అదిలాబాద్

పల్లెల్లో ప్రమాద ఘంటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: వేసవికి ప్రారంభానికి ముందే పల్లెల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాగునీటి కోసం సామాన్య జనం పడరాని కష్టాలు పడుతున్నారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా అడుగంటిన భూగర్భజలాలతో జనం అల్లాడిపోతున్నారు. రెండు నెలల క్రితంతో పోలిస్తే.. గత నెలాఖరు వరకు 16 మండలాల్లో భూగర్భజలాలు 12 మీటర్లకు పడిపోయాయి. గతేడాది మే నెలలో జిల్లా సగటు భూగర్భజలం 10.06 ఉండగా, ప్రస్తుతం 9.46 మీటర్లుంది. ఇక వేసవి కాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో భూగర్భ జలాలలు మరింత ప్రమాద స్థాయిలో పడిపోతాయని అధికారులు భావిస్తున్నారు. భూగర్భజలాలు ఉన్న చోట బోర్లు, మోటార్లు పని చేయకపోవడం, రక్షిత మంచినీటి పథకాలు నిరూపయోగంగా మారడంతో అనేక గ్రామాల్లో తాగునీటి కటకట ఏర్పడింది. రోజు రోజుకు భూగర్భజలాలు పడిపోతుండగా డిసెంబర్ 16తో పోలిస్తే జనవరి నెలాఖరు వరకు నేరడిగొండ మండలంలో భూగర్భ జలాలు 5.98 లోతుకు పడిపోయాయి. దిలావర్‌పూర్‌లో 5.90 లోతులో, గుడిహత్నూర్ 3.70, బజార్‌హత్నూర్‌లో 1.70, సారంగాపూర్‌లో 1.30, ఆదిలాబాద్‌లో 11.0 మీటర్ల లోతులో నీళ్లు పడిపోయాయి. ఇతర ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి ఇప్పుడిప్పుడే మొదలుకావడంతోప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పడిపోతున్న భూగర్భ జల మట్టంతో ఏర్పడనున్న నీటి ఎద్దడి నివారణ కోసం జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రెండు నెలల క్రితం రూ.26.97 కోట్ల పనులతో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు అటకెక్కాయి. ఇప్పటికే జిల్లాలో నీటి ఎద్దడి మొదలు కాగా ఇంత వరకు ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కాకపోవడంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిధుల గురించి ఆలోచించకుండా ముందస్తుగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రూ.46 లక్షలతో 36 బావులను అద్దెకు తీసుకొని, సీఆర్‌ఎఫ్, నాన్ సీఆర్‌ఎఫ్ కింద రూ.21.45 కోట్లతో 729 ఆవాస ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇంకా రూ.52 లక్షలతో 1256 బోర్లకు ప్లషింగ్, రూ.3కోట్లతో 291 ఓపెన్ బావుల్లో పూడికతీత, మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులు తాము పంపిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 22వేల బోర్‌వెల్‌లు ఉన్నాయి. వాటిలో 8వేలకు పైగా బోర్‌వెళ్లు పనిచేయడం లేదు. ఈ బోర్‌వెల్‌ల నిర్వహణ బాధ్యత ఆయా మండలాల ఎంపిడీవోలదే. పని చేయని బోర్‌వెళ్ల మరమ్మతు కోసం 13వ ఫైనాన్స్ నిధులు కేటాయించాల్సి ఉండగా చాలా మండలాల్లో నిధులు వినియోగం కావడం లేదు. అలాగే నాన్ సీఆర్‌ఎఫ్ గ్రాంటు కింద 355 నివాసిత ప్రాంతాలకు తాగు నీటిని సరఫరా చేసే పథకాలకు రూ.11.45 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ ప్రతిపాదనలు వెళ్లి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఈ నిధుల జాడ లేదు. దీంతో తాగునీటి ఎద్దడి నివారించేందుకు నిధులు లేకుండా పోయాయి. ఇతర నిధుల నుండి అధికారులు సర్దుబాటు చేస్తున్నప్పటికీ అవి ఏమూలన సరిపోవడం లేదు. అయితే గత ఏడాది మంజూరైన నిధులకు సంబంధించి ఖర్చులపై అడిట్ పూర్తి కాకపోవడంతో ఈ సారి నిధుల మంజూరిలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మహాశివరాత్రి పుణ్యస్నానాలకు కడెం ప్రాజెక్టు నాలుగు వరదగేట్ల ఎత్తివేత
* 1500 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల
కడెం, మార్చి 6: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడెం ఆయకట్టు కింద గోదావరి తీరప్రాంతంలో భక్తులకు స్నానాలు చేయడానికి నీరు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆదేశాలమేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఆదివారం కడెం ప్రాజెక్టుకు చెందిన నాలుగు వరదగేట్లు ఎత్తివేసి దాదాపు 1500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. గత రెండు మూడు రోజుల క్రితం కూడా నీటిపారుదలశాఖ అధికారులు ఒక వరదగేటు ఎత్తివేసి 500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన ఫలితం లేకపోవడం వల్ల గోదావరిలో పుణ్యస్నానాల కోసం భక్తులకు కావాల్సిన నీరు లేనందున మళ్లీ ఆదివారం రోజున నీటి పారుదలశాఖ అధికారులు నాలుగు వరదగేట్లు ఎత్తివేసి 1500 క్యూసెక్కుల నీటిని వదలడం జరిగింది. కడెం ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, నాలుగు వరదగేట్లు ఎత్తివేయడంతో ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నీటి మట్టం 676 అడుగులకు చేరింది.

సెల్ టవరెక్కిన ఏబివిపి నాయకులు
ఉట్నూరు, మార్చి 6: గిరిజన యూనివర్సిటీ ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేయడంపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి నాయకులు సెల్ టవరెక్కారు. ఆదివారం ఏబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పెందూర్ దత్తు, రాజేష్‌లు లక్కారంలో గల సెల్‌టవరెక్కి హంగామ సృష్టించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ రాష్ట్ర పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసం వరంగల్‌కు తరలించడం సమంజసం కాదన్నారు. సెల్ టవరెక్కిన తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సెల్‌టవర్ ఇచ్చేది లేదని వారు స్పష్టం చేశారు. సెల్ టవర్‌పైకి ఏబివిపి నాయకులు ఎక్కారన్న సమాచారం ద్రావనంలా వ్యాపించడంతో ప్రజా సంఘాల, రాజకీయ నాయకులు తరలివచ్చి దిగాలని విజ్ఞప్తి చేసిన వారు దిగలేరు. ఎస్సై మంగిలాల్ అధ్వర్యంలో అక్కడికి వచ్చి యూనివర్సిటీ అంశం తమ పరిధిలో లేదని, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయమని, కిందికి దిగి రావాలని విజ్ఞప్తి చేసినా వారు స్పందించకపోవడంతో రాత్రి వరకు వారు సెల్‌టవర్‌మీదే ఉన్నారు.

బిజెపి కృషివల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది
* పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మడావి రాజు
ఆదిలాబాద్ టౌన్, మార్చి 6: బిజెపి కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మడావి రాజు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు టిఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనడం హస్యస్పదంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యంతోనే మహారాష్టత్రెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న నదులపై బ్యారేజీల నిర్మాణానికి అంగీకారం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలోని రైల్వేగేట్ వద్ద ఓవర్‌బ్రీడ్జి నిర్మాణానికి రైల్వే బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కొన్ని దశాబ్దకాలంలో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతోనే సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరి చేయడం జరుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు కేంద్రం నుండి నిధులను ఉపయోగించుకుంటూ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలను మానుకోకపోతే ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సురేష్ జోషి, మండల అధ్యక్షుడు నాంపల్లి వేణోగపాల్, విజయ్‌సింగ్ షేకావత్ తదితరులు పాల్గొన్నారు.

సదర్‌మాట్ బ్యారేజి మంజూరీపై టిఆర్‌ఎస్ విజయోత్సవ బైక్‌ర్యాలీ
* పండుగ వాతావరణంలో పల్లెలు
ఖానాపూర్ రూరల్, మార్చి 6: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 120 సంవత్సరాల చరిత్ర కలిగిన సదర్‌మాట్ బ్యారేజి నిర్మాణానికి 5 కోట్ల 16 లక్షల రూపాయలను మంజూరుచేసిన సందర్భంగా టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సక్కారాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని కార్యకర్తలందరూ ఆదివారం స్థానిక విశ్రాంతి భవనం వద్ద ఉదయం 7 గటలకు హాజరై బైక్ ర్యాలీని దాదాపు వేయ్యి మందితో నిర్వహించారు. విశ్రాంతి భవనం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ తర్లపాడ్, సత్తనపల్లి, దిలావర్‌పూర్, బావాపూర్, కొత్తపేట్‌ల మీదుగా ఖానాపూర్ చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు సక్కారాం శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిపోయిందన్నారు. తెలంగాణ పోరాటం కోసం అలుపెరుగని వీరుడిగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపిగా నిలిచి పోరాడి తెలంగాణ సాధించిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయిన సందర్భంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరపున లబ్ధి జరుగుతూనే ఉందన్నారు. కెసిఆర్ ఎన్నికల్లో ఖానాపూర్ వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ విజ్ఞప్తిమేరకు కెసిఆర్ సదర్‌మాట్ బ్యారేజి నిర్మాణానికి హామీనిచ్చారు. ఈ హామీని నేడు నిలబెట్టుకున్న ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. సదర్‌మాట్ నూతన బ్యారేజి నిర్మాణానికి 5 కోట్ల 16 లక్షలు మంజూరుచేసిన సందర్భంగా పట్టణంలో వెయ్యిమందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సదర్‌మాట్ బ్యారేజి నిర్మాణంపై రైతులు సంతోషం వ్యక్తంచేస్తూ పండగ వాతావరణాన్ని తలపించింది. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం నేరుగా సదర్‌మాట్ బ్యారేజి వద్దకు వెళ్లి కార్యకర్తలంతా జై తెలంగాణ అంటూ నినాదాలుచేశారు. తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ బ్యారేజి నిర్మాణం వల్ల ఖానాపూర్, కడెం మండలాలే కాకుండా మామడ, లక్ష్మణచాంద మండలాలకు నీరందుతుందని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 18 గ్రామపంచాయతీల అధ్యక్ష, కార్యదర్శులు, జడ్పిటిసి సునిత రాజ్‌గంగన్న, సర్పంచ్ సత్యనారాయణ, మహేష్, రాములు, నిమ్మల శ్రీనివాస్, చరణ్, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అపర చాణక్యుడు కెసిఆర్
సిఎం చేస్తున్న భగీరథ ప్రయత్నం
ప్రతిపక్షాలవన్నీ పిచ్చికూతలే
ఎమ్మెల్సీ పురాణం సతీష్
కౌటాల, మార్చి 6: నవ తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహోరాత్రులు పాటుపడుతూ అపర చాణక్యుడిలా భగీరథ ప్రయత్నం చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యలో కలసి ప్రత్యేకంగా విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురాణం సతీష్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులతోపాటు అన్నివిధాలా దోపిడికి గురైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చే సత్తా ముఖ్యమంత్రికి ఉందని అన్నారు. దగా పడిన ప్రజలకు కెసిఆర్ ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భరోసా ఇచ్చాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కోటి ఎకరాలకు సాగునీరు, లక్ష ఉద్యోగాల కల్పన ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఇప్పటికే టీపీపీ ఎస్సీ ద్వారా ఇతరత్రా 40వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, వచ్చే మూడేళ్లలో 60వేల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ అవుతాయన్నారు. సాగునీటి విషయానికి వస్తే ఈ నెల 8వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీ ఎం ఫడ్నవిస్‌తో సిఎం కెసిఆర్ చేసుకోనున్న ఒప్పందం చారిత్రక ఒప్పందమని, సాగునీటి విషయంలో ఎక్కడికక్కడ జల జగడాలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పరివాహంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి నదులకు సంబంధించి చాణక్య నీతితో రీడిజైన్‌చేసి కేంద్ర ప్రభుత్వ మద్యవర్తిత్వం లేకుండా స్వతహాగా ఒప్పంద దశకు తీసుకురావడం ఆయన పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ స్వలాభం కోసం సాద్యం కాని రీతిలో ప్రాజెక్టులను రూపొందించిందని, తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టుకు సాగునీరు అధికంగా చూపినప్పటికీ, మహారాష్టల్రో 250 గ్రామాలకు ముంపు వాటిల్లుతుందని, ప్రస్తుతం 4మీటర్లు తగ్గి 140మీటర్ల ఎత్తులో నిర్మించే ప్రాజెక్టు ద్వారా 25 గ్రామాలకు ముంపు ఉన్నప్పటికీ జిల్లాలో 56వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమ అధిష్టానాల మెప్పు కోసం ఆయా పార్టీల రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఇప్పటికైనా ఆపాలని, ఇదేతీరు కొనసాగితే వారికి ప్రజలు రాజకీయ సమాది కడుతారని హెచ్చరించారు. ఎవరు మంచి పనిచేసినా, మంచి సలహా ఇచ్చినా వాటిని స్వీకరించి మంచి వారిని అభినందించడం ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు అలవాటని, ముఖ్యమంత్రి హోదాలో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పనులను కొనియాడిన విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. ప్రజలు తమ పాలనను మెచ్చుకునేందుకు తాము అధికారంలోకి వచ్చిన ఎన్నికలే కొలమానంగా నిలుస్తున్నాయని, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన తెరాస, ఖమ్మం, వరంగల్, మున్సిపాలిటీల్లో కూడా ఘన విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించాలి
* హరగోపాల్‌కు సదాశివ సాహితీ పురస్కారం ప్రదానం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 6: తెలుగు భాష సాహిత్య విలువలను పరిరక్షించుకోవడానికి సంఘటితంగా కవులు, రచయితలు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో తెలంగాణ కళా వేదిక అధ్యక్షులు అనుముల దయాకర్ అధ్వర్యంలో నిర్వహించిన సదాశివ సాహితీ పురస్కార గ్రహిత సన్మాన కార్యకమానికి కలెక్టర్ జగన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన ‘రెండు దోసిళ్ళ కాలం’గ్రంథ రచయిత శ్రీ రామోజు హరగోపాల్‌కు సామల సదాశివ స్మారక సహితీ పురస్కారాన్ని అందజేసి, శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ఎన్నో గ్రంథాలు రచించి జిల్లాకు సామల సదాశివ వనె్నతెచ్చారని గుర్తుచేశారు. కేంద్ర సాహితీ పురస్కార అవార్డును అందుకొని తెలంగాణ రాష్టఖ్య్రాతిని దేశానికి చాటిచెప్పిన ఘనత సామల సదాశివ మాస్టర్‌కే దక్కుతుందని అన్నారు. సామల సదాశివను నేటి కవులు, రచయితలు ఆదర్శంగా తీసుకొని దేశంలో తెలంగాణ ఖ్యాతిని చాటాలన్నారు. జిల్లా కేంద్రంలో సామల సదాశివ మాస్టర్ కాంస్య విగ్రహా ఏర్పాటుకు కృషి చేస్తానని, తెలంగాణ భాష అంతరించి పోతున్న తరుణంలో కవులు తెలంగాణ యాస భాషపై పుస్తకాలు రచించి నేటి బాలలకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం, శ్రీవర్దన్, వసంత్‌రావు దేశ్‌పాండే, సుమనస్పతి రెడ్డి, వేణుగోపాల్, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైన శివాలయాలు
ముధోల్, మార్చి 6: శివరాత్రి మహోత్సవాలకు నియోజకవర్గ కేంద్రంలోని శ్రీపశుపతినాథ్ శివాలయం, శ్రీజఠాశంకర శివాలయాలు ముస్తాబైనవి. ప్రజలు శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకోని స్థానిక శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తరలి వెళ్తుంటారు. శివాలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముఖ్యంగా శివాలయం ముఖ ద్వారాంను ప్రత్యేకంగ అలంకరించడం భక్తులను అకట్టుకోంటుంది. అలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ధ్వజస్థంభంకు ఇత్తడి తోడుగును ఏర్పాటు చేశారు. శివరాత్రి మహోత్సవం మొదటి రోజూన శివునికి బిల్వాపూజా, రుద్రాభిషేకం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య జరుపుతారు. శ్రీపశుపతినాథుని దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారని అలయ కమిటి సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా, ధ్వజ స్థంభానికి ఇత్తడి తొడుగును వేసే కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యుడు వస్తున్నట్లు సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ధర్మన్న, అర్.రమేష్ తెలిపారు.