శ్రీకాకుళం

చరిత్ర పుటల్లో వంశధార నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జనవరి 24: సిక్కోలు జిల్లా రైతాంగం, ప్రజల సాగు, తాగనీరు కష్టాలు తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు సర్వం కోల్పోయి చరిత్ర పుటల్లో నిలుస్తున్నారని, ఈ ప్రాజెక్టు నిర్వాసితులు చేసిన త్యాగాలు మరువరానివని రాష్ట్ర జలవనరులశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని కృష్ణాపురం నిర్వాసిత గ్రామంలో నిర్వాసిత యువకులకు యూత్ ప్యాకేజీల చెక్కులు పంపిణీ గ్రామంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు దేవినేని, అచ్చెన్నలు యువకులకు ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు త్యాగధనులని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులను జలయజ్ఞం పేరుతో దుర్వినియోగం చేసిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రాజెక్టును పూర్తి చేసి సిక్కోలు జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించారన్నారు. ఈ ప్రాజెక్టుకు అన్ని విధాలుగా సుమారు రూ.2,100 కోట్లు అంచనా వ్యయం వేసిందని, అయితే ఇప్పటివరకు గతేడాది డిసెంబర్‌లో రూ.78 కోట్లు ఇళ్ల నిర్మాణాలకు మంజూరుచేయగా, ఇటీవల రూ.420 కోట్లు కొత్తూరు, హిరమండలం మండలాల నిర్వాసితులకు పరిహారాలు చెల్లించేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. అయితే ఈ నిధులతో నిర్వాసితులకు నష్టపరిహారాలు చెల్లింపులో కొంత జాప్యం జరగడం వల్ల హిరమండలంలో నిర్వాసితుల ఆగ్రహానికి కారణమైందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాసితులకు క్షమాపణ చెప్పడం కూడా తెలిసిందేనన్నారు. నిర్వాసితుల నష్టపరిహారాల చెల్లింపుల పట్ల తక్షణమే యువతకు ప్యాకేజీల కోసం రూ.150 కోట్లు కేటాయించగా, మరో రూ.48.70 కోట్లు పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాల చెల్లింపులకు కేటాయించి తక్షణమే జిల్లా జాయింట్ కలెక్టర్ పేరున జమ చేసినట్టు తెలిపారు. ఏది ఏమైనా నిర్వాసితుల సమస్యలు ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ నెలాఖరులోగా నిర్వాసితుల గ్రామాల్లో ఏ ఒక్క సమస్య మిగిలి ఉండకుండా అధికారులను బృందాలుగా విభజించి ఇంటింటా సర్వే చేసి వారికి పరిహారాలు చెల్లించే విధంగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ జిల్లా నుంచి అధికంగా ఇతర రాష్ట్రాల పట్టణాలకు వలస వెళుతూ పలు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఈ జిల్లాకు చెందిన వారే అధికంగా ఉంటారని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జిల్లా నుంచి ఏ ఒక్కరు వలసపోకుండా ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ రవికుమార్‌లు మాట్లాడుతూ జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను, ప్రత్యేక లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు జిల్లాలోని వంశధార ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియజేయగా, దీనికి స్పందించి పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో బందోబస్తు : ఇటీవల హిరమండలంలో జరిగిన నిర్వాసితుల ఆందోళన, ఆగ్రహావేశాల నేపధ్యంలో అటువంటివి పునరావృతం కాకుండా నిర్వాసిత గ్రామాల్లోపర్యటించిన మంత్రులకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. ఎస్‌పి బ్రహ్మారెడ్డి పర్యవేక్షణలో పాలకొండ డి ఎస్‌పి ఆదినారాయణ, హిరమండలం, పాతపట్నం, పాలకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
బాణసంచా పేలుళ్లతో మంత్రులకు ఆహ్వానం: నిర్వాసిత గ్రామం కృష్ణాపురానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు దేవినేని, కింజరాపులకు గ్రామస్తులు బాణాసంచాల పేలుళ్లతో ఆహ్వానం పలికారు. గ్రామానికి విచ్చేసిన మంత్రులను ఎదురుగా వెళ్లి ఆహ్వానం పలికి, డప్పువాయిద్యాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జెసి చక్రధర్‌బాబు, ఆర్డీవో రెడ్డి గున్నయ్య, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

అచ్చెన్న..
నిర్వాసితుల విన్నపాలు విని ఉంటే...!!

శ్రీకాకుళం, జనవరి 24: రాష్ట్ర ముఖ్యమంత్రినే కోపం తెప్పించిన వంశధార ప్రాజెక్టు పనులు.. ఇకపై నిర్వాసితులు ఆందోళనలు జరగకుండా చూడాలంటూ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు చెప్పి ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు సి.ఎం. పంపితే - అక్కడ నిర్వాసితుల గోడు వినకుండా, వారి తెచ్చే విన్నపాలు స్వీకరించకుండా మంత్రులు, అధికారులు వెనుదిరగడంతో సమస్య మళ్లీ పునరావృతమైంది. నిర్వాసితుల విన్నపాలు తీసుకున్నట్టయితే..!! మంత్రి అచ్చెన్న 80 శాతం పొజిటివ్ ఫార్ములాలోకి చేరిపోయే వారంటూ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదారు వందల కిలోమీటర్ల్ల దూరంలోగల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై జిల్లా ఓటర్లు ప్రభావం పడినా కష్టనష్టాలు ఆయనకు అపాదించవన్న చిన్నపాటి ఆలోచనతో అచ్చెన్న సమయస్ఫూర్తిగా వ్యవహరించ లేకపోయారన్న ఆరోపణలు వినిపించాయి. భావనపాడు పోర్టు భూసేకరణ అంశంలో తనశైలిని విడిచిపెట్టి, ప్రాజెక్టులు, స్వర్ణశ్రీకాకుళం అన్న లక్ష్యాల కోసం అక్కడ మత్స్యకార గ్రామాల్లో వ్యతిరేకశక్తులతోనే స్వయంగా మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించగలిగిన అచ్చెన్న వంశధార ప్రాజెక్టు విషయంలో ఎందుకు అసహనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఈ ప్రాజెక్టు పరిహారాలు, నిర్వాసితుల గొంతమ్మకోర్కెలపై పలుమార్లు సమావేశాలు నిర్వహించి యుద్ధమేఘాలను తప్పించిన నేపథ్యంలో మళ్లీ గత ప్రభుత్వాల్లో జరిగిన విధంగానే ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. రూ.కోట్ల ఆస్తులకు నష్టం కలిగింది. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. వీటితో స్థానికంగా ఎమ్మెల్యే కలమటకు శతశాతం మైనస్ మార్కులు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఆయన జయాపజయాలు నిర్వాసిత గ్రామాలే నిర్ణయించే పరిస్థితులకు వెళ్ళిపోయాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరుమాసాల్లో ముందస్తు ముసలం మొదలైతే - కలమట పరిస్థితి సంకట పరిస్థితే! అటువంటి పరిస్థితులకు వంశధార ప్రాజెక్టు సున్నితమైన అంశం జఠిలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం హిరమండలం తహశీల్థార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిర్వాసితుల సభకు పాడలి, సులగాం గ్రామాల నుంచి కొద్దిమంది నిర్వాసితులు వారి సమస్యలు చెప్పేందుకు విన్నపాలు తీసుకువస్తే వారితో మాట్లాడేందుకు మంత్రి అచ్చెన్న ప్రయత్నించకపోవడం వల్లే మరో యుద్ధవాతావరణం అక్కడ ఏర్పడింది. రౌండ్ ది క్లాక్ నిర్వాసితుల చెక్కులు ఇచ్చేందుకు కొత్తూరు, హిరమండలం రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినంతటి ఆలోచన శక్తి కలిగిన మంత్రి అచ్చెన్న నిర్వాసితులు చెప్పే మాటలు ఓపికతో వినేందుకు కొద్ది సమయం హిరమండలంలో కేటాయిస్తే మరో రోజుకు యుద్ధ వాతావరణం ఉండిఉండేది కాదంటూ నిర్వాసితులే ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. చెక్కులు తీసుకునే నిర్వాసితులు కంటే, వాటిని నిరాకరించే వారితోనే జిల్లా మంత్రిగా మాట్లాడినట్లయితే అందరికీ మేలు జరిగేదని వారంటున్నారు. స్వాగతిస్తే మీఊరు వస్తామని చెప్పిన అచ్చెన్న, ఆయన వద్దకే తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే కలెక్టర్, ఎస్పీల మాదిరిగానే చులకనగా చూస్తే..ఓట్లు వేసిన సామాన్యప్రజలు ఆగ్రహించకపోతే ఏమీ చేస్తామంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి అచ్చెన్న చేస్తున్న పాలన, తీసుకుంటున్న నియంతనిర్ణయాలు ఇప్పటివరకూ నిర్వాసితులను కన్నీరు పెట్టించలేదని, కన్నీరుతో వచ్చిన నిర్వాసితులతో మాట్లాడేందుకు మంత్రిగా ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ప్రశ్నలే హిరమండలం నిర్వాసితుల సభలో తలెత్తాయి. ఇప్పటికైనా దివంగత నేత ఎర్రన్న సోదరుడుగా ఆ కుటుంబానికి, వారసులకు ఇచ్చే గౌరవాన్ని కాపాడుకునేలా వంశధార నిర్వాసిత గ్రామాలకు వచ్చి వారి సమస్యలు ముందుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖాముఖిగా మాట్లాడితే సమస్యే ఉండదంటూ నిర్వాసితులు చెప్పుకొస్తున్నారు. పెద్దమనసుతో ఓట్లు వేసి గౌరవించిన కింజరాపు కుటుంబ సభ్యులుగా బాబాయ్- అబ్బాయ్ జిల్లాను స్వర్ణశ్రీకాకుళంగా మార్చేందుకు పడుతున్న తపనలో మేముసైతం వారి వెంట ఉంటామంటూ తిట్ల పురాణాలు చదివే నిర్వాసితులే చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా సమాలోచనతో అచ్చెన్న నిర్వాసితులతో గ్రామాల వారీగా చర్చించి వారి సమస్యలను మనస్ఫూర్తిగా వినాలని వారంతా కోరుకుంటున్నారు. ఆ సమయం కల్పిస్తే చెక్కులతో పరిష్కారం అయ్యే సమస్యలు సామరస్యంగా కూడా మారిపోయే అవకాశం ఉందన్న నిగూఢరహస్యాన్ని కూడా పాడలి, సులగాం నిర్వాసితులు పేర్కొనడం గమనార్హం.

పల్స్ పోలియోగా విస్తృత ఏర్పాట్లు
* జెసి-2 రజనీకాంతరావు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 24: ఈ నెల 29న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని జెసి-2 పి.రజనీకాంతరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం జెసి తన ఛాంబర్‌లో పల్స్ పోలియో, లెప్రసీ ఎవేర్‌నెస్ ప్రచారంపై సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేసేందుకు జిల్లాలో 1,617 కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 1179, గిరిజన ప్రాంతాల్లో 325, పట్టణ ప్రాంతాల్లో 113 కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. అలాగే 76 కేంద్రాలను నియమించామన్నారు. 160 మంది సూపర్‌వైజర్లను 1138 పారామెడికల్ సిబ్బంది, 2938 ఆశావర్కర్లు, 3863 అంగన్‌వాడీ వర్క్‌ర్లకు కార్యక్రమంపై శిక్షణ ఇచ్చామన్నారు. సమావేశంలో డిఇవో దేవానందరెడ్డి, డిపివో కోటేశ్వరరావు, డిఐవో జగన్నాధరావు, ఐసిడిఎస్ సిడిపివో రాధారాణి, ఐటిడి ఎపివో నాయక్ పాల్గొన్నారు.

ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు
* మాజీ మంత్రి ధర్మాన
శ్రీకాకుళం(రూరల్), జనవరి 24: మాయమాటలు, అమలు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసగిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నగరంలోని 27 వార్డు పరిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఒకటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు. డ్వాక్రా సంఘ మహిళలకు 3000 రూపాయలు పసుపు కుంకమ కింద ఇస్తామని చెప్పి, వారి ఖాతాల్లో జమకాలేదన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కరపత్రాన్ని ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆంధవరపు వరాహ నర్సింహం, ఎంవి పద్మావతి, సాధు వైకుంఠరావు, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ, వెంకటరావు, టి.కామేశ్వరి, పైడి మహేశ్వరరావు, ఎం.రవి, ధనలక్ష్మి, బి.లక్ష్మీ, జోగినాయుడు, సత్యన్నారాయణ, బైరి మురళి, ఎ.మూర్తి, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.