మంచి మాట

మరణానుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరణం తనకు రాకుండా ఉంటే బాగుండునని చాలామంది మరణ స్పృహ కలిగినప్పుడల్లా భయపడుతుంటాడు. మరణం తథ్యమనీ,, అనివార్యమని తెలిసి కూడా అతి విచిత్రంగా అది తెలియనట్టే మానవుడు ప్రయత్నిస్తుంటాడు. అయితే తర్క దృష్టి, సత్య శోధన స్వభావం కలవారు మాత్రం తమ జన్మ రహస్యం, జీవన రహస్యం మరియు మృత్యు రహస్యం గురించి ఆత్మవిమర్శ చేసుకుంటాడు. భగవద్గీతాది గ్రంథాల్లో ఎన్నో ఉపనిషత్తులలో ఈ శరీరం యొక్క క్షణికత్వం గురించి, దీనిలోని మరియు దీనికి హేతుభూతమన ఆత్మయొక్క శాశ్వతత్వం గురించి చదివి అర్ధం చేసుకున్నవారు కూడా తమ నిజ జీవితంలో మటుకు ఆ రహస్యం తెలిసిన వారివలె ప్రయత్నించరు. ధర్మరాజాదులు కురుక్షేత్ర సంగ్రామంలో అఖండ విజయం సాధించి కూడా తమ సింహాసనానికి వారసుడు లభించగానే సర్వసంగ పరిత్యాగులై కట్టుబట్టలతో అరణ్యాలకు వెళ్లి స్వచ్ఛందంగాను, నిర్లిప్తంగాను, నిరాబాధంగాను మృత్యువును ఆహ్వానించారు.
ప్రతి వ్యక్తికీ ఇతరుల మరణాన్ని చూసినపుడు తాత్కాలికమైన వైరాగ్యం జనిస్తుంది. అయితే అది ఎక్కువ కాలం నిలవదు. మరణానికి కొద్ది క్షణాల ముందు మరణించనున్న వ్యక్తి అనుభవించే యాతన అతనిని లేక ఆమెను చూస్తున్న వ్యక్తి కొంతవరకు మరణం గురించి అవగాహన చేసుకోగలడేమోగానీ తాను మటుకు అలా బాధపడకుండా నేను నా జీవితాన్ని పరిష్కరించుకోగలనా?లేక సంస్కరించుకోగలనా అని అంతగా ఆలోచించడు. మరణించిన వ్యక్తి తాను మృత్యు సమయంలో ఎన్ని రకాలుగా ఏయే అనుభూతులను పొందాడో చెప్పడానికి, అతని నుండి మనం మృత్యువుయొక్క నిజ స్వరూపాన్ని అనుభవ పూర్వకంగా తెలిసికోవడానికి అవకాశం లేదు.
భగవాన్ రమణమహర్షి తాను మహర్షి కాకపూర్వమే ఒకసారి తను జ్వరగ్రస్తుడైనపుడు తాను మరణించినట్టు అప్పటి తన శరీర స్థితిని తాను తన శరీరం కన్నా భిన్నంగా ఉండి క్షణక్షణం తన శరీరంలో మరణాత్పూర్వము, మరణానంతరము తన శరీరంలో జరిగే మార్పులన్నీ గమనించి ఇతరులకు వివరించగలిగారు. శ్రీ అరవిందులు రచించిన ‘సావిత్రి’ అంతా ఈ మరణం యొక్క విశే్లషణయే. శ్రీ పరమహంస యోగానంద, స్వామి వివేకానంద మొదలైన బహుకొద్దిమంది ఈనాడు మన కళ్లముందు వున్న మహనీయులు తమ మరణానికి కొద్ది గంటలముందు తమ శిష్యులకు వీడ్కోలు చెప్పి మృత్యువునొక అతిథిగా ఆహ్వానించి ప్రాణాలు వదిలారు. దీనికి భిన్నంగా కొందరు ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఏమంటారంటే మరణించే ముందు వేల కొలదీ తేళ్లు ఒకేసారి కుడుతుంటే ఎంత తీవ్ర వేదన ఉంటుందో, అంత బాధను మరణోన్ముఖుడైన వ్యక్తి అనుభవిస్తాడని ఆ వ్యక్తియొక్క స్థూల శరీరం భూమిపై పడి ఖననమో, దహనమో జరిగి నశించినప్పటికీ సూక్ష్మశరీరం మాత్రం అతని పాప కర్మలకు అనుగుణమైన నరకాన్ని, నరక బాధను అనుభవిస్తాడని చెబుతారు. శ్రీమద్భాగవతంలోనైతే పంచమ స్కందము 26వ అధ్యాయంలో 21 పరమ భయంకరమైన నరకాలు ఆ లోకాలు ఎందుకు కలుగుతాయో, ఆ నరకంలో జీవుడు ఎంత ఘోరంగా శిక్షించబడతాడో వర్ణించబడింది. ఇక పుణ్య కర్మలు చేసేవారు అంటే యోగమయ జీవితం గడిపినవారు అనిర్వచనీయమైన దుఃఖ లేశమైనా లేని బ్రహ్మానందాన్ని అనుభవిస్తారట.
ఏది ఏమైనా వీటిని మనం నమ్మినా నమ్మకపోయినా మరణమనేది తథ్యమని, మనం ఎలా జీవన యాత్ర గడుపుతున్నామో తదనుగుణమైన అంత్యకాలాన్ని మనం చూస్తామనే విశ్వసించాలి. ఒకవేళ తద్భిన్నంగా మనం యోగమయ జీవితం గడిపినా చివరి రోజుల్లో కాన్సర్ మొదలైన వ్యాధులతో చాలా కాలం బాధ అనుభవించి మరణించనున్నామంటే దానికి కారణం మన పూర్వ జన్మలో చేసిన పాపాలయొక్క ప్రారబ్ధం ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్నామని భావించి ఇప్పటికైనా శరీరం మీద మమత, తాదాత్మ్యం తగ్గించుకుంటే సుఖమయమైన అంతిమ యాత్ర చేయగలం.

- మాదిరాజు రామసుందర్రావు