మంచి మాట

శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు జీవరాశులన్నింటిలోనూ ఉత్కృష్టమైన జీవి. విచక్షణా జ్ఞానాన్ని ఎరిగినవాడు. అటువంటి మనిషి పశుప్రాయుడిగా మారడానికి కారణం నైతిక విలువలు తెలీకపోడమే. మన పౌరాణిక గ్రంథాలు మనకెన్నో మంచి విషయాలను తెలియజేసాయి. వాటి అవగాహన మనకెంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పవిత్రమైనటువంటి రామాయణ మహాభారతాలు మనకెన్నో ఉన్నతమైనటువంటి జీవన విలువలను అందిస్తాయి. ఆ గ్రంథాలు పఠించడం, వాటిని గురించి తెలుసుకోవడం మనందరకూ ఎంతో అవసరం. మంచి పుస్తక పఠనం మన ఆరోగ్యానికి, బుద్ధి వికాసానికి దోహదపడుతుంది.
వాస్తవాన్ని చూస్తుంటే మనిషి ఎంత అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తున్నాడో మనకు తెలియనిది కాదు. తెల్లవారితే ఎన్నో దురృదృష్టకరమైన అమానుష చర్యలకు మనిషి పాల్పడుతున్నాడు. విద్యనభ్యసించినా వివేకాన్ని కోల్పోతున్నాడు. ఉప్పులేని కూర ఎలా రుచి పుట్టదో అలాగే వినయం, విధేయత, సౌశీల్యం లోపించిన విద్య.. మూర్ఖత్వానే్న ఇస్తుంది. కాని ఎటువంటి సత్ఫలితాన్ని ఇవ్వదు. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్నట్లు బాల్యం నుంచి క్రమశిక్షణ అలవడకపోవడం, మంచి చెడుల విచక్షణ కొరవడడంతో ఇలా జరుగుతోంది. వెనుకటి కాలంలో పసివాళ్ళను చక్కని నీతికథల, శతక పద్యాల సుభాషితాలను బోధిస్తూ అలరించేవారు. అప్పటిలో ఆప్యాయతలకు, అనుబంధాలకు లోటు లేదు. వృద్ధశ్రమాల పేరే తెలియదు. మరి నేడు జీవన వ్యయం పెరిగి తల్లిదండ్రులకు పిల్లల ఆలనా పాలనా చూసే తీరిక లేకపోవడం ఒక బలమైన కారణం అవుతోంది. దానితో పిల్లలు వక్రమార్గాల దారిన పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి రాకుండా యువతను కాపాడవలసిన బాధ్యత మనందరిది.
పూర్వకాలంలో ఒక అబద్ధం ఆడాలంటే ఎంతో బాధపడుతూ పెద్ద పాపం చేస్తున్నట్లుగా భావించేవారు. కానీ నేటి వాస్తవంలో తెల్లవారిన దగ్గరనుంచి నోటి వెంట వచ్చేది అబద్ధమే అవుతోంది. వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అలవోకగా అబద్ధం జాలువారుతూనే వుంటోంది. ఎందుకిలా జరుగుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే సంఘంలో గౌరవం కోసం లేని పోని గొప్పలు చెప్పుకుని కాలం గడిపే రోజులుగా మారాయి. ఒకప్పుడు మనిషి కనీస అవసరాలు తీరితే చాలు గుండెమీద చేయి వేసుకుని హాయిగా సంతృప్తిగా మసలేవాడు. కానీ ఇప్పుడు ఎంత సంపాదించినా ఏదో ఒక వెలితితో, అసంతృప్తితో ఇంకా ఏదో కావాలనే తపన మనిషిలో ఎక్కువగా కన్పిస్తోంది. అష్టకష్టాలు పడినా ఆడినమాట తప్పడం ఉండేది కాదు ఒకప్పుడు. ఆనాటి హరిశ్చంద్రుడు, రాజ్యాన్ని, భోగభాగ్యాలను తరువాత కట్టుకున్న భార్యను కూడా విక్రయించి ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్రలో సత్య హరిశ్చంద్రుడిగా కీర్తింపబడ్డాడు. అలాగే కర్ణుడు పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలను బ్రాహ్మణోత్తముని రూపంలో వున్న ఇంద్రునికి ఆడిన మాట తప్పకూడదన్న నియమానికి కట్టుబడి దానమిచ్చి చరిత్రలో దానకర్ణుడుగా నిలిచాడు. అనంతామాత్యుని భోజరాజీయంలో ‘ఆవు-పులి’ కథ మనకెంతో కనువిప్పునిస్తుంది. ఇంతటి ఉదాత్తమైన కథాంశంలో ఎంతో విశిష్టత దాగి వున్నది. పశుపక్ష్యాదుల ద్వారా మంచి మాటలను మనకందించిన పూర్వ కవుల చాతుర్యాన్ని అభినందించడమే కాకుండా వారి ఆదర్శాలకు మానవులంతా వారసులుగా నిలవాలి.
మనిషి ఎలాగైనా బ్రతికేయవచ్చు అనుకోవడం చాలా పొరపాటు. మనిషి మనుగడకే అది ముప్పు తెస్తుంది. అబద్ధాల మాటలతో మోసాలు చెయ్యడం, ధనమార్జిచడం సులభమైంది. మోసం, దగా మనిషి నిత్యకృత్యాలయ్యాయి. మనసుకు మాటకు పొంతనలేనితనం ఎక్కువగా కన్పిస్తోంది. మనుషుల సంభాషణల్లో పొందిక పూర్తిగా కనుమరుగవుతున్నది. బ్రతుకుతెరువుకోసం అక్రమ కార్యకలాపాలు చేయవలసిన అవసరం లేదు. మనిషి వివేకంతో అడుగు వెయ్యడం మంచిది. అబద్ధం ఆడడం మన నైజం కాకూడదు. మనిషి సాటి మనిషితో మంచిగా మసలుకోవడం మనందరకూ శ్రేయస్కరం.

-పెళ్ళూరి శేషుకుమారి