విజయవాడ

అమ్మ చెప్పింది (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మతో ఇక గొడవ పడకు’ అన్నాడు హరి.
‘ఎందుకని? అయినా, ఈమధ్య ఆవిడ చాలా వౌనాన్ని పాటిస్తున్నారు. అసలేం జరిగింది?’ కుతూహలంగా అడిగింది రమ.
‘నిన్న రైతుబజార్లో కృష్ణశాస్ర్తీ మామయ్య కనిపిస్తే మీ అత్తాకోడళ్ల గొడవల గురించి చెప్పాను. ‘ఇంక నాలుగు రోజులే నువ్వు వాళ్ల గొడవలు వింటావు’ అన్నాడు. అంటే అమ్మ..’ బాధగా అన్నాడు హరి. ‘అందుకేనా అత్తయ్య గదిలోంచి బయటకి రావడం లేదు’ అన్నది రమ. వెనుక వీధిలో భూపతిగారు చనిపోయి రెండు రోజులైంది. కొడుకులు అమెరికా నుంచి రావాలి. షామియానాలో బాక్స్‌లో కొడుకుల కోసం ఎదురుచూస్తూ ఆయన భౌతికకాయం. ఘంటసాల భగవద్గీత రెండు రోజుల నుంచి వినీవినీ హరిలో కూడా వైరాగ్యం వచ్చేసింది. శాస్ర్తీ మామయ్య చెప్పిన జాతకం విషయం అతని మనసులో మెదులుతోంది.
టివి చూస్తున్న రమ ‘వాన వచ్చేట్లుంది. డాబా మీద ఆరిన గుడ్డలు తెచ్చేయండి’ అరిచింది.
ఆరోజు ఆదివారం. ముందు గదిలో పేపరు చదువుతున్న హరి డాబా మెట్లెక్కుతున్నప్పుడే చిన్నగా గుండెల్లో నొప్పి. వాన పడుతోందని హడావుడిగా పైకి చేరేసరికి నొప్పి ఎక్కువైంది. విపరీతమైన చెమటలు. హరికి అనుమానం వచ్చేసింది. ఇది అదే.. భార్యను పిలుద్దామనుకున్నాడు. సాధ్యం కాలేదు. భగవద్గీత మైకులో వినిపిస్తోంది. ‘జాతస్వ మరణం ధృవః’ తనకి ఆఖరి క్షణాలు.. ‘మామయ్య చెప్పింది తను సరిగా అర్థం చేసుకోలేదు. ‘నువ్వు వినవు’.. అన్నాడు. అంటే పోయేది నేనేనన్నమాట. ‘శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం.. రామ నామ వరాననే’.. విష్ణు సహస్రం మనసులో చదవడం మొదలుపెట్టాడు. అమ్మ చెప్పింది చిన్నతనంలో - ‘బాధ కలిగితే ఇది చదువుకో. నీకు ప్రశాంతత లభిస్తుంద’ని. బహుశా తనకు చెప్పిన విషయం అమ్మకి కూడా తెలిసే అమ్మ వౌనంగా విష్ణుసహస్రం చదువుతూ.. ‘ఆర్తావిషణ్ణాశ్శిథిలాశ్చ్భీతాః... ఘోరేషుచవ్యాధి వర్తమానా;.. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్సుఖినోభవంతు.. కాయేనవాచా మనసేంద్రియైర్వా..’ అక్కడితో అతని శ్వాస ఆగిపోయింది. వాన పెరిగిపోయింది. బట్టలు తీసుకొస్తానని డాబా ఎక్కిన భర్త రాలేదని పైకి వచ్చిన రమ అతన్ని చూసి శిలలా నిలబడిపోయింది.
- ఎన్‌ఎస్‌పిహెచ్ చంద్రశేఖర్, విజయవాడ.

అందమైన లోకం..
‘గన్ను’ కవిత...
‘అంతరంగ’ తరంగం

కవిత్వానికీ, జీవితానికీ నిర్వచనాలను ఎన్ని చెప్పి నా - ఇంకా చెప్పవలసినవెన్నో మిగిలే ఉంటాయి. ఎందరెందరో వీటికి నిర్వచనాలు చెప్పారు. నిరంతరమూ నిరంతరాయంగా చెబుతూనే ఉంటారు. ఇది ఒక పుష్పక విమానం వంటిది. ఎవరి అనుభూతి వారిది. కరుణశ్రీ గారన్నట్లుగా ‘అనుభూతిలేనివాని వాణి - ముదుసలి మగడు తాళి కట్టిన అందాల రాణి’యే నిజంగా! కవితా పదార్థం ఏ ప్రక్రియలో ఉన్నా - స్వీకరించవలసిందే - ఎవరైనా సరే! ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ గారన్నట్లుగా ‘రెండు పంక్తులు వ్రాసినా - ఇరవై పంక్తులు వ్రాసినా సూటిగా గుండెకు తగిలితే చాలు - అది కవిత్వమే. లేకపోతే వట్టి మాటల పోగు. అలా సూటిగా గుండెకు తగిలే కవిత్వాన్ని చదివి, తదనుభూతిని పొందమన్నారు - మనవాళ్లు. ఒకవేళ సామాన్య పఠితల కోసం విమర్శకుడు విశే్లషణ చేసినా - కవితను చదివి ఆలోచనతో అవగాహన చేసుకొని, మంచిని ఆచరిస్తూ ఆనందించడమే ఆ కవితకు నిజమైన పురస్కారం అవుతుంది. గన్ను కృష్ణమూర్తి గారన్నట్లుగా ‘కవిని తూచడం కష్టమే - కారణం - అతడే ఒక తూనికరాయి!’. ఆయనే అన్నట్లుగా ‘తన కడుపులోకి తాను ప్రవేశించేవాడు - తనను తానుగా ప్రసవించుకునేవాడు కవి. ఒక్కొక్కప్పుడు పఠితకు కవిత్వం నీరైతే, కవికి ప్రాణవాయువు. ధారా శుద్ధిగల మంచినీరు వంటి కవిత - మనిషి కూడా ప్రాణాధారమే కదా ఆలోచిస్తే!
ఇంకొక దృష్టితో చూస్తే - ప్రకృతికి చెందిన వస్తువుల్లో నీరు ప్రధానమైందే గదా! ధారాశుద్ధి గల కృతి ఏదైనా - ప్రకృతితో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ప్రకృతి అంటే ఇక్కడ మానవ ప్రకృతి అని కూడా అర్థం చెప్పుకోవాలి. అటువంటి ప్రకృతితో అనుబంధం కలిగి ఉండవలసిందే ఏ కృతి అయినా. అసలు ప్రకృతిలోనే కృతి ఉంది. కృతి ఆకృతి ఉంది. అక్షరాలకు ఊపిరి ఊదే గంధర్వుడు కవియే గదా! కాబట్టే ‘నేచర్ ఈజ్ ది సిగ్నేచర్ ఆఫ్ ది గాడ్’- అని ఆంగ్ల సాహిత్యం పేర్కొందేమో! ప్రకృతిలో చెట్టు ఒక భాగమే మరి. అసలు చెట్టులేని ప్రకృతిని ఊహించగలమా? లేము గదా! అందుకే ‘మానవత్వం లేని మనిషి ఆకృతి - చెట్టు లేని ప్రకృతి’ అని ఒకచోట నేనన్నాను. ఇంతకంటే చురుగ్గా ‘మనిషి ఒక కదిలే వృక్షం. వృక్షం ఒక నిల్చున్న మహర్షి’- అని అక్షరాల ‘గన్ను’ పేల్చారు- ‘కృష్ణ’మైన ఆకర్షణీయమైన, స్ఫూర్తిమంతమైన ‘మూర్తి’తో ఒకరు. చెట్లకు పూలుంటాయి కదా! దీపాన్ని దీపం వెలుగులోనే చూసినట్లు మనిషిని అంటే మనిషి జీవితాన్ని మనిషి వెలుగులోనే చూడాలి కాబట్టి ‘సరిపోని అంగీ తొడిగినకొద్దీ చిరుగుతుంది జీవితం’ అని చూసి మరీ నిర్వచించారు ‘గన్ను’వారు. ఈ నిర్వచనం సామాన్య జనులకే కాదు, ఆశల పల్లకీలను మోసేంతకాలమూ - అనేక వర్గాల జన జీవితాలకన్నిటికీ వర్తిస్తుందనుకుంటాను. ఆశల పల్లకీలకు బోరుూలు కాని సాధారణ జనులెవరుంటారు చెప్పండీ ఈ ధాత్రిలో! జీవితంలో బాల్యం అమూల్యమైనది. ఇప్పటికి ఒక తరం ముందు వారంతా పెద్దబాలశిక్షను చదివే ఉంటారు. ఇప్పుడు చూడండి ఈ కవితాత్మక వాక్యం ఎంతగా ఆలోచనాలోచనాలను తెరిపిస్తుందో!
ఎలాగూ దేవుని ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈవిషయంలో ‘గన్ను’వారి ‘అంతరంగం’ తరంగాన్ని గమనించండి! ‘దేవుడు గుళ్లో రాయి/ మనిషి/ గుడికి పునాదిరాయి. ‘దేవుని గుడికీ, మనిషికీ అలాంటి అక్షరానుబంధం ఉందన్నమాట. భౌతికంగా ఆలోచిస్తే ఇది నిజమేకదా!
ఎనె్నన్నో మినీ కవితల్ని పండించిన గన్ను కృష్ణమూర్తిగారు కామారెడ్డి కళాశాలలో రిటైర్డ్ కామర్స్ లెక్చరర్. కానీ మొదటి నుండీ ‘కామ్’గా ఉండే వ్యక్తి కాదు. ఇటు మినీ కవితల నుండీ, సినిమా పాటల పేరడీ కవితల నుండీ, అనేక వచన పద్య కవితల నుండీ, అటు భారత- భాగవత- రామాయణ- వేదోపనిషత్తులను తమదైన గ్రహ ఖగోళ శాస్త్ర సమన్వయాత్మకమైన విమర్శ రూపమైన కన్నుతో పరిశీలించిన, పరిశీలిస్తూన్న మనీషి ఈ ‘గన్ను’. ఇంతకూ కవిత్వంతో కాగితంలా, మానవతా వ్యక్తీకరణంతో పరిమళించింది ‘గన్ను’వారి కవితా ‘అంతరంగం’ (ఒక లఘు కవితా ప్రపంచం) తరంగం!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

మనోగీతికలు ..

నీ కోసం ..
నీవు వస్తావో.. రావో!
నేను మాత్రం
కలలు కనటం కూడా మానేసి
కలవరపడుతున్నాను
విలువైన నీ సాహచర్యం కోసం
విలవిలలాడుతున్నాను

నీవు కరుణిస్తావో.. లేవో!
చంద్రకిరణం కోసం చూసే చకోరంలా
క్షణమొక యుగంగా నీకోసం
నిరీక్షిస్తూనే ఉన్నాను
నీ చరణ మంజీరాన్నై
రవళించాలని తపిస్తున్నాను

నీ కళ్లు నన్ను చూస్తాయో.. లేదో
నా కనుసైగ నీ కంటి కాటుకై
నీ కురుల చీకట్లలో కలిసిపోతుంది
నా చూపులు మాత్రం సీతాకోకచిలుకలై
నీ చుట్టూ ఎగురుతూనే ఉన్నాయి
నీకూ, నాకూ మధ్య వారధి కడుతున్నాయి

నీ పెదవులు నా పేరు ఉచ్ఛరిస్తాయో.. లేదో
నా మనసు వౌనంగా నినే్న స్మరిస్తూ
నీ హృదయ సింహాసనం అధిష్ఠిస్తుంది
నా తోటలో ప్రతి పువ్వూ నీ నవ్వును ధరించి
మరింత మకరందభరితమై
ప్రతీక్షని కూడా పరిమళింపజేస్తుంది

నా జ్ఞాపకాలలోకి జారిన ఓ అస్పష్ట రూపమా!
నీవు నా కళ్లెదుట ప్రత్యక్షమయేదెన్నడు?
శకుంతలవో.. శశికళవో..
ఊర్వశివో.. ఊహా సుందరివో..
నీటిగట్టున ఎంకి పాటవో..
ఎన్నాళ్లని వెనె్నల జ్వాలలు రగిలిస్తావు?
ఎడద దారిలో ఎడారులు పరుస్తావు?
అయినా ప్రతీ పరీక్షలో నేనే గెలుస్తాను
ఒక్క వసంతం కోసం
ఎన్ని శిశిరాలైనా వేచి ఉంటాను
ఒక శ్రావణ సమీరం కోసం
ఎన్ని గ్రీష్మాలైనా తట్టుకుంటాను
ఎందుకంటే నాది దైహిక వాంఛ కాదు
నాదొక అలౌకిక ఆనందయోగం!
బలభద్రపాత్రుని ఉదయశంకర్,
నందిగామ. కృష్ణా జిల్లా.
చరవాణి : 9494536524

మాతృభాష మాధుర్యం
అమ్మ ఒడే
తొలి బడి అందరికి
అమ్మే ఆదిగురువు అందరికి
పుట్టుకతో పలికే తొలిపలుకు అమ్మా.. అని
ఆ పలుకే తేనియలొలుకు తెలుగు పలుకు
పుట్టుకతో ఆవు పలుకు అంభా.. అని
కోయిల పలుకు కుహూ, కుహూ అని
కాకి అరుపు కావ్.. కావ్‌మని
కోడి మేల్కొల్పు - కొక్కొరోకోయని
ఇలా పశుపక్ష్యాదులు సైతం
తల్లిభాషలో సంభాషిస్తుంటే
మేధాసంపత్తి కలిగిన మనిషి మాత్రం
పరాయి భాషలో సంభాషించడం న్యాయమా?
పండు వెనె్నల్లో
ఆరుబయట విహరించినట్లు
మండు వేసవిలో
చల్లని పానీయం సేవించినట్లు
చిరుజల్లుల సమయంలో
ఇంద్రధనుస్సు అవతరించినట్లు
ఆహ్లాద సమయంలో
నెమలి పురివిప్పి నాట్యమాడినట్లు
మాతృభాషలో పఠిస్తే
సంపూర్ణ విజ్ఞానోదయమైనట్లు!
అందుకే ఓ తెలుగోడా..
మాతృభూమిని ప్రేమిస్తూ
మాతృమూర్తిని సేవిస్తూ
మాతృభాషలోనే పఠిస్తూ
మాతృభాషలోనే భాషిస్తూ
మాతృభాష మాధుర్యాన్ని చవిచూస్తూ
మంచిమనిషిగా మిగులు
మాతృ భాషాభిమానిగా కదులు!

ఆళ్ల నాగేశ్వరరావు,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 7416638823

చేతులు కాలాక...
వాడొక థర్డు జెండర్
గాలివాటంతో ఎన్నికైన ప్రజాప్రతినిధి
వాడు నోరుతెరిస్తే చేపల బుట్ట
వాడి వేషం పిట్టలదొరను తలపిస్తుంది
వాడి భాషలో సహజత్వం లోపించింది
వాడు నడుస్తుంటే భూతాలు భయపడ్డాయి
వాడు నవ్వితే ఎవ్వడిదో కొంప కొల్లేరవుతుంది

వాడి కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలి
వాడి చేతులు జనానికి వాతలు
వాడి రాతలు భట్రాజుల కోతలు
వాడి చూపులు బాధితులకు తూపులు

వాడో ఐరావతం
వాడో బుల్డోజర్
వాడో ట్రాష్ బాక్స్
చేతులు కాలాక
చేసిందేమిటో తెలిసింది
వాడి భరతం పట్టడానికి
వాళ్లంతా ఇప్పుడు
బ్యాలట్ బుల్లెట్ కోసం
ఎదురు చూస్తున్నారు!

- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
చరవాణి : 9493335150

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

సాహితీ సమాలోచన

‘మెరుపు’ ప్రయోగం
ఓ సాహసం!

తెలుగు సాహిత్యాభివృద్ధికి తొలి మెట్టు ఔత్సాహిక రచయతలకు సరైన వేదిక
ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ

ఒక తరానికే పరిమితమైన తెలుగు సాహిత్యాన్ని యువతరానికి స్ఫూర్తి నిచ్చేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రభూమి చేస్తున్న ప్రయోగమే ‘మెరుపు’ ప్రత్యేక శీర్షిక. తెలుగు పత్రికా రంగంలో మెరుపు శీర్షిక నిర్వహణ ఒక పెద్ద సాహసం అని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మెరుపు రచయితలు, కవులు, కాలమిస్టులు, కార్టూనిస్టులతో విశాఖ ఆంధ్రభూమి కార్యాలయంలో గత బుధవారం (మార్చి 1వ తేదీ) ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంవిఆర్ శాస్ర్తి తన అభిప్రాయాలను, మనోభావాలను రచయితలు, కవులతో పంచుకున్నారు. ప్రస్తుతం జనజీవనానికి దూరమైన తెలుగు సాహిత్యాన్ని బతికించు కునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పాతతరం యువతపై నాటి సాహిత్యం కలిగించిన ప్రభావాన్ని ఈ కాలపు యువతపై నేటి తెలుగు సాహిత్యం తీసుకురాలేక పోయిందని అన్నారు. యువతరంలో సాహిత్యాలాభిషను పెంపొందించేందుకు నాటి తరం సాహిత్యాభిమానులు కృషి చేయాలని, అందుకు ఆంధ్రభూమి ‘మెరుపు’ వేదికగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో కష్టానష్టాలకోర్చి సాహిత్యాభిమానుల కోసం ‘మెరుపు’ను నిర్వహిస్తున్నామని అన్నారు. రచయితలకు ప్రోత్సాహం ఇచ్చి వారి నుండి కొత్త రచనలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.
మూస కథలకు, కవితలకు పరిమితం కాకుండా ‘మెరుపు’ను సరికొత్త రీతిలో నిర్వహించేందుకు కూడా ఔత్సాహిక రచయితలు సహకరించాలని ఎంవిఆర్ శాస్ర్తి కోరారు. ముఖ్యంగా రచనల్లో కొత్తదనంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా కథలు, కథానికలు, సమీక్షలు తదితర అంశాలను పంపాలని సూచించారు.
‘మెరుపు’ ద్వారా సాహిత్యం పట్ల మక్కువ పెంపొందించడం, ఔత్సాహిక యువ రచయతలకు అవకాశం కల్పించి వారి ప్రతిభను సానబెట్టడం, వివిధ సాహితీ ప్రక్రియల్లో కొత్తతరం రచయితలను తయారు చేయడం ‘మెరుపు’ లక్ష్యమని శాస్ర్తీ పేర్కొన్నారు. రచయితలు వినూత్న ప్రక్రియలు, పోకడలను ఎంచుకుని తమలోని ప్రతిభా వ్యుత్పత్తులను చూపించాలన్నారు.
స్థానిక రచయతల సాహితీ వ్యాసంగాలు, జిల్లాస్థాయి సాహితీ సంస్థల కార్యకలాపాలకు ప్రాచుర్యం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా, ప్రాంతీయ స్థాయి రచయితలకు సమన్వయ వేదికగా ‘మెరుపు’ పేజీని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ‘మెరుపు’ ప్రయోగం విజయవంతం అయిం దని, ఉత్తరాంధ్ర రచయితల నుండి దీనికి మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ అభిమానులతో ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రొఫెసర్ డి విశే్వశ్వరం మాట్లాడుతూ భాష పట్ల మక్కువ తగ్గుతోందనీ, భాషను బతికించుకోవడం ద్వారా సాహిత్యాన్ని పదిలం చేసుకోవాలని సూచించారు. అందుకు ఆంధ్రభూమి వంటి పత్రికలు తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. కేవలం భాషా దినోత్సవం రోజునో, గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు వేడుకల్లోనో భాష ఔన్నత్యంపై ప్రసంగించి మర్చిపోయే సంప్రదాయం పోవాలన్నారు.
సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ మాట్లాడుతూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న రీతిలోనే నాటక రచనలకూ ప్రోత్సాహం అందించాలని సూచించారు. బాలల సాహిత్యం, హాస్య రచనలు పాఠకులను ఆకర్షిస్తాయని, వీటికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఈ తరం పిల్లలను సాహిత్యం వైపు మళ్లించవచ్చని సూచించారు.
రచయిత ఎ సీతారామారావు మాట్లాడుతూ రచనా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆంధ్రభూమి మెరుపు శీర్షిక ద్వారా రచనాభిమానులకు ప్రోత్సాహం లభిస్తోందని, ఇది శుభ పరిణామంగా పేర్కొన్నారు. సాహితీ అభిమానులు తరచు సమావేశమై ప్రస్తుత రచనా సరళిపై చర్చిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు.
శేషాద్రి సోమయాజులు మాట్లాడుతూ పాఠకుల అభిరుచులు మారుతున్నాయని, వారి అభిరుచులకు అనుగుణంగా రచనా శైలిని మార్చుకుని చేరువ కావాల్సి ఉందన్నారు.
మాధవీ సనారా (సత్యనారాయణ) మాట్లాడుతూ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధాన్ని టాబ్లాయిడ్ రూపంలో కాకుండా పుస్తక రూపంలో అందిస్తే అపురూపంగా భద్రపరచుకునేందుకు వీలవుతుందని సూచించారు.
రచయిత అనురాధ మాట్లాడుతూ కథలు, కవితలు రాసే ఔత్సాహికులకు మెరుపు ఒక వారధిగా పని చేస్తోందని కొనియాడారు. మిగిలిన పత్రికల్లో సాహితీ అంశాలు కనుమరుగవుతున్న తరుణంలో భాష, సాహిత్యానికి ఆంధ్రభూమి పెద్దపీట వేయడం హర్షించతగ్గ పరిణామమన్నారు.
‘మెరుపు’లో ప్రచుఠణకు స్వీకరించే కవితలు, కథలు, వ్యాసాలకు సంబంధించి ఆయా రచయతలకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలన్న రచయతల విజ్ఞప్తికి ఎంవిఆర్ శాస్ర్తి సానుకూలంగా స్పందించారు.
ఉత్తరాంధ్ర ‘మెరుపు’ సమన్వయకర్తలు బులుసు సరోజినీదేవి, దుర్గాప్రసాద్ సర్కార్ మాట్లాడుతూ రచనల నిడివికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా రచయతలకు కొన్ని సూచనలను అందించారు. కథలు వ్రాతప్రతిలో రెండు ఎ4 సైజు పేజీలకు మించరాదనీ, కవితలు పదిహేను నుండి ఇరవై పంక్తులలోపు ఉండాలని సూచించారు. అనంతరం మెరుపు శీర్షికకు రచనలు పంపే రచయితలు, కవులను ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రభూమి రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు కూడా పాల్గొన్నారు.
- ఆంధ్రభూమి బ్యూరో,
విశాఖపట్టణం
chitram...
1. విశాఖపట్టణంలో జరిగిన మెరుపు రచయతల ఆత్మీయ సమావేశం సందర్భంగా రచయిత్రి రాయవరపు సరస్వతితో మాట్లాడుతున్న
ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ. పక్కన వ్యంగ్య చిత్రకారిణి ఉప్పులూరి శ్రీదేవి వేసిన చిత్రాలను పరిశీలిస్తున్న దృశ్యం.

2. కార్యక్రమానికి హాజరైన ‘మెరుపు’ కవులు, రచయితలు

email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- ఎన్‌ఎస్‌పిహెచ్ చంద్రశేఖర్