మంచి మాట

భగవదవతారములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి పవిత్ర హృదయముంటే భగవంతుడు మనవాడే. ఈ సృష్టిలోని జీవులనుద్ధరించుటకు భగవంతుడు పొందని రూపం లేదు. చేప రూపం ధరించి వేదాలను, మహాఋషులను కాపాడాడు. తాబేలు రూపం ధరించి సముద్ర మథనానికి తోడ్పడ్డాడు. సూకర అవతారమెత్తి హిరణ్యాక్షున్ని వధించి భూదేవిని రక్షించాడు. నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడాడు. వామనావతారముతో మహాబల సంపన్నుడైన బలి చక్రవర్తిని పాతాళానికి త్రొక్కాడు. పరుశురామునిగా, రామునిగా అవతరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని ఉద్ధరించాడు. బలరామకృష్ణులుగా అవతరించి ధర్మపరిరక్షణ చేసి మానవ లోకానికి మార్గదర్శకులైనారు. కలికి అవతారంతో కలియుగాంతములో ఆవిర్భవించి ధర్మస్థాపన గావిస్తారని ప్రతీతి. ఇవన్నియు మనం అవతారములుగా భావిస్తాము.
అవ్యక్త చైతన్యము వ్యక్తమగుటయే అవతారము. అవతారమనగా క్రిందికి దిగుటయని అర్థము. నిరాకారుడైన భగవానుడు దుష్టశిక్షణ, శిష్ట జన రక్షణార్థం సాకార రూపుడుగా భూలోకములో వ్యక్తమగుటయే అవతారముగా పరిగణింపబడినది. అయితే విశ్వవ్యాపకుడు సర్వాంతర్యామియైన ఆ భగవంతుడు లేని చోటు లేదు కదా! పరిపూర్ణుడై విశ్వవ్యాప్తియైన భగవానుడు పరిమితుడగుటకు ఆస్కారమే లేదు. భగవానుడు సర్వవ్యాప్తి చెందినపుడు సర్వమూ భగవత్ స్వరూపమే అగుతుంది. అవతారము అద్వైత భావనతో ఆవిర్భవించలేదు. భగవదవతార మూర్తులందు చైతన్యం ప్రత్యక్షంగా దర్శింపబడి మానవునిలోనున్న అజ్ఞానం సన్నగిల్లే అవకాశం కలుగుతుంది. అజ్ఞానం దూరమైన కొలది జ్ఞాన ప్రకాశం విస్తరిస్తూ వుంటుంది. ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులో అజ్ఞానము పూర్తిగా పటాపంచలుకాగానే జ్ఞానానుభూతి ఏర్పడి భగవద్దర్శనమునకు మార్గం సుగమవౌతుంది.
భగవానుడు అవతరించుటకు, మామూలు జీవులు ఆవిర్భవించుటకు ఎంతో భేదమున్నది. జీవులన్నీ సంచిత కర్మల వలయంలో చిక్కుకొని ప్రారబ్దము ఆవరించగా ఈ ప్రపంచంలో కాలుమోపుతాయి. అందువలననే స్వేచ్ఛారహితులై గదిలో బంధించబడినట్లు పరిమిత జీవితాన్ని మాత్రమే గడుపుతారు. కాని సర్వవ్యాపకుడైన భగవంతుని అవతారం అలాంటిది కాదు. భగవంతునికి కర్మలు లేవు. కాని దివ్య సంకల్పముతో తన మాయ ఆధారంగా మాయను పాలిస్తూ జీవులనుద్ధరించుటకు ఈ జగత్తులో అవతరిస్తాడు. భగవంతునికి పుణ్య పాపాల కర్మలు లేవు. మరి కర్మాతీతుడైన భగవానుడు ఏ కర్మను అనుభవించుటకు అవతారమెత్తుతాడని మనకు సందేహం కలుగకమానదు. ఈ సృష్టిలోని జీవులలో పుణ్యాత్ముల పుణ్యకర్మలు పాపాత్ముల పాప కర్మలు భగవానుడు ఆవిర్భవించుటకు అవకాశము కలుగుతున్నది. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మసంస్థాపన చేయుటయే భగవదవతారమునకు ముఖ్యకారణం. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఉత్కృష్టావతారంతో ధర్మస్థాపనగావించాడు.
భగవంతుని స్థానమైన వైకుంఠములో దురహంకారము, దౌర్జన్యం, అవిధేయత, పక్షపాతములకు అణువంత స్థానముండదు. జ్ఞాన స్వరూపుడై ప్రకాశమును వెదజల్లే వైకుంఠపురంలో అజ్ఞాన ప్రదర్శనకు తావు లేదు. అక్కడందరూ సత్ప్రవర్తనతో, సున్నిత హృదయంతో మెలగాలి. ఆలయాలలో, ఆశ్రమాలలో, పవిత్ర స్థలాలలో, పుణ్యప్రదేశాలలో నివసించే అవకాశం అందరికీ లభించదు. పుణ్యపురుషులకే లభిస్తుంది. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసికొని సార్థకము చేసికొనుట ఉత్తమలక్షణం. పరస్పర జాతివైరం కలిగిన గరుడుడు, ఆదిశేషుడు వైషమ్యాలు విడిచి అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఆ విధంగానే
సర్వవ్యాపి అయనభగవంతుడు ఎల్లెడలా ఉన్నాడు కనుక మనం కూడా సర్వదా సత్ప్రవర్తనతో, సున్నిత హృదయంతో మెలుగుదాం. సర్వత్రా ఉన్నది దైవమే కనుక మనకు లభించిన ఈ జన్మను పుణ్యవిశేషం వల్ల వచ్చింది కనుక మనం పుణ్యాత్ములుగానే మెసలుదాం.

-పెండెం శ్రీధర్