మంచి మాట

గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రంలో ఎగసిపడే అలలతో కేరింతలు కొడుతాం కానీ సమస్యలు అనే అలలు జీవితంలోకి వస్తే అధైర్యంతో వెనకడుగు వేస్తాం. ఒక్కొక్క పరిస్థితిలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన చెయ్యడానికి కూడా ధైర్యం చాలదు. అటువంటప్పుడు మనం ఎంతగా క్రుంగిపోతాం అంటే చెప్పనక్కరలేదు. మానసికంగా కృంగిపోవడంతోపాటు శారీరకంగా బలహీనపడతాం.
సమస్యలను ఎదుర్కొనేటప్పుడు మానసికమైన ధైర్యం లేక మనలో శక్తి తగ్గిపోతుంది. క్రమేణా మన ఆరోగ్యం క్షీణించిపోతుంది కాబట్టి ఎల్లప్పుడు మనలో ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదు. సమస్యలకు బెదిరిపోయి వెనకడుగు వేసేలా ఉండకూడదు. మన విశ్వాసం ఎపుడు నిశ్చలంగా చెక్కుచెదరకుండా వౌనంగా సమస్యకు సమాధానం చెప్పే విధంగా స్థిరంగా ఉండాలి.
ప్లాట్‌ఫాం మీద నిస్సహాయ స్థితిలో శరీరం నీరసించిపోయి చెయ్యి కూడా కదిలించలేని స్థితిలో ఉన్నపుడు కూడా తనను అన్యాయంగా ఒకరు పనిగట్టుకొని మరీ దూషిస్తూ తను నమ్మిన దైవాన్ని వెక్కిరిస్తూ అపహాస్యం చేస్తున్నా వౌనంగా వింటూ కూర్చున్న అతనికి సాయం ఎవరు చేస్తారు? అసలు అతనికి సాయం నేను ఎందుకు చెయ్యాలి? అని వంకరగా ఆలోచించి హేళనగా ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోలేదు. చివరికి అతను సాయం కోసం ఎవర్ని అడగలేదు, బ్రతమిలాడలేదు. తన సంకల్ప బలం అన్నింటికన్నా దృఢమైనదిగా విశ్వసించిన అతనికి ఆ దైవమే ఎదురుగా వచ్చి తన ఆకలి తీర్చింది అని వివేకానంద జీవిత చరిత్ర చెప్తుంది. భావి భారత దేశ ప్రజలకు ఇనుప శరీరం ఉక్కు కండరాలు అవసరం అని చెప్పిన వివేకానందుని మాటలు ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవాలి.
గెలుపు ఎదురైనపుడు సంతోషించే మనిషి, సమస్యలు ఎదురైనపుడు డీలాపడిపోతాడు. గెలుపు ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ గెలుపుతో వచ్చే సంతోషంకన్నా ఓటమి ఎదురైనపుడు ధైర్యంగా నిలబడే విధానం ముఖ్యం. గెలుపుతో వచ్చే సంతోషంతో మనం నేర్చుకోవలసినవి ఎన్నో నేర్చుకోము. ఒక ఆటలో గెలిచినవాడు సంబరాలు చేసుకుంటే, ఓడిపోయినవాడు ఓటమిలో తన తప్పుల గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. ఇది ఆటగాడికి ఉండవలసిన లక్షణం. తన తప్పులను సరిదిద్దుకొని తన ఆటను మెరుగుపరచుకుంటే అతని కళ్ళలో ఉండే వెలుగు మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఆ వెలుగు అతని నమ్మకం, అతని సంకల్పబలం మరియు దృఢమైన విశ్వాసం. గెలుపుపట్ల సానుకూల భావన, అతను గెలుపుకోసం కదా నా అన్నవాళ్ళు నాపై నమ్మకం పెట్టుకొన్న వాళ్ళకోసం గెలవాలి. నా మీద నమ్మకం పెట్టుకున్న అందరి కళ్ళల్లో ఆనందం చూడాలి. నాకు తోడుగా అండగా కష్టాలలో ఓదార్పునిచ్చి నాలో ధైర్యాన్ని నింపి నాలో విశ్వాసాల్ని మేలుకొల్పిన వాళ్ళకోసం గెలవాలి అన్న అతని సంకల్పబలం అమితమైన ఆత్మవిశ్వాసం ఇస్తుంది. గెలుపు అన్న మూడు అక్షరాల పదం మనిషికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
సృష్టి యొక్క రహస్యం తెలుసుకున్నపుడు. సృష్టిలో అంతర్లీనం అయిన శక్తి ఉనికి ఎక్కడ ఆవిర్భవించిందో మనసుతో వెతికి కనుగొన్నపుడు. ప్రకృతి యొక్క ఆధారాన్ని తెలుసుకున్నపుడు బ్రహ్మం అంటే ఒక్కటే అని తెలుస్తుంది.
జీవి యొక్క మనుగడ కర్మసిద్ధాంతంపై ఆధారపడి జీవిని సృష్టించడం జరిగింది. కర్మానుసారమే మనిషిగాని జీవులుగాని జలచరులుగాని సమస్త ప్రాణులుగాని మరియు ఏ జీవి అయినా సరే కర్మానుసారంగానే సమస్యలు, బాధలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనుభవించాల్సి వుంటుంది. వాటి ఫలితం అనుసారంగానే మన సమస్యలుంటాయి. వాటిని కన్నీటితో స్వాగతం పలకడంకన్నా ధైర్యంతో ఎదురుపడి నిలబడితే మనలోని ఆత్మస్థైర్యం స్థిరంగా ఉండి మనల్ని ముందుకు తీసుకుపోయేలా చేస్తుంది.

-బ్రహ్మం.ఎం.ఎస్.వి.