మంచి మాట

శ్రీవసిష్ఠగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మసంస్థాపనలో మానవుడు తన కర్తవ్యమును నిర్వహించుటకు మార్గదర్శనము చేసిన దైవ దత్తమైన ఆత్మజ్ఞాన బోధనలే భగవద్గీత మరియు వసిష్ఠగీతలు. త్రేతాయుగములో వాల్మీకి, ద్వాపర యుగములో వ్యాసుడు మనకందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆయుధములు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచములో లోక కళ్యాణమునకు ఉద్భవించిన మణిపూసలు. ఏ జీవి సోమరి కాకుండా కర్మాచరణకు మార్గమును చూపించిన గొప్ప తత్త్వరాజములు. ప్రాపంచిక విషయములపట్ల విరక్తి చెందిన అర్జునుడు యుద్ధ రంగమున ఆయుధములు విసర్జించిన సమయమున ధర్మమును నిలుపుటకు శ్రీకృష్ణ్భగవానుని నుండి వెలువడిన ఉపకరణమే భగవద్గీత.
పదహారేండ్ల వ్వన ప్రాయమున వైరాగ్య చింతనలో మునిగియున్న శ్రీరామచంద్రుని కార్మోన్ముఖుని గావించుటకు వసిష్ఠ మునీంద్రుని నుండి ఉద్భవించినదే శ్రీవసిష్ఠగీత. యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను పంపవలెనని విశ్వామిత్రుడు కోరగా పుత్రవాత్సల్యముతో దశరథుడుని మనసు అనుమతించలేదు. అదే సమయమున శ్రీరామచంద్రుడు ప్రాపంచిక రాజ్యభోగాలపై విరక్తి నొంది, తన ఉనికియే ప్రశ్నార్థకమవ్వగా సందేహాస్పదుడై హృదయ తాపముతోనున్నాడు. ఆ సందర్భమున త్రికాలజ్ఞుడైన, రఘుకుల గురువైన వసిష్ఠ మునీంద్రుని వారికి ఆత్మజ్ఞానమును బోధింపవలెనని స్వయంగా విశ్వామిత్రుడు కోరినాడు.
సకల దేవతలు, ఋషిపుంగవులు సభకు రాగా ఇరువది దినములు చేసిన తత్త్వజ్ఞాన బోధయే యోగవాసిష్ఠము. దీనినే వాసిష్ఠ రామాయణమని, శ్రీ వసిష్ఠగీతయని కూడా అందురు. దీనియందు అనేక ఆధ్యాత్మిక రహస్యములు శ్రీరామ వసిష్ఠుల సంవాదన రూపములో మనకు జ్ఞానోదయమును కలిగించును. అనేక జన్మలనుండి కోరికలు, అలవాట్లు, అభ్యాసములు, సంస్కరణలు అన్నియు కలిసి ఏర్పడినదే జన్మాంతర వాసన. ఈ వాసన మనస్సునందు ఒక భాగము. సంకల్ప వికల్పములకు, సంస్కారములకు కారణము ఈ వాసన. మానవుడు ఈ పూర్వజన్మ వాసనలనుండి బయటపడలేక అదియే సత్యమని తలచి జన్మ జన్మలకు భ్రాంతిలో పడి కొట్టుకొనుచున్నాడని తెలియజేసింది.
మోక్షమునకు మార్గము వాసనాక్షయమని తీర్మానించినది. ఈ ప్రపంచమునందలి పదార్థములన్నియు మిథ్యయని, అస్థిరములని, నశ్వరమని జీవుడు ఎపుడు తెలిసికొనుకో అపుడే వాసనాక్షయమయి ముక్తికి దారి చూపును. దృశ్య ప్రపంచములను పూర్ణముగా త్యజించి, సమస్తము మిథ్యయని భావించిన పిదప ఆశలు సన్నగిలి వాసనలు నశించును. వాసనతోబాటు మనస్సు పడిపోవును. తదుపరి అధిష్ఠానమగు ఆత్మమాత్రము శేషముగా మిగిలి జీవనకు పరమానంద నిర్వాణ స్థితిని కలుగజేసి మోక్షమున లయింపజేయును.
ఏది ఆదిలోను, అంతములోను ఉండక మధ్యలో వచ్చి చేరునో అదియే మిథ్యయని తెలియజేసింది. ధర్మసంస్థాపన కొరకు యుగయుగాన మానవ రూపమున అవతరించుటయే మహావిష్ణువు చేసిన వాగ్దానము. మానవ రూపమున అవతరించి సకల జీవులకు దశాదిశ నిర్దేశనము చేయుటయే అవతార రహస్యము. చతుర్విధ పుషార్థములను ధర్మమార్గమున పరిపూర్ణము చేసుకొను విధానమును తత్త్వజ్ఞానము మనకు విశదపరచినది. చరాచర సృష్టికి మూలకారకుడైన పరమాత్మ మానవ రూపమున శ్రీరామచంద్రునిగా అవతరించి వసిష్ఠుని నేనెవరను? ఈ ప్రపంచమేమి? ఈ సంసారమున సుఖమేమున్నది? అని వైరాగ్యముతో ప్రశ్నించుట మనకు చాలా ఆశ్చర్యమును కలిగించును. గురువైన వశిష్ఠుని ద్వారా మానవులకు సృష్టి రహస్యములు తెలియచేయుటే ఆ విధముగా ప్రశ్నించినాడు. గురువు యొక్క ప్రాధాన్యతను కూడా తెలియచేసినాడు. అహంకార రహితముగా జ్ఞానమును పొందవలెనని దీనిలోని రహస్యము. కోరికలను, ఆశలను త్యజించి ఆత్మయందు వౌనముగా ఉండుటకంటె ఉత్తమ మైనది ఏదియు లేదని బ్రహ్మ తనయుడైన వశిష్ఠుడు ప్రమాణ వాక్యములు వెలువరించినాడు.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు