విజయవాడ

కాలం తెచ్చిన మార్పు ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చస్తే ఏ గోలా లేదు. చస్తే ఏ గొడవా లేదు. పుట్టే ప్రతివాడూ చస్తాడోయ్!’.. పాడుకుంటూ వంటింట్లోకి వచ్చిన మనవడిని ‘పొద్దునే ఆ చావు పాట ఎందుకు పాడుతున్నావురా?’ కసిరింది జానకమ్మ.
‘మన వెంకట్రామయ్య గారి నాలుగో పుత్రరత్నం భాస్కరం గారు లేరూ.. ఆయన నిన్న రుద్రరాజు గారింట్లో బోరింగ్ పంపు బాగుచేయడానికి వెళ్లారు. మార్చిలోనే మాడుపగిలే ఎండలు. అక్కడికీ ఆవిడ పాపం కొద్దిగా మజ్జిగ తాగి వెళ్లమని పిలిచిందట. మన వీర పనిమంతుడు పని పూర్తయితే గానీ ఏమీ తీసుకోనని భీష్మించుకుకుని చివరికిలా’.. బాధగా అన్నాడు బాచీ.
34 ఏళ్ల వయసు వచ్చేవరకూ పెళ్లి కాలేదు వాడికి. ఏ సంబంధం కుదరడం లేదని అన్నలు ముగ్గురూ పెద్ద పొజిషన్‌లో వుండటం వల్ల ‘ఆస్తిలో మాకు వాటా వద్దు, అంతా తమ్ముడికే’ అని చెప్పారట. అయినా ఏ ఆడపిల్ల తండ్రి కూడా పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. చివరికి ప్రతిరోజూ గుడికిపోయి ఆ దేవునితో మొరపెట్టుకుంటే.. సుందరం మాష్టారి అమ్మాయి ఉషారాణి వాడి బాధని గ్రహించి ‘నీకు నేనున్నాను బాచీ’ అన్నదట. వెంటనే గుళ్లోనే ఆమెకి మూడుముళ్లూ వేసి ఇంటికి తీసుకొచ్చాడు. రెండు పక్షాల వారూ ఈ విషయంలో ఎలాంటి గోల చేయకపోవడం విశేషం.
‘పెళ్లయిన ఏడాదికే ఒక పాప. ఇప్పుడు మళ్లీ బతకడానికి లోటు లేకుండా సొంత ఇల్లు వుంది. ఒక పోర్షన్ అద్దెకిస్తే ఎనిమిది వేలు అద్దె. పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఆర్థిక వనరు వుంది. ఇక వాడు లేని లోటు తీర్చలేనిది’ దిగులుగా అన్నాడు పార్థుడు.
ఆ సాయంత్రం వెళ్లి ఇరుపక్షాల వారిని ఓదార్చి వచ్చింది జానకమ్మ. అందరూ ఆవిడకి మనసులోని విషయాలన్నీ చెపుతారు. ఏ విషయం ఎవరు చెప్పినా గుట్టుగా వుంచుతుందని.
‘వాడికి ఆయుష్షు లేదని నలభై లోపలే పోతాడని.. మా అన్నయ్య వాడి జాతకం చెప్పాక వాడి కూతుర్ని ఎలా అడగను? అందుకే వాడి పెళ్లి గురించి పట్టించుకోలేదు’ అంది దుర్గమ్మ.
‘మా ఉషకి కుజదోషముంది. అదే దోషమున్న అబ్బాయికిచ్చి దాని పెళ్లి చెయ్యాలిట. లేకుంటే చేసుకున్న వాడికి గండం. అందుకే దాన్ని చేసుకోడానికి ఎవరూ ముందుకి రాలేదు’ అంది.
‘్భస్కరం తనకు ఆయువు పెద్దగా లేదని, పోయేలోగా ఎంతోకొంత అనుభవించి పోవాలని వుందని అంటే.. అక్కడికీ మేము ఒప్పుకోలేదు అందరూ మమ్మల్ని ఆడిపోసుకుంటారని. కానీ వాళ్లిద్దరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మేం ఏమీ చెయ్యలేకపోయాం’ అంది ఉష తల్లి.
‘పెళ్లిళ్లు స్వర్గంలోనే అవుతాయట, ఎవరికి ఎవరని! కాబట్టి ఇది దైవ నిర్ణయం. మనం నిమిత్తమాత్రులం’ అని ఓదార్చి వచ్చేసింది జానకమ్మ.
మరో నెలకి వెంకట్రామయ్య గారిల్లు అమ్మేశారు. ‘ఇంటి విలువ పాతిక లక్షలని వదిలేశాం. రాష్ట్రం విడిపోయి కోటి రూపాయలైంది కదా.. మా ముగ్గురికి ఇరవై లక్షల చొప్పున. ఇక ఉషకి ఓ ఇరవై లక్షలు, నీకు ఇరవై! నువ్వు తనదగ్గరే వుండి వాడి పిల్లలని జాగ్రత్తగా పెంచు. నా వాటా డబ్బు నీ తదనంతరం వాడి ఇద్దరు పిల్లకి చెందుతాయి’ అని చెప్పారట. కాలం ఎంత మార్పు తెస్తుంది మనిషిలో!
చిన్నప్పుడు మామ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చింది. ఒక వాన రాత్రి వంటినిండా నగలతో ఒక అమ్మాయి అతని ఇంటి తలుపు తట్టిందట. తెల్లారాక ఆమెను క్షేమంగా వారింటిలో దింపి వచ్చాడట ఆ యువకుడు. పదేళ్ల తరువాత ‘కొన్ని నగలు ఆమెనడిగి తీసుకుంటే బాగుండేదని.. మరో పదేళ్లకి ఆ అమ్మాయిని ఆ రాత్రి అనుభవించి వుంటే బాగుండేదని..’ ఇలా ఆ యువకుని మదిలో కాలం అనేక మార్పులు తెచ్చింది!
‘ప్రస్తుతం భాస్కర్ అన్నలు కూడా అలాగే..’ అనుకుంటూ నిట్టూర్చాను.

- అపర్ణా దీక్షిత్,
విజయవాడ.

మనోగీతికలు

జ్ఞాపకాల వసంతం
వేకువలో శుకపికముల
కువకువలు
భూపాల రాగాలై భువనమంతా
ప్రతిధ్వనిస్తున్నాయి
కలకల కోకిలల కుహూకుహులు
కలికి ఆమని నవ్వుల్లా
ధ్వనిస్తున్నాయి
చిత్రరథస్వామి చైతన్య కిరణాలూ
చైత్ర రథానికి స్వర్ణకాంతులు
అద్దుతున్నాయి
శిశిరంలో నగ్నంగా మారిన
దారుశిల్పం
సుమశర మిత్రుని చూసి సిగ్గుతో
పచ్చని చిగురు చీర కప్పుకుంది
హేమంతంలో ఘనీభవించిన
మంచుబిందువు
వసంతంలో మల్లెమొగ్గలా
మురిసిపోయింది
మావిచెట్టుని అల్లుకున్న మాలతీలత
మధుమాస వేళ నవవధువులా
ముస్తాబయింది
యుగాలనాటి ఉగాదుల వైభవం
స్మృతివనంలో ఇంకా పచ్చగానే ఉంది
వర్తమానం మాత్రం వర్తకమైపోయి
వసంతం కూడా
సంతలో సరుకైపోయింది!
మనోయవనికపై వున్న
జ్ఞాపకాల చిత్రాలను
డౌన్‌లోడ్ చేసుకునే
సాప్ట్‌వేర్ ఉంటే బాగుండు..
గున్నమావి గుబురుల్నీ,
కోకిలమ్మ కూతల్నీ
గూగులమ్మ గూటిలో సేవ్ చేసి
భావితరాలకు
ఫార్వర్డ్ చేయటానికి!

- బలభద్రపాత్రుని ఉదయ శంకర్,
గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా.

చినుకుతల్లి
చిర్నవ్వు కోసం..
ప్రత్యక్ష దైవం
అగమ్య సూచకంగా
తూరుపు మేఘాలు
సింధూరం పులుముకుని
స్వాగత తోరణాలు కడుతున్నాయి
అప్పుడే జన్మించిన నెత్తుటి గుడ్డులా!
నిప్పులు కురిసే నేత్రాలు
నులుముకుంటూ
పైకి లేస్తున్నాడు బాల ప్రభాకరుడు
పూలతోటలను పులకింపజేస్తూ
పుష్పరాజాలను వికశింపజేస్తూ
సకల జీవులను మేల్కొల్పుతూ!
వయసొచ్చినకొద్దీ
భానుడి చూపులు సూదిమొనల్లా
కాల్చిన కడ్డీల్లా
అగ్గిబరాటాల్లా
భగ్గుమనిపించి
భువిపై జీవులను
బుగ్గి చేసేలా
వేటకొచ్చిన సింహంలా
భూమిపై గర్జిస్తున్నాయి అగ్నిసెగలు
ఎండలు మండుతున్నాయి
దేహాన్ని పిండుతున్నాయి
నోళ్లు ఎండుతున్నాయి
పండిన జీవులు రాలుతున్నాయి
భూమి బీటలు వారుతోంది
ఆక్సిజన్ సిలిండర్లు
వాడిపోతున్నాయి
చిగురాకులు మాడిపోతున్నాయి
సకల జీవులు ఆకాశం వైపు
ఆర్తిగా నోళ్లువిప్పి చూస్తున్నాయి
వరుణ దేవుని కరుణ కోసం
చినుకుతల్లి చిరునవ్వు కోసం
భూమితల్లి పులకరింతల
పూలజల్లు కోసం
పుడమితల్లి పరిమళాల కోసం
చిలకపచ్చని చిగురాకు కోసం
పులకరింతల పూలమాల కోసం
ఆకుపచ్చని వనాల కోసం..!

- వంగర యతేంద్రబాబు, ఐలవరం, గుంటూరు జిల్లా.
చరవాణి : 78933 53816

దుర్ముఖీ ..
వత్సరాల తోటలో
విరిసిందొక దుర్ముఖీ
పరిమళోన్మీల నవ ప్రసూనమై
అదిగో! అట
శీర్ణ శిశిరంపు ఛాయలనెల్ల క్రుంగి
వాసంత సుమ సౌరు లహరులై
పొరలుచున్నది తెలుగు వాకిళ్లయందు
తరురాజి శాఖలు స్వాగతిస్తూన్నవి
వందిమాగధ కైమోడ్పులతో
శీతల సమీరాలు మయూరాలై
లాస్యమాడుతున్నవి పారవశ్యంతో
చూత పల్లవాలు మెసవి
మత్తిల్లిన పూస్కోకిలల గళసీమల్లో
వినవస్తూన్నవి ఆమనిగీతాలు
శ్రవణానందంగా,
ఝరులు గిరులు సుందర తరులు
కురిపిస్తూన్నవి ప్రమోదాల వృష్టిని
ప్రకృతి లలన పులక రాశి అవుతూన్నది
రసానంద లోలితయై
ఇది చైత్రమాస శుభ్ర మానస
శుద్ధ పూర్ణోదయం
వివృత భావ చైతన్య సమన్విత
స్నిగ్ధ స్వర్ణోదయం
ఇట పృధ్వినలుముకొన్న
గాఢ తమిశ్రతతులు ఛిద్రమైనపోయి
క్లిష్ట నికృష్ణ ద్భుఃవశిష్ట
పరివేష్టనా సాంద్ర జీమూతములెల్ల
ఛిన్నమైపోయి
వజ్రసంకల్పులై దీక్షాదక్షులై
సిద్దాశయులై మానవతా రథారూఢులై
అధర పాత్రల్లో
దరహాసామృతం ఒలికించుకొనుచు
భవిష్యత్ కేదారాన్ని పండించుకొని
ఆనంద ఫలసాయం కోసం
ప్రతి మనిషీ ఓ కృషీవలుడై
పురోగామి పథాలనంటి
కదల బారాలి...

- డా. అవనిగడ్డ సూర్యప్రకాష్,
విజయవాడ.
చరవాణి : 8297033525

పాలిపోయే
పాలబుగ్గలు!
అమ్మభాషను ఆదమరచిరి
పసికందులకు పరాయి భాష ప్రసాదమాయె
అన్నప్రాసన నాడు ఆవకాయతో అన్నమాయె
పెద్దల బుద్ధులు మొద్దుబారె
మమీ.. డాడీ పిలుపులతో మురిసిపోయిరి
టాటా, బైబైలతో తనువు మరచిరి
మెడకు టై, కాలికి బూటుతో
తరతరాల సంస్కృతిని వీడిరి
ఎల్‌కెజి, యుకెజి మోజులో
పెద్ద బాలశిక్ష పాఠాలూ
పెదవులకు అందకపోయె
పాఠశాలల్లో ప్లేగ్రౌండ్లు లేకపోయె
ఆటపాటలు లేక ఆనందమే కరువాయె
కిలోలకు కిలోల కితాబుల మోతతో
కీళ్లు కాస్తా అరిగిపోగా
ర్యాంకుల పోటీ చదువుతో
చూపు కాస్తా మందగించగ
కంటి అద్దాలె శరణ్యమనగ
అలసి సొలసిన పసిపాపల
పట్టించకొనరైతిరి
భావి పౌరులీరీతిన ఛిద్రమగుచుండ
పట్టించుకునే వారే లేరా?

- కొలుసు శోభనాచలం,
గరికపర్రు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9951123364

ఇసకేరా
అన్నింటికి మూలం
ఇసకేగా అన్నిటికి మూలం
ఆ ఇసకలేనిదే నిర్మాణాలు శూన్యం
ఇసకను సులువుగా చూడకురా
ట్రక్కు ట్రక్కు ఇసకను కుప్పలు చేయరా
కుప్ప చేసి డబ్బులు కూడబెట్టరా
ఇసక రాశులున్నప్పుడే లక్షలు చేకూరునూ
అందుకే ఇసక విలువ తెలుసుకొని నడవరా!

వాగైనా వంకైనా ఓకేరా
కాలువైనా నదియైనా ఫరవాలేదురా
డ్యాములైనా, చెక్‌డ్యాములైనా సరేలేరా
కాలుష్యం గొడవ మనకొద్దురా
ఎవరెటు పోయినా మనకెందుకురా
వీలైతే సీనరేజ్‌లు ఎగరెయ్యరా
వీలైనంత స్విస్ బ్యాంకులో నిల్వచేయరా!
ఏదైనా ఏమైనా చేసి నీవు లీజు పట్టురా
లీజు రాకున్న రాజకీయం రగిలించుమురా
ఎవరైనా ఎదురొచ్చిన లెక్క చేయకుమురా
ధైర్యముతో తెగ దోపిడి చేయమురా
దోచేసి పెద్దమనిషిగా చలామణి కమ్మురా!

ఎల్లప్పుడు పదవిలో ఉంటేటట్లు చూసుకోరా
అది లేనప్పుడు
మన వారెవరైనా వుండేటట్లు చేసుకోరా
ఇసకే కదా అని నిర్లక్ష్యం చేయబోకురా
సోమరిగా నీవు నీ పనులు
పరులకప్పగించకురా
ఎంత నమ్మితే అంత మంచిదని నటించుమురా
అనవసరంగా అందరిని నమ్మవద్దురా
అడుగడుగున
సొంత లాభము చూసుకొమ్మురా
నమ్మకంగా నీ పనులు చక్కపెట్టుకొమ్మురా
లక్షలక్షలు కూడబెట్టిననాడే
జనం నిను గౌరవించురా
అది లేనప్పుడు నీవు గుడ్డికాసుకు లెక్కకాదురా
ఇసక ఉచితమనేది ఒక నాటకమురా
అధికారులు తనవారిని కాపాడే కపటనీతిరా!

ఉచితముగా ఏ వస్తువు వస్తుందిరా
కరెంటా? నీరా? తిండా? బట్టా? నీడా?
నిత్యావసర వస్తువులా?
ఏది ఉచిత వస్తువురా?
సరసమగు ధరకు వస్తువస్తే అది చాలురా
అన్నింటిని సామాన్యులు కొనక తప్పదురా
కొని స్థిమితంగా జీవించుమురా..!

- లక్కరాజు శ్రీనివాసరావు. అద్దంకి
చరవాణి : 9849166951

అక్షర సేద్యం
మనసును
లోతైన చాళ్లుగా దున్ని
ఎత్తుపల్లాల బతుక్కి
గొర్రు కట్టి
శ్వాస కోసం
నీళ్లు పోస్తుంటాను
మెదళ్లలో మొలుస్తున్న
కలుపు మొక్కల్ని
పీకేస్తుంటాను
అక్షరాల మెదగొట్టుడుకు
ఆనందం పొట్టకొస్తది
పాలు పోసుకున్న
గింజల్లెక్క
పదాలన్నీ నిగనిగలాడుతాయ్
వరి గొలుసుల మాదిరిగా
కవిత్వం
ఒకదాని కింద ఒకటి
పెనవేసుకుంటది
వాక్యాలను కోతలు కోసి
రసాత్మకంగా ఆరనిచ్చి
కుప్పలుగా పోస్తాను
బంతి కొట్టో
తూర్పారబట్టో
ఆణిముత్యాల్ని ఏరుకుంటాను!

- కటుకోఝ్వల రమేష్,
ఇల్లెందు, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9949083327

డబ్బెవరికి చేదు?
రామశర్మ చనిపోయి పది రోజులైంది. పనె్నండోరోజు ఆశీర్వచనం రోజున ఇంటి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంది సరస్వతి.
శర్మ బతికున్నన్నాళ్లూ ప్రతి సంక్రాంతికి అక్కలిద్దరినీ పిలిచేవాడు. రెండు ఫ్యామిలీలు పిల్లలతో సహా దిగి తమ్ముడి జేబుకి చిల్లుపెట్టి.. సినిమాలు, షికార్లు, నచ్చిన చీరలు, బావగార్లకి డ్రస్‌లు మొత్తం లెక్కచూస్తే పదివేలు పైమాటే!
‘ఇంత ఖర్చు అవసరమా?’ అని సరస్వతి విసుక్కుంటే ‘నీకు తెలియదు ఊరుకో! మా బావలు దేవాంతకులు. ఆడపిల్లకి ఆస్తిహక్కు వుందని పేచీకి దిగితే ఇంటిని మూడు వాటాలు చెయ్యాల్సిందే. వాళ్లామాట అనకుండా వుండటానికే ఈ మర్యాదలు’ అనేవాడు నవ్వుతూ.
‘ఇప్పుడు రామశర్మ లేడు. బిల్డర్‌లు వచ్చి ఇంటిని అడుగుతున్నారు’ అంది సరస్వతి.
‘మన వాటాకి మూడు అపార్ట్‌మెంట్లు వస్తాయి. అక్కకి, నీకూ, నాకూ! ఇక తమ్ముడి జాబ్ నీకిస్తానని అక్కడి అధికార్లు చెప్పారుగా. ఇక పిల్లలిద్దరికీ పెద్ద చదువులు చెప్పిస్తామని తమ్ముడి ఫ్రెండ్స్ చెప్పారు నాతో. నువ్వేమీ దిగులు పెట్టుకోకు సరస్వతీ!’ అంది పెద్దాడబిడ్డ. తెల్లబోయింది సరస్వతి ఆమె మాటలకి. వాళ్లు ఆస్తి అడగరని ఇల్లాంతా ఆయన దోచిపెట్టేశారు పాపం! మనిషి పోగానే వీళ్లలో ఎంత మార్పు?.
‘మీరు ఆస్తిలో వాటా అడగరనే..’ అంది మెల్లగా సరస్వతి.
‘తక్కువైతే వదులుకునేవాళ్లం. ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ అంటే 40 లక్షలు కదా! ఎలా వదులుకుంటాం?’ అంది చిన్న ఆడబిడ్డ.
‘డబ్బెవరికి చేదు?’.. మనసులోనే కుమిలిపోయింది సరస్వతి!

- లోకపావని, విజయవాడ.

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- అపర్ణా దీక్షిత్, విజయవాడ.