మంచి మాట

ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి జీవితమంతా సంతోషంగా, ఆనందం ఉండాలని కోరుకుంటాడు. ఇది మనిషికి ఉన్న సహజ గుణం. సంతోషానికి ఆనందానికి చాలా వ్యత్యాసం వుంది. సంతోషం తాత్కాలికమైంది. ఆనందం శాశ్వతమైంది. సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఆనందం జీవితాంతం వుంటుంది. సంతోషానికి ఆనందానికి మధ్యలో అప్పుడప్పుడు కష్టం వచ్చి చేరుతుంది. కష్టంతో మనిషి కృంగిపోయి సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోతాడు. కష్టం తాత్కాలికం కాదు. శాశ్వతం కాదు. కష్టసుఖాలు కావడి కుండలవంటివి. కష్టం వచ్చినపుడు కుంగిపోక, సంతోషం కల్గినపుడు పొంగిపోక స్థితప్రజ్ఞునిగా ఉన్నప్పుడు ఆనందం మన దరి చేరి స్వర్గ సుఖాలను అందిస్తుంది. చింతలకు, బాధలకు నిరాశపడక, తాత్కాలిక సంతోషంతో పొంగిపోక మనిషి జీవించినపుడే అతనిలోని ఆనందం పొంగివస్తుంది.
ఆనందం ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? అని మనిషి అనే్వషిస్తే దానికి సమాధానం మనిషి ఎదలోనే దొరుకుతుంది. మనం చేసే పనిలో నిస్వార్థం ఉండాలి. ఆ పని నలుగురికి ఉపయోగపడాలి. సమాజం మనం చేసే పనివలన లాభంపొంది వారు ఉద్ధరించబడాలి. వారి ముఖాల్లో సంతోషం గోచరించాలి. అప్పుడే మనిషికి ఆనందం కలుగుతుంది.
మనిషి చేసే పనిలో నిబద్ధత, నీతి, నిజాయితీ లోపిస్తే చెడు ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి పరిస్థితిలో సుఖాలు చెదిరిపోయి కష్టాదరి చేరుతాయి. వెంటనే మనిషి నిరాశకు లోనై బంగారు జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటాడు. వచ్చే విజయాలకు, సుఖాలకు దూరమైపోతాడు. సుఖంలో జీవితం గడిపేవారికి సమయం తెలియకుండానే గడిచిపోతుంది. కష్టాలు అనుభవించేవారికి క్షణం ఒక యుగంలా తోస్తుంది. కష్టాలు వచ్చినపుడు గుండె నిబ్బరం చేసుకుని మన పురాణాలల్లో ఇతిహాసంలో ఆదర్శంగా నిలిచిన మహానుభావుల బాటలో పయనిస్తే తుదకు విజయం వరిస్తుంది. శాశ్వత ఆనందం కలుగుతుంది. కష్టాల కడలిలో పయనిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకున్న పాండురంగని భక్తురాలు జనాబాయి, సక్కుబాయి, భక్తపుండలికుడు, శ్రీరాముని భక్తుడు గోపన్న (్భక్తరామదాసు), విశ్వామిత్రుని పరీక్షలో నెగ్గిన హరిశ్చంద్రుడు, శివుని భక్తుడు భక్తకన్నప్ప, తండ్రికి ఇచ్చిన మాటకు అడవుల పాలైన శ్రీరామచంద్రుడు- ఇలా ఎందరెందరో మహానుభావులు మనకు గోచరిస్తారు.
నేటి కష్టమే రేపటి ఆనందానికి మూలం. నేటి పరాజయమే రేపటి విజయానికి శ్రీకారం అని మనం భావించాలి. మనిషికి కలిగే అవమానాలను, ఈసడింపులను, పరాజయాలను, బాధలను, చింతలను మనిషి ఒక్కొక్క మెట్టుగా ఎక్కగలిగితే ఆనందపు గమ్యానికి చేరువ అవతాడు. శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. శాశ్వత కీర్తిని పొందాడు. హరిశ్చంద్రుడు సత్యాన్ని వదలలేదు. శాశ్వత కీర్తిని పొందాడు. పాండవులు ధర్మం తప్పలేదు. శాశ్వత కీర్తిని పొందారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. పుట్టినప్పటినుంచి చచ్చేవరకూ మనిషిని పలకరించడానికి బాధలు, చింతలు, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, సుఖాలు, సంతోషాలు వస్తాయి, పోతాయి. కాని ఆనందం అలా కాదు. అది శాశ్వతం. ఈ ఆనందాన్ని మనం పొందాలంటే మన మాట మంచిదై ఉండాలి. మన చేత మంచిదై ఉండాలి. మన పెదవులపై చిరునవ్వు వుండాలి. ఇవి ఇతరులకు సంతోషాన్ని కల్గించాలి. వారి సంతోషంతో మనకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఫలితాన్ని ఆశించకుండా ఇవి చెయ్యగలగాలి. సంకుచిత భావాలు వదలి విశాల దృక్పథం అలవర్చుకోవాలి. మనస్సు ఆధీనంలో ఉంచుకోవాలి. మనలోని అరిషద్వార్గాలను దూరం చేయాలి. చేసే పనిమీద పూర్తి నమ్మకం ఉండాలి. ప్రతి విషయాన్ని ఆనందంగా స్వీకరించాలి. తప్పక ఆనందం కలుగుతుంది. జీవితం ధన్యమైపోతుంది. ఇంతకన్నా ఎక్కువ మనిషికి ఏం కావాలి.
............................................................................................................
భగవంతునిపై భారము వేసి నిర్భయంగా నడుచువాని దరికి దుఃఖము దరిచేరదు.

-జాధవ్ పుండలిక్‌రావు