మంచి మాట

విశిష్ట వ్యక్తిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలోని ప్రధాన పాత్రలను పక్కకు పెడితే విశిష్ట వ్యక్తిత్వంగల వ్యక్తులుగా ఇరువురు మనకు గోచరిస్తారు. ఒకరు విదురుడు, రెండవవాడు సంజయుడు.
విదురుడు ధృతరాష్ట్రునికి సోదరుడే. దృతరాష్ట్రుని తల్లి అంబిక. అంబాలిక పాండురాజు తల్లి. వీరిరువురూ విచిత్రవీర్యుని భార్యలు. విచిత్రవీర్యుడు సంతానం లేకుండా మరణించడంతో కుటుంబానికి పెద్దదిక్కు అయిన సత్యవతి కుమారుడైన వేదవ్యాసుని పిలిచి అంబిక, అంబాలికలకు సంతానం అనుగ్రహించి వంశం నిలుపమని కోరింది. పడక గదిలో వ్యాసుని ఆకారం చూసి భయపడి అంబ కళ్లు మూసుకొనడంతో గుడ్డి కొడుకు జన్మించాడు. ఈసారి కళ్లు మూసుకోవద్దని అంబాలికకు చెప్పింది. ఇష్టం లేకుండా వెళ్లినందున పాండురాజు అలా అయ్యాడు. మళ్లీ సత్యవతి చెప్పినపుడు ఇష్టం లేని రాణి తన దాసికి రాణి దుస్తులు ధరింపజేసి పంపడంతో ఆ ఫలితంగా జన్మించిన మహనీయుడే విదురుడు.
విదురుని జననం గురించి మరో వృత్తాంతం కూడా కొన్ని పురాణాలలో కనబడుతుంది. మాండవ్యుడు అనే మహాముని కారణాంతరాలవల్ల కొరత వేయబడతాడు. కాని యోగ ముద్రలో ఉన్నందున మరణించాడు. ఆయన యముని వద్దకు వెళ్లి ‘‘నాలాంటి మహామునికి ఈ కొరత శిక్షణ ఏమిటి’’ అని అడుగుతాడు. అప్పుడు యముడు ‘‘నీవు బాల్యంలో అజ్ఞానంతో చిన్న చిన్న పురుగులను, పక్షుల రెక్కలను విరిచి అలా చిత్రహింసలు పెట్టావు. అందుకే నీకు ఇలా జరిగింది’’ అంటాడు. అందుకు మాండవ్యుడు ‘‘చిన్నతనంలో తెలియక చేసిన పొరపాటుకు ఇంత శిక్ష విధించిన నీవు మానవుడుగా జన్మించి వాళ్ల కష్టసుఖాలు అనుభవించు’’ అని శాపమిచ్చాడు. ఆ శాప ఫలితంగానే యముడే విదురుడుగా జన్మించినాడని, అందువల్ల అంత గొప్ప జ్ఞాని అయ్యాడని చెబుతారు.
దుర్యోధనుడు ఒక పకడ్బందీ వ్యూహం పన్ని పాండవులు వారణావతం వెళ్ళేట్టు చేశాడు. అక్కడ పురోచనుడు ఒక లక్క ఇల్లు నిర్మింపజేసి దానిని వారికి విడిదిగా ఇచ్చాడు. దాన్ని కాల్చివేయాలని దాంతో తనకు పాండవులనుండి ప్రమాదం ఉండదని దుర్యోధనుని దురూహ. ఈ కుట్రను పసికట్టిన విదురుడు వారణావతానికి పయనమవుతున్న పాండవులతో ‘‘పెద్ద కార్చిచ్చు అడవిని అంతా దగ్ధం చేసినా కన్నంలో దాగున్న ఎలుకను, నేలలో బొరియలు చేసే పందికొక్కును ఏమీ చేయలేవు’’ అంటాడు. అన్యాపదేశంగా పాండవులకు ముందుగా చేసిన హెచ్చరిక ఇది. విదురుని పంపున ఒక భూగర్భ నిపుణుడు వారణావతం చేరి పాండవులున్న ఇంటినుండి బయటకు వెళ్ళే విధంగా ఒక పెద్ద సొరంగం నిర్మించాడు. లక్క గృహం దహించబడగానే పాండవులు మరణించారని అందరూ అనుకొని బాధపడ్డారు. భీష్మాచార్యులవారు విదురునితో ‘‘పాండవుల అవస్థకు అందరూ దుఃఖిస్తున్నారు. నువ్వేమిటి, నిమ్మకు నీరెత్తినట్లు నిమ్మళంగా ఉన్నావు’’ అని అడిగినపుడు విదురుడు పితామహునికి వాస్తవం తెలియజేశాడు.
విదురుడు ఆ సందర్భంలో ‘‘అగ్ని బంగారాన్ని శుద్ధిచేసినట్లు, కష్టాలను ఎదుర్కొని పాండవులు ప్రపంచంలోని చేదు నిజాలు తెలుసుకొనగలుగుతారు. సముద్రం ఒడిదుడుకులతో ఉన్నపుడే నావికులు అందులో నుండి తప్పించుకొనే మెళకువలు నేర్చుకోబడతారు. అంతఃపురాలు, రాజభవనాలలో నివసించినంతకాలం రాజులు, రాజకుమారులు కూపస్థమండూకాలై ఉండిపోతారు. వారు పంజరంలోని చిలకలే అవుతారు’’ అంటూ ఎన్నో నీతి వాక్యాలను ఉటంకిస్తాడు. ఈ మాటలకు మహాదానందం చెందిన భీష్ములవారు విదురుని అభినందించకుండా ఉండలేకపోయాడు.
చివరలో ధృతరాష్ట్రునితో పాటు విదురుడు కూడా వానప్రస్థానికి అడవులకు వెళ్లాడు. అక్కడే యోగదీక్షలో శరీరం చాలించగా ఆయన శరీరంలోని ఒక కాంతి బయటకు వచ్చి యమధర్మరాజులో కలిసిపోయింది. ఈ విధంగా కౌరవ సంతతివాడయినా ధర్మపక్షాన్ని అనుసరించి జీవితం చాలించిన మహాజ్ఞాని, నీతికోవిదుడు విదురుడు.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం