అదిలాబాద్

బంగారు తెలంగాణకు బాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
బోథ్, నవంబర్ 29: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని, ప్రాణాలను త్యాగం చేసి మన తెలంగాణను మనం సాధించుకున్నామని, ఇప్పుడు బంగారు తెలంగాణకు బాటలు వేసుకుంటున్నామని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జెఎసి శిబిరం వద్ద ఏర్పాటు చేసిన దీక్షదివాస్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కెసిఆర్ నిరాహారదీక్ష రోజు అయిన నవంబర్ 29 తేదీని ప్రతి సంవత్సరం దీక్షదివాస్‌గా జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా ఆ మహానీయుని యొక్క సేవలను గుర్తు చేసుకుంటున్నామన్నారు. కెసిఆర్ చేపట్టిన అమరనిరాహార దీక్షవల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కెసిఆర్ ప్రధాన కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం జనరంజకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. గత పాలకులు దశాబ్దాల కాలంలో చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే చేసి చూపించిందన్నారు. ఇంకా మనం బంగారు తెలంగాణ సాధించుకుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఈ బంగారు తెలంగాణకు ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి బంగారు తెలంగాణలో ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఆసరా, ఆహారభద్రత, కళ్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, డబుల్‌బెడ్‌రూం వంటి పథకాలను ప్రవేశపెట్టి అర్హులైని ప్రతిఒక్కరికి పథకాలు లభించేలా కృషిచేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా పథకాలను చేపడుతున్నామన్నారు. బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రాబోవు 20 సంవత్సరాల కూడా కెసిఆర్ ప్రభుత్వమే కొనసాగుతుందని, బంగారు తెలంగాణ సాధించి తీరుతామన్నారు. కెసిఆర్ పాలన, ముఖ్యమంత్రిపై నమ్మకం గత వరంగల్ ఎన్నికలే ఉదాహరని, రికార్డు స్థాయిలో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికి ప్రతిపక్షాలకు డిపాసిట్ దక్కకుండా చేశారన్నారు. ప్రజలు కెసిఆర్‌పై పెట్టుకున్న నమ్మకానికి ఇది ఉదాహరణ అని, ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బంగారు తెలంగాణ కోసం కెసిఆర్‌తో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఉద్యమ సమయంలో చేసిన సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రుక్మాణ్‌సింగ్, ఎంపిపి గంగుల లక్ష్మి మల్లేష్, టీఆర్‌ఎస్ నాయకులు మల్లేష్, విష్ణు, గౌరయ్య, దేవన్న, రమణగౌడ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

అక్రమ స్థలం కాదు.. పునరావాస స్థలం
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 29: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్మించుకున్న తన ఇంటిని రిజిస్టేషన్, రెవెన్యూ అధికారులు కూలగొట్టడం సమంజసం కాదని బాధితుడు ఉట్ల నర్సిములు అన్నారు. ఆదివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టుగా పనిచేసి 1990వ సంవత్సరంలో అప్పటి ఆదిలాబాద్ ఎస్పీ మాలకొండయ్య ముందు సరెండర్ అయినందుకు కలెక్టర్ ఎంజి గోపాల్, మున్సిపల్ కమిషనర్, చైర్మన్ సహకారంతో కలెక్టరేట్ ఎదుట గల ఖాళీ స్థలంలో ఫుడ్ ఆర్ట్ ఫర్నిచర్ షాప్ పెట్టుకోవడానికి స్థలం చూపించారన్నారు. పునరావసం కింద కల్పించిన ఈ స్థలాన్ని ఇప్పుడు రిజిస్టేషన్, రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ఖాళీ చేయించడం ఎంత వరకు సమంజసమన్నారు. వెంటనే తన స్థలాన్ని కేటాయించాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని బాధితుడు నర్సిములు తెలిపాడు. సమావేశంలో అరుణ, నవీన్, గంగన్న పాల్గొన్నారు.

హిందూ సమాజం సంఘటితం కావాలి
* ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ సుబ్రహ్మణ్యం
దివ్యనగర్, నవంబర్ 29: స్వాతంత్య్రం రాకముందు మనదేశంపై ఎందరో దాడులు చేశారని, దేశ స్వాతంత్య్రం ఎందుకు కోల్పోయిందో ఆలోచించాల్సిన అవసరం ఉందని, హిందూ సమాజం సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ అన్నదానం సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీ ఆర్ మినీ స్టేడియంలో ఆర్‌ఎస్‌ఎస్ 90ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన జిల్లా చైతన్య శిభిరానికి ఆయన ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. హిందువులను ఏకం చేయడానికే ఆర్‌ఎస్‌ఎస్ హిందూ సంఘటనను ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐకమత్యం లేదని, అందరూ ఐక్యమైనప్పుడే ఏదైనా సాధించవచ్చన్నారు. దేశభక్తిని జాగృతం చేయడానికే ఆర్ ఎస్ ఎస్ పూనుకుంటుందన్నారు. దేశ అభివృద్దిలో యువత పాలుపంచుకోవాలన్నారు. దేశంలో కుహాన లౌకికవాదులు ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్లను రద్దుచేయుమని చెప్పలేదని, రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని కోరిందన్నారు. దీనిని కొంత మంది వేరుగా అర్థం చేసుకున్నారన్నారు. అంబేద్కర్ ఉద్దేశాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ జివిలో పరమాత్మను చూడాలని హిందూ ధర్మం చెప్పిందన్నారు. దేశభక్తి పూర్వక సమాజ నిర్మాణం జరగాలన్నారు. యువతకు దశా, దిశ లేకుండా పోతుందని, యువశక్తి మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల దేశభక్తి కారణంగానే ప్రపంచ దేశాలు అభివృద్ది చెందాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రజలను సమాజ ప్రేమికులుగా తయారుచేస్తుందన్నారు. అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. సమాజంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఉన్నాయని, ప్రజలు వాటిని గమనించాలన్నారు. అరబ్బు దేశీయులు కూడా గోవు విశిష్టతను తెలుసుకున్నారని, దానిని రక్షించడం భారతదేశానికి ఆత్మ అన్నారు. జీవ ఆరాధకుడు దైవ ఆరాధకుడవుతారన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మగాంధీ గో హత్యను నిషేదించాలని తెలిపారన్నారు. మత విబేదాలు లేకుండా మనమందరం భారతీయులుగా జీవించాలన్నారు. వేర్పాటువాద కుట్రలు ఈ దేశంలో జరుగుతున్నాయని, సమాజంలో విష భీజాలు నాటే కుట్రలపై జాగరూకతతో ఉండాలన్నారు. దేశరక్షణకు సంఘటితం కావాలని దేశంలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో నాగరికత కల్పించే కార్యక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో పత సంచలన్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంఘ్‌చాలక్ నూకల విజయ్‌కుమార్, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ రామాంజనేయులు, జిల్లా కార్యవాహ రాజులవార్ దిగంబర్, ప్రభంద ప్రముఖ్, పతికె రాజేంధర్, ఉల్లేంగ ముత్యం, మెడిసెమ్మ రాజు, డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, పట్టణ ప్రములు, హాజరయ్యారు.

జిల్లా జడ్జికి ఘనంగా సన్మానం
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 29: ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న జిల్లా న్యాయమూర్తి గ్రంథి గోపాలకృష్ణమూర్తిని ఆదివారం పట్టణంలోని సెంట్రల్ గార్డెన్‌లో హైకోర్టు జడ్జి చంద్రయ్య, కలెక్టర్ జగన్మోహన్‌లు ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య మాట్లాడుతూ పదవీ విరమణ అనేది సహాజమని, అంకితభావంతో పనిచేస్తే ఎళ్లవేళల గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం జిల్లా జడ్జి గ్రంథి గోపాల కృష్ణమూర్తి మాట్లాడుతూ పేద, ధనికవర్గాలు అనే తారతమ్యం లేకుండా అందరికి సమన్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ ఉద్యోగ విరమణ పొందడం ఆనందంగా ఉందన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు తమ వృత్తికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. న్యాయం కోసం వచ్చేవారికి మనస్పూర్తిగా న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో వెనకబడి ఉందని, వంద శాతం అక్షరాస్యత సాధించినట్లయితే జిల్లా అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి అరుణకుమారి, అదనపు జడ్జి కుంచాల సునీత, విశ్రాంతన్యాయమూర్తి యతిరాజ్, అరుణసారిక, ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అజ్ఞాతవాసం వీడి... జనజీవనంలో కలువండి
* నక్సల్స్‌కు ఎస్పీ పిలుపు
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 29: ఆయుదాలతో అడవిబాట పట్టిన మావోలు సాధించేది శూన్యమని, తమ పంథా మార్చుకొని జనజీవన స్రవంతిలో కలిసే నక్సల్స్‌ను అన్నివిధాలుగా చేయూతనందిస్తామని జిల్లా ఎస్పీ తరుణ్ జెషి అన్నారు. ఆదివారం హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఈనెలలో జరిగిన కోర్టు కేసులు, అరెస్టు వారెంట్‌లు, దొంగతనాలు, మావోయిస్టుల ప్రభావం, శాంతి భద్రతలు ఇతర సమస్యలపై పోలీసు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. నేరాలను అదుపుచేయుటకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కోర్టు కేసుల పురోగతి, గుడుంబా కేసులు, పోలీసు స్టేషన్‌ల కేసుల దర్యాప్తు వివరాలు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ పోలీసుల తమ విధులను చురుకుగా నిర్వహించనప్పుడే నేరాలను అదుపు చేయుటకు అవకాశం ఉందని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రాంతాల్లో నేరాలు అధికంగా జరుగుతుంటాయన్నారు. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులకు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. తెలిసి తెలియని వయసులో యువకులు అడవిబాట పట్టి మావోయిస్టుల్లో చేరారని, వెంటనే లొంగిపో తమ కుటుంబాలతో కలిసి సాధారణ జీవనం గడపాలని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అమల్లో ఉందని, మావోయిస్టులు నిర్భయంగా లొంగిపోవాలని సూచించారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నేరుగా ఫోన్ నెం.94407 95080కు ఫోన్ చేసినట్లయితే పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి లొంగిపోయినట్లు ప్రకటిస్తామని తెలిపారు. సంచుల బక్కన్న ఆయుధంతో తిరుగుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అరెస్టుచేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టామన్నారు. కొందరు కావాలనే బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని, కాల్చిచంపారని ప్రచారం చేశారని, పోలీసులకు బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం ఏమాత్రం అవసరం లేదన్నారు. జిల్లా అడవుల్లో పోలీసు ప్రత్యేక దళాలు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నందున మావోయిస్టులో భయం భయంతో జీవనం సాగించే బదులు, స్వచ్ఛందంగా లొంగిపోవాలన్నారు. జిల్లాలో గుడుంబా, గుట్కావంటి ఆనారోగ్యకరమైన, ప్రాణాంతకరమైన మత్తు పదార్థాలను నిర్మూలించుటకు సంబంధిత శాఖలతో కలిసి దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టి.పనసారెడ్డి, జిఆర్ రాధిక, డిఎస్పీలు లక్ష్మినారాయణ, మనోహార్ రెడ్డి, రమణారెడ్డి, అందేరాములు, శిక్షణ కేంద్రం డిఎస్పీ సీతారాములు, సిఐలు సత్యనారాయణ, వెంకటస్వామి, షేర్ అలీ, పోతారం శ్రీనివాస్, మోహన్, నిర్మల్ రూరల్ సిఐ కె.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

కరవు జిల్లాగా ప్రకటించే వరకు పోరాడుతాం
* తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు రమణ
నిర్మల్, నవంబర్ 29: ఆదిలాబాద్ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించే వరకు తెలుగుదేశం పార్టీ తరపున ఒత్తిడి తెస్తామని, పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ఆదివారం నిర్మల్‌లోని తెలుగురైతు రాష్ట్ర నాయకుడు భూషన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నప్పటికి కరువు జిల్లాగా ప్రకటించకపోవడం విడ్డూరమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిదులు నివేదికలు సక్రమంగా పంపకపోవడంతోనే జిల్లాకు దుర్గతి దాపురించిందన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న 400 రైతు కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ రూ.50 వేల చొప్పున అందజేసిందని, ముఖ్యమంత్రి కేసి ఆర్ ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షలు పంపిణి చేయాలని డిమాండ్‌చేశారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. ఇక్కడి పరిస్థితులపై తెలుగుదేశం ఎంపిలు, ఎమ్మెల్యేలు రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఇక్కడి ప్రభుత్వం సరైన నివేదికలు కేంద్రానికి పంపకపోవడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తగు ప్రాధాన్యత నిస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ రాష్ట్రం స్పందించలేదన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని నివేదికలు తయారుచేయడం వల్లే నాలుగు జిల్లాలకే కరువు మండలాల ఎంపిక పరిమితమైందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పత్తి రైతులకు క్వింటాళ్‌కు 6వేలు చెల్లిస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేయడం విడ్డూరమన్నారు. రైతులపై కేసులు నమోదుచేసి జైళుకు పంపడం శోచనీయమన్నారు. సమావేశంలో జిల్లా టిడిపి అధ్యక్షులు లోలంశ్యాంసుందర్, రాష్ట్ర నాయకులు భూషన్‌రెడ్ది, గండ్రత్మ్రేష్, తదితరులు పాల్గొన్నారు.

మా పంట మేము అమ్మడానికి లక్ష నిబంధనలా?
* అయినా యార్డు సౌకర్యం లేదు.
వాంకిడి, నవంబర్ 29: మేము పండించిన పంటను మేము అమ్ముకోవడానికి లక్ష నిబందనలా? ఇది ఎక్కడి న్యాయమని వాంకిడి మండల రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మండలంలోలని బాలాజీ జిన్నింగ్ మిల్లులో సోమవారం నుండి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా రైతులకు గుర్తింపు కార్డు, పట్టా పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ వంటివి తప్పకుండా సమర్పించుకోవాలని అధికారులు ఆదేశించడంతో అనేక మంది రైతులు ఇదేం గోస అని సిసిఐ కొనుగోలు కేంద్రానికి తమ పత్తిని అమ్మడానికి వెళ్ళడంలేదు. తాము తెచ్చిన కొద్దిపాటి పత్తిని బయట ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని వెళ్ళుతున్నారు. వాంకిడి మండలంలో పత్తి రైతులకు గత సంవత్సరం మాదిరగా ఈ సంవత్సరం కూడా మార్కెట్ యార్డు కొనుగోలు దాదాపు లేనట్లుగానే కనిపిస్తుంది. కొనుగోలు కోసం ఇప్పటివరకు మార్కెటింగ్ శాఖ యార్డులో బీట్ ధరకే పత్తి పాట పాడడానికి ఏర్పాటు చేయలేదని దీంతోపాటు కొనుగోలు కోసం రంగ ప్రవేశం చేసిన సిసిఐలో అమ్ము కోవడానికి అనేక నిబందనలు అడ్డు వస్తున్నాయని దీంతో గతిలేని పరిస్ధితిలో మేము ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొంటున్నామని వారంటున్నారు. వాంకిడిలో సోమవారం నాడు సిసిఐ కొనుగోలును ప్రారంభించింది. అయితే తేమ శాతం పేరుతో రైతుల పత్తికి ధర తక్కువగా చెల్లించడంతోపాటు ఈసారి ప్రభుత్వం నిబంధనలు తమను అటువైపుకు వెళ్ళకుండా చేస్తున్నాయని మండల గిరిజన రైతులు వాపోతున్నారు. ఇదే జిన్నింగ్‌లో ప్రైవేట్ కొనుగోలు చేసినా అన్ని నిబంధనలు లేవని వారంటున్నారు. పత్తి రైతుల కోసమే పత్తి కొనుగోలు నిబందనల ప్రవేశపెట్టినట్లు నాయకులు,అధికారులు చెబుతున్న అవి మాత్రం మాకోసం కాదని దాని వల్ల అధికారులే బాగుపడుతున్నారని వారంటున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల అనుమతి ప్రకారమే ప్రవేట్ కాంటలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడంతోపాటు అమాయక రైతుల పొట్టకొడుతున్న వారిపట్ల జిల్లా అధికారులు కఠీనంగా వ్యవహారించాలి తప్ప రైతుల పట్ల కాదని వారంటున్నారు.
వాంకిడి మండలంలో రెండు సంవత్సరాలుగా మార్కెటింగ్ యార్డు పనిచేయడంలేదని గ్రామానికి దూరంగా యార్డు ఏర్పాటు చేసి బిట్ పాడి, ధర నిర్ణయించడానికి వ్యాపారులు వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేయలేదని, అదేవిధంగా పత్తి కొనుగోలు చేసే వ్యాపారుల పట్ల అధికారులు చూసి చూడనట్లు వదిలి వేయడంతో తిరిగి వాంకిడి మండలంలో పత్తి కాంటాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని వారంటున్నారు. ఇకపై మార్కెటింగ్ శాఖ అధికారులతోపాటు జిల్లా అధికారులు, నాయకులు వాంకిడి మండలంలో సిసిఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు క్రమం తప్పకుండా ఉండాలని,అదేవిధంగా పనికి రాని నిబందనలన్ని తొలగించి, సిసిఐ కొనుగోలు చేసిన పంటకు వెంటనే డబ్బులు, లేదా చెక్కు ఇచ్చేవిధంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పత్తి కొన్న వారం రోజులపైగా చెక్కులు(డబ్బులు) రాకుండాపోవడంతోపాటు అధికారులు ఇక్కడి నుండి రాసి పంపే వివరాలతో చెక్కులు తప్పుగా రావడంతో అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారంటున్నారు.