శ్రీకాకుళం

రహదారుల నిర్మాణానికి దండిగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జనవరి 19: మండలంలోని కనీస రహదారి సౌకర్యంలేని గ్రామాలన్నింటికి తారురోడ్లు, సిమెంటు రోడ్లుకు అవసరమైన నిధులను ఒకే పర్యాయం మంజూరు చేయించి స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జిల్లాలో అగ్రగామిగా నిలిచారు. వంద జనాభాలోపు గల గ్రామాల్లో కూడా తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం విశేషం. అదేవిధంగా గతంలో 250 లోపు జనాభా ఉంటే నిధులు మంజూరు చేసిన పరిస్థితి లేదు. ఇటువంటి సాంకేతిక పరమైన నిబంధనలను అతిక్రమించి ప్లాన్ నిధులనుండి, ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి అవసరమైన పైకాన్ని మంజూరు చేయించారు. అతితక్కువ జనాభా గల 13 గ్రామాలకు రహదారి సౌకర్యం నిమిత్తం రూ. 2.03కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఇది కాకుండా ఎస్‌డి ఎఫ్ నిధులనుండి గ్రామాలకు సిమెంట్ రోడ్లు, వీధి డ్రైన్‌లు నిర్మాణానికి రూ. 7.67కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి అవసరమైన ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో ఎస్ డి ఎఫ్ నిధులకు ఉపాధి హామీ నిధులను జోడించి పనుల పర్యవేక్షణ బాద్యతలను పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజనీర్‌కు బాధ్యతలు అప్పగించారు.
టూ టౌన్ సీఐగా మల్లా మహేష్
శ్రీకాకుళం (రూరల్), జనవరి 19: టు టౌన్ సి ఐగా మల్లా మహేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సి ఐగా పనిచేసిన తిరుపతిరావుకు సోంపేటకు బదిలీ అయ్యింది. దీంతో మల్లా మహేష్‌ను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సి ఐగా నియమిస్తూ శుక్రవారం రాత్రి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లా మహేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. టు టౌన్ పరిథిలో క్రైం రేటును తగ్గించేందుకు కృషి చేస్తానని అన్నారు. గతంలో మల్లా మహేష్ శ్రీకాకుళం వన్‌టౌన్‌తో పాటు విశాఖ ట్రాఫిక్, ఎంవిపి స్టేషన్లో సి ఐగా పనిచేశారు. 2014 ఫిబ్రవరిలో విశాఖకు బదిలీపై వెళ్లారు. తిరిగి సిఐగా శ్రీకాకుళం బదిలీపై వచ్చారు.
రిపబ్లిక్‌డేకు యూత్ రెడ్‌క్రాస్ వలంటీర్లు
శ్రీకాకుళం(టౌన్), జనవరి 19: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూచన మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించబోయే రిపబ్లిక్ దినోత్సవ సంబరాలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యూత్ రెడ్‌క్రాస్ వలంటీర్లు రెడ్‌క్రాస్ తరుపున పాల్గొంటున్నారు. జిల్లాకు చెందిన మున్సబుపేట గాయత్రి డిగ్రీ కళాశాలకు చెందిన ఈ యూత్ రెడ్‌క్రాస్ వలంటీర్లు రిపబ్లిక్‌డే వేడుకలకు ఎంపిక కావడం పట్ల జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపికైన వీరంతా శనివారం అమరావతికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ మేనేజర్ ఎ.నర్శింగరావు, కో ఆర్డినేటర్ కె.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
యాదవ కులస్థులు ఐకమత్యంతో ఉండాలి
సారవకోట, జనవరి 19: జిల్లాలోని యాదవ కులస్థులందరూ ఐకమత్యంతో మెలగాలని ఈ కుల పెద్ద కిల్లాన జానకీరామయ్య ట్రస్ట్ మాధవరావు పిలుపునిచ్చారు. మండలంలోని సవరడ్డపనస గ్రామంలో గల బివికె పాఠశాల ఆవరణలో శనివారం జరిగిన మండల యాదవకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తూ సేవాభావంతో మెలగాలని సూచించారు. తన తండ్రి తాతల స్పూర్తితో సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. అనేక గ్రామాల్లో గల పేద విద్యార్థులకు వస్తురూపేణా ఆర్థికంగా ట్రస్ట్ ద్వారా ఆదుకున్న సంఘటనలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ తరుపున యాదవ కులానికి చెందిన 30 మంది వికలాంగులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పాఠశాల కార్యదర్శి వాడ పున్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి గద్దెబోయిన కృష్ణారావు, స్థానిక మండల కమిటీ అధ్యక్షులు కోరాడ అప్పయ్య, కార్యదర్శి పేడ ఆనందరావు, జిల్లా సంఘం నాయకులు గురునాధరావు, వంజరాపు కసవయ్య, రేగాన తిరుపతిరావు, కిల్లాన రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

దుర్గంధభరితం వ్యవసాయశాఖ కార్యాలయం
సారవకోట, జనవరి 19: స్వచ్ఛ్భారత్ మిషన్ పేరుతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నప్పటికి ఎక్కడికక్కడే బహిరంగ మల విసర్జన తప్పలేదు. ఇందుకోసం ఆరునెలలు శ్రమపడి ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించినప్పటికి వీటి వినియోగం అంతంత మాత్రంగానే మిగిలింది. స్థానిక ప్రాథమిక పాఠశాలకు చేరువలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణ పూర్తిగా బహిరంగ మల విసర్జనకు ఆనవాలమయింది. సంక్రాంతి సెలవులు అనంతరం శనివారం కార్యాలయానికి వచ్చిన వ్యవసాయ శాఖాధికారి, ఇతర సిబ్బంది అవాక్కయ్యారు. తలుపులు తెరవడానికి కూడా వీలులేని పరిస్థితిలో ఇక్కడి అపారిశుద్ధ్యం వీరిని వెనుకకు పంపించినట్లు చేసింది. గత్యంతరం లేక చేరువలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద ఆరుబయట చెట్టుకింద తాత్కాలికంగా విధులు నిర్వహించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు వ్యవసాయశాఖాధికారి పిర్యాదు చేశారు. కార్యాలయం ఆవరణలో బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి చర్యలు గైకొనడానికి తమ ఫిర్యాదులో ఏవో మురళీధర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
మీ సేవా కేందాలకు తరలివచ్చిన ప్రజలు
సారవకోట, జనవరి 19: సంక్రాంతి సెలవులు ఆ తదుపరి రెండు రోజుల పాటు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు బంద్ పాటించిన అనంతరం శనివారం తిరిగి తెరుచుకున్నాయి. సుమారు ఆరురోజుల పాటు మీ సేవ కేంద్రాలు మూతపడడంతో శనివారం ఈ కేంద్రాలకు ప్రజల ఒత్తిడి అధికమయ్యింది. వివిధ ధృవ పత్రాలకు సంక్రాంతి ముందు దరఖాస్తు చేసుకున్నవారు ఆ ధృవపత్రాలను పొందడానికి క్యూ కట్టారు. అదే విధంగా వలసలు వెళ్లి సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు ఆధార్ కార్డ్‌ల్లో దొర్లిన తప్పులు సవరించడానికి, కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులను సమర్పించడానికి వివిధ అవసరాలకోసం ఒకే పర్యాయం మీ సేవ కేంద్రాలను ఆశ్రయించడం కన్పించింది. తమ కోర్కెల సాధనలో విజయం సాధించినందున సమ్మెను విరమించిన మీ సేవా కేంద్రాల నిర్వాహకులు వినియోగదారులకు సేవలందించడంలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుండడం విశేషం.

ట్రాఫిక్‌జామ్‌తో ప్రయాణీకుల ఇక్కట్లు
జలుమూరు, జనవరి 19: మండలం చల్లవానిపేట కూడలిలో సంక్రాంతి పర్వదినాల సందర్భంగా నిత్యం ఉన్న ట్రాఫిక్ కన్న అదనంగా పలు ప్రాంతాలనుండే వచ్చే ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలకు ప్రయాణీకులు పలు ఇక్కట్లు పడుతున్నారు. రోడ్డుపై ఒక వైపు కూరగాయలు, మరోవైపు చేపలు, మాంసం దుకాణాల్లో విక్రయాలతో ప్రయాణీకానికి ఆటంకం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇంత రద్దీగా ఉన్న ఈ జంక్షన్‌లో కనీసం పోలీస్‌శాఖ భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కనీసం కాలినడకన వెళ్లాలన్నా ఇబ్బంది కల్గుతుందని అన్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోకముందే భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పలువురు ప్రయాణీకులు కోరారు.
మందుబాబులపై పోలీసుల నిఘా
జలుమూరు, జనవరి 19: మండలం చల్లవానిపేట పరిసర ప్రాంతాలలో స్థానిక జలుమూరు ఎస్సై ఎమ్.గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలు మందు బాబులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు సాయంత్రం చల్లవానిపేట కూడలి పరిసర ప్రాంతాలలో మకాం వేసి ప్రతీ వాహనాన్ని నిలుపుతూ వాహన యజమానులకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు లేదా మరికొంతమందితో ప్రయాణం చేసినవారిపై, హెల్మెట్ ధరించని ఎడల కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్సై మురపాక గోవిందరావు తెలిపారు.