మంచి మాట

అభయజ్యోతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణావతారంలో ఈశ్వరుడే లోకంలోకి దిగివచ్చి కురుక్షేత్ర యుద్ధ పూర్వరంగంలో అర్జునునకు బుద్ధియోగం నుండి భక్తియోగం వరకు అనేక విధాలుగా యోగబోధ చేస్తాడు. తన ఐశ్వర్య రూపాన్ని ప్రసాదించి, సఖుని ఒప్పించి, నమ్మించి మోక్షార్హుణ్ణి చేయపూనుకొంటాడు పరమాత్మ.
యుద్ధవాసనలు ఉండటంవల్లనే మహోయోగియైన అర్జునుడు, ఈ జన్మలో క్షత్రియుడై జన్మించాడు. ఫలాపేక్షతో క్షత్రియ ధర్మానికి లోబడి ఎలాగూ యుద్ధం చేస్తాడు. కానీ అర్జునుడు కర్మబంధం వదలిపోవాలంటే, ఫలాపేక్ష లేకుండా యుద్ధం చెయ్యాలి. అప్పుడే జ్ఞానమార్గంలో ఈశ్వరుని చేరుకుంటాడు. ఈ విధంగా బంధ విముక్తుణ్ణి చేయాలనేదే శ్రీకృష్ణుని పూనిక. శిష్యునిపై గురువు అపార ప్రేమ అలాంటిది మరి.
ఇంద్రియ శోషణతో వ్యధ చెందుతున్న అర్జునునకు శ్రీకృష్ణుడు తిన్నగా యోగబోధ ప్రారంభిస్తాడు. బోధ చేసింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని స్వరూపుడైన శ్రీకృష్ణుడు . భగవంతుడే జగద్గురువుగా నిలిచి బోధించే ఈశ్వరుని కరుణ కనుకనే అర్జునుని కట్టడి చేసి, వివేకవంతుణ్ణి చేసింది. మానవాళి జ్ఞానోద్ధరణకై ఈ లోకంలోకి దిగిరావడమే శ్రీకృష్ణావతార విశేషం. ఏ జీవి తను చేతులు చాచినా, ఎల్లప్పుడు రక్షించడానికి సిద్దంగా వుండే స్నేహితుడు ఈశ్వరుడు. కారణం ఆయన ‘సర్వభూత సుహృదుడు’ కావటమే.
వేద చోదిత మార్గాన పయనిస్తే, స్వర్గ సుఖాలనుభవించవచ్చు. కానీ పుణ్యం తీరగానే తిరిగి రాక తప్పదు. జ్ఞాన మార్గాన్నాశ్రయించినవారు పరమేశ్వరుని పరంధామంలో శాశ్వత నివాసులౌతారు. వారు తిరిగిరారు. అర్జునుని వెలుగు మార్గానే్న ఆశ్రయించి తనలో చేరుకోమంటాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు మహావీరుడు, క్షత్రియుడు, త్రిగుణాతీతుడు కనుక సులభ సాధ్యమని భగవాన్ ఉత్సాహపరుస్తాడు. ఈ బోధ పరోక్షంగా లోకోద్ధరణకే, లోకంలోని ప్రజలకు, అర్జునకున్న యోగశక్తి ఈ లోక వాసులకు సాధ్యమా? మానవాళి దౌర్భల్యం, దైన్యం, నిస్సహాయత, నీతి మొదలైన బలహీనతలు ముక్తి సాధనకు బలైన ప్రతిబంధకాలు. ఈ అడ్డంకుల్ని తొలగిస్తే కానీ, మానవాళి సాధనలతో బంధ విముక్తం కాదు.
గీత బోధ ఫలించాలంటే మానవుని మానసిక దైన్యం, దౌర్బల్యం నశించాలి. ప్రారబ్ధ బద్ధుడైన మానవుణ్ణి, యోగసాధనార్హుణ్ణి చేయాలంటే, వానిలోని సమస్త బలహీనతల్ని తొలగించడానికి అభయ హస్తాన్ని ప్రసాదించాడు గీతలో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ అభయ వైభవాన్ని అనుభూతం చేసుకోవాలంటే ఆయన బోధలోని అంతర్యాన్ని అర్థం చేసుకోవాల్సిందే. లోకానికి ప్రసాదించబడిన శ్రీకృష్ణుని మహోన్నత పరమ పవిత్ర, కరుణాపూర్ణ, మహోజ్జ్వల అభయ జ్యోతులను మన హృదయాలలో వెలిగించుకుందాం. ఆ మహావైభవ కాంతులతో మన హృదయాల్లో చైతన్యం నింపుకొని ధ్యానం చేసుకొందాం, తరిద్దాం.
నిత్యమూ యుక్తచిత్తులై ఎవరు అనన్యచింతతో ననే్న ఉపాసిస్తారో వారి యోగక్షేమం నేను కనిపెట్టి వుంటాను. ఎంత దురాచారుడైనా, అనన్య భక్తితో నన్ను భజిస్తే, యోగ్యమైన నిశ్చయంతో ఉన్నాడు గనుక అతను పుణ్యాత్ముడే. నా భక్తుడెపుడూ నశింపడని నిశ్చయంగా తెలుసుకో మని అర్జునునితో చెప్పటం అంటే అదంతా మనకోసమే. ఎంత నిస్సహాయుడినైనా పైకెత్తగల గొప్ప ఉద్బోధ, అభయం, దైన్యం మానవ బలహీనతల్ని అప్పుడప్పుడు కలిగిస్తూ వుంటుంది. వాటిని సరిచేసుకుంటూ భగవరాధనలో వుండిన ఎడల మనిషి బలహీనతలు తొలగి ఊరట లభిస్తుంది. సత్సంకల్పంలో ఉండటం ప్రధానం. అంటే అతని భక్తి అతడ్ని పాపాల్నించి విముక్తం చేసి పుణ్యాత్ముడిని చేయడంలో శాంతి లభిస్తుంది. పాపం లేని భక్తుడికే ఆయనలో స్థానం దొరికేది. శ్రీకృష్ణుని అనుగ్రహంవల్ల మానవాళికి లభించిన మహా అభయ ప్రసాదం అది. నిర్మల భక్తితో శరణు అంటే చాలు. భక్తవత్సలుడు సందేహాతీతంగా ముక్తిని ప్రసాదిస్తాడన్న మాట సత్యం.

-పింగళి పాండురంగారావు