మంచి మాట

అతిథిసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన భారతీయ ధర్మం ‘మాతృదేవోభవ, పితృదేవోభవ. ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ’’ అని బోధిస్తుంది. ముందుగా తల్లిదండ్రులు తర్వాత గురువు. నాల్గవ పూజ్యనీయ స్థానం అతిథిదే. ‘అభ్యాగతిః స్వయం విష్ణు’ అని ఆర్యోక్తి.
మనిషి జీవితంలోని నాలుగు దశలైన బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమాలు- ఈ నాల్గింటిలోనూ అత్యంత ముఖ్యమైనదీ గృహస్థాశ్రమమే. మిగిలిన బ్రహ్మచారులు, సన్యాసులు, యోగులు ఎవరైనా తమ తమ దైనందిన నిత్య భోజన, నివాసాది అవసరాల కోసం గృహస్థుమీద ఆధారపడవలసిందే. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికీ, దైవ కార్యాచరణకూ కేవలం భార్య ఉన్న గృహస్థుకు మాత్రమే అధికారం వుంది. గృహస్థునుండి స్వీకరించిన భిక్షే సన్యాసులకూ, బ్రహ్మచారులకూ భోజనం.
‘అతిథిసేవ’. అతిథి అనగా తిథి, వార, నక్షత్రాలు, వారం, వర్జ్యం ఏవీ చూడకుండా అనుకోకుండా వచ్చేవాడు అని అర్థం. అతిథిని మర్యాదగా ఆహ్వానించి, తనకు కలిగినంతలో అతనిని సకల మర్యాదలతో సేవించడం గృహస్థుయొక్క ప్రధాన విధి.
అతిథులను ఆహ్వానించడం, వారిని సేవించడం భారతీయ జన జీవన దైనందిన వ్యవహారంలో ఒక ముఖ్య భాగంగా ఉండేది. ‘అతిథిసేవ’ను ప్రతి భారతీయుడూ ఒక కర్తవ్యంగా, ఒక వ్రతంగా ఆచరించేవాడు. మన పురాణాల్లో, ప్రబంధ వాఙ్మయంలో ఈ అతిథి సేవా పరాయణతను ఒక తప్పనిసరి వ్రతంగా ఆచరించి పాటించిన పుణ్యాత్ములు కొందరు మనకు కన్పిస్తారు. 15వ శతాబ్దంలో విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ అన్న ప్రబంధంలో విష్ణుచిత్తుని కథ వుంది. విష్ణుచిత్తుడు విష్ణ్భుక్తుడు. గోదాదేవికి పెంపుడు తండ్రి. ఋతువులతో సంబంధం లేకుండా సర్వకాలాలోనూ ఆయన అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆయన ఇంట నిత్యం అతిథులకు అన్నసంతర్పణ నిరాఘాటంగా, నిరంతరాయంగా సాగుతూ ఉండేది. ఆ ప్రబంధంలో విష్ణుచిత్తుని అతిథి సత్కార వర్ణన ఉంది. ఆయన ఇంటికి అర్థరాత్రి వెళ్లినా హరిభక్తి భజనలూ, ప్రవచనాలూ, విష్ణుకథా చర్చలే వినబడేవట. అన్నం వేడిగా వుందా, కూరలు లేవు, పులుసు చల్లారిపోయింది- ఇలాంటి మాటలు వినబడేవి కావట. కుంభవృష్టిగా వర్షాలు కురిసి కట్టెలు తడిసి, పొయ్యిలు మండక తాను ఇబ్బందులు పడుతున్నా సరే అతిథులకు మాత్రం వేడి వేడి భోజన పదార్థాలు వండి సిద్ధం చేయించి అతిథులను సంతృప్తిపరచి పంపేవాడట. ఇదీ అతని వ్రతం. ఇదీ విష్ణుచిత్తుని అతిథిసేవా తత్పరత.
అతిథి సేవ ఆర్ష సంస్కృతిలో ఒక అంతర్భాగం. అతిథి సేవా ధర్మాన్ని ఆచరించడానికి తాను ఎన్ని కష్టాలు పడినా వెనుదీయలేదు ఆనాటి భారతీయుడు. శ్రీనాథుడు రచించిన హరవిలాసంలో ‘సిరియాళుని కథ’ ఉంది. సిరియాళుని తండ్రి చిరుతొండ నంబి శివభక్తుడు. అనునిత్యం శివభక్తులైన జంగమదేవరలను అతిథులుగా తన ఇంటికి ఆహ్వానించి వారిని పూజించి భోజనం పెట్టి తృప్తిపరచిగానీ తాను భోజనం చేయడు.
అతని శివభక్తిని పరీక్షించడానికి సాక్షాత్తూ పరమశివుడే పార్వతితో మాయాజంగముడై అతని ఇంటికి అతిథిగా వచ్చాడు. వస్తూ అత్యంత కఠినమైన షరతులు పెట్టాడు. అతని కన్న కొడుకునే చిరుతొండనంబి, అతని భార్య ఇద్దరూ కలిసి స్వహస్తాలతో చంపి, అతని మాంసంతో వండిన భోజనం పెడితేనే వస్తానన్నాడు. అన్నిటికీ ఒప్పుకుని చిరుతొండడు జంగముని ఆహ్వానించి ఇంటికి తీసుకువచ్చాడు. మరొక వంక పార్వతి పచ్చి బాలెంతరాలి రూపంలో పసిబిడ్డతో వచ్చి తిరువెంగనాంబిని తన బిడ్డకు పాలు పొయ్యమని యాచిస్తుంది. ఇలా ఎన్ని విధాల పరీక్షించినా ఆ దంపతులు తమ బిడ్డడైన సిరియాళుని చంపి ఆ శివయోగికి ఆహారంగా వడ్డిస్తారు.
చివరికి బిడ్డలు లేని నిర్భాగ్యులింట నేను భోజనం చేయను అని ఆ శివయోగి మీ బిడ్డడ్ని పిలవంటాడు. చివరకు తూర్పు దిక్కుకు తిరిగి పిలువగానే సిరియాళుడు సజీవుడై పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదీ చిరుతొండనంబి అతిథి సత్కారదీక్ష.
ప్రపంచ దేశాలలో భారతదేశం, భారతీయ సంస్కృతి అత్యంత ఉత్తమమైనది, ఉన్నతమైనది. ఆ సంస్కృతి మూలాలు భారతీయుల ధార్మిక కుటుంబ జీవనంతో ముడిపడి ఉన్నాయి. తరతరాలుగా, యుగ యుగాలుగా సాగుతున్న ఈ అతిథి సేవా సంస్కృతి ఆచరణను భావితరాలకు కూడా ఒక సద్ధర్మాచరణంగా అలవాటు చేయగలగాలి.

-సూరికుచ్చి బదరీనాధ్