మంచి మాట

సాల్వుని ‘సౌభగం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుని చేతిలో తన అన్న శిశుపాలుడు మరణించాడని తెలుసుకొన్న సాల్వుడు (్భష్మునితో యుద్ధం చేసిన సాళ్వుడు వేరు) ద్వారకపై దండెత్తడానికి సకల సన్నాహాలు చేయడం మొదలుపెట్టాడు. ద్వారకపై దండెత్తడమంటే చాలా కష్టం. ఎందుకంటే శత్రు దుర్బేధ్యమైన కోటలు రక్షింపబడుతూ వుంటుంది. సముద్రమే నలువైపుల రక్షణగా ఉన్న ద్వీపం ద్వారక. సాల్వుడు ద్వారకపైకి దండెత్తబోయే సమయానికి కృష్ణుడు ఇంకా అక్కడికి రాలేదు. రాజసూయ పరిసమాప్త సందర్భంగా అక్కడే వుండిపోయాడు. ద్వారకలోని యదువీరులు శత్రువులు నగరంలోనికి రాకుండా వంతెనలను ధ్వంసం చేశారు. విదేశ ఓడల ఆగమనం నిషేధించారు. కోటలోపల రహస్య ప్రదేశాలలో మందుగుండు సామాను నిక్షిప్తం చేశారు. ఎన్నో రోజులకు ప్రజలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను నగరంలో నిలవ వుంచారు.
సాల్వుడు నగరంలోనికి రాకముందే యాదవ సేనలు, కృష్ణ కుమారులైన సాంబ, ప్రద్యుమ్నల నాయకత్వంలో నగరం వెలుపల చేరి అక్కడ విడిసి ఉన్న సాల్వ సేనలను ఎదుర్కొన్నారు. ఈ సాల్వుడు యుద్ధ తంత్రాలను క్షుణ్ణంగా తెలిసిన యోధుడు. అతనికి ఎవరికి లేని ఒక ప్రత్యేకమైన యంత్రం లాంటి విమానం ఉన్నది. దాని విశేషం ఏమిటంటే అది చక్రాలతో నేలమీద రథంలాగా అతివేగంగా పరిగెత్తగలదు. దానికి రెక్కలు ఉండడంవలన గగనతలంలో శత్రువులు పోరాడడానికి సహాయపడగలదు కూడా. అంతేకాదు ఇప్పటి టాంకులలాంటి నేలమీద యుద్ధంలో ఉపయోగించే ఆయుధ విశేషాలు కూడా ఆ విమానంలో నిలవ ఉంటాయి.
అదే ‘సౌభగం’. దాంతో తనను జయించేవాళ్లు ఎవరూ ఉండరని అతని విశ్వాసం. నిజానికి అటువంటి ప్రత్యేక యంత్ర విమానాలలో యుద్ధం చెయ్యడం అంటే సాధారణ వ్యక్తులకు చాలా కష్టమే. సాల్వుడు ప్రయోగించిన ఒక శక్తి అనే మారణాయుధానికి ప్రద్యుమ్నుడు రథంపై మూర్ఛపడిపోయాడు. ఆ రథాన్ని నడుపుతున్న వ్యక్తి కృష్ణుని రథ సారథి దారుకుని కుమారుడు. సారథి జాగ్రత్తగా రథాన్ని దూరంగా తీసుకొని వెళ్ళాడు. తేరుకున్న ప్రద్యుమ్నుడు ‘‘ఇదేమిటి? ఓటమికన్నా మరణమే మేలు’’ అన్నపుడు సారథి ‘‘సోదర రథికుని, రథికుడు సారథిని ప్రమాద సమయంలో కాపాడటం ధర్మం. అందుకే అలా చేశాను’’ అని జవాబు చెప్పాడు. తిరిగి యుద్ధ రంగంలో ప్రవేశించిన ప్రద్యుమ్నునిపై సాల్వుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు వారుణాస్త్రంతో దాన్ని తిప్పికొట్టాడు. ప్రద్యుమ్నుని బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సాల్వుడు వెనుతిరిగాడు.
ద్వారక పరిస్థితి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాల్వుని సంహరించేవరకు నేను ద్వారకలో కాలుపెట్టనని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. వేదవిధులైన బ్రాహ్మణోత్తములు స్వామికి అక్షతలతో ఆశీస్సులు అందజేశారు. పాంచజన్యం పూరించి కృష్ణుడు ముందుకు కదిలాడు. చివరకు సముద్ర తీరంలోని మూర్తెకవాట అనే దేశంలో సాల్వుని కనుగొన్నాడు. సాధారణ యుద్ధరీతులలో కృష్ణుని గెలవడం కష్టమని తెలుసుకొన్న సాల్వుడు చిత్ర విచిత్రమైన వ్యూహాలను ప్రయోగించాడు. కృత్రిమ ఝంఝామారుతాన్ని సృష్టించాడు. ఒక్క సూర్యకిరణం కూడా కనబడని పరిస్థితి. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఎక్కడనుండో హఠాత్తుగా వచ్చి కృష్ణునితో ‘‘స్వామీ! మీ తండ్రి వసుదేవుడు ద్వారకలో బందీ అయి ఉన్నాడు. నేను అక్కడ నుంచే వస్తున్నాను’’ అని చెప్పారు. కృష్ణుడు అలా చూస్తుండగానే సౌభక విమానంలో తండ్రి కట్టివేయబడి ఉండడం కనిపించింది. కృష్ణుని విల్లు అచేతనంగా క్రింద పడిపోయింది. కొంతసేపట్లో తేరుకొన్న కృష్ణుడు ఇదంతా సాల్వుని మాయాశక్తులు సృష్టించిన ‘భ్రమ’ అని గ్రహించాడు. ఆలస్యం చేయకుండా సుదర్శన చక్రం ప్రయోగించడంతో ఆకాశమార్గంలో యుద్ధం చేస్తున్న సాల్వుడు క్రిందపడి మరణించాడు. నిమ్మళంగా కామాక్యవనం చేరిన శ్రీకృష్ణుడు ధర్మజునితో ‘‘మీరు కౌరవులతో జూదమాడుతున్న సమయంలో నేను సాల్వునితో యుద్ధం చేస్తున్నాను. నేనే ఉండే ఏదో విధంగా జూదం ఆడకుండా ఆపగలిగేవాణ్ణి’’ అంటూ అరణ్యవాసం చేస్తున్న పాండు సూతులకు పరామర్శించి వెళ్లిపోయాడు.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం