకుని, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే గాని నరులు నీకు బయలుపరచలేదని చెప్పెను. అయితే అదే సమయములో యేసు - నేను హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలిపినపుడు, మరణము నీకు దూరమగును గాక అని పేతురు అన్న మాటకు ప్రభువు - పేతురుతో సాతానా నా వెనుకకు పొమ్మన్నాడు. పేతురుతో ముందు మాట్లాడిన తండ్రియైన దేవుడు, అయితే ఇప్పుడు మాట్లాడించినది మాత్రము సాతాను. అది పేతురు గ్రహించలేకపోయాడు. ఇది చాలా ముఖ్యమైన విషయము. మనలో ఎవరున్నారు. దేవుని వాక్యముతో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులైతేనే ఈ సంగతి గ్రహించగలము. సాతానుని మోసములో నుండి తప్పించుకోగలము.
గిద్యోను అడిగిన సూచనను చూయించి దేవుడు తనను మిద్యానీయులందరి ఓడించి ఇశ్రాయేలీయులను రక్షించేటట్లు చేశాడు. గిద్యోను అడిగిన సూచన - కల్లములో మాత్రము మంచు పడగలదని ఒకసారి, కల్లములో మాత్రం మంచు పడి చుట్టూ మంచు ఉండకూడదని మరియొకసారి.
దేవుని వలన ఇంకొక సూచన - ఆహాజు ఎండ గడియారము సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల పది మెట్లు ఎక్కచేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను. అలా అనేక సూచనలు ప్రభువు నూతన నిబంధనలో కూడ చేసి చూయించారు. అయినా యేసయ్యను ఇంకొన్ని సూచనలు చూపుమని శోధించినపుడు, వారితో ప్రభువు సాయంకాలమున మీరు ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతనము వారు సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియలను వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లెను. ఎన్నో సూచనలు చూశాక కూడా మరలా మరలా అడిగితే ప్రభువు వారిని విడిచి వెళ్లాడట. ప్రభువు విడిచి వెళితే మన జీవితము చీకటిగా ఉంటుంది. జాగ్రత్త!
చూసి నమ్మిన వారికన్న చూడక నమ్మినవారు ధన్యులని ప్రభువే సెలవిచ్చాడు.
యెషయా ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ప్రవచనం ‘కన్నియ గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును’ అప్పటి జనులు ఏమనుకున్నారో తెలియదు, నమ్మారో లేదో తెలియదు కాని, తరువాత 700 సంవత్సరముల తరువాత ఆ ప్రవచనము నెరవేరింది. కన్య మరియ గర్భవతియై కుమారుని కన్నది.
కాబట్టి దేవుడు సర్వశక్తిగల వాడని ఈ సంగతులను బట్టి మన విశ్వాసం అంతకంతకు పెరుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256