మంచి మాట

మేలి పలుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతికి సమత్వం, మానవత్వం మూలబలాలు. సంప్రదాయం, కలిసి జీవించటం, సహనం, భిన్నత్వంలో ఏకత్వం వంటి మంచి లక్షణాలు మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్నాయి. మనిషి సంఘజీవి కనుక సాటివారితో సహజీవనం నెరపటానికీ, మనుగడని సుఖమయం చేసుకోవడానికీ- మానవీయ విలువల పాటింపు అనూచానంగా వస్తున్నది. పరుల మేలు కోరటం, సంఘ శ్రేయస్సుకు అందరితో కలిసి నడవటం పరమ ధర్మపథంగా చెప్పబడింది. కోటి ధర్మగ్రంథాల సారమంతా అర్థశ్లోకంలో చెబుతానని ఒక పండితుడు ‘పరోపకారం చేస్తే పుణ్యం, పరపీడన చేస్తే పాపం’ అని మరువరాని మాటని చెప్పాడు.
మనిషి జీవితంలో పరిపూర్ణత్వం సాధించటానికి సూక్తులూ, హితోక్తులూ చోదకశక్తులవుతాయి. అలాంటివాటిని మనకు వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణేతిహాసాలూ సందేశించాయి. అధర్వ వేదంలో శాన్తి ఊక్తమంతా విశ్వశ్రేయస్సుని కాంక్షించే ఉపదేశమే. ఉదాహరణకు- ఆ సూక్తంలో ప్రార్థన ఇలా ఉంటుంది. ‘ఆకాశంలో ప్రశంతత నెలకొనుగాక! భూమి శాంతిదాయమగుగాక! విశాల అంతరిక్షంలో ప్రశాంతత నెలకొనుగాక! నదులలో, స్థావర జంగమాల్లో ప్రశాంతత నెలకొనుగాక’ అని. అలాగే, సమ్మనస్య సూక్తమంతా- వ్యక్తీ సమిష్టీ మధ్య సమతుల్యని ఆకాంక్షిస్తుంది. మానవ సంబంధాల్లో మనసుల కలబోత ఆవశ్యకతనీ ప్రబోధిస్తుంది.
దీవెనలు మన సంస్కృతి ఔన్నత్యాన్ని స్పష్టంగా ప్రస్ఫుటంగా సూచిస్తాయి. సమస్త సన్మంగళాని భవన్తు, సర్వేజనా స్సుఖినోభవంతు, దీర్ఘాయుష్మాన్‌భవ, దీర్ఘసుమంగళీభవ వంటివి సామూహికంగానూ, వ్యక్తి నిష్ఠగానూ ఎంతో అర్థవంతమైనవి. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆశాభావంతో బతకాలి. ఎవ్వరికీ దుఃఖం కలుగకూడదు- వంటి భావనలన్నీ వసుధైక కుటుంబ లక్ష్యాన్ని ప్రోది చేసేవే!
మేలి పలుకుల్లో కొన్ని విధులు మనల్ని స్థిమితంగా ఉండేటట్లు చేస్తాయి. కొన్ని బాధ్యతని గుర్తుచేస్తూ ఉంటాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, సత్యంవద, ధర్మం చర, సత్యమేవ జయతే వంటి సూక్తులు వ్యక్తి మనసా, వాచా, కర్మణా అనుసరణీయాలు. గతంలోని మంచిని నిలుపుకుంటూ, వర్తమానంలో సద్భావనని కలిగి చరిస్తూ, భవితని ఉజ్జ్వలంగా ఆశిస్తూ జీవితాన్ని గడిపితే సమాజంలో సమన్వయం, సమతుల్యతను సాధింపబడతాయి. ధర్మం అందరికీ ఎల్లప్పుడూ హితకరమైనదిగా ఉండాలి. శ్రీరామాయణ యుద్ధకాండలో వాల్మీకి అంటారు- మనోవాక్కాయ కర్మలవలన కలిగే కష్టాల్ని తన సాటివారికి కలగకుండా ప్రవర్తించే జీవన విధానం ఏదైనా వున్నదో దానికి సమానమైన ధర్మం లేదు అని. అంటే మనిషి తానుగా ధర్మాచరణం చేయటమేగాక, ధర్మపరిరక్షణకు కూడా పాటుపడాలన్నమాట. అందుకే ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని అనుసరిస్తే అర్థం, కామం వాటంటతవే లభిస్తాయి అంటుంది భారతం.
భారతీయ జీవన విధానంలో భగవరాధన సూత్రం ఒక ధర్మసాధనంగా స్థిరపడి వుంది. అయితే, ఆ సూత్రానికి పటుత్వం కూర్చేది ఆత్మవత్ సర్వభూతాని అనే మేలుపలుకే! దీన్ని మాననధారలో నిలుపుకుంటే ఆచరణలో సాధించుకుంటే- మనిషి అభ్యున్నతీ, సమాజాభ్యుదయమూ వాస్తవ రూపం వహిస్తాయి.
దైనందిన జీవితంలో మనకు ఉపయుక్తమయ్యే ఎన్నో మంచి మాటలు వాఙ్మయం నిండా విస్తృతంగా కనిపిస్తాయి. అవన్నీ చిన్న చిన్న హెచ్చరికలుగానూ అందుతాయి. ఉదాహరణకి ఈశావాస్యోపనిషత్‌లో ఒక వాక్యం ఇలా అంటుంది- ‘మా గృథః కస్యస్విత్ ధనమ్’ అని. అంటే ఎవరిదో అయిన సొమ్ము గ్రహించవద్దు అని భావం. శతక సాహిత్యం కూడా ఇలాగే సులభగ్రాహ్యంగా ఉండే ఎన్నో నీతుల్ని పసిడి పలుకులుగా అందించిది. అవన్నీ క్రిందటి తరం విద్యార్థుల నాల్కలపై నర్తించి పర్యాప్తి పొందాయి. ఇప్పటివారిలో అవి సకృత్తుగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇక భగవద్గీతలో ఎన్నో ధర్మసూక్ష్మాలు, ధైర్యోద్బోధకమైన వాక్యాలూ మనకు కనిపిస్తాయి.

- విహారి