శ్రీకాకుళం

‘దిశ’ మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 18: కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరు, పురోగతి, జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం, పర్యవేక్షణ ‘దిశ’గా జరగాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసిమెలిసి కాకిలెక్కలు వివరించారు. సమావేశానికి చైర్మన్, విజయనగరం ఎం.పి. పూసపాటి అశోక్‌గజపతిరాజు హాజరుకాకపోవడంతో కో చైర్మన్‌గా శ్రీకాకుళం ఎం.పి. రామ్మోహన్‌నాయుడు అధ్యక్షతన జరిగింది. జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు సగానికిపైగా ఈ అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకాలేదు. ప్రతిపక్షం నుంచి పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు వి.కళావతి, జోగులు హాజరైనప్పటికీ, ఫోటో పోజుచ్చి రాజాం ఎమ్మెల్యే సమావేశం చర్చలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. చివరి వరకూ కళావతి గొంతే ప్రతిపక్షపాత్ర పోషించారు.
సమావేశం సరికొత్త విధానాలతో, కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆదేశాలతో, గతంలో గల విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ పేరును డిస్ట్రక్ట్ డెవలప్‌మెంట్ కోర్డినేషన్ అండ్ మోనటరింగ్ కమిటీ(దిశ) అంటూ 28 శాఖలపై సమీక్ష నిర్వహించాల్సివున్నప్పటికీ 15 శాఖలనే అజెండాలో ప్రవేశపెట్టి, మూడు, నాలుగు శాఖలపైనే చర్చ నిర్వహించి దిశ తొలి సమావేశం ముగించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2.40 గంటలకు ముగించేశారు.
తొలిత కో చైర్మన్ రామ్మోహన్‌నాయుడు ప్రసంగంతో ప్రారంభమైన కమిటీ సమావేశంలో జిల్లా అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పథకాల పాత్ర పట్ల ఎటువంటి చర్చ జరగలేదు. పథకాల ప్రచారంలో లోపాలుగాని, లక్ష్యాలు పూర్తి చేసేందుకు ఏర్పడుతున్న ఆటంకాలపైగాని చర్చ నిర్వహించలేకపోయారు. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ‘దిశ’ నిర్దేశం చేస్తూ నిర్వహించాలంటూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసిమెలిసి కాకిలెక్కలు వివరించారు. జిల్లా యంత్రాంగం బిగ్‌బాస్ నోట చెప్పాల్సిన మాటలన్నీ పక్కనే కూర్చున్న ప్రభుత్వ విప్ చెవిలో చెబుతుంటే ఆయన మాటలుగా కూన రవికుమార్ వెల్లడించడం, మరోపక్క కూర్చున్న ఎం.పి. రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతుంటే గొంతుకలిపి కలెక్టరే ప్రజాప్రతినిధి పాత్రలో సమీక్ష నిర్వహించడంతో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టు ‘దిశ’ సమావేశం ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య మాత్రం నిర్దేశాన్ని సూచించినట్టు మారింది.
ముందుగా ఉపాధి పథకం గిరిజన సమగ్రాభివృద్ధిలో ఎంతవరకూ లక్ష్యాలు సాధించిందన్న విషయాన్ని కలెక్టర్, ఎం.పి. చర్చకు తీసుకువచ్చారు. ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరావు మాటల మ్యాజిక్కే తప్ప మరేమీ కన్పించలేదు. పలాస మున్సిపాలిటీ పరిధిలో పెంటిభద్ర అనే ఎస్టీ నివాసితుల ప్రాంతం ఉన్నట్టు ఐటిడిఎ పీవోకి తెలియదు. దీనిపై పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అక్కడ ఎస్టీ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గిరిజన పథకాలు అమలు కావడంలేదంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై కో చైర్మన్, కలెక్టర్ స్పందించకపోవడంతో ఐటిడిఏ పివో ఆ గ్రామమే ఉన్నట్టు తనకు తెలియదంటూ చెప్పారు. అలాగే, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్‌లో ఎన్ని విధాలైన పనులు వర్తింపజేస్తూ కేంద్రం ఆదేశాలిచ్చిందన్న ప్రశ్నకు తాజాగా 198 పనులు అమలు చేయవచ్చునంటూ డుమా పిడి కూర్మనాథ్ సమాధానం ఇచ్చారు. 198 పనులు తనకే తెలియదని శివాజీ చెబుతూ జాబ్‌కార్డు పనివాళ్ళకు కూడా తెలియకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఒకటిరెండు పనులతోనే వారికి ఉన్నపని తీసేసి, లేనిపని కల్పించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. కలెక్టర్ లక్ష్మీనృసింహం చెప్పాల్సిన వివరణకు బదులుగా విప్ కూన రవికుమార్ కలెక్టర్ గళాన్ని అందుకుని కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క ప్రాంతానికి అనుసరించి 198 పనులు అమర్చలేదని, దేశంలోగల అన్నీ రాష్ట్రాల నైస్వర్గిక పరిస్థితుల ఆధారంగా రూపొందించినవంటూ సుస్పష్టం చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రచారం జరగడం లేదన్న వాదనను మాత్రం దాటేసేశారు. ఈ నేపథ్యంలో డుమా పిడి మాట్లాడుతూ నీటిగుంటలు తవ్వకాల బిల్లులు, ఫీల్టు అసిస్టెంట్లు జాబితాల్లో తప్పులు చేశామంటూ ముక్కుసూటిగా కమిటీ ముందు అంగీకరించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అత్యుత్సాహంతో గిన్నిస్‌రికార్డుల్లా జిల్లాలో నీటిగుంటల తవ్వకాలు చేశామని, దాని ఫలితంగా గ్రామాల్లోకి క్యాడర్ ముందుకు వెళ్ళలేని పరిస్థితికి డుమా పిడి తీసుకువచ్చారంటూ విమర్శించారు. మూడురోజుల్లో బిల్లులు ఇస్తామంటూ హామీ ఇచ్చి ఆరుమాసాలుగా వాటి బిల్లులు చెల్లింపులు చేయలేకపోవడంతో అత్యుత్సాహంతో అడ్డంగా బుక్కాయ్యామంటూ ఆవేదన వెల్లగక్కారు. మూడు లక్షల లక్ష్యానికి 1.60 లక్షల వరకూ చెల్లింపులు చేశామంటూ డుమా పిడి చెప్పే కూడికలు తీసివేతలపై కో చైర్మన్ రామ్మోహన్‌నాయుడు అడ్డుతగిలి ఆగ్రహించారు.
పాలనాపరమైన అనుమతులు లేకుండా ప్రజాప్రతినిధులచే కొబ్బరికాయలు కొట్టించేలా ఎందుకు ప్రవర్తించారంటూ ప్రశ్నించారు. దీంతో డుమా పిడికి మాటలు మూగపోవడంతో కలెక్టర్ సర్దుబాటు చేస్తూండగానే, విప్ రవికుమార్ అసెంబ్లీలో అడగాల్సిన ప్రశ్నలు జిల్లా సమీక్షల్లో అడగడం వల్ల ప్రయోజనం ఉండబోదంటూ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ ప్రశ్నను కొట్టిపారేశారు. మధ్యమధ్యలో ఎమ్మెల్యే లక్ష్మీదేవి అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్డు పెట్టడంలేదని, శ్రీకాకుళం ఎంపిపి జగన్నాథం ఫీల్డ్ అసిస్టెంట్లు జాబితాల్లో లొసుగులు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తీరని సమస్యలన్నీ సమావేశముందుంచారు. ఇదిలావుండగా, హౌసింగ్‌శాఖలో సాంకేతికలోపాలపై చర్చ జరిగింది. కేంద్రం ప్రకటించిన స్కీమ్‌ల జాబితాల్లో మార్పులుచేర్పులు జరగవంటూ అధికారులు తరుఫున విప్ సుస్పష్టం చేశారు. అనంతరం దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ అవాస్ యోజన, ఐసిడిఎస్, పంచాయతీరాజ్ శాఖల పనుల పురోగతి, సమన్వయంపై జరిగిన చర్చలో కోట్లాది రూ.లు పథకాలకు అనుమతులు ఇచ్చి, నిధులు విడుదల చేస్తున్నా కనీసం 10 శాతం లక్ష్యాలు కూడా చేరుకోలేకపోతున్నందుకు సిగ్గేస్తుందని కలెక్టర్ ఆగ్రహించారు. పనిచేయని అధికారులు జీతభత్యాలు తీసుకోవద్దన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ప్రతిభాభారతి తనకు సమీక్షల సమాచారమే ఇవ్వడంలేదంటూ ఆరోపించారు. కలెక్టర్ సమాధానం తెలిసినా చెప్పనంటూ సీనియర్ ఎమ్మెల్యే శివాజీకి చెప్పడం గమనార్హం. జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు, డిఈవో దేవానంద్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి.ఎ.శోభ, ట్రాన్స్‌కో ఎస్.ఈ., ఎం.హెచ్.వో. దవళ భాస్కర్, డి.ఐ.వో. బగాది జగన్నాథరావు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.