మంచి మాట

కోపము - నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు శతక కర్త నుడివినట్లు, మనిషికి- తన కోపమె తనకు శత్రువు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వాక్రుచ్చినట్లు ‘‘ఈలోకంలో, ఐహిక విషయాలనే ప్రాథమికంగా ఆలోచించే వ్యక్తికి, వాటిమీద ఆసక్తి బాగా కలుగుతుంది. ఇది కోరికలకు దారితీస్తుంది. కోరికలవలన కోపము, దానివలన అవివేకం కలుగుతుంది. కోపం మూలంగా అవివేకం, అజ్ఞానం పెరిగి, మతిభ్రమణం, మతిమరుపు, బుద్ధి నాశనం సంభవిస్తాయి. చివరకు అది వ్యక్తి నాశనానికి దారితీస్తుంది. నిజానికి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలవలనే మనిషికి, తన జీవితంలో వేర్వేరు దశలు సంప్రాప్తిస్తాయి. పురాణేతిహాసాలలో వేర్వేరు వ్యక్తులకు తమ తమ పరిసరాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి క్రోధావేశాలు కలిగినట్లు ఈ క్రింద చెప్పిన ఉదాహరణలను బట్టి తెలుస్తుంది. మహాభారతం నాటి చివరి రోజులలో పరీక్షిత్తు మహారాజు (అభిమన్యుడు - ఉత్తరల కుమారుడు) వేటకై అరణ్యానికి వెళ్లి, ఒక మునీశ్వరుడి ఆశ్రమానికి చేరతాడు. తపోనిష్ఠవలన కళ్లు మూసుకొని ధ్యానం చేసికొంటున్న తాపసి తన రాకను లక్ష్యపెట్టలేదని కోపంతో, పక్కన ఉన్న చనిపోయిన పాముని ఆయన మెడలో వేసి వెళ్లిపోయాడు. ఇక్కడ పరీక్షిత్తు కోపానికి కారణం అహంకారం. తనంతటి మహారాజుని తాపసి పట్టించుకోలేదని క్షణికావేశానికి గురై, కోపానికి బానిసయ్యాడు పరీక్షిత్తు. తరువాత మునీశ్వరుడి కుమారుడి శాపంవలన తక్షకుడనే విష సర్పపు కాటుకు బలైపోయిన పరీక్షిత్తు వృత్తాంతం కోపంవలన కలిగే దుష్పరిణామానికి తార్కాణం.
కొంతకాలం క్రితం భారవి అని ఒక మహాకవి ఉండేవాడు. కవిత్వంలో కొత్త పుంతలు తొక్కిన అతనిని ఆ ఊరిలో ఎందరెందరో ప్రశంసించేవారు. అది వింటున్న ఆ కవికి మహదానందం వేసేది. కాని, ఇంట్లో స్వంత తండ్రి మటుకు తన పుత్రుని ప్రతిభను ఎప్పుడూ పొగడకపోగా, నలుగురిలోనూ తన కుమారుడి కవిత్వ పటిమ ఇంకా రాటుదేలాలంటుండేవాడు. దానితో ఎప్పటినుండో తండ్రి పట్ల కోపం పెంచుకొంటున్న భారవి, తన తండ్రిని మట్టుబెట్టాలని భావించి ఇంట్లో ఒక మూల నక్కి ఉంటాడు. ఈలోపల బయటనుండి ఇంటిలోనికి ప్రవేశించిన భారవి తండ్రితో తల్లి వాదనకు దిగుతుంది. అప్పుడు భారవి తండ్రి ‘‘ఓరుూ! ఇల్లాలా! భారవి కవితాపటిమ, కవితా సౌందర్యము అనితర సాధ్యము. కానీ పుత్రుని ప్రశంసిస్తే ఆయుఃక్షీణమని నలుగురిలో నేను వానిని పొగడటంలేదు. నిజానికి మన భారవి చాలా గొప్ప కవి’’ అని అంటాడు.
ఈమాటలు వింటూనే భారవి బయటకు వచ్చి, తను చేయదలచిన మహాపాపాన్ని తల్లిదండ్రులకు వివరించి తనకు తగిన శిక్ష విధించమని ప్రార్థిస్తాడు. అత్తగారింట్లో వరుసగా ఆరు నెలలు గడిపిరావడమే తగిన శిక్ష అని తండ్రి నిర్ణయిస్తాడు. ఆరు నెలలు భారవి తన అత్తగారింట క్రమంగా మానావమానాలు భరించి తిరిగి స్వగృహం చేరతాడు. ఇక్కడ తన కీర్తిప్రతిష్టలకు అడ్డుపడుతున్నాడనే కారణంవల్ల కోపం తెచ్చుకొన్నా, సంయమనం పాటించడంద్వారా తండ్రిమీద దాడి చేయడమనే పాపం చేయకుండా బయట పడ్డాడు భారవి. పూర్వం యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు ముంగిసను పెంచుకొంటుండేవాడు. ఒకరోజు తన పసిబిడ్డను ఇంట్లో వదలి భార్యతో కలిసి యజ్ఞశర్మ బయటకు వెళతాడు. కొంతసేపటి తరువాత తిరిగి వచ్చిన అతనికి ఇంటిముందర రక్తసిక్తమైన మూతితో ముంగిస ఎదురుపడుతుంది. తన బిడ్డను ముంగిస చంపి ఉంటుందని అపార్థం చేసుకున్న శర్మ ముంగిసను చంపివేస్తాడు. లోపలికి వెళ్లి చూస్తే ఆడుకొంటున్న పసిబిడ్డ, పక్కన చనిపోయి పడి వున్న నాగుపాము కన్పిస్తాయి. నిజానికి పామును చంపటం ద్వారా మాత్రమే ముంగిస నోరు రక్తసిక్తమైంది. కొంచెమైనా ఆలోచించకుండా తనలో తాను తర్కించుకోకుండా, బిడ్డమీది మోహానురాగాలతో, విచక్షణాజ్ఞానాన్ని మరచి, కోపానికి బానిసైన శర్మ, తన బిడ్డను రక్షించిన ముంగిసను కోల్పోయాడు. కోపంవలన కలిగే దుష్ఫల, దుష్పరిణామాలకు ఇదొక ఉదాహరణ.
వీటిఅన్నింటివల్లా హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించుకొని, సమస్యని విశే్లషించుకొని తన క్రోధాన్ని అదుపులోనికి తెచ్చుకోవాలని అర్థమవుతుంది.

-పొత్తూరి రాఘవేంద్రరావు