మంచి మాట

సులభమైనది కలియుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి ఋషులలో దైవకృపకు ఏ యుగం సులభైనదనే చర్చ జరిగింది. కొందరు కృతయుగమని, ఇంకొందరు త్రేతాయుగమని, మరికొందరు ద్వాపర యుగమని, మిగిలినవారు కలియుగమని వాదించుకోసాగారు. ఇలా వాదోపవాదాలే తప్ప ఎంతకీ అసలు విషయం తేలలేదు. దాంతో వేదవ్యాస మహర్షిని అడిగి తమ సందేహ నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకొని ఋషులందరూ ఆయన ఆశ్రమానికి బయలుదేరారు.
వారు అక్కడికివెళ్లిన సమయానికి వ్యాస మహర్షి సరస్వతీ నదిలో స్నానమాచరిస్తున్నారు. చేసేది లేక ఋషులు ఆశ్రమంలో కూర్చొని మహర్షి రాకకోసం, నిరీక్షించసాగారు. కాస్సేపటి తర్వాత వ్యాస మహర్షి స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నీ ముగించుకొని వచ్చారు. ఋషులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. మహర్షి ప్రతినమస్కారం చేసి వారి యోగక్షేమాలు విచారించారు. పిమ్మట ఒక్కసారిగా అందరూ తన ఆశ్రమానికి ఎందుకొచ్చారో చెప్పమన్నారు. ఋషులలో ఒకరు తమ సందేహాన్ని ఆయనకు తెలియజేశారు.
అప్పుడు వ్యాస మహర్షి చిన్నగా నవ్వి, ఒకింతసేపు ఆలోచించి ‘‘ఋషివర్యులారా! దైవకృపకు శాస్త్రాలలో జ్ఞానమార్గం, భక్తిమార్గం, కర్మమార్గం, ధ్యానమార్గం మొదలైనవెన్నో చెప్పడం జరిగింది. అయితే యుగాల పరంగా చూస్తే, కృతయుగంలో అందరూ నిష్పాపులు. స్వాభావికంగా వారి ప్రవృత్తి పరమార్థమందే ఉండేది. ఎలాంటి బాహ్య సామగ్రి అవసరం లేకుండా అకుంఠిత దీక్షతో ధ్యానం చేసి దైవకృపను పొందేవారు. అందువల్ల కృతయుగం ధ్యాన ప్రధానమైనది.
‘‘తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ఈ యుగంలో ప్రజల దృష్టి కొంచెం బాహ్యమైంది. స్వాభావికంగా ధ్యానం నిలవకపోవడంతో బాహ్యోపకరణాల అవసరం కలిగింది. అది మొదలు బాహ్య సామగ్రిని సమకూర్చుకొని గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేసి దైవాన్ని ప్రసన్నం చేసుకునేవారు. అందుచేత త్రేతాయుగం యజ్ఞప్రధానమైనదిగా చెప్పబడింది.
‘‘ఇక మూడవదైన ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులతో పాటు ఉపాసన, భగవత్ పరిచర్యలు ప్రాధాన్యత వహించాయి. భగవదవతారాలు అర్చామూర్తి పూజలు విస్తారం చేసి పరమాత్మ ప్రేమకు పాత్రులయ్యేవారు. దీంతో ద్వాపర యుగం పరిచర్యాయుగంగా పేరు పడింది.
‘‘అటు పిమ్మట కలియుగం ప్రవేశించింది. ఇది కలహయుగం! అన్నదమ్ములమధ్య, తండ్రీ కొడుకుల మధ్య, భార్యాభర్తలమధ్య, గురుశిష్యుల మధ్య, దేశాలమధ్య.. ఇలా ఎక్కడ చూసినా కలహమే! జనానికి స్వాభావిక ప్రేమ లేదు. ధార్మిక కార్యక్రమాలపట్ల ప్రత్యేక శ్రద్ధ లేదు.
‘‘ఈ యుగంలో మనుష్యులెవరూ తపస్సు చేయలేదు. దేహాన్ని కష్టపెట్టలేదు. అయినా గత యుగాల మాదిరి కఠిన నియమాలు లేకుండా ఈ యుగంలో అతి తేలికగా దైవకృపను పొందే మార్గం ఉంది. అదే భగవన్నామ కీర్తన. ఇది కలహయుగం, పాపయుగం అయినప్పటికీ నిత్యం నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో జపకీర్తనలు చేసేవారు తప్పక సంసార సాగరాన్ని దాటిపోగలుగుతారు. నిస్సందేహంగా ఆ దేవ దేవుని దివ్య సన్నిధికి చేరగలుగుతారు. కనుక అన్ని యుగాలకంటే దైవకృపకు సులభమైనది కలియుగం అని గ్రహించండి’’ అన్నారు వేదవ్యాస మహర్షి.
సవివరంగా తమ సందేహాన్ని నివృత్తి చేసిన మహర్షిని ఋషులంతా అభినందించారు.
............................................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు