సంజీవని

మానసిక ప్రశాంతతే మైగ్రేన్‌కు మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: మైగ్రేన్ కు నివారణ చెప్తారా?
-్ధర్మారావు కడియాల, నల్గొండ
జ: ఇంకో జేబురుమాలు కూడా పట్టనంత లైటుగా బట్టలు సర్దిన సూటుకేసులా కపాలం లోపల మన మెదడు ఇరికి ఉంటుంది. దానిలో నరాలు, రక్తనాళాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. రక్తనాళంలోపల రక్తపోటు పెరిగినపుడు, బెలూనులో గాలి ఊదితే ఎలా పొంగుతుందో అలా ఈ రక్తనాళాలు పొంగాలని ప్రయత్నిస్తాయి. కానీ, అక్కడ పొంగేందుకు చోటు లేకపోవడంతో, పక్కనున్న నరాలను నొక్కుతాయి. ఈ కంప్రెషన్ వలన తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి తగ్గాలంటే, రక్తనాళాల పొంగు అణగాలి. అంటే అందులో పెరిగిన బీపీ తగ్గాలి. ఆ ఒత్తిడిని తగ్గించేందుకోసం మెదడు వాంతిని ప్రేరేపిస్తుంది. వాంతిగానీ, విరేచనం గానీ, మూత్రంగానీ అయితే కొంత ప్రెషరు తగ్గినట్టు అవుతుంది. ఇది మైగ్రేను తలనొప్పి విషయంలో తరచూ కనిపించే ఒక దృశ్యం. బీపిని పెంచుతున్న ఆ మానసిక సంఘర్షణ కలిగించే అంశాన్ని వదిలిస్తేనే నొప్పి తగ్గుతుంది.
మైగ్రేన్ తలనొప్పి రాగానే మనసును ప్రశాంతంగానూ, సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉంచుకునేందుకు ప్రయత్నం చేయటం మొదటి కర్తవ్యం. వచ్చినపుడు తగ్గేందుకు వాడవలసిన మందులు ఎటు తిరిగీ ఉంటాయి. కానీ మర్నాడు రాకుండా చూసుకోవాలి. అందుకు మందులు ఉండవు. డాక్టర్లను, మందులను మార్చటం కాదు, మారాల్సింది మనం.
వాతాన్ని పెంచే ఆహార పదార్థాలను మానండి. అతి పులుపును తినటం ఆపండి. అల్లం వెల్లుల్లి మషాలాలు తగ్గించండి. వేపుడు కూరలు, శెనగపిండి లాంటి కఠినంగా అరిగేవాటిని ఆపండి.. జీర్ణశక్తిని కాపాడుకోండి. అనుకూలమైన ఆలోచనా విధానాన్ని అనుసరించండి. మైగ్రేన్ తలనొప్పిని దూరం చేసుకోవటానికి ఇవన్నీ అనుసరణీయాంశాలు.
మలబద్ధకం
ప్ర: మలబద్ధకంతో సతమతవౌతున్నాను. రోజూ ఎక్కువ విరేనాల మందులు వేసుకోవలసి వస్తోంది. నివారణ సూచిస్తారా?
-ప్రసాద్ జె.డి, మచిలీపట్నం
జ: సగటు మధ్యతరగతి మహిళల మీద పని ఒత్తిడి ఎక్కువ. సక్రమంగా కాలకృత్యాలు తీర్చుకునే సావకాశం వారికి లేకపోవడం, వంటింటి విధుల్లో పడి శరీరధర్మాలను వాయిదా వేయటంవలన మహిళల్లో మలబద్ధత ఎక్కువగా ఉంటుంది. మలబద్ధతవలన కీళ్ళనొప్పులు, నడుం నొప్పి, గ్యాస్‌ట్రబుల్ లాంటి అనేక ఇతర వ్యాధులకూ ద్వారాలు తెరిచే పరిస్థితి ఏర్పడుతోంది.
కొంచెం సేపాగాక వెడదాం అని వాయిదా వేయటంవలన చివరికి అదే అలవాటుగా మారి, విరేచనం అనేది ఆడవాళ్ళలో ఒక అపురూప అంశం అయిపోతుంది. మోషన్ వస్తే మోక్షం వచ్చినంత సంబరం అవుతుంది. ఇది ఆడవారికి వారి జీవన విధానం వలన కలిగే ఒక సమస్య. ఇలా జీవించే మగవారిక్కూడా ఇది సమస్యే!
గడియారం రోజూ సమయానికి గంట కొట్టినంత ఠంచనుగా విరేచనం ప్రతిరోజూ అదే సమయానికి అవుతుంది. దాని స్వభావం అది! కాలానికి అవుతుంది కాబట్టి, కాలానికి అయితీరవలసింది కాబట్టీ, దాన్ని కాల విరేచనం అన్నారు. అది సకాలంలో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విరేచన సమయాన్ని తప్పించేందుకు ప్రయత్నించకూడదు. తరువాత అనే తాత్సారానే్న మలబద్ధకం అంటున్నాం. అది మలబద్ధతకు దారితీస్తుంది.
సమస్త రోగాలకూ మూలకారణం మలబద్ధతేనని మొదట గ్రహించాలి.
విరేచనం అయ్యే తీరునుబట్టి జీర్ణాశయ వ్యవస్థలు మృదు, మధ్య, కఠిన (క్రూర) అని మూడు రకాలుగా ఉంటాయి. గ్లాసు పాలు తాగితే చాలు, రెండు విరేచనాలు కావడం మృదుతత్వం. విరేచనాల బిళ్లలు డబ్బాడు మింగినా కడుపు కదలక పోవటం కఠినతత్వం. ఒక చిన్న విరేచనం మాత్ర వేసుకుంటే మధ్యస్థంగా విరేచనం కావటం మధ్యతత్వం. ఈ మూడు రకాల తత్త్వాలలో ఎవరికివారు తాము ఏ విధమైన శరీర తత్వం కలిగి ఉన్నారో మొదట అంచనా వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఆహార విహారాలనూ జీవన విధానాన్నీ మార్చుకోవడం అవసరం. అన్ని ఇతర పనులూ మాని విరేచనానికి వెళ్లిరావాలి!
టాయిలెట్లోకి వెళ్లిన వెంటనే విరేచనం అయిపోవాలి. ముక్కీ ముక్కీ విరేచనానికి వెళ్ళే పరిస్థితివలన గుండెలు అవిసిపోగలవు. నీరు తక్కువ తాగేవారికి విరేచనం పిట్టం కట్టి ఎంత ముక్కినా బయటకు రాదు. స్థూలకాయం, నడుంనొప్పి, మోకాళ్ళనొప్పులున్నవారు గొంతుక్కూర్చునే దేశవాళీ మరుగుదొడ్లో విరేచనానికి వెళ్ళటాన్ని పెద్ద శిక్షగా భావిస్తారు. నొప్పులకు భయపడి చాలామంది విరేచనాన్ని వాయిదా వేయాలని చూస్తారు. కొందరికి టాయిలెట్లో ఎంతసేపు కూర్చున్నా ఇంకా అవలేదన్నట్టు, పెద్ద విరేచనం కదిలి వచ్చేస్తోందన్నట్టు అనిపించి, గంటల తరబడీ అక్కడే గడపాల్సి వస్తుంటుంది. ఇవన్నీ వాత వ్యాధులకు సంబంధించిన లక్షణాలు.
కొందరు మగవాళ్ళకి కాఫీ తాగకపోతేనో, సిగరెట్టు కాల్చకపోతేనో, దినపత్రిక చదవకపోతేనో విరేచనం కాదనే అపోహలు ఉంటాయి. వాటికోసం విరేచనాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి కాఫీలో గానీ సిగరెట్టులో గానీ విరేచనం అయ్యేలా చేసే గుణాలేవీ లేవు. కానీ విరేచనానిక్కూడా సెంటిమెంటుని లింకు పెడుతుంటారు. ఇవన్నీ విరేచనాన్ని ఎగగొట్టే ఎత్తుగడలే గానీ ఉపయోగపడే ఆలోచనలు కావు.
ఆరోగ్యకరమైన మలానికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. వెళ్లగానే అయిపోవాలి, మలం మృదువుగా ఉండాలి, కాసిని నీళ్ళు కొట్టగానే లెట్రిన్ ప్లేటుకు అంటుకోకుండా పోవాలి. నిన్ననో మొన్ననో తిన్న ఆహార పదార్థాలు విరేచనంలో కనిపించినా, నీళ్ళతో కడుక్కున్నా చేతికి ఇంకా జిడ్డుగా అనిపించినా, లెట్రిన్ ప్లేటులో అంటుకొని ఎంత నీరు కొట్టినా వదలక అంటుకొని ఉంటున్నా ఆ వ్యక్తి పొట్ట చెడిందని అర్థం.
మొలలు, లూఠీలు, విరేచన మార్గంలో అవరోధాలు, పుళ్ళు, వాపులు, కొన్ని రకాల మందులు, కొన్ని రకాల ఆహార పదార్థాలు మలబద్ధకానికి కారణం కావచ్చు. కేన్సరు లాంటి వ్యాధులక్కూడా మలబద్ధత తొలి హెచ్చరిక అవుతుంది. విరేచనంలో తుమ్మజిగురు బంకలాగా తెల్లని జిగురు గానీ, రక్తపుచారలుగానీ ఉంటే అమీబియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నాయేమో చూపించుకోవాలి. విరేచనం పుల్లని యాసిడ్ వాసన వస్తుంటే కడుపులో ఆమ్లరసాలు పెరిగిపోతున్నాయని అర్థం. కుళ్లిన దుర్మాంసం వాసన వేస్తుంటే లోపల చీము ఏర్పడుతోందేమో చూపించుకోవడం అవసరం. రిబ్బనులాగా సన్నగా విరేచనం అవుతుంటే పేగుల్లో అవరోధం కారణం కావచ్చు. మేకపెంటికల మాదిరి ఉండలు ఉండలుగా అవుతుంటే ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ లాంటి మానసిక వ్యాధులు కారణం కావచ్చు.
కాలవిరేచనం కోసం విరేచనాల మందు వాడటం ప్రమాదకరం. రోజూ విరేచనాల మందు సహకారంతో విరేచనానికి వెళ్ళటంవలన పేగులు స్వయంగా కదిలే పరిస్థితిని కోల్పోతాయి. నీరు ఎక్కువగా తీసుకోండి. కాయగూరలు ఎక్కువగా తినే విధంగా వండే తీరు మార్చుకోండి. అమితంగా పులుపు, శనగపిండి, అతిగా మషాలాలు ఇవన్నీ మలబద్ధతను కలిగిస్తాయి. ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవలసిందిగా శరీరం చేసే హెచ్చరిక ఈ మలబద్ధతని గుర్తించాలి.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు