మంచి మాట

భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమేశ్వరుని పాద పద్మములపై మనస్సును లగ్నము చేయుటయే భక్తి అని ఆదిశంకరులవారు సెలవిచ్చారు. భక్తి అను పదము ‘్భజ్’ అను ధాతువునుండి ఉత్పన్నమైనది. దీనికి ‘క్తిన్’ అను ప్రత్యయము చేరగా భక్తి అను పదము ఏర్పడినది. భక్తి అనగా భజించడము లేక సేవించడము అని అర్థము. శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో భక్తులే నాకు అత్యంత ప్రియమైనవారని సెలవిచ్చియున్నాడు. ‘్భక్తాస్తేతీవమే ప్రియాః’ (్భగ.12వ అధ్యా. 20శ్లో.) నారద భక్తి సూత్రములలో పరమేశ్వరుని యందలి పరమ ప్రేమయే భక్తి అని, అది అమృత స్వరూపమైనదని తెలుపబడినది. (సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా! అమృత స్వరూపాచ) శాండిల్య భక్తి సూత్రములలో భగవంతుని ఎడగల పరమ ప్రీతియే భక్తియని వివరించబడినది.
అతి ప్రాచీన కాలమునుండి ఈనాటివరకు భారతావనిలో ఎందరో మహానుభావులు భక్తిరస ప్రధానములైన కృతులను లోకానికందించారు. నాటినుండి నేటివరకు భక్తిరస స్రవంతి అకుంఠితముగా భారతీయ ప్రజలలో ప్రవహిస్తూనే యున్నది. తెలుగు సాహిత్యములో అన్నమయ్య, పోతన, భద్రాది రామదాసు, త్యాగయ్య వంటి భక్తశిఖామణుల నోటినుండి జాలువారిన సాహిత్యం నేటికిని ప్రజల నాలుకలపై జీవిస్తూనే యున్నది. నవరసాలలో భక్తిరసముకాదాని లక్షణకారులు చెప్పినప్పటికిని ఎందరో కవిశ్రేష్ఠులు, భక్తశిఖామణులు భక్తికి రసస్థాయిని కలిగించారు. ఆధునిక కాలంలో కూడా భక్తి సాహిత్యమును వెలువరించినవారు అనేకులున్నారు.
అవ్యక్త చైతన్యములో వ్యక్తి ఔన్నత్యము ఏ విధంగా ఇమిడియున్నదో తెలియజేయునదియే భక్తి. వాస్తవమునకు భక్తి అంటే సత్యము దర్శించి, సత్యావగాహనతో జీవించి సత్యమై భాసించుటయే నిజమైన భక్తి. అవగాహనాపూరిత ఉజ్వల పారవశ్యస్థితియే భక్తి. భక్తి తెలిసి భగవంతునితో కలిసి, కరిగి లీనమై ప్రకాశించు స్థితిని ప్రసాదించు ఉత్కృష్టమైన మహోన్నత సాధనయే భక్తియోగము.
ఈ విశాల విశ్వంలో మనము అనేకమంది వ్యక్తులను, అనేక వస్తువులకు సంబంధించి యున్నాము. అయితే ఈ సంబంధాలు అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయత మనోకల్పితాలు మాయా నిర్మితాలు. అజ్ఞానము, అంధకారముచే సత్యమును మరుగుపరచే ఇనుప గోడలు. ఒకవేళ మనోకల్పిత భావాలు, బాంధవ్యాలు అభిలషిస్తే దరిజేర్చుకోవచ్చు. అడ్డువస్తే తొలగించుకొనవచ్చు. కాని బాంధవ్యాన్ని మాత్రము తొలగించుకొనేందుకు వీలులేదు. అదియే భగవంతునితో మనకున్న అపూర్వ సంబంధం, అనుబంధం. లోకంలో ఇదొక్కటే శాశ్వత అనుబంధం, సంబంధం. మనము విరక్తితో భగవంతుని విస్మరించవచ్చు. వికల్పముతో అతనితో మనకున్న సంబంధాన్ని విసర్జించవచ్చు. అలా అయినంత మాత్రాన మనము అతనికి దూరంగా మాత్రము వెళ్ళలేము. నదిలోని, సముద్రములోని కెరటం వాటితో తనకెలాంటి సంబంధము లేదని భావించవచ్చు. కాని నదిని, సముద్రాన్ని విడిచి కెరటం దూరంగా వెళ్ళుట మాత్రం అసాధ్యము. ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన అభేదమైయున్న అపూర్వ సందేశము. అలాగే మనం భగవానునితో కలిసియున్నామని అర్థం చేసికోవాలి. ఇది అర్థమైతే భక్తి అర్థమైనట్లే! ఈ అవగాహన మన అంతర్యములో స్ఫురించి భాసిల్లాలి. భక్తి అంటే అర్థం కాని మనస్సునకు భక్తి ఏ విధంగా కలుగుతుంది? అంటే భక్తి కలుగదు. భక్తి పోల్చుకోవలసిన విషయము కాదు. మన మనస్సుతో తేల్చుకోవలసిన విషయం.
భక్తి భగవంతుని కొరకే. భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకొనుటకు రెండు సాధనాలున్నాయి. అవి సగుణ, నిర్గుణ సాధనాలు. ఈ రెండూ శ్రేష్ఠమైనవే. వాటిమధ్య ఎలాంటి తేడాలు లేవు. సాధకుని మనస్సు సాధనను ఎన్నుకుంటుంది. ఇందుకు కావలసినది అనన్య చిత్తము. నిత్య యుక్తమైన ఉపానస, ఉత్తమమైన శ్రద్ధ. ఈ మూడింటితో సగుణమైన, నిర్గుణమైన భగవంతుని పొందవచ్చును. అదియే నిజమైన భక్తి, శక్తి.

-పెండెం శ్రీధర్