శ్రీకాకుళం

నిర్వాసితుల విధ్వంసంపై పోలీసుల ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం/ ఎల్‌ఎన్‌పేట, జనవరి 23: వంశధార నిర్వాసితుల ఆగ్రహావేశాలకు జరిగిన విధ్వంసాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన సోమా కంపెనీ గుత్తేదారులకు రూ.4.50 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. నిర్వాసితుల ఆందోళనలతో రిజర్వాయర్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో సోమవారం రిజర్వాయర్ నిర్మాణంపై వివిధ శాఖల అధికారులు సమాలోచనలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. సమస్యలు పరిష్కరించకుండా పోలీసుల పహారాతో రిజర్వాయర్ పనులు వేగవంతం చేసేందుకు ప్రయత్నించడంతోపాటు మంత్రులు, అధికారుల హెచ్చరికలతో సహనం కోల్పోయిన నిర్వాసితులు రెండు రోజులుగా ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీయడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. మండలంలోని పెద్ద సంకిలి, బర్రిపేట, దుగ్గుపురం, పాడలి, తులగాం, చిన్నకొల్లివలస గ్రామాలతోపాటు కొత్తూరు మండలం కృష్ణాపురం తదితర గ్రామాల నిర్వాసితులు 5 వేలు మంది ఈ ఆందోళనలో ఉన్నట్టు అంచనా వేశారు. ఆందోళనకారులు తహశీల్దార్, విద్యాశాఖ, ఎంపిడిఒ, వెలుగు కార్యాలయాలతోపాటు సోమా కంపెనీ ఆస్తులపై దాడులు చేపట్టారు. విధ్వంసాలు పోలీసుల కనుసన్నల్లోనే జరగడంతో వీటి వీడియోలు, ఫొటోల ఆధారంగా గుర్తిస్తున్నారు. అలాగే తెరవెనుక ఉద్యమాన్ని నడిపిన నేతల సమాచారం కూడా సేకరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి జరిగిన నష్టాలను అధికారుల నుంచి పోలీసులు సేకరించారు. శాంతియుతంగా నిర్వాసితులు నిరసనల ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమని జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు. విధ్వంసాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలియవస్తుంది.
సోమా కంపెనీ జిఎం జితేంద్ర మాట్లాడుతూ కంపెనీకి సంబంధించి 300 మంది ఉద్యోగులు, 700 మంది కార్మికులు పనిచేస్తున్నారని, నిర్వాసితులతోపాటు కొందరు దుండగలు కూడా కార్యాలయంలోకి ప్రవేశించి విలువైన వాహనాలను, సామగ్రిని ధ్వంసం చేశారన్నారు. గొట్టా బ్యారేజ్ జంక్షన్, పెద్దకొల్లివలస, మోదుగువలస ప్రాంతాల్లో కంపెనీ ఆస్తులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేశామని, ప్రధాన కార్యాలయం నుంచి నష్టాన్ని అంచనా వేయడానికి బృందం రానున్నట్టు తెలిపారు. కార్మికులను స్వస్థలాలకు పంపించగా, వాహనాలను పరిరక్షణకు సరుబుజ్జిలి వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆందోళనతో రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంతో పనుల నిర్వహణకు రెవెన్యూ, తహశీల్దార్ పోలీస్‌శాఖల అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

సిక్కోలు పేరు మరోసారి మార్మోగాలి
* జెసి చక్రధరబాబు

శ్రీకాకుళం, జనవరి 23: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే మానవ అశోకచక్రంతో సిక్కోలు మరోసారి మార్మోగాలని జాయింట్ కలెక్టర్ కెవిఎన్ చక్రధరబాబు పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసే మానవ అశోకచక్ర రిహార్సల్స్ సోమవారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరిగింది. మావన అశోకచక్రం ఏర్పాటుచేసే సమయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు, కళాశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. గుజరాత్ రాష్ట్రం పోరుబందర్‌లో 3750మంది విద్యార్థ్ధులు 50 నిముషాల్లో మానవ అశోకచక్రం ఏర్పడి రికార్డును సృష్టించారని, వారికంటే తక్కువ సమయంలో 5,580 మందితో మానవఅశోకచక్రంగా ఏర్పడి సిక్కోలు పేరును మరోమారు మార్మోగేలా చేయాలని విద్యార్థ్ధులకు పిలుపునిచ్చారు. ఈ మావన అశోకచక్రంలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి ఎన్నికల సంఘం తరఫున ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. జనవరి 25న ఉదయం 10గంటలకు మానవ అశోకచక్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని, అందుకు కనీసం గంటన్నర ముందు విద్యార్థులు వారికి కేటాయించిన వలయాల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. విద్యార్థ్ధులను సకాలంలో తీసుకురావడమే కాకుండా వారికి కేటాయించిన వలయాల వద్ద సిద్ధంగా ఉంచడం, కార్యక్రమ అనంతరం సురక్షితంగా కళాశాలకు తీసుకువెళ్లే బాధ్యతను ఆయా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులతో మానవ అశోకచక్రాన్ని ఏర్పాటు చేసి డ్రోన్ల సహాయంతో వీక్షించారు. కళాశాల విద్యార్థులందరూ నిర్ణీత సమయంలో మావన అశోకచక్రంగా ఏర్పాటై అబ్బురపరిచారని జెసి అభివర్ణించారు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నమోదయ్యేందుకు ఎటువంటి సమస్య ఉండబోదన్నారు. ఈకార్యక్రమంలో జెసి-2 పి.రజనీకాంతారావు మాట్లాడుతూ మావన అశోకచక్రంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు 6,500మంది విద్యార్థ్ధులు పాల్గొంటారన్నారు. ఇందులో శివానీ ఇంజినీరింగ్ కళాశాల నుండి 1000, ప్రభుత్వ పురుషుల కళాశాల నుండి 1000, డిగ్రీ కళాశాల నుండి 800, మహిళా కళాశాల, సన్‌డిగ్రీ కళాశాల నుండి 1000మంది, వెంకటేశ్వర కళాశాల నుండి 600, ఐతమ్, శ్రీశివానీ డిగ్రీ కళాశాలల నుండి 800మంది, గాయిత్రీ డిగ్రీ కళాశాలల నుండి 450 మంది, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలల నుండి 300, ఆదిత్య కళాశాల నుండి 250, హెచ్‌పిఎన్ నుండి 200, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి 100మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. వీరింతా నిర్ణీత సమాయానికి చేరుకొని వారికి కేటాయించిన వలయాల్లో సిద్ధంగా ఉండాలన్నారు. మావన అశోకచక్రం ఏర్పాటులో ఎటువంటి సమస్యలు లేకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి జి.సి. కిషోర్‌కుమార్, జెడ్పీ సిఇఓ బి.నగేష్, ఆర్డీవోలు దయానిధి, ఎం.వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ ధనుంజయరావు, సర్వే సహాయ సంచాలకులు డిబిడిబి.కుమార్, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ పి.జగన్మోహనరావు, బెజ్జిపురం యూత్‌క్లబ్ డైరెక్టర్ ప్రసాద్, స్వీప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వై.వి రమణమూర్తి, శివానీ కళాశాలల మేనేజింగ్ డైరెక్టర్ దుప్పల వెంకటరావు, పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.బాబూరావు, మహిళా కళాశాలల ప్రిన్సిపాల్ జ్యోతిఫెడ్రిక్ పాల్గొన్నారు.

‘గ్రీవెన్స్’కు వినతుల వెల్లువ
శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువెత్తాయి. ఉదయం 11గంటల వరకు ఖాళీగా ఉన్న గ్రీవెన్స్‌కు జిల్లా కలెక్టర్ రావడంతో ఒకేసారి రద్దీగా మారింది. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం వినతులు స్వీకరించారు. 2013 భూసేకరణ చట్టాన్ని యథాతథంగా చేయాలని, సవరణలు చేయాలన్న ఆలోచనలను వెంటనే విరమించుకొని తక్షణమే రైతు, వ్యవసాయ కార్మిక గిరిజన సామాజిక సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వినతిపత్రం సమర్పించిన వారిలో బుడితి అప్పలనాయుడు, కోనారి మోహనరావు, టి.సన్యాసిరావు, గొండు రఘురాం, కోరాడ నారాయణరావు ఉన్నారు. కమ్యూనిటీ హాల్‌కు స్థలం కేటాయించాలని ఎంఆర్‌పిఎస్ జిల్లా గౌరవధ్యక్షుడు దీర్ఘాశి సూర్యనారాయణ, దాసరి తిరుమలరావు, లోపింటి నారాయణరావు కోరారు. 2012లో దరఖాస్తు చేశామని, అప్పటిలో ఆరున్నర సెంట్ల స్థలం ముసలయ్యకాలనీలో చూపించారని, ఆ స్థలాన్ని కమ్యూనిటీ భవనానికి కేటాయించాలని కోరారు. కుటుంబాన్ని ఆదుకోవాలని ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ అంబేద్కర్‌నగర్‌కు చెందిన లింగాలపున్నమ్మ, రామకృష్ణ కోరారు. తన కుమారుడు లింగాల శ్రీనివాసరావు ఎస్‌ఐ సెలక్షన్‌కు వెళ్లి క్వాలిఫై అన్నీ పూర్తయ్యాక కుప్పకూలి పోయాడని, కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరింది. కుటుంబాన్ని ఆదుకోవాలని ఎం.త్రినాథరావు, చక్రధరరావు, ఇ.తవిటినాయుడు, జి.శ్రీకాంత్ కోరారు. జిల్లాలోని కొత్తూరు పిహెచ్‌సిలో వైద్యమిత్రగా పనిచేస్తున్న డి. మధు కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ప్రస్తుతం కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, తమను ఆదుకోవాలని విన్నవించారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, రాష్ట్ర స్థాయి పోటీల్లో తాను మొదటి 5,6వ స్థానాలను సాధించానని, ఎక్కువమంది కావడంతో తనను ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ఎంపిక చేయలేదని, దాతలు ఆర్థిక సహాయాన్ని అందిస్తే అధిరోహిస్తానని కొత్తూరు మండలం వసపక్ గ్రామానికి చెందిన మామిడి రమణ తెలియజేశారు. పెన్షన్‌ను మంజూరు చేయాలని ఎల్‌ఎన్‌పేట మండలం పల్లి రాజశేఖర్ కోరారు. జన్మభూమిలో తనకు పెన్షన్ వచ్చినట్లు ఎంపిక జాబితాలో పేరు నమోదై ఉందని తీరా తన పేరు తొలగించి వేరే వ్యక్తులకు ఇస్తున్నారన్నారు. ఎస్సీలను వర్గీకరించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు వైఎస్ రాజు, రాణా శ్రీనివాస్, నారాయణ, రామారావు కోరారు.

నియోజకవర్గంలో స్ర్తి ఓటర్లే అధికం
ఆమదాలవలస, జనవరి 23: స్థానిక నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది 1166 ఓట్లు పెరిగాయి. వీటిలో స్ర్తిలు 203 ఆధిక్యంగా ఉన్నారు. 2016 జనవరి 25 గత ఏడాది ఓటర్ల దినోత్సవం నాటికి 1,70,489మంది ఓటర్లు నమోదు కాగా, ఈ ఏడాది 1,71,055మంది నమోదై ఉన్నారు. వీరిలో పురుషులు 86,407మంది ఉండగా, స్ర్తిలు 84,604మంది ఓటర్లు నమోదై ఉన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం తహశీల్దార్ తారకేశ్వరి తాజా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మండలాల వారీగా పోల్చితే ఆమదాలవలస మండలంలో పురుషులు 29,054మంది స్ర్తిలు 28,467మంది, ఇతరులు 35మంది కాగా, మొత్తం 57,560మంది ఓటర్లు నమోదై ఉన్నట్లు ఆమె ప్రకటించారు. అదే విధంగా సరుబుజ్జిలిలో 12,573మంది పురుషుల ఓటర్లు ఉండగా, 12,574మంది స్ర్తిలు ఉండగా, మొత్తం 25,097మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బూర్జ మండలంలో 16,122 మంది పురుషుల ఓటర్లు ఉండగా, 15,506మంది స్ర్తిలు, ముగ్గురు ఇతరులు మొత్తం 31,631మంది ఉన్నారని అధికారులు తెలిపారు. పొందూరు మండలంలో 28, 658మంది పురుషులు ఉండగా , 28,107మంది స్ర్తిలు, 6 ఇతరులు మొత్తం 56,771 మంది ఓటర్లు ఉన్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ ఓటర్లను సన్మానం చేయనున్నామని, మహిళా యువత ఓటర్లకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వనున్నట్లు తహశీల్దార్ తారకేశ్వరి తెలిపారు.

కిడిమి ప్రజలను వణికిస్తున్న కిడ్నీ రోగం
సారవకోట, జనవరి 23: జిల్లాలోని ఉద్దానం ప్రజలను పట్టిపీడించిన కిడ్నీ సమస్య మండలంలోని పలు గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. కిడిమి పంచాయతీలో ఈ బాధితులు అధికంగా ఉండటం కిడ్నీ రోగాన పడిన యువకులు గత సంవత్సర కాలంలో ఈ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో అధికంగా మృత్యువాత పడటంతో ప్రజలు వణికిపోతున్నారు. కిడిమితోపాటు శివారు గ్రామాలైన బుడితి, భద్రాచలం, గొల్లపేట గ్రామాలలో ఈ బాధితులు అధికంగా ఉన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకులు కొంతమంది ఇప్పటికే ప్రతీ మూడు రోజులకొకసారి డయాలసిస్ కోసం టెక్కలి ఏరియాసుపత్రికి వెళ్తున్నారు. కిడిమిబుడితిలో ఒక బోర్‌వెల్ నుండి వచ్చిన నీరు వినియోగానికి పనికిరాదని ఇంజినీరింగ్ అధికారులు తేల్చి చెప్పినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనందున ప్రజలు ఈ బోరునీటినే వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలను అనే్వషించి రోగాలు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కిడిమి బుడితి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కిడిమిబుడితిలో ఇప్పటివరకు కిడ్నీ వ్యాధి బారినపడి బుర్రా లక్ష్మణరావు, బుర్రా సాంబమూర్తి, దాసరి సుబ్బమ్మ, దాసరి రవి మృతిచెందగా, బుర్రా రమణయ్య, తిప్పన సుబ్బయ్య, బుర్రా గణపతి, మన్మథరావు టెక్కలి ఏరియాసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. కిడిమి పంచాయతీ, సవరమాలవు, మదనాపురం గ్రామాలలో కూడా కిడ్నీ వ్యాధి బాధితులు అధికంగానే ఉన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల సామూహిక
రిలే నిరాహారదీక్షలు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అగ్రిగోల్డ్ యాజమాన్య మోసంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తోడు కావడంతో బాధితుల కష్టాలు తీరడం లేదన్నారు. 20 నెలల క్రితమే అగ్రిగోల్డ్ ఆస్థులను అటాచ్ చేసిన ప్రభుత్వం వేలం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ నెల 1000 నుండి రూ.2వేల కోట్ల ఆస్థులను వేలం వేయాలని, అప్పుల కంటే ఆస్తులే ఎక్కువగా ఉన్నాయని పదేపదే చెప్పిన ప్రభుత్వం వాటిని ప్రభుత్వమే తీసుకొని ఖాతాదారులకు వడ్డీతో సహా చెల్లించాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆర్థిక కుంభకోణానికి కారణమైన యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షలలో ఎం.జగదీష్, సిహెచ్ రమణమూర్తి, సత్యన్నారాయణ, ఏజెంట్లు పాల్గొన్నారు.

‘డయల్ యువర్ కలెక్టర్’కు 14 వినతులు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: ‘డయల్ యువర్ కలెక్టర్’కు 14 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వయోజనవిద్య ప్రాంతీయ సంచాలకుడు జి.కృష్ణారావు డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ఫోన్ చేస్తూ సమస్యలను విన్నవించారు. గార మండలం ఆడవరం గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావు ఫోన్‌చేస్తూ ట్రైమ్యాక్స్, టి.జి.ఐ కంపెనీల వాహనాలు అతివేగంగా నడుపుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన బి.జగదీష్ రాజీవ్‌గృహ కల్ప నిర్వహణ వ్యయం చాలా ఎక్కువగా ఉన్నందున చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన బి.చంద్రరావు ఫోన్‌చేస్తూ రిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో సిబ్బందిని నియమించాలని కోరారు. టెక్కలి మండలం పాతనౌపాడకు చెందిన ఎం.సురేష్ మాట్లాడుతూ రైల్వేగేటు నుండి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు మంజూరైనప్పటికీ వాటిని ఇంతవరకు నిర్మించలేదని. వెంటనే రోడ్డుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జలుమూరు మండలానికి చెందిన ఎస్.పార్వతీశ్వరావు ఇంకుడు గుంతలకు గత ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేదని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి రామారావు, సిపివో శివరామనాయకర్, సెట్‌శ్రీ సిఇఓ వివిఆర్ ఎస్ మూర్తి, ఏపిఎం జమదగ్ని, చేనేత జౌళిశాఖ ఏడి రాజారావు, సాంఘిక సంక్షేమశాఖకు చెందిన ధనుంజయరావు, హౌసింగ్ డిడి నర్సింగరావు, ఉద్యానవన శాఖ ఎడి రహీమ్ పాల్గొన్నారు.

‘ఎస్పీ-గ్రీవెన్స్’కు 10 వినతులు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 23: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సోమవారం 10 వినతులు స్వీకరించారు. 8 కుటుంబ తగాదాలకు చెందినవి కాగా, రెండు సివిల్ తగాదాలపై వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కె.్భర్గవరావునాయుడు, లీగల్ అడ్వైజర్ కె.ఆఫీస్‌నాయుడు పాల్గొన్నారు. వీటి పరిష్కారానికి డిఎస్పీ, సిఐ, ఎస్‌ఐలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మహిళా ఎస్‌ఐ వి.వాణిశ్రీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌనె్సలింగ్ నిర్వహించగా 10 ఆర్జీలు వచ్చాయి. అందులో 5 రాజీ కుదిర్చారు. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఎస్‌ఐ పి.రాజేశ్వరరావు, ఎన్.నిర్మల, డి.విజయకుమారి, న్యాయవాధి పి.వరప్రసాదరావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు ఉన్నారు.