శ్రీకాకుళం

ఆదిత్యునికి రూ. 5లక్షల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 1: ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి నగరానికి చెందిన కూర్మాపు సత్యరాజు ఐదు లక్షల వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు. శుక్రవారం ఈ మేరకు దేవాలయం ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈవో పి.శ్యామలాదేవిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దబ్బాయి వెంకటసూర్యనారాయణ(సుబ్బారావు) స్మారకార్థం ప్రతీ రోజు ఆదిత్యుని సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానంలో తమ తరుపున ఐదుగురికి అన్నదానం చేయడానికి విరాళం అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మృత్యుంజయరావు, వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే, విశాఖపట్నానికి చెందిన యం.మురళీధర్ దంపతులు
ఆదిత్యుని సన్నిధిలో బారికేడ్లు ఏర్పాటుకు 50 వేల రూ.లు విరాళం అందజేశారు. శుక్రవారం ఆదిత్యుని సన్నిధిలో ఈ మేరకు 50 వేల రూపాయల విలువతో తయారుచేసిన బారికేడ్లను ఈవో శ్యామలాదేవి సమక్షంలో ఆలయ సిబ్బందికి అందజేశారు.
==========

ప్రభుత్వ బడికి
‘్భగ్యం’ కరవాయె....
ఆంధ్రభూమి బ్యూరో-
శ్రీకాకుళం
ప్రభుత్వ బడులకు ‘్భగ్యం’ కరవాయింది.. ‘అక్షర’ జ్ఞానంతో అభివృద్ధి సాధ్యమని గొంతుచించుకుంటున్న ప్రభుత్వం.. ఆ దిశగా చేపట్టిన చర్యలు శూన్యమనే చెప్పుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో వలే వ్యవసాయ, ఇతర రంగాల్లోకి తమ గారాల పట్టీలను పంపించకుండా చదువుల చెట్టునీడకు పంపిస్తున్నారు. అయితే, ఇది ప్రభుత్వ బడులకు కాదు.. రంగు రంగులతో కనువిందు చేసే ఆధునిక భవనాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ పాఠశాలల్లోకి... ఇక్కడ ఫీజులు మోపుడు అవుతున్నా భరిస్తూ తమ నిర్ణయాన్ని స్థిరపరుచుకుంటున్నారు. కారణం లేకపోలేదు... ఊర్లో, ఇంకా చెప్పాలంటే.. ఇంటికి నాలుగడుగుల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మృగ్యమయ్యాయి. గురువులు ఉంటే భవనాలు ఉండవు... భవనాలు ఉంటే బల్లలు ఉండవు... ఈ రెండు ఉంటే.. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు సర్కారు ఆదేశించిన వేరే పనికి వెళ్ళిపోతారు. ఇదీ సర్కారు బడుల స్థితి. ఇదే ప్రైవేట్ పాఠశాలల వారికి పాలకులు ఇచ్చిన వరంగా మారింది. తమ పాఠశాలలను ‘అభివృద్ధి’ చేస్తూ దూసుకుపోతున్నారు. దీనిని పసిగట్టని విద్యాధికారులు, ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దకుండా, ఉపాధ్యాయులు, ప్రజలను చైతన్యవంతులను చేయకుండా ఉన్నపళంగా సర్కారు బడులకు తాళాలు వేస్తూ పరోక్షంగా ‘ప్రైవేట్’కు జై కొడుతోంది.
ఇప్పటి వరకూ జిల్లాలో సుమారుగా 200 ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, మరో 174 సర్కార్ బడులు రానున్న విద్యాసంవత్సరంలో తాళాలు వేసేందుకు విద్యాశాఖ సన్నద్ధం అవుతోంది. ఈ దౌర్భాగ్యం వల్ల చివరకు ప్రభుత్వ పాఠశాలల ఉనికికే ముప్పువాటిల్లే పరిస్థితి ఉందని విద్యాధికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు తమ సిబ్బందిని గ్రామాల్లోకి పంపించి పిల్లలను చేర్చుకుంటున్నారు. దీని ప్రభావం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రవేశాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. డ్రాపౌట్స్ కోసం సర్వశిక్ష అభియాన్ సర్వం నెట్టుకొస్తున్నట్టు కాకిలెక్కలు ఉన్నాయి. కానీ, బడి బయటే చదువుకున్న పిల్లలు ప్రతీ గ్రామానికి ముఖద్వారంలోనే ఉపాధి పనుల్లో కన్పిస్తుంటారు. గ్రామాల్లోకి వెళ్ళిన కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులను ప్రభావితం చేయడంతో జిల్లాలో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 2,490 ప్రాథమిక పాఠశాలలు, 574 ప్రాథమికోన్నత పాఠశాలలు, 440 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ వల్ల జిల్లావ్యాప్తంగా 574 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్టు విద్యాశాఖ చెబుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా అంతటా 512 పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని విద్యాశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో వసతిగృహాలు కూడా మూతపడనున్నాయి. ఈ ఏడాది ఎనిమిది ఎస్సీ వసతిగృహాలు, ఏడు వెనుకబడిన వసతిగృహాలను మూతపడినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. దీనిని బట్టి కార్పొరేట్ యాజమాన్యాల ప్రభావం ఎలా ఉందో స్పష్టమవుతోంది. ఇప్పటికే కార్పొరేట్ యాజమాన్యాలు అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తున్నా విద్యార్థులు తల్లిదండ్రులు అటువైపే మొగ్గుచూపిస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలలపై పాలకులు ఏ మేరకు శ్రద్ధ కనబరుస్తున్నారో అర్థం చేసుకుకోవచ్చు.
గ్రామాల్లో గ్రామస్థులకు, ఉపాధ్యాయులకు అంతరం పెరగడం, కార్పొరేట్ దీటుగా, వసతులు, నైపుణ్యతలు ఏర్పాటు చేయకపోవడం వలన అందరూ కార్పొరేట్‌పై మొగ్గుచూపిస్తున్నారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందంటారు. విద్య కూడా అంతే.. విద్యను మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది. ప్రభుత్వం రచ్చబండల వద్ద గ్రామపెద్దలకు, సర్కార్ బడుల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించనంత కాలం గ్రామీణ విద్యపై ‘కార్పొరేట్’ పెత్తనం కొనసాగుతునేవుంటుంది... ప్రభుత్వ విద్యాలయాల స్థితిగతులు దిగజారి, సామాన్య విద్యార్థికి దూరంగానే ఉంటాయి.

34 ఏళ్ళ కల
నెరవేరిన వేళ...
శ్రీకాకుళం, ఏప్రిల్ 1: టిడిపి 34 ఏళ్ళ కల శుక్రవారంతో నెరవేరింది. జిల్లా టిడిపి అధ్యక్షురాలు శిరీష, వెంకన్న చౌదరి దంపతులు అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయ రీతిలో కార్యాలయ నిర్మాణానికి వాస్తు రీత్యా భూమిపూజ చేసి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నగరంలో 80 అడుగుల రోడ్డులో ఐసిడిఎస్ కార్యాలయం దరి సుమారు 2.17 ఎకరాల స్థలం ఇటీవల పార్టీ కార్యాలయ నిర్మాణానికి టిడిపి క్యాబినెట్‌లో చర్చించి 99 ఏళ్ళ లీజుకు అనుమతించిన విషయం తెలిసిందే. ఆ స్థలంలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం జరుగనున్న తరుణంలో అందరి సహకారం అవసరమని, పార్టీ కార్యాలయం అన్ని హంగులతో రూపుదిద్దుకుంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుతో పాటు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎన్నో సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా పార్టీ కార్యాలయానికి ప్రజాస్వామ్యరీతిలో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందామని కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో గుర్తుచేశారు. టిడిపిలో ప్రతీ కార్యకర్తకు పాఠశాలగా కార్యాలయం ఉంటుందని, అటువంటి కార్యాలయం నిర్మాణం కల 34 ఏళ్లనాటిదని పేర్కొన్నారు. అయితే, కార్యాలయం నిర్మాణం పూర్తిఅయిన తరువాత నిర్వహణ భారం కార్యాలయంపై వచ్చే ఆదాయంతోనే సాగుతుందన్నారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరి కార్యాలయ నిర్మాణానికి ఏ ఒక్కరి వద్ద పైసా వసూలు చేసేది లేదంటూనే కార్యకర్తల కష్టంతోనే భవన నిర్మాణం జరుపుతామన్నారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా వారివారి కార్యాలయాలకు స్థలానికి దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రభుత్వం తరుపున స్థలం కేటాయిస్తామని చెప్పారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషను పొగడ్తలతో ముంచెత్తారు. కాగా, పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎన్టీఆర్ సుజలధార పథకం కింద వాటర్ ప్లాంట్‌ను నిర్మించడానికి శిరీష భర్త వెంకన్న చౌదరి ముందుకు వచ్చారు. అలాగే మల్లా కృష్ణారావు ఐదు లారీల ఇటుకలు, బగ్గు లక్ష్మణరావు గ్రానైట్ మెటీరియల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన గోవిందరాజులు లక్ష రూ.లు, పోలాకి మండలం నుండి నాగరాజు అనే నేత ఐదు లక్షల రూ.లు విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, గౌతు శ్యాంసుందర శివాజీ, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, పార్టీ నేతలు చౌదరి నారాయణమూర్తి, జిల్లా టిడీపీ మహిళా అధ్యక్షురాలు మెట్ట సుజాత, పార్టీ సమన్వయ కార్యదర్శి మొదలవలస రమేష్, గోవిందరాజులు, రమణమాదిగ, కొర్ను ప్రతాప్, నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైకాపా:కళా
పాలకొండ(టౌన్), ఏప్రిల్ 1: రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా దిశానిర్దేశం లేని పార్టీ అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక టిడిపి కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు అన్ని విధాలు వౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో తామంతా నిరంతరం పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఎమ్మెల్యేలు కొనసాగలేక తమ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మి ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష హోదాలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. దీంతో అసెంబ్లీలో సమస్యలు ప్రస్థావనకు ఆయన చేసిన కృషి ఏమిలేదన్నారు. అలాగే పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల రూ.2కోట్లు నిధులతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా కేటాయించినట్టు తెలిపారు. అలాగే ఇంటి పన్నులు భారాన్ని తగ్గించేందుకు మంత్రి నారాయణ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈయనతోపాటు తెదేపా నాయకులు దుప్పాడ పాపినాయుడు, కర్నేన అప్పలనాయుడు, వారాడ సుమంత్‌నాయుడు, కిమిడి కాశింనాయుడు, వావిలపల్లి రాజారావు, సుంకరి అనిల్‌దత్ పాల్గొన్నారు.

తగ్గిన ఆసక్తి
పాలకొండ, ఏప్రిల్ 1: జిల్లాకు ఒకే ఒక పంచదార కర్మాగారం... రేగిడి మండలం సంకిలి వద్ద పదిహేనేళ్ల కిందట జిఎంఆర్ ఆధ్వర్యంలో ప్రైవేటు చక్కెర కర్మాగారం నెలకొల్పారు. కొనే్నళ్లు జిఎంఆర్ గ్రూపు ఆధ్వర్యంలో నడిచిన తరువాత ప్యారీస్ గ్రూపునకు కర్మాగారాన్ని విక్రయించారు. జిఎంఆర్ సారథ్యంలో నడిచిన సమయంలో చెరకు రైతులకు అనేక రాయితీలు ప్రకటించి పంట సాగుకు ప్రోత్సహించేవారు. కర్మాగారం నిర్వహణ చేతులు మారిన తరువాత చెరకు పండించే రైతుల పరిస్థితి కూడా మారిపోయింది. యాజమాన్యం ఏ ఒక్క రైతునూ చెరకు పండించాలని అడగటం లేదు సరి కదా ఎటువంటి రాయితీలను ప్రకటించటం లేదు. దీనికి తోడు స్వేచ్ఛా విపణిలో పంచదారకు సరైన ధర లేదని సాకు చూపించి రైతులకు ఈ ఏడాది గతేడాది చెల్లించిన ధరకు టన్ను ఒక్కంటికీ రూ.50లు తగ్గించి చెల్లిస్తామని సీజన్‌కు ముందే ప్రకటించారు. ప్రస్తుతం రైతులకు టన్ను ఒక్కంటికీ రూ.2,200లు ప్రాథమికంగా బిల్లులు తయారు చేసి బ్యాంకులకు పంపుతున్నారు.
రైతుల పరిస్థితి దయనీయం
చెరకు పంట సాగు చేసే రైతుల పరిస్థితి పరిశీలిస్తే దయనీయంగా ఉంది. ఏడాది పాటు ఒకే పంట కావడంతో రైతులకు కర్మాగారం యాజమాన్యం చెల్లించే ధర ఖర్చులకే సరిపోవడం లేదు. చెరకు నాటింది మొదలు ఫ్యాక్టరీకి చేరే వరకు మదుపులు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. రైతులు పండించిన చెరకు పంట సకాలంలో ఫ్యాక్టరీకి తరలకపోవడంతో ఏడాది పొడువునా పొలంలోనే ఉండిపోయి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మిగిలిన పంటల మాదిరిగా కాకుండా ఈ పంట ప్యాక్టరీకి చేరాలంటే ఎక్కువ మంది కూలీలు పని చేయాల్సి ఉంది. ఏ గ్రామంలో చూసినా వలసలు అధికంగా ఉండటంతో స్థానికంగా పనిచేస్తున్న కూలీల సంఖ్య తగ్గింది. దీంతో రైతులకు పెట్టుబడులు అధికమై పంట గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది వరి, పెసర, మినుము పంటలతో పోల్చి చూస్తే చెరకు పంటపై వచ్చిన ఆదాయం అతి తక్కువనే చెప్పాలి. చెరకు పండించే ఏడాదిలో వరి, పెసర, మినుము, నువ్వులు తదితర పంటలు వేసుకుని అధిక ఆదాయం పొందే అవకాశముండటంతో రైతులకు చెరకు పంటపై ఆసక్తి సన్నగిల్లింది. కొందరు రైతులు విసుగు చెంది మమ్ము తోటలను కూడా దుక్కులు దున్ని ఖరీఫ్ వరికి తయారు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిని చూసి కూడా కర్మాగార సిబ్బంది ఏ ఒక్కరూ గ్రామాల్లో రైతులను చెరకు వేయాలని కోరడంలేదు. దీంతో రైతులు ఇతర పంటలపై మొగ్గుచూపుతున్నారు.
షుగర్ ప్యాక్టరీకి అనుబంధంగా ఇథనాల్ ప్యాక్టరీ ఉండటంతో పంచదారపై వచ్చిన లాభాల కంటే చెరకు ద్వారా వచ్చే మొలాసిస్‌తో తయారయ్యే ఇథనాల్ ప్యాక్టరీ ద్వారా అధిక లాభాలు వస్తాయన్న ఆలోచనతో మొలాసిస్ తయారీపైనే ప్యాక్టరీ యాజమాన్యం ఎక్కువ దృష్టిసారిస్తోంది. చెరకు కాకుండా మొలాసిస్ తయారయ్యే ఇతర పంటలు వేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంపిలి వంటి నూటికి నూరు శాతం చెరకు పండించే గ్రామంలో మొలాసిస్ తయారీకి అవసరమైన వాణిజ్య పంటల సాగు ప్రారంభమైంది. దీంతో వచ్చే సీజన్‌కు సంబంధించి ఈ ఏడాది జిల్లాలో వేలాది ఎకరాల్లో చెరకు విస్తీర్ణం తగ్గినట్టు గణాంకాలు వివరిస్తున్నాయి.

పోలియో చుక్కల స్థానంలో ఐసివి ఇంజక్షన్లు
* డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌వో మీనాక్షి
నరసన్నపేట, ఏప్రిల్ 1: పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఇప్పటివరకు పోలియో చుక్కలను వాడటం జరిగేదని వాటి స్థానంలో ఐసివి ఇంజక్షన్లు ప్రవేశపెడుతున్నట్టు డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌వో మీనాక్షి తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పోలాకి, ఉర్లాం, మాకివలస, తిలారు, గుప్పిడిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి వైద్యాధికారులతో, ఆరోగ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో చుక్కల వలన ఎక్కడో ఒకచోట పోలియో వ్యాధి సోకినట్టు కేసులు నమోదు అవుతుండేవని దానిని పూర్తిస్థాయిలో నిలిపేందుకు ప్రభుత్వం ఐసివి ఇంజక్షన్లను అందుబాటులోనికి తీసుకుని వస్తుందని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుండి వీటిని అందజేస్తామని 6,14 వారాలకు ఒకసారి కుడిచేతి పైభాగాన భుజంపై వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ఇందుసింహా, రాజేష్, బలగ మురళీ, అప్పలనాయుడు పాల్గొన్నారు.
రిజిస్ట్రార్‌గా తులసీరావు బాధ్యతల స్వీకరణ
ఎచ్చెర్ల, ఏప్రిల్ 1: అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆచార్యుడు, ప్రిన్సిపల్ గుంట తులసీరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటివరకు రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ చేతుల మీదుగా బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాకు చెందిన ప్రొఫెసర్ తులసీరావుకు మూడో రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టడడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకే వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, వర్శిటీ బోధకులు సిబ్బంది అధిక సంఖ్యలో చేరుకొని తులసీరావుకు ఘన స్వాగతం పలికారు. క్యాంపస్‌కు చేరుకున్న తులసీరావుకు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికి స్థానిక వినాయక ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుండి రిజిస్ట్రార్ ఛాంబర్‌కు చేరుకుని అభిమానుల కోలాహాలం నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఫ్లెక్సీలు పోటాపోటీగా ఏర్పాటు చేసి బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తులసీరావు మాట్లాడారు. 27 ఏళ్ల అనుభవంలో ఇక్కడ ప్రధాన సమస్యలపై ఉన్న పూర్తి అవగాహనతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు సమస్యలే కాకుండా టీచింగ్, నాన్ టీచింగ్ సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతామని తెలిపారు. వీసి, రెక్టార్, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం రిజిస్ట్రార్ తులసీరావు వీసి లజపతిరాయ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈయనను అభినందించినవారిలో వీసి లజపతిరాయ్, రెక్టార్ ఎం.చంద్రయ్య, డీన్ టి.కామరాజు, ప్రొఫెసర్ అడ్డయ్య, పాలక మండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, జయరామ్, కె వి ఏ నాయుడు, శివానీ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధులు దుప్పల వెంటకరావు ఉన్నారు.

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 1: మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. దుంగ రామకృష్ణ తదితరులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక ఉచిత విధానం వలన పంచాయతీకి ఒరిగిందేమీ లేదని పంచాయతీ నిర్వహణ కష్టంగా ఉందని దూలి రేగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ నిర్వహణకు కనీస రుసుం చెల్లించాలని వారు స్పష్టంచేశారు.

ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారిస్తేనే ప్రగతి
శ్రీకాకుళం, ఏప్రిల్ 1: జిల్లాలోని ప్రాధాన్యంగల అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రెవెన్యూ అధికారులను జెసి వివేక్‌యాదవ్ ఆదేశించారు. రెవెన్యూ, పౌరసరఫరాల అంశాలపై జిల్లాకలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రాధాన్య అంశాలుగా భావిస్తున్న అంశాలపై ప్రత్యేక దృష్టి కేటాయించి పనిచేయాలన్నారు. ఈ అంశాలు అన్ని ఆన్‌లైన్‌లో నమోదు అవుతున్నాయని, వాటిని ప్రతీ రోజూ గమనిస్తూ, పురోగతి సాధించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కోర్‌డాష్ బోర్డులో ప్రతీ రోజూ జిల్లాల్లో జరిగే అంశాలను గమనిస్తున్నారన్నారని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫెర్మార్మెన్సు ఇండికేటర్స్‌నూ ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. ఇ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయడంలోనూ, ఆధార్ అనుసంధానంలోనూ శ్రద్ధ వహించాలని కోరారు. ఇ క్రాప్ బుకింగ్‌ను చేపట్టాలని ఆయన ఆదేశించారు. పౌరసరఫరాల గిడ్డంగుల నిర్మాణానికి స్థలాలను పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఈ అంశాన్ని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పర్యవేక్షించాలని, లభ్యమయ్యే మండలాల్లో ముందస్తుగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతీ మండలంలో స్థల కేటాయింపునకు చర్యలు చేపట్టాలన్నారు. భూశిస్తుల వసూలులో పురోగతి కనిపించాలన్నారు. ధాన్యం కొనుగోలు అంచానాలకు మించి వేశామని, రైతులకు బిల్లులను చెల్లించామని ఆయన చెప్పారు. ఇన్‌చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి పి.రజనీకాంతారావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నప్పటికీ సకాలంలో నివేదికలు సమర్పించక ప్రగతి నివేదికలలో తక్కువ స్థాయిలో కనిపిస్తున్నామన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హెచ్. జయరామ్ మాట్లాడుతూ జిల్లాలో 5.24లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 29 వేలమంది రైతులకు రూ.8వందల కోట్లను చెల్లించామన్నారు. రైస్‌మిల్లర్లకు అందించిన ధాన్యంలో 3.92లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఇప్పటికి 2.67 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, మిగిలిన 1.25లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాలన్నారు. వీటిని పరిశీలించి నిర్దేశిత సమయంలో అందేటట్టు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాసరఫరాల అధికారి వి.సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్ఫర్మెటిక్స్ అధికారి గంగాధరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారులు బి.దయానిధి, ఆర్ గున్నయ్య, ఎం.వెంకటేశ్వరరావు, తహశీల్దార్లు , డిప్యూటీ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రగతి
* టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు
పొందూరు, ఏప్రిల్ 1: టిడిపి ప్రభుత్వం పాలనలోనే అంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన, సమర్థతే కారణమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. శుక్రవారం మండలంలోని లోలుగు గ్రామంలో త్వరలో జరగనున్న అసిరితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకొని ఆ అమ్మవారి పేరిట నిర్మించిన ముఖ సింహద్వారాన్ని ప్రారంభించి, మాట్లాడారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆరునెలల్లో అభివృద్ధ్ఫిలాలు అందజేయనున్నట్టు తెలిపారు. విద్యా,వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అధ్యక్షత వహించారు. జెడ్పిటీసీ శ్రీరాములనాయుడు తదితరులు పాల్గొన్నారు.

3న ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ పరీక్ష
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 1: ఈనెల 3న జరగనున్న ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ పరీక్షకు ప్రభుత్వ బాలుర పాఠశాల శ్రీకాకుళంలో హాజరయ్యే ఉపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారిచే జారీ చేసిన హాల్‌టికెట్ తోపాటు అదనంగా ఒకస్టాంప్ సైజ్ ఫోటోను తీసుకుని రావాలని డిఇవో దేవానందరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలని తెలిపారు.
పదో తరగతి పరీక్షలకు 213మంది గైర్హాజరు
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన సైన్స్-2 పరీక్షకు 39,163మంది హాజరు కావాల్సి ఉండగా 213మంది గైర్హాజరయినట్టు డిఇవో దేవానందరెడ్డి తెలిపారు. జిల్లాలో ఫ్లైయింగ్ స్క్వాడ్ 48 కేంద్రాల్లో, డి ఇవో 2 కేంద్రాల్లో, అబ్జర్వర్ 5 కేంద్రాల్లో పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండే ఉండేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.

సొసైటీ భూములపై పూర్తిస్థాయిలో సర్వే
నరసన్నపేట, ఏప్రిల్ 1: మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్సు సొసైటీ భూమి వివాదంపై సమగ్రమైన నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారని డిప్యూటీ సర్వేయర్ వెంకటరావు తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సొసైటీ భూములకు సంబంధించిన రికార్డులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమికి సంబంధించిన పూర్తిస్థాయిలో సర్వేను చేపట్టామని దీనికి సంబంధించి ప్రత్యేక మ్యాప్‌ను కూడా రూపొందించామని తెలిపారు. అప్పట్లో ఈ భూమికి సంబంధించి కేవలం 79 ప్లాట్‌లను వేసి లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం చాలా వరకు ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించామని వీటికి సంబంధించిన నివేదికను త్వరలోనే కలెక్టర్ గారికి అందజేస్తామని స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సహాయ సర్వేయర్ అప్పారావు,స్థానిక సర్వేయర్ వెంకటరమణ, జిల్లా కోపరేటివ్ సొసైటీ అధికారులు జానకిరామ్, దామోదరరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు.