ప్రార్థన

ఆహారమా దేహమా ప్రాణమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను - ఆది 2:17.
ఆహారము కంటె ప్రాణము, వస్తమ్రు కంటే దేహము గొప్పవి కాదా? అని ప్రభువు తన మొదటి ప్రసంగములో ప్రశ్నిస్తున్నాడు. కారణమేమంటే, జనులు సృష్టికర్తను మరచి, సృష్టిని ఏలుచు కాయుచు ఉండవలసిన వారు సృష్టమును పూజిస్తూ ఉన్నారు. సృష్టి మనకు కావలసినవన్నీ ఇస్తుంది గనుక ఇక దేవుడవసరము లేదు అన్నట్టు పాత నిబంధన కాలము నుండే అలా ఆలోచిస్తున్నారు. అయితే ఒక సంగతి దేవుడు మనలను సృష్టించక ముందే మనకు కావలసినవన్నీ సిద్ధపరచాడు. అంతే మనకు కావలసిన గాలి నీరు ఆహారము అన్నీ సిద్ధపరచి అనుకూలంగా చేసి అప్పుడు నరుని సృజించాడు. ఇది సత్యము. నేల మీదనున్న సమస్త జంతువులకు కావలసినవన్నీ దేవుడు సమృద్ధిగానే సిద్ధము చేశాడు. కాకపోతే జదఆ జఒ జదఆ అన్నట్టు బలవంతులు ఎక్కువ సమకూర్చుకొని మిగిలిన వారిని ధారిద్య్రములో నెట్టి వేస్తున్నారు గనుక పేదవారి సంఖ్య దినదినము పెరుగుతూనే ఉంది. ఆకలితో చనిపోయే వారు ఎక్కువౌతున్నారు. అంటే దేవుడు పంటలు ఇవ్వలేదని కాదు గానీ, ఆయన ఇచ్చిన దానిని సరిగా వాడుకోలేక పోవటం వల్లనే ఇట్లు జరుగుతుంది. రెండు వేల సంవత్సరాలకు ముందు నుండే ఇలా జరుగుతున్నందున ప్రభువు తన మొదటి ప్రసంగములోనే చాలా వివరంగా చెప్పాడు. స్వార్థప్రియులకు ధన సంపాదన ముఖ్యమైంది. కనుకనే ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ధన సంపాదన మీద ఉన్నారు.
కనుక భూమి మీద ధనమును మీ కొరకు కూర్చుకొనవద్దు. దొంగలు కన్నము వేయొచ్చు, తుప్పు పట్టవచ్చు, చిమ్మెట తినివేయవచ్చునని యేసు ప్రభువు స్పష్టముగా తెలియచేశాడు. ఎందుకంటే ధనమున్న దగ్గరనే హృదయము ఉంటుందట. మనకు తెలుసు, ఇంట్లో ఉంచితే దొంగలు పడతారేమో అనీ, బ్యాంక్‌లో దాచుకొన్నట్లయితే అక్కడ ఇంకో రకమైన విధంగా పోతున్నాయి. బ్యాంక్ దొంగలు కూడా ఎక్కువయ్యారు. వేలకు వేల కోట్లు హరించుకు పోతున్నాయి. కనుక రేయి పగలు ఇదే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనలలో మునిగిపోయిన వారికి దేవుడు గుర్తు రాడు. దేవుడు చెప్పిన మాటలు గుర్తుకు రావు గనుక రేపటి గురించిన ఆలోచనతోనే ఉంటున్నారు.
ప్రభువు మీద నమ్మకముంటే రేపటి గూర్చిన ఆలోచన ఉండదు. తరతరాలకు తరగని ఆస్తులు సంపాదించాలన్న ఆశ ఉండదు. దానిని గూర్చిన చింతన ఉండదు. పక్షులను పోషించుచున్న దేవుడు, పువ్వుల గురించి ఆలోచించిన దేవుడు మనలను ఎంతో ప్రేమించి మన కోసం వీటన్నిటిని సమకూర్చిన దేవుడు మరి మనలనెందుకు పట్టించుకోడు. ఆయన ధ్యాస అంతా మన మీదనే, మన కాపుదల, రక్షణ, విమోచన మీదనే.
ఆకాశ పక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? పక్షులను జంతువులను ఆయన ప్రేమించటము లేదు గానీ, వాటిని మరువక పోషిస్తూ ఉన్నాడు. కానీ మనలను ఎంతగానో ప్రేమించి తన కుమారుని మన కొరకు బలిగా ఈ లోకానికి పంపించాడు. మరి మన కొరకు ప్రాణమే ఇచ్చిన ప్రభువుకు మన మీద ఎటువంటి ప్రేమ ఎంత ప్రేమ ఉంటుందో కదా! అసలు దేవునిలో మన విలువ ఎంతో చూడండి. దేవుని కుమారుని ప్రాణానికి ఎంత విలువ ఉందో, అంత విలువ మనకు అనుగ్రహించాడు. దేవుని దృష్టిలో మన విలువను చూస్తే ‘కుమారుని’ విలువ. క్రీస్తును ఎందరంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారమిచ్చాడు. అందుకే మనము పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తున్నాము. ఆయన పరమ తండ్రి. అంటే సర్వలోకాన్ని సృష్టించి పాలిస్తున్న దేవునికి కుమారులన్న మాట. ఒక్కసారి నమ్మితే పరలోక రాజ్య సంబంధులవౌతాము. దేవుడు మనకు తండ్రి గనుక మనకు కావలసినవన్ని సమకూరుస్తాడు. దైవ కుటుంబములో చేరతాము. పరలోక రాజ్య వారసులవౌతాము. ఈ లోకము ఎంత అశాశ్వతమో మనకు తెలిసిందే. రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరు ఉంటారో పోతారో తెలియదు. అయినా 70 లేదా 90 సంవత్సరాల తరువాత ఈ లోకాన్ని వీడిపోవాల్సిందే. ఈ లోకం అశాశ్వతమనీ, ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి ప్రాణమును మాత్రము ఆపలేవని మనకు తెలుసు. అంటే శాశ్వతమైన లోకము కూడా ఉందన్న మాట. ఆ శాశ్వత లోకాన్ని గురించి తెలియచేయటానికే, యేసు ప్రభువు తన మహిమను వదలి మానవుని రూపములో మన మధ్యకు వచ్చి పరలోక విలువలు తెలియచేశాడు. ఆయన మాటలు వింటే మన విలువ ఏంటో కూడా తెలిపాడు. ఆయన మాటలు నమ్మి ప్రభువును వెంబడిస్తే మనము దేవుని కుమారులవౌతాము, క్రీస్తు తోటి వారసులవౌతాము.
నరులు, కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివారే, విసరి వెళ్లి మరలి రాని గాలి వంటివారేనని ప్రభువుకు తెలుసు మనకు తెలుసు. వాస్తవానికి నరుని తన రూపులో చేసి, ఏదేను వనమంతటి మీద అధికారము అనుగ్రహించాడు. దేవుని పోలికలో చేయబడి అంత ఉన్నత అధికారములో ఉన్న ఆదాము హవ్వలు చిన్న పండు కోసం ఆశపడి, దేవుని పోలికను, దేవునితో సంబంధాన్ని, ఏదేను తోట మీద ఉన్న అధికారాన్ని కోల్పోయారు. చిన్న పండు కోసం ఎంత గొప్ప ఆధిక్యత కోల్పోయారో చూడండి. దేవుని సహవాసము, దేవుని రూపు, సమాధానము, ఏదేను తోట అన్నింటిని కోల్పోయారు.
చిన్నపండు కోసం ఉన్నత దేవుని సహవాసము పోగొట్టుకున్నారు. చిన్న లంచమునకు ఆశపడి పెద్ద ఉద్యోగము పరువు ప్రతిష్టలు పోగొట్టుకుంటున్నారు. చిన్న సిగరెట్ కోసం లక్షలతో కొనలేని ఆరోగ్యం దానితోపాటు ప్రాణము కోల్పోతున్నారు. క్షణికావేశాలతో ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణము పోయిన తరువాత ఈ లోకములో ఉన్న ధనమంతా కలిపినా, మనుషులందరూ కలిసి తిరిగి తీసుకురాలేరు. అంత విలువైన ప్రాణాన్ని అంతే విలువగా చూసుకోవాలి.
ప్రాణముతో ఉంటేనే ఆహారం అవసరం. అంటే ఆహారము కన్న ప్రాణము ఎంత ముఖ్యమో గదా. ఈ లోకములో ఉన్న ఆహారం విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, పండ్లు ఫలాలు అన్నీ కలిపినా ప్రాణాన్ని తేలేవు. జీవితములో ఏది ముఖ్యమో గ్రహించాలి.
వాస్తవానికి దేవుని దృష్టిలో మనిషి విలువ చాలా ఎక్కువ. అది దేవుడు ఉచితముగా ప్రేమతో ఇచ్చిన కానుక. వాస్తవానికి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని ముందు మనిషి ఏపాటివాడు? యెషయా ప్రవక్త దైవ దర్శనము ద్వారా వ్రాసిన మాటలు చూస్తే, జనములు చేద నుండి జారు బిందువులుగా, త్రాసు మీద ఉండే ధూళి వంటి వారుగాను, గాలికి ఎగురు సూక్ష్మరేణువులు లాగ ఉన్నారట. దేవుడు భూమండలము మీద ఆసీనుడైనప్పుడు భూమి మీద ఉన్న జనులు మిడతల వలె కనబడుచున్నారట. అలాగు చూస్తే అబ్రహాము భక్తుడు దేవుని శక్తిని ఎరిగి ఆయన ముందు ప్రార్థన చేస్తూ, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నానని పలికాడు. అంటే సర్వాధికారి సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని ముందు మనము దుమ్ము ధూళి వంటి వారమన్నమాట.
ఎంతో ప్రేమతో ఎంతో ఉన్నతంగా దేవుని రూపులో చేయబడిన మానవుడు దుమ్ము ధూళి వంటి వాటి కోసం ఆశపడి దుమ్ము ధూళిలా మారిపోయి, చివరికి మంటి పాలౌతున్నాడు. దుమ్ము ధూళి లాంటి మానవుని వెతుక్కుంటూ యేసు ప్రభువు, ఆకాశ మహాకాశములను వదలి, తన మహిమను వదలి ఆ ధూళి రూపములోనే వచ్చి, మనిషికి అవిధేయత వల్ల అంటుకున్న పాపాన్ని విదిల్చి తిరిగి దేవుని స్వరూపమును ధూళిలాంటి మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువు చేసిన ఈ కార్యాన్ని నమ్మిన వారికి దేవుని కుమారులవుటకు అధికార మనుగ్రహించాడు.
రక్తము పంచుకొనిన బిడ్డలకు ఏమైనా ప్రమాదమైతేనే తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడిపోతాయి. మరి దేవుని ప్రాణము పంచుకున్న మనకేమైనా అయితే ఆ ప్రభువుకు ఎలా ఉంటుందో గదా! ఆ ప్రేమతోనే ప్రభువు అంతగా తగ్గించుకొని సామాన్య మానవునిగా ఈ లోకానికి వచ్చి, చిక్కులలో ఉన్న ప్రాణాలను విడిపించాడు. ప్రాణము పంచుకొన్న వాళ్లము గనుక అంతగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను చాలామంది అర్థం చేసుకోలేక దేవుడైతే అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు, అన్ని బాధలెందుకు పడవలసినదని అంటూంటారు. పేగు తెంచుకున్న వారి కోసమే తల్లిదండ్రులు ప్రాణాలివ్వటానికి సిద్ధపడినప్పుడు మరి ప్రాణం తెంచుకొని పుట్టిన మన కొరకు అవన్నీ చేయడా?
స్తెఫెను అనే భక్తుని రాళ్లతో కొడుతున్న సమయములో, ఈ శరీర విషయములో బాధపడలేదు కానీ, ఆత్మను నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థించాడు. ప్రభువుని సిలువకు కొట్టి చిత్రహింసలు పెడుచున్నపుడు కూడా ఆయన ఇలానే ప్రార్థించాడు, శరీరానికి తగిలిన దెబ్బలు, గాయాలు ఒళ్లంతా రక్తము కారుచున్న ప్రాణాన్ని దేవుని సన్నిధికి చేర్చుకోమని ప్రార్థించాడు. తెలియక శరీరాన్ని హింసిస్తున్న వారిని క్షమించారు. కొంతమంది ధ్యాస అంతా శరీరముపైననే. ఈ తాత్కాలికమైన లోకము మీదనే ఉంటుంది. అటువంటి వ్యక్తి ఒకడు స్వార్థపరుడై, దేవుడిచ్చిన సమృద్ధియైన పంటను బట్టి అతిశయముతో తనలో తాను ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకున్నాడట. అనేక సంవత్సరాలకు సరిపడ విస్తారమైన ఆస్తి సమకూర్చుకొని, ఇక నాకేంటి అనుకుంటున్నాడు. తనను తాను చాలా తెలివిగల వాడననుకుంటున్నాడు. దేవుని కృప వల్ల ఈ స్థితికి వచ్చాడు అన్న సంగతి మరచిపోయాడు. అయితే దేవుని దృష్టిలో మాత్రము ఇలా ఇహలోక ఆస్తుల మీద, పొలాలు భూములు సిరిసంపదలను బట్టి సంతోషించువారు వెఱ్ఱివారే! స్వార్థము దేవుని దృష్టిలో వెఱ్ఱితనమే. దేవుని మరచి ఆస్తి అంతస్తులపైననే ఆలోచనలు కలిగి తినుచు త్రాగుచు సుఖించుచు ఉండుటకు వెఱ్ఱితనమే కారణము. మన ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నవి, ఆయన ఇష్టమైనప్పుడు, ఒకవేళ ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే, నీవు సిద్ధపరచినవి ఏమైపోతవో, దేవుని ప్రాణము ఆయన తీసుకుంటే మన్నయినది వెనుకటి వలెనె మరల భూమికి చేరును. ఆత్మ దాని దయ చేసిన దేవుని యొద్దకు పోవును - ప్రసంగి 12:7.
రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవము ఏ పాటిది. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరే కదా. అందుకే ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేయుదమని చెప్పుకోవాలి. అంతేగానీ మనకిష్టమొచ్చినట్టు చెప్పుకోరాదు.
చాలావరకు ఈ మట్టిలో కలిసిపోయే శరీరముపైననే శ్రద్ధ కలిగి ఉంటారు. జీవితకాలమంతా ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి. శరీరాశలు ఎలా తీర్చుకోవాలి. నేత్రాశను ఎలా తృప్తిపరచుకోవాలి అనే ధ్యాసతోనే ఉంటున్నారు. అయితే వస్తమ్రు కంటే దేహము, దేహము కంటే ప్రాణము ముఖ్యమన్న సంగతి తెలుసుకోవాలి. ఈ ప్రాణానికి పాపమంటకుండా ఉంచితే, మన్నయ్యే శరీరము, శిథిలమై పోయే ఈ శరీరానికి బదులు మహిమ శరీరాన్ని ఇస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. అప్పుడు మన మొదటి స్థితి, అంటే మనము కోల్పోయిన దేవుని సహవాసాన్ని మరలా పొందుకుంటాము. అధికారాన్ని పొందుకుంటాము. మహిమను కూడా పొందుకుంటాము, ఆయన రూపును పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగునుగాక.
అయితే నిరంతరము ప్రభువులో, ఆయన రాజ్యములో ఉంటూ శాంతి సమాధానములతో దేవునితో సహవాసము కలిగి ఉండే భాగ్యము చిన్న విషయాల కోసం, అనేక మంది కోల్పోతున్నారు. దేవాది దేవునితో సహవాసము కలిగి ఉండుట ఎంత భాగ్యము. అంతేకాదు పరిశుద్ధులతో కూడా నిత్యము సహవాసము కలిగి ఉంటాము. నిత్య సంతోషము సమాధానము అక్కడ ఉంటుంది. కొద్దికాలము చెడు సహవాసమును బట్టి శాశ్వత కాలపు దీవెన పోగొట్టుకుంటున్నారు. అందుకే దావీదు వ్రాసిన మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువ వద్దంటున్నాడు. వారి ఆలోచనలు ఎల్లప్పుడూ తాత్కాలికమైన విషయాల మీదనే ఉంటాయి. ఆకలి వేస్తుంది గనుక ఏదో ఒకటి చేసి ఆహారము సంపాదిస్తామని ఆలోచిస్తారు. లేక ఏదో ఒక దొంగతనమో లేక ఎవరో ఒకరిని కొట్టి లాక్కోవటమో లేక ఆహారము పెట్టేవాళ్లు ఏది చేయమన్నా చేయటానికి సిద్ధమై, ఒక పూట కూటి కొరకు అనేక రకాల తప్పులు చేసి సాతాను వలలో చిక్కుకుంటున్నారు. ఆ ఒక్క రోజుకి దొరికే త్రాగుడు తిండి కొరకు ఓటును వేసి ఐదు సంవత్సరాలను అమ్ముకుంటున్నారు. అంతేకాదు భావిపౌరుల జీవితాలను కూడా అమ్ముతున్నారని తెలియకనే అమ్మి వేస్తున్నారు.
ఆహారము కోసం గోడలెక్కి దూకేటప్పుడు లేక చెట్లెక్కి దూకేటప్పుడు కాలో చెయ్యో విరిగితే ఎంత ప్రమాదమో గదా. అందుకే ఆహారము కంటె దేహము ముఖ్యము. అంతేకాదు దేహము కంటె ప్రాణము ఇంకా ముఖ్యము. జాగ్రత్త. దేహాశలు తీర్చుకోటానికి ప్రభువు మాటల ప్రకారము చేసినట్లయితే తృప్తి కలుగుతుంది, దానితోపాటు నిత్య రాజ్యము లభిస్తుంది. అయితే సాతాను మాటలు విని లంచాలకు, జూదానికి, తాగుడుకు, వ్యభిచారానికి, దొంగతనాలకు పాల్పడినా, అబద్ధాలు ఆడినా, నరహత్యలు చేసినా ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడినా నిత్య నరకములో పాలుపొందవలసిందే. వాస్తవానికి నరకమనేది అపవాదికి వాని దూతల కోసం ఏర్పాటు చేయబడినది. మనుషుల కోసము కానే కాదు. కానీ ఇష్టపడి అపవాది మాటలు విని వాటి ప్రకారము చేసినందుకు, వాడితోపాటు తిరిగినందుకు మనిషి కూడా నరకానికి వెళ్లవలసి వస్తుంది. మన ఇష్టానికే దేవుడు అనుమతించాడు. ప్రభువు మాటలు విని గినె్నడు నీళ్ళిచ్చిన ఫలముంటుంది, ఆయన రాజ్య వారసులవౌతాము. సాతాను మాట విని చిన్న అబద్ధమాడినా, చిన్న తప్పు చేసినా, వాడితోపాటు నరకములో పడవేయబడతాము. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట, అరుపులు, ఆరని అగ్ని మంటలు, అంతులేని గొయ్యి ఉంటాయి. అక్కడ ఎటువంటి సహవాసముండదు, శాంతి సమాధానాలుండవు, సంతోషము అసలు ఉండదు. నిర్ణయము ఇక మనదే. ఆహారము కంటె దేహము, దేహము కంటె ప్రాణము ముఖ్యము గనుక ప్రాణానికి ప్రాణమిచ్చిన ప్రభువు కావాలో, ఆయన ఇచ్చే నిత్య జీవము కావాలో లేక దేహ ఆశలు క్షణికమైనవి తీర్చుకొని సాతాను కొరకు ఏర్పాటు చేసిన నిత్య నరకము కావాలో ఆలోచించు.
జీవితములో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభువిచ్చే నిత్య రాజ్యాన్ని పొందుకోటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. - యోహాను 3:16.

- మద్దు పీటర్ 9490651256