శ్రీకాకుళం

మహిళలకు సముచితస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 9: సమాజంలో సగభాగమైన మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి మహిళా పార్లమెంట్‌పై అవగాహన కల్పించేందుకు మహిళలతో ర్యాలీని నిర్వహించారు. మహిళా కళాశాల నుండి ప్రారంభమైన ఈర్యాలీ సూర్యమహల్ జంక్షన్ మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మానవహారం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, ఐసిడిఎస్ సిడిపిఓలు, జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం.జ్యోతిఫెడ్రిక్, ఐసిడిఎస్ పథక సంచాలకురాలు కె.లీలావతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం మాట్లాడుతూ పట్టణంలో మహిళా పార్లమెంట్‌పై ర్యాలీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 10,11,12వ తేదీల్లో అమరావతిలో మహిళా సాధికారిత సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలకు మహిళా తోడ్పాటుకు, అభ్యున్నతికి తమ గళం వినిపిస్తారని తెలిపారు. మహిళల కోసం చేసిన చట్టాలు, వాటిని అమలు చేస్తున్న విధానం మహిళా చట్టాల ద్వారా అందించాల్సిన సహాయం వారికి కావాల్సిన తోడ్పాటు అంశాలపై చర్చిస్తారన్నారు. చట్టాలు ఎన్ని చేసినా ఇంకా మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది. మహిళలు తమ హక్కులతోపాటు కష్టాల్లో ఉన్న తోటి మహిళలకు తోడ్పాటును అందించాలన్నారు. సమాజంలో మానవత్వం సంస్కారం, పెంపొందిననాడే మహిళకు న్యాయం చేకూరుతుందన్నారు. జిల్లాలో 65శాతం మహిళా ప్రజాప్రతినిధులు స్వతంత్రంగా తమ విధులను నిర్వర్తించే స్థాయికి ఎదగడం శుభపరిణామమని తెలిపారు. జిల్లానుండి మహిళా ప్రతినిధులు మహిళా పార్లమెంట్‌కు వెళ్లారని తెలిపారు. ఈకార్యక్రమంలో డిసిపిఓ కె.వి.రమణ, ఐసిడిఎస్ సిడిపిఓలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

బూత్ కమిటీల ద్వారా బిజెపి బలోపేతం
* పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 9: బూత్‌కమిటీల ద్వారా భారతీయ జనతాపార్టీ బలోపేతం అవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు అన్నారు. స్థానిక బ్లూఎర్త్ హోటల్‌లో గురువారం బిజెపి పతాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఆలిండియా పార్టీ పిలుపుమేరకు రాష్ట్రంలో 42,236 బూత్‌లు , జిల్లాలో 2,702 బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ బూత్‌లో ఓ కమిటీ కనీసం 10మంది సభ్యులకు తక్కువ లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఈనెలాఖరు నాటికి జిల్లాలో బూత్ కమిటీలను పూర్తి చేయాలన్నారు. కమిటీ సభ్యుల ద్వారా కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలన్నారు. బూత్ కమిటీలు ఆధారంగా స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో 2లక్షల మంది బిజెపి సభ్యత్వం తీసుకున్నారని, వీరితో మాట్లాడి బూత్‌కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా బిజెపి విజయానికి బూత్ కమిటీల ఆధారంగానే పనిచేస్తారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా వీటిని అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, మాజీ ఎం.పి కణితి విశ్వనాథం, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శవ్వాన ఉమామహేశ్వరి, శవ్వాన వెంకటేశ్వరరావు, రెడ్డి నారాయణరావు, సంపతిరావు నాగేశ్వరరావు, సువ్వారి వెంకటసన్యాసిరావు, మెట్ట గడ్డయ్య పాల్గొన్నారు.

మథుకేశ్వరుని దర్శించుకున్న మెరైన్ ఐజి
జలుమూరు, ఫిబ్రవరి 9: దక్షిణకాశీగా పిలువబడుతున్న శ్రీముఖలింగం మధుకేశ్వరస్వామిని మెరైన్ ఐ.జి సూర్యప్రకాశరావు కుటుంబ సమేతంగా గురువారం స్వామిని దర్శించారు. మధుకేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ విశిష్టతలను అర్చకులు తెలియజేశారు. అనంతరం అశీర్వచనాలు అందించి శిల్ప సంపద నిర్మాణ గాథలను తెలియజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపదను తిలకించి ఆనందం వ్యక్తంచేశారు. ఇటువంటి నిర్మాణాలు ప్రశంసనీయమని అన్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

279 జీవోను రద్దు చేయాలి
* మున్సిపల్ కార్మికుల ధర్నా
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 9: మున్సిపల్ కార్మికుల జీవితాన్ని నాశనం చేసే 279జీవోను వెంటనే రద్దు చేయాలని సిటు జిల్లా కార్యదర్శి పి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి ఎన్.బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పేదలు, దళితులపట్ల వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు, లాభాలు చేకూర్చేందుకు ఈ జీవో అమలుకు చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని విమర్శించారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల బతుకులు చాలీచాలని జీతాలతో అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. చంద్రబాబు పేదల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. ఇప్పటికే తగినంతమంది సిబ్బంది లేక పారిశుద్ధ్య కార్మికులకు పని ఇబ్బంది జరుగుతోందన్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడిన చందంగా 279జీవోను తేవడం చాలా దుర్మార్గమన్నారు. జీవో-151 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, 244 జీవో ప్రకారం కార్మికులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వీటితో జాతీయ సెలవుదినాలు ప్రకటించి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్, పార్థసారది, రాజు, శ్రీరాములు, గౌరమ్మ, నర్శమ్మ, రాజేష్, విజయ్, యుగంధర్, మణి, సరోజ పాల్గొన్నారు. ధర్నా అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

నవ్యాంధ్ర పుస్తక సంబరాలు
* నేటి నుండి పుస్తక మహోత్సవం
* ఎమెస్కో ఎం.డి. విజయ్‌కుమార్
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 9: నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా ఈనెల 10నుండి 19వతేదీ వరకు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎమస్కో ఎం.డి విజయకుమార్ తెలిపారు. స్థానిక నాగావళి హోటల్‌లో గురువారం సాయంత్రం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో పుస్తక పఠనం ముఖ్యమైందని, పుస్తకం పఠనం పెంచేందుకు పుస్తక మహోత్సవాలు అనంతపూర్, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రిలో యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సమాజం చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఈనెల 10న సాయంత్రం ప్రదర్శన ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు(కారామాస్టారు) జిల్లాలోని ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ , ప్రభుత్వం, విజయవాడ బుక్ సెల్లర్స్ సంఘం సంయుక్తంగా పుస్తక సంబరాలను నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యాసరచన పోటీలను పుస్తక ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలియజేశారు. 14న వాక్ ఫర్ బుక్ ప్రాధాన్యత తెలిపేందుకు ఏడురోడ్ల జంక్షన్ నుండి కృష్ణాపార్కు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్టీ ఆర్ ట్రస్ట్ ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ పిల్లల్లో కూడా చదివే అలవాటును పెంచాలని, కె.జి టు పిజి వరకు 8రకాల పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ మూడు విభాగాలుగా పోటీలు ఉంటాయని, అన్ని విభాగాలకు మొదటి బహుమతి రూ.5వేలు నగదు, రెండవ బహుమతి రూ.3వేలు, మూడవ బహుమతి రూ.1500 ఉంటుందన్నారు. బాధ్యతగల పౌరులుగా ఇందులో భాగస్వామ్యులు కావాలని కోరారు. విలేఖర్ల సమావేశంలో ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు, శ్రీనివాసరావు, డిపిఆర్‌వో రమేష్ పాల్గొన్నారు.