మంచి మాట

జీవామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఆనందంగా జీవించడానికి కావాల్సిన నైతిక సూత్రాలను, నియమాలను మన మహర్షులు ఏనాడో రూపొందించారు. వాటిని ఆచరించి ధార్మికంగా, తాత్త్వికంగా ముందుకు సాగాలి. ఇందుకు ఉన్నత సంస్కారం, విద్య ఎంతో అవసరం. విద్య కల్పవృక్షం వంటిది. విద్యలో శాస్త్రం ఉంది. ఆధ్యాత్మిక తత్వం ఉంది. విద్య దిక్కులన్నింటా కీర్తి వ్యాపింపజేస్తుంది. ఒక మనిషిని ఇంకో మనిషి విద్యాగంధం చేతనే ఆకర్షించగలరు.
మనిషి మనసు విద్యయందలి వివేకాన్ని బహిర్గతం చేస్తే, హృదయం ఆచరణలోని ఆనందాన్ని అందిస్తుంది. ‘సర్వేషాం విద్యానాం హృదయమే కాయనం’, సకల విద్యలకు హృదయమే నిలయం. ఈ మనోహృదయ సమ్మేళనమే మానవ జీవిత పరమావధి అని బృహదారణ్యకోపనిషత్తులో వివరించబడింది.
అనిత్యంలో నిత్యంగా, లౌకికంలో అలౌకికంగా, అసత్యంలో సత్యంగా, అశాంతిలో శాంతిగా జీవించాలంటే మనిషి మొదట అపరావిద్యనార్జించి లౌకిక సుఖాలను పొందాలి. లౌకిక సుఖాలతోపాటు నీతి నియమాలను ఆచరిస్తూ, జీవితానికి ప్రశాంతతను పరమార్థాన్నీ ప్రసాదించే పరావిద్యను కూడా అభ్యసించాలి. ఆధ్యాత్మిక విద్య అయినా పరావిద్య వలన జన్మరాహిత్యం కలుగుతుంది.
ఈ దేహం అనిత్యం, అశాశ్వతం. అయితే ఈ నశ్వర శరీరంలో అంతర్గమై చేతన అణురూపంలో ఉండే అద్భుతశక్తి మాత్రం సర్వవ్యాపకమైంది. అది మహత్తులలో మహత్తరమై నిత్యమై సత్యమై ప్రకాశిస్తోంది. ఈ విషయాన్ని ‘అణోరణియాన్ మహతో మహియాన్’ అని ఉపనిషత్తులు చక్కగా బోధించాయి. పైన చెప్పిన అద్భుత శక్తికే విలువగాని ఈ దేహానికి విలువ లేదు. రథంలో దేవుడు ఉంటేనే రథానికి విలువ. అదేవిధంగా దేహం అనే రథంలో ఆ దివ్యశక్తి నివశిస్తేనే దేహానికి విలువ. శిక్షణ లేని అశ్వాలవలన రథానికి ప్రమాదం సంభవించినట్లే ఈ దేహమనే రథానికి కట్టిన నిగ్రహం లేని ఇంద్రియాలనే అశ్వాలవలన మనిషికి ప్రమాదం కలుగుతోంది.
ఈ జగత్తుకు మూలం జ్ఞానం. ఇది విద్యవల్లనే మనిషికి అలవడుతుంది. తరువాత తల్లిదండ్రులవల్ల, గురువులవల్ల, సమాజ పరిశీలన అనుభవంవల్ల లౌకిక జ్ఞానం పొందగలుగుతున్నాడు. కనుక లోకంలో ప్రతి వ్యక్తికీ ఒక బాధ్యత వున్నదని గుర్తించాలి. సంఘానికి వ్యక్తి ఓ స్తంభం వంటివాడు. వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ సంఘం ఒక్క గౌరవాన్ని కాపాడాలి. సమాజాభివృద్ధికి వ్యక్తియే కారణం. స్వార్థం నశించి ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అనే విశాల దృష్టి మనిషి హదృయంలో వికసించనంతవరకూ ప్రపంచంలో అశాంతి తప్పదు.
మనిషి దుష్ట సంకల్పంతో, దుష్ట సాంగత్యంలో వుంటే ఆ దుష్టత్వమే లోకమంతా వ్యాపించి దుర్మార్గులుగా తయారవుతారు. తాను బాగుపడి ప్రపంచానికి మంచిని అందించడానికి కృషిచేయాలనే వాస్తవం ఎవరూ మరచిపోకూడదు. సృష్టికర్త పశుపక్ష్యాదులకంటే మనిషికి వాక్కు, బుద్ధి అదనంగా ప్రసాదించాడు. మనిషి తనలోపలి భావాలను వాక్కు ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. బుద్ధిని ఉపయోగించి పుణ్యా పుణ్య ధర్మా ధర్మ విచక్షణ చేయగలుగుతున్నాడు.
‘్ధర్మోమూలం మనుష్యాణాం’ అంటూ మానవులకు ధర్మం మూలమని శాస్త్రం ఘోషిస్తోంది. ధర్మాచరణ లేకుండా మోక్షం లేదు. అందుకే పురుషార్థ చతుష్టయంలో ధర్మానికి ప్రధాన స్థానం కల్పించారు. ధర్మం వినా ఏ వ్యక్తి జీవితంలోనూ అభివృద్ధి కలుగదు. ఆనందం ఉండదు. కాబట్టి మనిషి జీవితం ఆనందంగా గడిచిపోవాలనే ధ్యేయంతో పెద్దలు మనకు అందించిన ధర్మసూత్రాలను విధిగా ఆచరించాలి. గృహస్థులు ధన సంపాదనతోపాటు ధర్మాగ్రహణ, ధర్మాచరణ, ధర్మరక్షణలు తప్పనిసరిగా నిర్వర్తించాలి. తమ సంతానానికి విద్యాబుద్ధులతోపాటు ధర్మాన్నీ తప్పక అందించాలి.
సద్యోచన, సత్సాంగత్యం, సత్‌ప్రవర్తనలతో తాను ఆనందించాలి. ఆ ఆనందాన్ని లోకానికి పంచాలి. ‘ఆనందా ద్యేవ ఖల్విమాని భూతాని జయంతే! ఆనందేన జాతన జీవంత! ఆనందం ప్రయత్నబి సంవిశంతి!’... సర్వభూతాలు ఆనంద జనితాలై ఆనందం చేతనే జీవించి ఆనందంతోనే లయిస్తున్నాయని, ఆనందమే జీవామృతమని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి.

-చోడిశెట్టి శ్రీనివాసరావు