మంచి మాట

స్థితప్రజ్ఞత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గతా సూన గతాసూంశ్చ నామ శోచంతి పండితాః’’- గతించిన వారిని గురించి, జీవించి ఉన్నవారిని గురించి పండితుడు ఒకే భావన కలిగి ఉంటాడు. పండితుడంటే స్థితప్రజ్ఞుడని భావం. దీనికే సమ దృష్టి అని పేరు.
మనస్సాగరంలో ఉద్భవించే కోరికలనే అలల్ని అణచి, కట్టడి చేసి ఆత్మ తృప్తిని పొందినవాడు స్థితప్రజ్ఞుడు. బాహ్యమైన కామనలపట్ల వెంపర్లాట కూడదు. అప్పుడు ఆత్మానందం తనకు తానే వశమవుతుంది. వాడే బ్రహ్మజ్ఞాని.
దుఃఖాలకు కుంగడు, సుఖాలకు పొంగక రాగ భయ క్రోధాలను వదలినవాడే స్థితధీః. నిర్భయత్వమనేది ఉపనిషత్ సందేశం. జ్ఞాని చావును సైతం లెక్క చేయడు. శుభాశుభాలను ఆహ్వానించడు, తిరస్కరించడు. కొండ శిఖరాలనుండి తొంగిచూచేవానికి నేలపై వుండే చెట్లు, గడ్డి హెచ్చుతగ్గులు అన్నీ సమంగా కనపడతాయి. బ్రహ్మజ్ఞాని సమస్త దృష్టిలోనూ, సృష్టిలోనూ దైవానే్న దర్శిస్తాడు.
ఇంద్రియాలు మనసును అల్లకల్లోలపరుస్తాయి. అవి కళ్లానికి లొంగని గుర్రాలవంటివి. వాటిపై స్వారీ ప్రాణాంతకం. బ్రహ్మజ్ఞాని కాగోరినవాడు మున్ముందు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
‘‘వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా’’ అని గీతాచార్యుని వాక్కు.
రవ్వంత రాని విత్తనం గోడ చీలికలో పడి పెరిగి, పెద్దదై అనలూ కొనలూ సాగి వేళ్ళూని గోడను కూలదోస్తుంది. అలాగే ఒక చిన్న కోరిక మనసులో పడిందా? అది అన్ని అనర్థాలను పెంచి పోషిస్తుంది. మనసును జయించినవాడే యోగి. నిశ్చలమైన మనస్సు ఎప్పటికీ చెదరదు. పైగా స్వచ్ఛత, నిశ్శబ్దత అలవడి సర్వదుఃఖాలు తొలగిపోతాయి.
‘అశాంతస్య కుతః సుఖమ్’ అని గీతావాక్యం. చుక్కాని లేని నావ గాలి తాకిడికి ఎటు వెళుతుందో తెలియదు. ఆ విధమైన ప్రయాణంలో గమ్యస్థానం చేరడం కుదరదు. తప్పుదోవ పట్టిన మనస్సు ఆత్మను చేరలేదు. దురద పుట్టిన చోట గోకితే అది మరింత పెద్ద పుండుగా మారుతుంది. అల్ప సంతోషాలకు ఆకర్షింపబడితే అందులో ఇరుక్కుపోక తప్పదు.
స్వతః సిద్ధంగా ఆత్మ స్వతంత్రం, అమరం, అవిద్య జ్ఞానంతో తాదాత్మ్య భ్రాంతికి లోనవుతూ వాటి సుఖ దుఃఖాలను తానూ అనుభవిస్తుంటుంది. ఈ ఆత్మానాత్మ వివేకం లేకపోవడంవల్ల అన్ని దుఃఖాలను అనుభవిస్తుంటుంది. మనః శరీరాలకంటే ఆత్మ భిన్నమనే విస్పష్టజ్ఞానం అవసరం. వీటినుండి విముక్తమైతేనే ముక్తి.
ఆత్మరాగ ద్వేష విముక్తమైతేనే నిశ్చలమవుతుంది. కోరికలను జయించి, అహంకారాన్ని వదిలినవాడే శాంతికి అర్హుడు. కుక్కను, కుక్క మాంసం తినేవాడిని సమంగా చూసేవాడే సమదర్శి అయిన స్థితప్రజ్ఞుడు. అతని దృష్టిలో మట్టి గడ్డ అయినా బంగారపు ముద్ద అయినా ఒక్కటే.
కలియుగంలోను ఈ సమభావం రావాలంటే స్వార్థాన్ని విడనాడాలి. అందరిలోను భగవంతుని అంశను చూడగలగాలి. అందరూ బాగుంటే నేనూ బాగుంటాను అన్న ఆలోచనతో ఉంటే అందరూ సమానంగా కనిపిస్తారు. తనకోసం కష్టపడినపుడు వచ్చే ఆనందానికన్నా ఇతరులకోసం కష్టపడినప్పుడు అందులోను ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివారి మంచి కోసమే ఆరాటపడినప్పుడు, ఎదుటివారికి కావలసింది మనం ఇచ్చినపుడు కలిగే ఆనందం రుచిచూస్తే ఇక ఎప్పటికీ స్వార్థబుద్ధిని రానివ్వరు. తనకోసం కాక ఇతరులకోసమే ఆలోచనాస్రవంతి సాగుతుంది. అలాంటి భావం వృద్ధి అయనపుడు అంతా సమభావమే, సమబుద్ధే ఏర్పడుతుంది. ఎల్లెడలా నూతనోత్తేజం ప్రసరిస్తుంది.

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-పి.వి.రమణకుమార్