విజయవాడ

ఎవరైతే ఏంటి? (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేవాలయం వీధి’ బోర్డు దగ్గరే రిక్షా ఆపేశాడు రిక్షావాలా. వాడితో గొడవెందుకని దిగి మా సందులో నడుస్తున్నాను. పదడుగులు నడవగానే పెద్దగా కేకలు. అందరూ ఇళ్ల బయటే నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంకొద్ది దూరం నడవగానే అర్థమైంది. ఆ గొడవ మా అమ్మవాళ్ల ఇంట్లోంచేనని. నాకు సిగ్గుతో చచ్చినంత పనయింది. అక్కడే నిలబడిపోయి వదిన, అమ్మల గొడవను అందరితో పాటు వింటుండిపోయాను రేడియో నాటకంలా!
‘నా కొడుకుని వల్లో వేసుకున్నావు. ఆ వెధవకి తల్లంటే గౌరవం లేదు. గంగిరెద్దులా అయిపోయాడు. నీ చేతిలో కీలుబొమ్మను చేసుకున్నావు. ఇప్పుడు నా కూతురు వస్తుంది. దానితో కలిసి వెళ్లిపోతాను. ఇక చచ్చినా ఇక్కడికి రాను’.. అమ్మ అరుస్తోంది.
‘మీ అమ్మ నోరు పెద్దది. మన పరువు బజారున పెడుతోంది. మీ అన్నయ్యేమో మీ అమ్మ వల్ల ఎంత అల్లరి అయిపోతున్నానోనని చెప్పుకుని బాధపడ్డాడు. ఇప్పుడు మన ఇంటి గౌరవం కూడా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో’ శ్రీవారి హెచ్చరిక గుర్తుకొచ్చింది. ‘మీ వదిన కాబట్టి మీ అమ్మ ఆగడాన్ని భరిస్తోంది. ఏడువేలు పెన్షన్ ఇస్తున్నానంటూ ఏడు చెరువుల నీళ్లు తాగిస్తోంది’ పెళ్లిలో వల్లి చెప్పిన మాటలివి.
ఇంకా కొద్దిసేపు వాళ్ల గొడవ వింటూ గేటు బయటే నిలబడ్డాను. అమ్మ నోరు రానురాను పెరిగిపోవడం, వదిన వెక్కివెక్కి ఏడవడం విన్న తరువాత ఒక నిర్ణయానికి వచ్చి వెనుదిరిగాను. సందు చివర ఆటో ఎక్కి బస్టాండుకి పోనిమ్మన్నాను. ఎవరైతే ఏంటి? అమ్మ అయినా.. అత్త అయినా వీధిలో పడేసి సంసారం పరువు తీస్తుంటే ఎలా భరించగలం?
- వేమూరి సాయిదుర్గ, విజయవాడ.

వేదిక

13, 14న సాహిత్య సభలు, శతాధిక కవి సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కవులు, రచయితలను అనుసంధానం చేస్తూ వారి సమస్యల్ని సంఘం పరిధిలో పరిష్కరించేందుకు కృషి చేయాలనే సంకల్పంతో రూపుదిద్దుకున్న ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఆవిర్భావ దినోత్సవ సభ, వేడుకలు ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడ నగరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, 13 జిల్లాలకు చెందిన ప్రఖ్యాత కవులు పాల్గొని సందేశాలిస్తారు. ఈ వేడుకల్లో రచయితల సంఘం జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొంటారు. కొత్త పుస్తకాల ఆవిష్కరణలు ఉంటాయి. ఈసందర్భంగా ప్రత్యేక శతాధిక కవి సమ్మేళనం జరగనుంది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే కవులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. జ్ఞాపిక, దుశ్శాలువా, ప్రశంసాపత్రంతో కవులను సత్కరిస్తారు. పాల్గొనాలని ఆసక్తి కలిగిన కవులు ఫోన్ నంబర్లు 9247475975, 9246415150 ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సంఘం అధ్యక్షులు సోమిపల్లి వెంకటసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారి కలిమిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.

కథ

సంఘర్షణ

ఉదయం 11 గంటలవుతోంది. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా మండుతోంది. అయినా ఆంధ్రా యూనివర్సిటీ క్యాంటీన్ సందడిగా ఉంది. ఎక్కువ జనం లేనిచోట, ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర రమ, నిర్మల కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ముఖాలను బట్టి చూస్తే వాళ్లేదో సుదీర్ఘ సంభాషణలో మునిగి ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్లు అదే యూనివర్సిటీలో ఎంఏ కలిసి చదివారు. మొదటి పరిచయంలోనే స్నేహితులయ్యారు. అభిరుచులు కూడా కలిశాయి. సాహిత్యం అంటే ఎనలేని అభిమానం. ఇద్దరూ కలిసి పుస్తకాలను గురించి చర్చించుకోవడం మొదలుపెడితే గంటలు గంటలు గడచిపోయేవి. వీళ్లిద్దర్నీ పిచ్చివాళ్ల కింద జమకట్టేవారు మిగతావాళ్లు.
ఎంఏ అయింతర్వాత రమ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేయడానికి వెళ్లింది. నిర్మల ఒక్కతే సంతానం కావడం, తల్లిదండ్రులు అంత దూరం పంపడానికి ఇష్టపడక పోవడం వల్ల ఆంధ్రా యూనివర్సిటీలోనే పిహెచ్‌డిలో చేరింది. దాదాపు రెండేళ్ల తర్వాత స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ఈ మధ్యకాలంలో రమ జీవితంలో చాలా మార్పులొచ్చాయి. ఆర్నెల్ల క్రితమే హైదరాబాద్‌లో రమకు రవితో ప్రేమ వివాహం జరిగింది. ఆ సమయంలో తండ్రి అనారోగ్యం వల్ల రమ పెళ్లికి నిర్మల వెళ్లలేకపోయింది. చాలారోజుల తర్వాత కలవటంతో స్నేహితురాలి విశేషాలన్నీ తెలుసుకోవాలని నిర్మలకి ఉత్సాహంగా ఉంది. ఆలోచనల్లో మునిగి గంభీరంగా ఉన్న రమని చూసి నిర్మల ఆశ్చర్యపోయింది. ప్రేమ వివాహం జరిగిన తర్వాత నవ్వుతూ తుళ్లుతూ ఉంటుందనుకున్న రమ నిరుత్సాహంగా ఉండడం చూసి ఏదో జరిగి ఉంటుందని అనుకుంది లోపలే.
‘రమా! ఏంటీ అలా గంభీరంగా ఉన్నావు? నీ పెళ్లి విశేషాలు, రవి కబుర్లు నాతో చెప్పాలని అనిపించడం లేదా?’ అడిగింది నిర్మల.
‘జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. చాలా కట్టుబాట్లకి మనం రాజీపడవలసి వస్తుందనుకుంటాను’ బదులిచ్చింది రమ.
ప్రేమగా రమ చేతిని తన చేతిలోకి తీసుకుని ‘అలా అనుకుంటున్నావెందుకు రమా?’ అని ఆత్రంగా అడిగింది నిర్మల.
నిర్మల వంక చూస్తూ తన మనస్సులో పడే బాధంతా స్నేహితురాలితో చెప్పకుంటే సాంత్వన లభిస్తుందని రమ చెప్పడం మొదలుపెట్టింది.
* * *
యూనివర్సిటీలో చేరిన కొద్దిరోజుల్లోనే రమకి చాలామంది స్నేహితులయ్యారు. వారిలో రవి ఒకడు. పరిచయమైన రెండు నెలలకే రవి ప్రపోజ్ చేశాడు. తనకా ఉద్దేశ్యం లేదని, అతడ్ని స్నేహితుడిగా కాకుండా మరో దృష్టితో చూడలేదని ఎంతో వినయంగా, అనునయంగా తిరస్కరించింది. దాంతో రవి అభిమానం దెబ్బతిన్నది. ఏదో ఒకరోజు రమ స్వయంగా ‘నువ్వంటే నాకిష్టం’ అంటూ తనకి చేరువ కావాలని అతను కోరుకున్నాడు. రమకి ఇష్టమైన పనులన్నీ చేసేవాడు. ఒకటి రెండుసార్లు రమ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సేవలు అందించాడు. ఆమె పట్ల ఎంతో గౌరవం, ప్రేమ చూపేవాడు. చివరికి రమ కూడా అతని పట్ల ఆకర్షితురాయింది. ప్రేమించడం మొదలుపెట్టింది. తనంతట తనే వెళ్లి ‘నువ్వంటే నాకిష్టం’ అని చెప్పేసింది ఒకరోజు. అలా ప్రారంభమైన వాళ్ల ప్రేమ కథ ‘పెళ్లి చేసుకుందాం’.. అనుకునేంత వరకు వచ్చింది.
‘ముందు నీ తల్లిదండ్రులకు చెప్పు’ అని రమని ఒప్పించాడు రవి. రమ నిర్భయంగా వాళ్ల నాన్నగారికి ఉత్తరం రాసింది. చిన్నప్పటి నుంచి రమలో ఆశయాలు, ఆవేశాలు ఎక్కువ పాళ్లలో ఉండేవి. బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని, స్వతంత్రంగా జీవించాలని కోరుకునేది. కట్నం తీసుకునేవాడిని కాకుండా, తనే కావాలని కోరుకునేవాడినే పెళ్లి చేసుకోవాలని అనుకునేది. రమ ఉత్తరం అందిన వెంటనే రవిని కలుసుకుందామని హైదరాబాద్ వచ్చారు రమ నాన్నగారు.
రవి అంటే ఆయనకి మంచి అభిప్రాయం ఏర్పడింది. అప్పటికే ఉద్యోగంలో స్థిరపడిన రవిని తిరస్కరించడానికి ఆయనకి కారణాలేమీ కనిపించలేదు. కాని స్వేచ్ఛగా పెరిగిన రమ కులాంతర వివాహం చేసుకుని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇమడగలదా! అనే ఆలోచనలో పడ్డారాయన. ‘రమా! నువ్వు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నువ్వు వెళ్లబోయే కుటుంబంలో వాళ్లు నిన్ను విశాల హృదయంతో ఆహ్వానించి, వ్యక్తిగా నీకు గౌరవాన్ని ఇవ్వలేకపోవచ్చు. అన్నివిధాలా నువ్వే అడ్జస్టు అవ్వాలని కోరవచ్చేమో’ అని సున్నితంగా హెచ్చరించారు. దానికి రమ ‘నాన్నా! నేను అన్నీ ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చాను. రవి నన్ను అన్నివిధాలా సపోర్ట్ చేస్తాడని నా నమ్మకం’ అంది. ఇక రమ దృఢ నిశ్చయంతో ఉందని గ్రహించి తన అంగీకారం తెలుపుతూ రవి తన తల్లిదండ్రులని ఒప్పిస్తే వీలయినంత తొందరలో పెళ్లి ఏర్పాట్లు చేస్తానని చెప్పి వెళ్లిపోయారాయన.
రమ, రవి యూనివర్సిటీలో కలుసుకుంటూనే ఉన్నారు. రవి తన తండ్రికి ఉత్తరం రాశానని మాటల సందర్భంలో రమకి చెప్పాడు. రోజులు గడచిపోతున్నాయి. రవి తన తండ్రి దగ్గర నుంచి రావలసిన ఉత్తరం గురించి కాని, పెళ్లి గురించి కానీ ఏమీ మాట్లాడటం లేదు. తనకేమీ పట్టనట్లు ప్రవర్తిస్తున్నాడు. చివరికి రమ ఒకసారి రవిని అడిగింది ‘ఏమిటి విషయం?’ అని. ‘వాళ్లకి మరికొంత టైమిద్దాం’ అని ముక్తసరిగా బదులిచ్చాడు. రమ ఇక ఆ విషయం ఎత్తలేదు. ఆర్నెల్లు గడిచాయి. రమ నాన్నగారు రమని పెళ్లి విషయం అడగటం మొదలెట్టారు. రమ రవిని చాలాసార్లు అడిగింది. రవి దానికి సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. రమలో అనుమానం మొదలయింది. ‘రవి నిజంగా తనని ప్రేమిస్తున్నాడా? ఎందుకు తన ప్రశ్నలకి సమాధానం చెప్పడు?’ అని మనసులో మథనపడేది. చివరికి విసుగనిపించి విశాఖపట్నంలో లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంది. వెంటనే ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్లవద్దని రవి బతిమాలాడు. రమ వినిపించుకోకుండా వెళ్లింది. ఉద్యోగం రమకే వచ్చింది. రమ ఉద్యోగంలో చేరడానికి కొంత సమయం అడిగి హైదరాబాద్ వచ్చింది. ఉద్యోగం వచ్చింది కదా వెళ్లిపోతున్నానని రవికి చెప్పింది. రవికి విషయం తెలిసివచ్చింది. పెళ్లి విషయమై తన తల్లిదండ్రులు వౌనం వహిస్తున్నారని చెప్పాడు. వాళ్లు అంగీకరించేవరకు తాను పెళ్లాడనని అన్నాడు. రమ చాలా బాధపడింది. ‘నేనే రవి స్థానంలో ఉంటే ఎదిరించి పెళ్లి చేసుకునేదాన్ని. రవి ఇంత పిరికివాడేమిటి?’ అని చాలాసార్లు అనుకుంది. తనదంటూ ఒక నిర్ణయం తీసుకోమని రవిని కోరింది. అలా కాని పక్షంలో తాను విశాఖపట్నం వెళ్లిపోతానని చెప్పింది. రమ ఇక తన మాట వినదని రవికి అర్థమైంది. వెంటనే రమ ఎదురుగానే తన తండ్రికి ఉత్తరం రాశాడు. కానీ దాన్ని రమకి చూపించకుండానే పోస్ట్ చేశాడు. రమకి బాధనిపించింది. ఎందుకంటే ధైర్యంగా తను నాన్నగారికి రాసిన ఉత్తరం రవికి చదివి వినిపించాకే పోస్ట్ చేసింది. ‘మరి రవి ఎందుకు అంత గుంభనంగా ఉంటాడు?’ అనుకుంది.
రవి తన ఉత్తరంలో ఏమి రాశాడో గాని, అతని తల్లిదండ్రులు వెంటనే రమని, రమ తండ్రిని హైదరాబాద్ వచ్చి కలుసుకుంటామని జవాబిచ్చారు. తర్వాత అందరూ కలుసుకోవడం, పెళ్లి ముహూర్తం నిర్ణయించడం జరిగిపోయాయి. తమ వివాహం చాలా నిరాడంబరంగా జరగాలని, వీలైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని రమ ఎప్పుడూ రవితో అనేది. రవి ‘అలాగే.. అలాగే’ అనేవాడు. చివరకి రవి తన తల్లిదండ్రుల ఇష్టప్రకారం వివాహం వైభవంగా జరగాలని చెప్పాడు. ఇంకా చాలాచాలా విషయాల్లో రవి తల్లిదండ్రుల ఇష్టప్రకారమే పనులు జరిగాయి. రమకి తీవ్ర ఆశాభంగం కలిగింది. ముందుముందు చాలా విషయాల్లో రాజీ పడవలసి వస్తుందేమోనని ఆమె మథనపడింది.
పెళ్లి అయిన తర్వాత బంధువులంతా వెళ్లిపోయారు. రమ, రవి తమ రొటీన్ జీవితంలో పడిపోయారు. రోజులు గడిచేకొద్దీ రవిలోని ఒక గుణం రమని కలత పెట్టసాగింది. తన స్నేహితురాళ్లతో రవి చాలా ఫ్రీగా మాట్లాడతాడు. జోక్స్ వెయ్యడం, వాళ్లని విపరీతంగా మెచ్చుకోవడం లాంటివి చేస్తాడు. రవి ప్రవర్తన రమకు అతిగా అనిపిస్తోంది. అంతేకాదు, ఒక్కోసారి రవి స్నేహితుడు మహేష్ ఇంటికి వచ్చేవాడు. మహేష్‌కి ఇంకా పెళ్లికాలేదు. హాస్టల్లో ఉండి పిహెచ్‌డి చేస్తున్నాడు. ఇద్దరూ కలుసుకున్నప్పుడల్లా యూనివర్సిటీలోని అమ్మాయిల గురించి, వాళ్ల అందచందాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తను అక్కడ ఉన్నా తన ఉనికినే గమనించనట్లు ఇద్దరూ అలా మాట్లాడుకోవడం రమలో చెప్పరాని విసుగు, బాధ కలిగించేది. మహేష్‌కి బుద్ధిలేకపోతే పోయింది, కనీసం పెళ్లయిన రవైనా అతన్ని వారించకపోగా, ఆ సంభాషణల్లో ఇష్టంగా పాల్గొనడం రమలో అసహనాన్ని కలిగించేది. అలాంటి రవి అబ్బాయిలతో రమ ఫ్రీగా మాట్లాడటం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తాడు. ఒకసారి స్నేహితుడు గౌతమ్ కోల్‌కత్తా నుంచి రమని చూద్దామని వచ్చాడు. అతను కథలు రాయడమే కాకుండా పాటలు కూడా చక్కగా పాడేవాడు. ముఖ్యంగా ముఖేష్ పాటలు అతను పాడుతుంటే రమకి మళ్లీమళ్లీ వినాలనిపించేది. రమకి పెళ్లయిందని తెలిసి వెతుక్కుంటూ ఇంటికే వచ్చేశాడు. ముగ్గురూ కలిసి కూర్చున్నారు. ఎంతసేపూ రమ, గౌతమ్ మాట్లాడుకోవడమే కాని రవి వాళ్ల సంభాషణల్లో పాలుపంచుకోవడం లేదు. అసలు అక్కడ కూర్చోవడమే ఇష్టం లేనట్టు ముఖం పెట్టాడు. రమకి చాలా బాధనిపించింది. ఎలాగో సర్దుకుని టీ తెస్తానంటూ వంటింట్లోకి వెళ్లింది. ట్రేలో మూడు కప్పుల నిండా టీ తెచ్చిన రమకి గౌతమ్ కనిపించలేదు. ‘గౌతమ్ ఏడీ?’ అని రవిని అడిగింది. ‘ఏదో పని ఉందట, వెళ్లిపోయాడు’ అని చెప్పి ఇంకేమీ అడగొద్దన్నట్లు అక్కడి ఉంచి వెళ్లిపోయాడు. రమ నివ్వెరపోయింది. రవి ఏదో అని ఉంటాడని, గౌతమ్ ఉండలేక చెప్పకుండానే వెళ్లిపోయాడని రమకి అర్థమయింది. రవిలోని ఈ ద్వంద్వ వైఖరి రమ సున్నిత మనస్సును గాయపర్చింది.
రవి తల్లిదండ్రులు కొన్నిరోజులు వాళ్లతో ఉండటానికి వచ్చారు. వాళ్లెదురుగా రవి రమతో ఫ్రీగా ఉండవాడుకాదు. వాళ్లుకూడా రమ అణకువగా ఉండాలని, వాళ్లకి కావలసినవన్నీ అందిస్తూ సేవలు చెయ్యాలన్నట్లు ప్రవర్తించేవారు. చాలా స్వేచ్ఛగా పెరిగిన రమకి ఈ వాతావరణం ఇబ్బందిగా, జైలులా అనిపించేది. పోనీలే వాళ్లు కొద్దిరోజులే కదా ఉండేది అని సరిపెట్టుకుని వాళ్లని సంతోష పెట్టడానికి ప్రయత్నించేది. అత్తమామలు ఉన్నప్పుడే రమకి ఉద్యోగం వచ్చింది. రమ ఎంతో సంతోషంతో ఉద్యోగంలో చేరింది. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన రమ.. రవి, అతని తల్లిదండ్రులు, ఆ కాలనీలో పరిచయమైన మామగారి స్నేహితుడు చంద్రశేఖర్‌గారు కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు గ్రహించింది. తన గదిలోకి వెళ్లబోతూ తన పేరు వినబడటంతో ఆగిపోయి వినసాగింది. చంద్రశేఖర్‌గారు ‘మీ కోడలు లేదా’? అని అడిగారు. దానికి రవి తండ్రి ‘ఇంకా ఆఫీసు నుంచి రాలేదు. అయినా ఆడపిల్లలకి ఉద్యోగాలెందుకు? ఇంటిపట్టున ఉండి సంసారం చక్కదిద్దుకోవచ్చు కదా?’ అని అన్నారు. దానికి రవి తనను సమర్థిస్తూ సమాధానం చెప్తాడని ఆశించిన రమకు అతని వౌనం ఆశాభంగం కలిగించింది.
* * *
ఇలాంటి సంఘటనలే ఇంకా చాలా చెప్పి, ఇక చెప్పడానికి ఏమీలేనట్లు నిట్టూర్చింది రమ. ‘నిర్మలా! నేను ఓడిపోయానని అనిపిస్తుంది అప్పుడప్పుడూ’ అని వౌనంగా ఉండిపోయింది. రమ వంకే చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది నిర్మల. ‘స్వేచ్ఛగా, నిర్భయంగా ఉండే రమ ఎంత నిరుత్సాహంగా మారిపోయింది! మనిషిలో మునుపటి చురుకుదనమే లేదు. ప్రేమ మనిషికి మత్తెక్కించి ప్రపంచానే్న మరిపించేలా చేస్తుందని విన్నానే. అలాంటి ప్రేమే సున్నిత మనస్కురాలైన రమని నీరసపరుస్తోందా?’ అనుకుంది నిర్మల. రమ ఓడిపోవడాన్ని నేను సహించలేననుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చినదానిలా.. ‘రమా! జీవితమే ఒక సంఘర్షణ. దానికి భయపడి ఎప్పటికప్పుడు రాజీపడటం పిరికివాళ్ల లక్షణం. నువ్వెన్నో ఆశయాలతో, ఆదర్శాలతో పెరిగావు. అవన్నీ సాధించుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలో తోటివారిని ద్వేషించకు. మనుషులను బంధించే కట్టుబాట్లని ద్వేషించి వాటి నుంచి వాళ్లకి విముక్తి కలిగే ప్రయత్నం చెయ్యి’ అని కర్తవ్య బోధ చేసింది. రమ నిర్మల వంక చూసింది. తనలో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తేవాలన్న నిర్మల ప్రయత్నం ఆమెకి అర్థమయింది. మనస్సులో ఏమూలో ఉత్సాహం మళ్లీ చిగురించింది. ఏదో నిర్ణయానికి వచ్చినదానిలా.. ‘నిర్మలా! నేనిక వౌనంగా అన్నీ సహించను. నాకు నచ్చని సంఘటనలు జరిగినప్పుడు నా మనస్సులో మెదిలే ఆలోచనలని వ్యక్తం చేస్తాను. జీవితంలో ఎదురయ్యే సమస్యలని ధైర్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. నా ఈ పోరాటం ఈరోజు నుంచే మొదలు’ అని దృఢంగా చెప్పింది రమ. నిర్మల నిశ్చింతగా రమ వంక చూసింది.
కొన్నిరోజుల తర్వాత రమ హైదరాబాద్ వెళ్లిపోయింది. ఒకరోజు సాయంత్రం మహేష్ ఇంటికి వచ్చాడు. యథాలాపంగా రవి, మహేష్ యూనివర్సిటీలోని అమ్మాయిల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. కొంచెం సేపు విన్న తర్వాత రమ ‘మీ ఇద్దరికీ అమ్మాయిల గురించి తప్ప మాట్లాడుకోడానికి ఇక ఏ విషయాలూ లేవా? నా ఉనికినే మర్చిపోయి ఇలా మాట్లాడుకోవడం అసలు బావుందా? నాకెలా అనిపిస్తోందోననే ఆలోచనే మీకు కలగడం లేదా? నా భావాలకి కూడా విలువనివ్వడం అవసరమని అనిపించడం లేదా? చూడు రవీ! నేను, నా స్నేహితురాలు ఇలాగే యూనివర్సిటీలో అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం మొదలుపెడితే నీకెలా ఉంటుంది? అది విని నువ్వు భరించగలవా’ అని ప్రశ్నించింది ఆవేశంగా. రమలో ఊహించని ఈ మార్పుకి వాళ్లిద్దరూ నిర్ఘాంతపోయారు. మహేష్ వెంటనే సారీ చెప్పాడు. రవి ముఖంలో కూడా ఏదో మార్పు వచ్చినట్లు రమకి అనిపించింది. తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ రమ ముందు అమ్మాయిల గురించి మాట్లాడుకోలేదు. ఈ సంఘటన రమలో ధైర్యాన్ని నింపింది. ముందుముందు సమస్యలని ఎదుర్కోగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో కలిగింది.

- శాంతిశ్రీ బెనర్జీ,
కొత్త ఢిల్లీ. చరవాణి : 9871989360

మనోగీతికలు ..

నాకై హరితం..
సతతం హరితం సహితం హరితం
సంపద హరితం సన్నిధి హరితం
సంతతి హరితం సంకటి హరితం
సర్వం హరితం సౌఖ్యం హరితం
సకలం హరితం సాధ్యం హరితం
సంపుటి హరితం సంతస హరితం
స్వచ్ఛత హరితం స్పష్టత హరితం
సత్యం హరితం స్పందన హరితం
సౌరభ హరితం సాక్ష్యం హరితం
స్వప్నం హరితం సాకార హరితం
సఫలం హరితం సుజలం హరితం
సంస్కృతి హరితం నిష్కృతి హరితం
రక్షతి హరితం రక్షణ హరితం
నాకై హరితం.. నాకో హరితం!

- కావూరి రాధాకృష్ణమూర్తి,
మచిలీపట్నం, కృష్ణా జిల్లా.

పచ్చ సంతకం
మనుషుల మనస్సు కూడలి చుట్టూరా
విషాదాల కెరటాలు తాకినప్పుడల్లా
గాయాల సమూహాన్ని లేపనంతో మానే్ప
చేతులు కావాలి!
చిరు ఆనందవీచిక కోసం ఎక్కడోనని
కళ్ల ఆరాటం సఫలం చేసే క్షణం కావాలి
బతుక్కి ఒకింత ఊరటనిచ్చే హస్తాల కోసం
సాగే చూపు అనే్వషణాయుధం
ఆశలు తీగలై అల్లుకొని పూలై విరబూసి
పరిమళాలు వెదజల్లే పూలతోటపై
దృష్టి సాగే సన్నివేశం
భావాల దేహాలు ఆవేదానాగ్ని శిఖలతో
దహింపబడుతున్నప్పుడు
జ్ఞాపకాల నెగళ్లతో
దుఃఖపు చలిని కాచుకొనే
సమయం కావాలి!
నిరాశ నిట్టూర్పుల బాధల కణాలను ఈడ్చి
ఒక తన్నుతంతే ఎక్కడో ఎగిరిపడే
మనోధైర్యమయే సందర్భంగా ఉండాలి
మనస్సు అభయరేఖగా నిలవాలి ప్రతినిత్యం
జీవితానికి ఊరటనిచ్చే ఒక చల్లని మాట కోసం
రాత్రీ పగలెరుగక ఎదురుచూసే కళ్లు
తామరపూలు!
ఎన్ని చెడు తలుపులు
గుండె ద్వారాన్ని ఆవహించినా తొలగించి
ఒక మంచితనపు కర్తవ్యానికి
సాగే కాలయాత్రలో
గంభీర మనోశక్తిమంతుడుగా
రేపటి భవిష్యత్తు ఉజ్జ్వలత్వానికి
పచ్చ సంతకం చేసి
భరోసా గీతాన్ని ఆలాపన చేయాలి!
- అంజనాశ్రీ, ఖమ్మం.
చరవాణి : 7702537453

మన్‌కీ బాత్!
కొండను తవ్వారో..
కొండనాలుక్కి మందేశారో..
130కోట్ల మంది సాక్షిగా
ఫలిస్తున్న ఆర్థిక మూలాలమీద
ఊహించని దాడి జరిగిపోయింది!
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే సంచలనం’
‘నల్లడబ్బు వెలికితీతలో సరికొత్త శకం’
ఇలాంటి ఉపమానాలు, ఊకదంపులతో
పాలకులాడిన పరాచికాలు అన్నా.. ఇన్నా..?
నవంబర్ 8 బహిరంగ వేదిక మీద
చడీచప్పుడూ లేకుండా
పెద్దనోటు రద్దయింది
పెద్దోణ్ణి పడగొట్టడానికి
చిన్ననోటు రాజయ్యింది
చితికిన బతుకుల్లో నవ్వులు పూయించడానికి
మనసులో ఉద్దేశం అదే అయితే అదే జరిగేది
ఏదిఏమైనా నల్లనీతి అంతానికి
తెల్లడబ్బుని నడిబజారున
కమీషన్‌పై అమ్మేస్తున్నారు
మేధావులు మేనిఫెస్టోల్లో వాగ్దానాల్ని
రేడియం మార్కర్లతో జిగేల్మనిపించి
గ్రాఫిక్ మాయాజాలంతో ముఖాల్ని
మార్చేసుకుంటున్నారు
లక్షల కోట్లకు
నిస్సిగ్గుగా వల్లిస్తున్న మాఫీమంత్రాలు
మారణాయుధాలై
జాతిగుండెను ఛిద్రం చేస్తుంటే
గాయాల సలపరింత ఎవరికి కనిపిస్తుంది
సామాన్యుడి గుండెఘోష
ఎవరికి వినిపిస్తుంది!

- బంగార్రాజు కంఠ,
విజయవాడ.
చరవాణి : 8500350464

స్ర్తి శక్తి
ఆగిపోకు మహిళా నువు వడివడిగా సాగిపో
అడ్డంకులు అపశ్రుతులు అవలీలగ దాటిపో
నీ జననం నీ మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు
జీవితాన వ్యక్తిత్వం యాసిడ్లకు కాలినప్పుడు
వైషమ్యం విద్వేషం నైరాశ్యం నింపినప్పుడు
నీ ఆత్మవిశ్వాసమె కవచంగా మలచుకో
కర్తవ్యం కార్యదీక్ష క్రమశిక్షణా తురగలపై
ఏ రంగములోనున్నా అంతర్గత మథనంతో
పురుషాధిక్య శృంఖలాలు తెంచుకుంటూ ఉరికిరా
చదువే నీ ఆయుధం చట్టం నీ ఆలంబన
సర్కారు చేయూత భవితనొసగే సాధికారత
అమ్మలోని త్యాగనిరతి ఆలిలోని ఆప్యాయత
బిడ్డలోని మమకారం ఆడపిల్ల అనుభూతి
ఆడదంటె అనురక్తి బతుకు పంటనిచ్చు ముక్తి
భవితకు వెలుగిచ్చు దీప్తి అలరారే ఆదిశక్తి
పురుషునికీ ప్రకృతికి లేదులేదు వైరుధ్యం
కుత్సితమగు వ్యవస్థపై పోరాటమె నీకు స్ఫూర్తి
స్ర్తి-పురుషులు సమమంటూ
వడివడిగా అడుగులెయ్!

కె దేవికారత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908706218

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. ళ్ఘౄజ: ౄళూఖఔఖ్పీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ

- వేమూరి సాయిదుర్గ