మెయిన్ ఫీచర్

వల్మీక సంభవుడు తిరుమలగిరీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క లి మాయలలో చిక్కుకున్న మానవులను ఆ బాధలనుండి విముక్తులను చేయటానికి అవతరించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఆపద్భాంధవుడు, అనాధ రక్షకుడిగా పిలువబడుతూ కోరిన కోర్కెలను తీరుస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ వేంకటేశ్వరుడు కొలువై వుండి ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ‘‘తిరుమలగిరి.’’
తిరుమలగిరి అంటే పవిత్రమైన కొండ అని అర్థం. ఈ కొండపై శ్రీ వేంకటేశ్వరుని అవతరణతో స్వామి తిరుమలగిరీశునిగా భక్తజనులచే పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో భరద్వాజ మహాముని దక్షిణ హిందూ దేశానికి వచ్చి కృష్ణా నది ఒడ్డున వున్న కొండ మీద ఘోర తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ఆయన తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలని అడుగగా ప్రజలు పరమేశ్వరుని సేవించి తరించటానికి వారి ఇలవేల్పు అయి సంరక్షించటానికి మీ అంశను ఈ సమీపంలోగల పవిత్ర పర్వతంపై నిలిపి, ఆ పర్వతం దగ్గరలో నీటి ప్రవాహం ఏమీ లేనందున నిర్మలశుద్ధ జల తరంగిణిని కూడా ఏర్పాటుచేయమని కోరాడు భరద్వాజుడు.
స్వామి వెంటనే తిరుమలగిరిపై మహాతేజస్సుతో అఖండ శిలారూపంలో స్వయంభువుగా వెలిసారు. స్వామివారు వల్మీకం కలిసి ఏకశిలా రూపంలో వుండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ పుట్టలో ఆదిశేషుడు అన్నివేళలా నివసిస్తూ శ్రీనివాసునికి తల్పముగా వుంటూ స్వామి సేవలో నిమగ్నమయ్యాడు.
ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ద్వాదశ నామాలతో పుట్టలో శిలారూపంలో వుంటూ దక్షిణాభిముఖంగా వుండటం ఈ ఆలయం యొక్క మరొక విశిష్టత. సకల చరాచర జీవులకు ప్రాణాధారమైన జలం ఈ క్షేత్రమున సహజసిద్ధమైన శ్రీ స్వామివారి వామపాదము (ఎడమ పాదము)తో వెలిసింది. అదే స్వామి పాదముద్ర ఆకృతిలో కనిపిస్తున్న కోనేరుగా మారింది. శ్రీపాద పుష్కరిణిగా పిలువబడుతున్నది. ఈ కోనేరులోకి నీరు పాతాళము నుండి ఉద్భవించుతుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కోనేరులో నీటిని శిరస్సుపై చల్లుకొని పవిత్రులై కోనేరు ఎదురుగా కనిపించే శ్రీవారి పాదాలను దర్శించుకొని మనసారా నమస్కరించుకొని అనంతరం స్వామి సన్నిధికి రావటం ఆచారం.
మహిమాన్విత క్షేత్రమైన తిరుమలగిరిలో శ్రీ వేంకటేశ్వరుడు వల్మీకం రూపంలో వేంచేసి భక్తుల పాలిటి కొంగుబంగారంగా మహిమలను చాటుతున్నాడు. స్వామి ఆలయ నిర్మాణం జరగకముందు పూర్వకాలంలో కొండ చుట్టూ వున్న పచ్చిక మేపటానికి పశువుల కాపరులు ఆవులు తోలుకొచ్చేవారు.
సూర్యుడు నడినెత్తిమీద వున్న మిట్టమధ్యాహ్నం సమయంలో మేత మేస్తున్న ఆవులకు పొదుగులలో పాలు నిండేవట. పాలు చేపుకున్న ఆవులు అంబా అనే అరుపులతో పరుగెత్తుకొచ్చిన వల్మీకం రూపం వున్న స్వామివద్ద పుట్టపైకి ఎక్కి నిలబడగానే పొదుగుల నుండి పాలు వాటంతట అవే పుట్టలోకి కారిపోయేవి. ఈ వింతను చూసిన పశువుల కాపరులు వారి యజమానులకు చెప్పగా ఇది దైవ మహాత్మ్యంగా భావించి వల్మీకం రూపంలో వున్న స్వామి ఆవుపాలు ప్రీతిగా సేవిస్తారన్న విశ్వాసం కలిగింది.
ఇక్కడ మెట్ల దారిలో ఎతె్తైన గరుత్మంతుని విగ్రహం, శ్రీ ఆంజనేయస్వామివారి దేవాలయం, శ్రీ స్వామివారి పాదాలు, శ్రీ స్వామివారి పాదాకృతిలోవున్న శ్రీపాద పుష్కరిణి, నిత్యాన్నదాన సత్రం వున్నాయి. అలాగే కొండపై శ్రీ వరాహస్వామి, క్షేత్రపాలకుడైన శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం, సంతాన బిల్వవృక్షం మొదలైనవి భక్తులు దర్శించవచ్చు.
సంతానం లేని దంపతులు ఈ బిల్వ వృక్షం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణచేసి తన చీర కొంగు చింపి ఆ చెట్టుకి ఉయ్యాల ముడుపుకట్టి కోరిక తెలుపుకున్న భక్తురాలు ఏడాది తిరిగేటప్పటికి బిడ్డతోస్వామిని దర్శించుకుంటారని భక్తుల విశ్వాసం. అలాగే స్వంత నివాస గృహం లేనివారు స్వామి పట్ల విశ్వాసంతో మల్లేశ్వరస్వామికి దక్షిణ భాగంలో రాయిపైన రాయి అయిదు రాళ్ళు ఎత్తుగా పేర్చి తమ కోరికలు తెలుపుకున్న దంపతులకు స్వామి అనుగ్రహంతో ఇల్లు సమకూరుతుందని కూడా నమ్ముతారు. వివాహము జరగని భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణము జరిపిన తప్పక వారికి వివాహము జరుగుతుందని నమ్మకం. పదకొండు ప్రదక్షిణలు చేసి కోర్కెలు మొక్కుకున్న భక్తులకు తప్పక కోరిక నెరవేరునని నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకోవాలి అని చెపుతారు.
తిరుమలగిరి క్షేత్రంలో మరొక విశేషం స్వామిని పగలు మాత్రమే భక్తులు దర్శించుకోవటం. స్వామి వల్మీకం రూపంలో అవతరించారు కనుక అంతర్లీనంగా ఆదిశేషువు వున్నట్లు భక్తుల విశ్వాసం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అనగా ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి వుంటుంది. ఆ తర్వాత అర్చక స్వాములతో సహా భక్తులెవరూ కొండపై వుండరు. గర్భాలయానికి తలుపులు, ద్వార బంధాలు లేకపోవటం కూడా ఈ ఆలయం ప్రత్యేకత. రాత్రివేళలో వైకుంఠ వాసునికి పాన్పుగా వుండే ఆదిశేషువు యిక్కడ వల్మీకంగా అవతరించిన వేంకటేశ్వరస్వామిని సేవిస్తుంటారని ప్రతీతి. శ్రీ వేంకటేశ్వరునికి అన్ని పూజలు, శాంతి కళ్యాణంతోపాటు నిత్యం భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామివారికి చైత్రమాసంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆరు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామిని దర్శించుకునే భక్తులకు అర్చక స్వాములు స్వామివారి చరిత్ర మహిమలు వివరిస్తారు. ఎవరైనా భక్తులు వారి కోరికలు తీరటానికి స్వామికి మండల అనగా నలభై ఒక్కరోజులు తమ గోత్రనామాలతో పూజ చేయించుకుంటే కోరికలు నెరవేరుతాయి. స్వామి లీలలు అనేకం భక్తులను అడిగి తెలుసుకోవచ్చు. ఇటువంటి అద్భుత, మహిమాన్వితమైన ‘‘తిరుమలగిరి క్షేత్రం’’ని భక్తులు అందరు తప్పక దర్శించి శ్రీ వేంకటేశ్వరుని కృపాకటాక్షములు పొంది తరించండి.

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం