స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--131

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

సర్వప్రకాశమయుడైన భగవానుడు పరమరహస్యమైన గుహలో అందమైన ఆసనంపై రాజుగా అధిష్ఠించియున్న జీవాత్మవద్దకు వచ్చి చేరుతాడు.
వివరణ:- లోకంలో అనేకులు పరమాత్మ ననే్వషిస్తుంటారు. కాని వారిలో చాలామంది ఆ పరమాత్మను పొందలేరు. ఎవరో కొద్దిమందిమాత్రం తమ భాగ్యవిశేషంచేత భగవత్ప్రాప్తిని పొందుతుంటారు.
అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిమ్ (గీత.6-45)
‘‘పట్టువీడక ప్రయత్నించే యోగి బహుజన్మ పరిపాక విశేషం చేత సమస్త దోషరహితుడై పరమ సంసిద్ధిని పొందుతున్నాడు’’అని భగవద్గీత కూడ వచిస్తూంది. పరమ సంసిద్ధ అంటే పరమాత్మతో జీవాత్మ ఐక్యం చెందడమే. పరమాత్మ కంటె అధికమైన మరియు అన్యమైనదేదీ లేదని, అదే జీవులన్నీ చేరుకో దగిన పరమప్రదేశమని, పరాగతి అని-
పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా పరాగతిః॥ (కఠ.ఉ.1-3-11) కఠోపనిషత్తు వివరిస్తూంది.
పరమాత్మ ఎవరితో సంయోగం చెందుతుంది? ఆత్మతోనే కదా. మరి ఆ ఆత్మ ఎటువంటిది కావాలి? అంటే అది అత్యంత రహస్యంగా ఉండేది కావాలి. ఆత్మ ఎప్పుడూ గుప్తమైయుండేదే. దానినెవరూ ఇంతవరకు కళ్ళతో చూడనేలేదు.
సామాన్యులు ఆత్మ విషయంలో అది ఉందా? లేదా? అన్న సందేహంలో ఉంటారు. మరికొందరు అసలు ఆత్మ అన్నది ఉంది అన్న విషయంలోకూడ విశ్వాసం కలిగియుండరు. కాని ఆత్మ ఉంది. ఎలా? గుహా హితమ్= అత్యంత రహస్యంగా. ఏ జీవి- ఆత్మ అయినా అంతే.
గుహా హితమంటే ఏమిటి? ఎవరి ఆత్మబాహిరమైన లౌకిక విషయాలను విడిచి ఆత్మశోధనలో నిమగ్నమై అంతర్ముఖమై యుంటుందో ఆ ఆత్మ గుహాహితమ్= రహస్యంగా ఉన్నదని అర్థం.
జీవాత్మతో పరమాత్మవచ్చి సంయోగపడేందుకు మరొక విశేష గుణం కూడ అవసరం. అదేమంటే అది చిత్ర బర్హిః= చిత్రబర్హుడు కావడమే. అంటే ఎవరి ఆసనం చిత్రమైయుంటుందో అతడు చిత్రబర్హుడు.
ఇక్కడ ఆసనమంటే హృదయాసనమే. హృదయంలో ఏ ఇతర భావాలు తలెత్తకుండ కేవలం భగవంతునకు చెందిన భావాలు చిత్రితమై ఉంటాయో ఆ హృదయం చిత్రబర్హం. అట్టి హృదయంకలవాడు చిత్రబర్హిః= చిత్రబర్హుడై.
ఇక్కడ మరో విషయం కూడ తెలుసుకోవాలి. ఏమంటె ఈ మంత్రంలో ఆత్మరాజు అని చెప్పబడింది. ఎవరికి రాజు? శరీరానికి మరియు ఇంద్రియాలకు. చిత్రమేమంటె ఆత్మ రాజయినా శరీరేంద్రియాల వెంట బంటుగా వెంటబడుతూ ఉంది. కానీ ఆత్మ ‘‘నేనే ఈ శరీరేంద్రియాలకు అధిపతిని. నా ప్రయోజనాలకొఱకే అవి బంటులై పనిచేయవలసి యుంది’’అని ఎప్పుడు తెలుసుకోగలుగుతుందో అప్పుడే ఆత్మ రాజుగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.
ఆత్మ ఆ రీతిగా రాజత్వాన్ని పొందిందని పరమాత్మ ఎపుడు గ్రహించగలడు? అంటే ఆ ఆత్మ లౌకిక విషయాల వెంటపడక కేవలం హృదయ గుహలో అంతర్ముఖంగా నిలిచియున్నప్పుడు మాత్రమే.
పరమాత్మ ‘ఆఘృణి’ సర్వత్ర ప్రకాశమానుడై యుండేవాడు. కాబట్టి అజ్ఞానాంధకారంతో నిండిన హృదయ గుహను ఆ పరమాత్మ జ్ఞానప్రకాశమానంచేసి ఆత్మతో సంయోగమవుతాడు.
ఆయన ‘పూషా’ అంటే పథికృత్. అంటే మార్గాన్ని చూపేవాడని భావం. ఒక్కసారి ఆత్మ నిజంగా పరమాత్మతో సంయోజనం చెందాలని హృదయ పూర్వకంగా కాంక్షిస్తే దానికి తగిన ప్రకాశమార్గాన్ని పరమాత్మయే చూపిస్తాడు.
అట్టి ప్రకాశంలో ఆత్మపరమాత్మతో సమ్మేళనం పొందుతాడు. అంతేకాదు పరమాత్మ చాల దయాళువు. అందుకే-
ఉతో స మహ్యమిందుభిః షడ్‌యుక్తా అనుసేషిధత్‌॥ (ఋ.1-23-15)
జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు ఈ ఆరింటిని ఆ దైవం జీవాత్మ కనుకూలంగా నడిచేటట్లుచేస్తాడు’’ ఈ విధంగా జీవాత్మకనుకూలంగా నడిపి తనకభిముఖమై జీవాత్మ తనతో సంయోగపడేటట్లు పరమాత్మయే చేసి తన దయాళుత్వాన్ని ప్రకటించుకొంటున్నాడు.
**