తూర్పుగోదావరి

టిడిపి-వైసిపి వాగ్వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 22: రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశం ఆద్యంతం రాద్ధాంతంగానే సాగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు సభా మర్యాదలను పక్కనపెట్టి రాద్ధాంతం చేసిన తీరు విస్మయాన్ని కలిగించింది. శుక్రవారం మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు రాసిన బహిరంగ లేఖలోని 30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పట్టుబట్టగా, వైఎస్సార్‌సిపి సభ్యులు ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా జరిగిన వాగ్వివాదాలతో గందరగోళం నెలకొంది. మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగానే వైసిపి సభ్యులు పోడియంను చుట్టుముట్టి ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చివరకు టిడిపి సభ్యులు వెళ్లిపోవడంతో ప్రజా సమస్యలు, అజెండాపై చర్చ లేకుండానే సమావేశం ముగిసింది.
సమావేశాన్ని వాయిదా వేసే విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తొలుత తొలి మేయర్ ఎంఎస్ చక్రవర్తి మృతికి సంతాపం తెలిపారు. అనంతరం కౌన్సిల్ సమావేశం నిర్వహణపై వైఎస్సార్‌సిపి సభ్యుడు మింది నాగేంద్ర, ఫ్లోర్‌లీడర్ ఎం షర్మిలారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మేయర్‌పై ధ్వజమెత్తారు. దీనిపై మేయర్ స్పందిస్తూ ఇప్పటికే దానిపై వివరణ ఇచ్చానని, అనవసర అంశాలపై చర్చలు వద్దని కాస్త ఘాటుగా చెప్పారు. టిడిపి ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు లేచి తాను సంధించిన ప్రశ్నలపై సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. వైసిపి ఫ్లోర్‌లీడర్ ఎం షర్మిలారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో సభ విమర్శలు, వాగ్వివాదాలతో గందరగోళంగా మారింది. ఈసందర్భంగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే వర్రే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని, సమాధానాల్లో ఎలాంటి పస లేదని, అంతా మమ అనిపించేలా అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వర్రే రాసిన లేఖలోని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందన్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సుందరీకరణకు 7కోట్లు ఖర్చు చేశారని, ఎవి అప్పారావురోడ్డు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకే 14లక్షలు ఖర్చు చేశారన్నారు. ఈవ్యవహారాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఈఅంశాలపై కూలంకుషంగా అధ్యయనం చేసి ఆధారాలతో సహా విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తే మంచిదన్నారు. ఈఅంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గోరంట్ల జోక్యం చేసుకుంటూ గోదావరి పుష్కరాల నిధుల వినియోగంపై శే్వతపత్రం, వర్రే లేఖపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించాలన్నారు.
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో అవకతవకలు, అవినీతి జరిగినందునే టిడిపి ఫ్లోర్‌లీడర్ వర్రే బహిరంగ లేఖ రాశారన్నారు. ఈసందర్భంగా వైసిపి, టిడిపి సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. వైసిపి సభ్యులు ప్రశ్నోత్తరాల కోసం మేయర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. చివరకు సమావేశాన్ని వాయిదావేశారు. అప్పటికే అజెండాలోని అంశాలపై అధికారులు అధికార పార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని ఆమోదించినట్లు నమోదు చేసుకోవడం గమనార్హం. మేయర్ పంతం రజనీశేషసాయి ఫిబ్రవరి 18న శే్వతపత్రం, వర్రే లేఖపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
అనవసర అంశాలపై రాద్ధాంతం- సోము
ఎన్నో ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి అనవసర అంశాలపై కౌన్సిల్‌లో రాద్ధాంతం చేశారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రాత్మక రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చిన అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరాన్ని కేంద్రం హెరిటేజ్ సిటీగా ప్రకటించే అవకాశం ఉన్నందున దీనిపై చర్చించి, తీర్మానిస్తే బాగుండేదన్నారు.

టిడిపి తీరు అప్రజాస్వామికం- ఆదిరెడ్డి
కౌన్సిల్‌లో అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధ్వజమెత్తారు. తమకు కౌన్సిల్‌లో బలముందని ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, న్యాయస్థానం, ప్రజాకోర్టులో తేల్చుకుంటామన్నారు.

వ్యాట్ ఉపసంహరణతో గట్టెక్కిన చక్కెర పరిశ్రమ
డైరెక్టర్ ఆఫ్ షుగర్ కేన్ కమిషనర్ మురళి
సామర్లకోట, జనవరి 22: చక్కెరపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చక్కెర పరిశ్రమలు సంక్షోభం నుండి గట్టెక్కాయని ఎపి డైరెక్టర్ ఆఫ్ షుగర్ కేన్ కమిషనర్ యల్ మురళి పేర్కొన్నారు. స్థానిక నవభారత్ వెంచర్స్ చక్కెర ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యుదయ చెరకు రైతులతో ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. వ్యాట్ ఎత్తివేయడం వల్ల ఫ్యాక్టరీలు రాష్ట్రంలో ఉత్పత్తి అయిన పంచదారను, ఇతర రాష్ట్రాల నుండి లభించే పంచధార ధర కంటే తక్కువగా లేదా సమానంగా విక్రయించి రైతులకు సకాలంలో సొమ్ములు చెల్లించే స్థితికి చేరుకున్నాయన్నారు. ఉపాధి హమీ పథకం వలన వ్యవసాయ కూలీల సమస్య, కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ఈ పథకం వల్ల వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించినా, చెరకు సాగుకు వారు అందుబాటులో లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్, మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లి చెరకు రైతులకు న్యాయం జరిగే దిశగా కృషిచేస్తామన్నారు. చక్కెర కర్మాగారాలు కేవలం పంచదార ఉత్పత్తికే ప్రాధాన్యత ఇవ్వకుండా ఇధనాల్, విద్యుదుత్పత్తి వంటివి చేపట్టాలన్నారు. ఇటీవల ప్రభుత్వం కూడ ఇధనాల్ కొనుగోలు ధరను పెంచి సహకరించినట్లు చెప్పారు. రైతులు కూడ చెరకు ధర పెంచడమే చెరకు సాగు గిట్టుబాటుకు ఏకైక మార్గం అని భావించకుండా, సాగు ఖర్చులు తగ్గించుకుని అధికోత్పత్తి సాగించాలని సూచించారు. అలాగే చెరకు తోటల్లో అంతర పంటలను సాగుచేసి అదిక ఆదాయం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను రైతులు కమిషనర్ మురళి దృష్టికి తెచ్చారు. ఇతర పంటల వలే చెరకుకు కూడ విత్తన సబ్సిడీ సౌకర్యం కల్పించాలని రైతులు కోరారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు చెరకు శాఖకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రస్తుతం చెరకు నరుకు, రవాణా ఖర్చులపై సబ్సిడీ ఇచ్చి, చెరకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరకు అభ్యుదయ రైతులు బుర్రా ఆంజనేయ కామరాజు, యేలేటి ప్రసాద్, బత్తిన పేర్రాజు, చక్కెర ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్లు యార్లగడ్డ కోటయ్య, జి వెంకటేశ్వర్లు, సలహాదారులు పమిడి వెంకటేశ్వర్లు, కె రామలింగస్వామి, సహాయ జనరల్ మేనేజర్ యస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేన్ కమిషనర్ సమగ్ర రైతు సేవా పథకంలో నిర్వహిస్తున్న మహిళా స్వయం ఉపాధి కల్పన కార్యక్రమం, జీవ నియంత్రణ, జీవ ఎరువుల తయారీ, టిష్యూ కల్చర్ ప్రయోగశాలలను సందర్శించారు. ప్లాస్టిక్ ట్రేలలో చెరకు నారు పెంపకంలో మహిళల బాగస్వామ్యంను ఆయన కొనియాడారు.
తాగు,సాగునీరు సక్రమంగా అందించాలి
అధికారులకు కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశం
యు కొత్తపల్లి, జనవరి 22: తాగు, సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పల్లెక్రాంతిలో భాగంగా శుక్రవారం యు కొత్తపల్లి మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని వాకతిప్పలో రక్షిత మంచినీటి పథకాన్ని కలెక్టర్ పరిశీలించి, రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గి ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రక్షిత మంచినీటి పథకానికి నీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తపల్లి పిహెచ్‌సిని తనిఖీచేసి రికార్డులు పరిశీలించారు. ఈ సమయంలో వైద్యాధికారిణి రూబేలా వైద్యశాలకు రక్షణ గోడ నిర్మించాలని కలెక్టర్‌కు విన్నవించారు. పిహెచ్‌సి ఆవరణలో పేరుకుపోయిన అపారిశుద్ధ్యాన్ని చూసి వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడిఒ నారాయణమూర్తిని పిలిచి గ్రామాలలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై కలెక్టర్ ఆరా తీశారు. అక్కడ నుండి కొత్తపల్లిలో సాగునీరు అందక ఎండిపోతున్న పొలాలను చూసి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. వెంటనే ఎండిపోతున్న పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు, తహసీల్దార్ రత్నకుమారి, కొత్తపల్లి సర్పంచ్ కాపుల వెంకటలక్ష్మి, వాకతిప్ప సర్పంచ్ ఈగల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
--గిరిజన ప్రాంతాల్లో --
హిందూ, ధర్మ పరిరక్షణకు చర్యలు
హెచ్‌డిపిటి కార్యదర్శి విజయరాఘవాచారి
శంఖవరం, జనవరి 22: రాష్ట్రంలో హిందూ, సనాతన ధర్మాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ఎపి హిందూ, ధర్మ పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలు చేపడుతోందని సమితి కార్యదర్శి మరియు సిటా ప్రిన్సిపాల్ విజయరాఘవాచారి పేర్కొన్నారు. అన్నవరం శుక్రవారం వచ్చిన విజయరాఘవాచారి ప్రముఖ పుణ్యక్షేత్రమైన రత్నగిరిపై వేంచేసియున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం వేద పండితులు స్వామివారి వేదాశీస్సులు, ప్రసాదం అందించి ఙ్ఞపికను బహూకరించారు. అనంతరం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ హిందూ, ధర్మ పరిరక్షణలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో యువకులను ఎంపిక చేసి వారికి సనాతన ఆచార, సాంప్రదాయాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న ఆలయాలు నిర్మించి వీటిలో శిక్షణ పొందిన వారిని అర్చకులుగా నియమిస్తామని తెలిపారు. తద్వారా వారికి ఉపాధి కల్పనతోపాటు ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల నిర్వహణ సక్రమంగా జరుగుతుందన్నారు. ఆలయాలను అభివృద్ధి చేసేందుకు హిందువుల భాగస్వామ్యం ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా హెచ్‌డిపిటి అచ్యుత అనే ఆన్‌లైన్ అక్కౌంటును ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా విరాళాల స్వీకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో శిధిలస్థితిలోగల రామాలయాలకు మరమ్మతులు చేయడం, వాటిలో కొత్త విగ్రహాల ఏర్పాటు చేసి, వాటిని హిందూ ఆరాధన మందిరాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇఓ కాకర్ల నాగేశ్వరరావు, సహాయ కమిషనరు ఇవి జగన్నాధరావు, పిఆర్వో తులా రాముడు తదితరులు పాల్గోన్నారు.
ఐక్య గర్జనకు ఆటంకాలు!
*ఆర్టీసీ బస్సులు అద్దెకు నో*విద్యా సంస్థల బస్సులివ్వకుండా ఆటంకాలు*కాలినడకనైనా వెళ్తామంటున్న కాపు నేతలు

ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 22: ఆర్థికంగా వెనుకబడిన కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపుఐక్యవేదిక ఈ నెల 31న తునిలో నిర్వహించతలపెట్టిన కాపుఐక్యవేదిక బహిరంగ సభ అడుగడుగునా అడ్డుతగులుతోంది. కాపు ఐక్యవేదిక కన్వీనర్ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కనీవినీ ఎరుగని రీతిన బహిరంగ సభ సక్సెస్ కానున్నట్లు సంకేతాలు అందాయి. రాష్ట్ర నలుమూలల నుండి కాపులు ఉత్తుంగతరంగంలా తునికి తరలిరానున్నట్లు ఇంటిలిజెన్స్ నివేదికలు రావటంతో సందిగ్థంలోపడిన పాలకులు ఎలాగైనా సభ సక్సెస్‌ను దెబ్బతీసేందుకు సర్వశక్తులు ఒడుతున్నారని కాపు నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకునేందుకు వెడితే బస్సులు లేవంటూ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పి దాటవేస్తున్నారని, అడిగిందే తడవుగా అద్దెకు బస్సులు ఇచ్చే ఆర్టీసీ తమకు మాత్రం బస్సులు లేవంటూ ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు. ప్రైవేటు కళాశాలల, స్కూలు బస్సులు అడిగితే తొలుత యాజమాన్యాలు ఆమోదం తెలిపారని, ఇప్పుడు వారినీ బెదిరిస్తుండటంతో వారు బస్సులు ఇవ్వలేమని, కావాలంటే దానికయ్యే ఖర్చులు ఇస్తాం వేరే వాహనాలు చూసుకోమని చెబుతున్నారంటున్నారు. ఇలాగైతే జనాగ్రహాన్ని చవిచూడక తప్పదని కాపుయువత నాయకుడు త్సవటపల్లి నాగభూషణం హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యమాన్ని పథకం ప్రకారం అణచివేయాలని చూస్తోందని, ప్రభుత్వం తమపై ఎంత వత్తిడి పెంచితే తాము పదింతలుగా తరలివెళ్లి జనబలంతో ప్రభుత్వానికి బుద్ధిచెబుతామని నాగభూషణం హెచ్చరించారు. కాపుల్లోని కొందరు సభను భగ్నం చేయమని చెబుతున్నారని, ముద్రగడ పద్మనాభం తుని కాపు ఐక్యగర్జన గురించి ప్రకటన చేసిన తరువాతే చంద్రబాబు ప్రభుత్వానికి కాపుకార్పోరేషన్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాపులకు ఏడాదికి వెయ్యికోట్లు చొప్పున రూ.5వేల కోట్లు కేటాయిస్తానని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక వంద కోట్లు ముష్టివేసిన విషయం చంద్రబాబుకి తెలియదా అని నాగభూషణం ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తోందని, కొందరు ప్రకటించటం ఆత్మహత్యాసదృశమన్నారు. 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రావులపాలెం సభలో కాపునాయకులపై జరిగిన లాఠీఛార్జీకి నిరసనగా తన పదవికి రాజీనామాచేసి ఆమరణ దీక్ష చేసిన ముద్రగడ ఉద్యమానికి తలవంచి ప్రభుత్వం జీవో 30ని తీసుకువచ్చిందని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కాపు ఉద్యమాన్ని సొమ్ముచేసుకుందన్నారు. 31న జరగబోయే కాపు ఐక్యగర్జన సభ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తాయన్నారు. రాష్ట్రంలో కాపులంతా ముద్రగడ వెంటే ఉన్నారని, ఎవరెన్ని విధాలుగా బెదిరించినా సభను విజయవంతం చేసి తీరుతామని నాగభూషణం స్పష్టంచేశారు.

పెద్దపులి దాడి.: రెండు దుక్కిట్టెద్దులు మృతి
విఆర్ పురం, జనవరి 22: మండల పరిధి మారుమూల అటవీ ప్రాంతంలోని బూరుగువాడ గ్రామ రైతులు కలుముల ఇరమరాజు, రామారావులకు చెందిన దుక్కిట్టెద్దులు పెద్దపూలి దాడి చేయటంతో మృతి చెందాయి. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాదితుల వివరాల ప్రకారం వ్యవసాయ సీజన్ అయిపోవటంతో పశువులను వదిలి వేశారు గ్రామస్థులు. దీంతో పశువులు గ్రామ సమీపంలోని అడవిలో మేతకు వెళ్లగా శుక్రవారం తెల్లవారుఝామున పెద్దపులి ఎద్దులపై దాడి చేసిందని, ఒక ఎద్దు పెద్ద పులి దాడి నుండి తప్పించుకుని అరుచుకుంటూ గ్రామం వద్దకు వచ్చి చనిపోయిందని తెలిపారు. కంగారుపడిన గ్రామస్థులు తెల్లవారిన తరువాత అడవిలో మిగతా పశువుల కోసం వెతుకుతుండగా మరొక ఎద్దు పెద్దపులి దాడిలో హతమైనట్టు గుర్తించామని వారు పేర్కొన్నారు. గ్రామం వద్దకు వచ్చి చనిపోయిన ఎద్దు రామరాజుదిగాను, అడవిలో చనిపోయిన ఎద్దు అప్పారావుదిగా గ్రామస్థులు గుర్తించారు. మృతిచెందిన రెండు ఎద్దుల చర్మంపైనా పులిపంజా గుర్తులు, మెడను కరచినట్లు బలమైన గాట్లు చాలా స్పష్టంగా కనిపించటంతో పులిదాడిలోనే తమ ఎద్దులు మృతిచెందినట్లు రైతులు చెబుతున్నారు. తమ వ్యవసాయానికి ఉపకరించే దుక్కిటెద్దులు మృతిచెందటంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చనిపోయిన ఎద్దులు ఒక్కొక్కటీ రూ.30వేలు ఉంటుందని రైతులు చెబుతున్నారు.
నగల వ్యాపారి
ఆత్మహత్యలో...
ఆ అధికారి తీరుపైనే ఆగ్రహం!
*రగులుతున్న సువర్ణ వర్తకులు *డిజిపి, విజయవాడ సిపికి ఫిర్యాదులు

ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 22: విజయవాడ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న బంగారు నగల వ్యాపారి ఆత్మహత్య ఘటనపై జిల్లా బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. రాజమండ్రికి చెందిన నగల వ్యాపారి వినోద్ ఇటీవల విజయవాడలోని వన్‌టౌన్ క్రైం పోలీసు స్టేషన్ భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆందోళనలు నిర్వహిస్తున్న బులియన్ వ్యాపారులు ఇందుకు బాధ్యునిగా ఒక అధికారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దొంగ బంగారం కొనుగోలుచేశారనే ఆరోపణలపై తీసుకెళ్లిన వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేంతగా వేధింపులకు గురిచేయడం ఆ అధికారికే చెల్లిందన్నారు.
ఈ అధికారి వ్యవహారంపై పోలీసు శాఖలోనే పలు ఆరోపణలున్న నేపథ్యంలో అతనిపై రాష్ట్ర డిజిపి, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదుచేయడానికి సమాయత్తమవుతున్నారు.
ఆదినుండీ వివాదాస్పదమే....
తూర్పుగోదావరి జిల్లాకు చెంది, విజయవాడ క్రైం విభాగంలో అనధికారికంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ అధికారి తీరు ఆదినుండీ వివాదాస్పదమేనని బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. ఎక్కడ చోరులు దొరికినా రికవరీ పేరుతో వర్తకులను వేధించడం, కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తారని ఆరోపిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన ఉపయోగించే పదజాలం అత్యంత జుగుప్సాకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. రికవరీ పేరుతో భారీగా బంగారం, నగదు వసూలుచేస్తారని, అయితే రికవరీ చేసిన మొత్తాన్ని పూర్తిస్థాయిలో బహిర్గతం చేయకపోవడం ఆయన ప్రత్యేకతగా చెబుతున్నారు. విజయవాడలో నేర విభాగంలో ఒక కిందిస్థాయి అధికారి, మరో కానిస్టేబుల్ ఆధ్వర్యంలో రికవరీల పేరుతో దందా నిర్వహిస్తుంటారని వారు పేర్కొంటున్నారు. వారి ఆధ్వర్యంలోనే వినోద్‌ను తీవ్రస్థాయిలో బెదిరించి, మానసికంగా వేధించడంవల్లే ఆత్మహత్యకు ఒడిగట్టేంత పరిస్థితి తలెత్తిందనేది ఆరోపిస్తున్నారు. రికవరీ వ్యవహారాల్లో ఆ అధికారిపై గతంలో వచ్చిన కొన్ని వివాదాస్పద అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసినపుడు కూడా ఆయనపై పలు ఆరోపణలొచ్చాయని పేర్కొంటున్నారు.
ఇంతటి వివాదాస్పద చరిత్ర కలిగిన అధికారికి రాష్ట్ర రాజధానిగా పేరొందిన విజయవాడ నేర విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించడం ఏ విధంగా సమర్ధనీయమని బులియన్ వర్తకుల సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ జెవి రాముడు, విజయవాడ పోలీసు కమిషనర్ గౌతంసావంగ్ దృష్టికి తీసుకెళ్లడానికి బులియన్ వర్తకులు సమాయత్తమవుతున్నారు.

విలీన మండలాలకు మోతుగూడెం నుండి
విద్యుత్ సరఫరా
- ఇపిడిసిఎల్ జిఎం రాజబాబు
కూనవరం, జనవరి 22: విలీన మండాలలకు సీలేరు విద్యుత్తును మోతుగూడెం ద్వారా లైన్లను పునరుద్ధరిస్తామని ఇపిడిసిఎల్ జిఎం ఎస్ రాజబాబు తెలిపారు. శుక్రవారం భీమవరం గ్రామంలోని సబ్ స్టేషన్లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విఆర్ పురం మండలానికి సబ్ స్టేషన్ ప్రతిపాదనలు పూర్తయ్యాయని, త్వరలోనే ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్‌ఇడి బల్బులను విలీన మండలాలకు ఈ నెలాఖరులోగా పంపిణీ చేస్తామన్నారు. దీన్ దయాళ్ కింద నూతనంగా 450 విద్యుత్తు కనెక్షన్లు అందజేసినట్టు తెలిపారు. వచ్చే మార్చి నాటికల్లా లక్ష్యాన్ని పూర్తిచేస్తామని, పొలాల్లో కిందకు ఉన్న విద్యుత్ లైన్లను గోదావరి వరదలప్పుడు ముంపు కాకుండా ఉండేందుకు ఎతె్తైన ప్రాంతాల ద్వారా లైన్లు వేస్తామన్నారు. అవసరమైన ప్రాంతాలలో సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రూ.125లకే విద్యుత్ మీటర్లు అందజేస్తున్నామని, ఎవరికీ అదనంగా డబ్బులు ఇవ్వనవసరం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డిఇ డి శ్రీనివాస్, ఎడిఇ మదుసూధనరావు, వెంకట్రావు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
పల్లవెంకన్న నర్సరీని సందర్శించిన కర్ణాటక ఎమ్మెల్యే
కడియం, జనవరి 22: కర్ణాటకు చెందిన మాజీ మంత్రి కరంగల్ ఎమ్మెల్యే రాయిరెడ్డి బసవరాజు శుక్రవారం కడియంలోని పల్ల వెంకన్న నర్సరీని సందర్శించారు. బెంగళూరు నుంచి నర్సరీలు ఇక్కడ విస్తరించాయని, అక్కడ గులాబీ వంటి కొన్ని రకాల మొక్కలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, ఇక్కడ కొన్నివేల రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని బసవారాజు ఈసందర్భంగా పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ, కడియం నుండి మొక్కలు తీసుకెళ్తున్నామన్నారు. నర్సరీ యజమాని పల్ల వెంకటేష్ నర్సరీకి వచ్చిన బసవరాజుకు ఘనస్వాగతం పలికారు.
నరసన్న కళ్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 22: ఫిబ్రవరి 14 నుండి 23వరకు జరగబోయే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలకు అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజోలు తహసీల్దారు కార్యాలయంలో అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తకోటి స్వామివారి కల్యాణానికి రానున్న సందర్భంగా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఆర్డీవో గణేష్‌కుమార్ మాట్లాడుతూ తాగునీటికి ఏవిధమైన ఇబ్బంది లేకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, స్నానపుఘట్టాల వద్ద జట్టీలు, బార్‌కోడింగ్‌లు నిర్మించాలని, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని, మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయాశాఖల అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ తరుపున నాలుగు శిబిరాలు ఏర్పాట్లు చేసి 60మంది వైద్య సిబ్బందిని నియమిస్తున్నట్లు మెడికల్ ఆఫిసర్ ఎ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయితీ అధికారి జెవిఎస్‌ఎస్ శర్మ, గోదావరి డెల్టాప్రాజెక్ట్‌కమిటీ ఛైర్మన్ సాయిబాబారాజు తదితరులు పాల్గొన్నారు.