విజయవాడ

నేడు విఎంసి కౌన్సిల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 15: నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి అధికార, విపక్షాలు తమ అస్తశ్రస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు విఎంసి ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ భవనంలో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఒక ప్రత్యేక ఉంది. ప్రస్తుతం జరగబోయే కౌన్సిల్ కాకుండా మరో ఆరు సమావేశాలతో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది. మూడన్నరేళ్ల పాలనాకాలం ముగించుకున్న నగర పాలక వర్గానికి మరో 18 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ 18నెలల్లో ప్రతి 3నెలలకోసారి చొప్పున జరిగే కౌన్సిల్ సమావేశం చొప్పున లెక్కేసుకొంటే ఇంకా 6 సమావేశాలతో పాలక వర్గం పాలనాకాలం ముగుస్తోందన్న విషయంపై విఎంసిలో చర్చోపర్చలు జరుగుతున్నాయి. దీంతో ప్రజాప్రతినిధులుగా తమకు కౌంట్‌డౌన్ పీరియడ్ ప్రారంభమైనట్టు అధికార, విపక్షాల కార్పొరేటర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటి నుంచీ జరగబోయే ప్రతి కౌన్సిల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సమర్ధవంతంగా నిర్వహించాలని అధికార పక్షం, పాలకులు తీసుకొనే ఏకపక్ష నియంతృత్వ పోకడలను తిప్పికొట్టాలని విపక్షాలు వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం జరగబోయే కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరగబోయే కౌన్సిల్ సమావేశంలో పారిశుద్ధ్య చర్యలను ప్రైవేటీకరించే జీవో నెంబర్ 279 అమలుకు కీలకమైన సిటీ శానిటేషన్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుల నియామక అంశం కీలకమనే చెప్పాలి. ప్రైవేటు పారిశుద్ధ్య చర్యలతో నగర ప్రజలపై భారాలు మోపడమే కాకుండా కొన్ని దశాబ్దాల తరబడి పారిశుద్ధ్య పనులనే వృత్తిగా అంకితభావంతో పనిచేస్తున్న వేలాది మంది సిఎంఇవై, డ్వాక్రా సంఘాల సభ్యుల జీవనోపాధిపై వేటుపడే జీవో 279ను రద్దుచేయడంతో పాటు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వీరందరినీ రెగ్యులరైజ్ చేసి నూతన జీవో ప్రకారం వీరికి మెరుగైన జీతాలివ్వాలంటూ విపక్షాలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, వాటి అనుబంధ కార్మిక సంఘాలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయ. రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో 279 జీవో అమలుకు కీలకమైన సిటీ శానిటేషన్ టాస్క్ఫోర్స్ కమిటీ ఆమోదాన్ని తిరస్కరించాలని, అంతేకాకుండా జీవో 279ను రద్దు చేయాలన్న అంశంపై ప్రత్యేక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నది విపక్షాల డిమాండ్. అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీని ఈ విషయంలో ఇరుకున పెట్టాలన్నది విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. కౌన్సిల్‌లో జరిగే ప్రజాప్రతినిధుల ఆందోళనలతో పాటు కౌన్సిల్ బయట విపక్ష కార్మిక సంఘాలు కూడా తమ నిరసన తెలిపే ఆందోళనకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికార పక్షం కౌన్సిల్ లోపల, బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇదిలావుండగా కౌన్సిల్‌లో ఎలా వ్యవహరించాలి, ఏయే అంశాలపై అధికార పక్షాన్ని నిలదీయాలన్న అంశంపై కౌన్సిలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అగ్రనేతలు నగరంలోని వైసిపి కార్యాలయంలో కార్పొరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం గమనార్హం. ఇక సిపిఎం ఫ్లోర్‌లీడర్ గాదె అదిలక్ష్మి, బిజెపి ఫ్లోర్ లీడర్ బండారి ఉత్తమ్‌చంద్ కూడా కౌన్సిల్ అంశాలపై తమదైన శైలిలో స్పందించనున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు అమలులో భాగంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు గాను చేపట్టిన డైవర్షన్ రోడ్ల అభివృద్ధికి గాను రూపొందించిన అంచనాల వ్యయం 150 కోట్ల రూపాయలను మెట్రో రైల్ ప్రాజెక్టే భరాయించాలంటూ కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు అధికార టిడిపి అడుగులేస్తోంది. వాస్తవానికి ఈ ఖర్చును మెట్రో ప్రాజెక్టు కాకుండా విఎంసియే భరాయించేటట్టు, ఈ మొత్తాన్ని వివిధ ఆర్ధిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం హామీగా ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున విఎంసికి సమాచారం రావడంతో ఇప్పటికే అప్పుల ఊబిలోనే కాకుండా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న విఎంసిపై మరో 150 కోట్లను భారంగా మోపడానికి నగర మేయర్ అంత సుముఖంగా లేరన్న వాదన వినిపిస్తున్న తరుణంలో ఈ అంశంపై అన్ని పక్షాలతో కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నది నగర పాలకులు ఆలోచనగా ఉంది. ఈవిషయాలతోపాటు మరిన్ని కీలక అంశాలు చర్చకు రానున్న నేపథ్యంలో మంగళవారం జరగబోయే కౌన్సిల్ సమావేశం అధికార, విపక్షాలకు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి.

నాణ్యతా ప్రమాణాలు పాటించని
ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు
* మంత్రి గంటా హెచ్చరిక
* అవసరమైతే అనుబంధ కళాశాలల గుర్తింపు రద్దుకు ఆదేశం
విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ లక్ష్యమని, ఈ క్రమంలో నాణ్యత కొరవడిన వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైతే అఫిలియేషన్ కూడా రద్దు చేసేందుకు వెనుకాడవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాలల నాణ్యతపై ఏపి ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ నరసింహారావు ఆధ్వర్యంలో వేసిన కమిటీ పలు కళాశాలలను సందర్శించి నివేదిక సమర్పించింది. అందులో నాణ్యతా ప్రమాణాలను పాటించని 40 కళాశాలలను గుర్తించింది. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా వర్సిటీల వైస్ ఛాన్సలర్లను ఆదేశించాలని మంత్రి గంటా ఉన్నతాధికారులను ఆదేశించారు. గత మూడేళ్లుగా జీరో శాతం అడ్మిషన్లతో వౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది లేని ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉన్నత ప్రమాణాలతో బోధించే కళాశాలలతోనే విద్యార్థుల భవిష్యత్ నిర్మితమవుతుందన్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాలు జరిగేలోపు ఈ కళాశాలలపై చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కళాశాలల జాబితాను రూపొందించాలని మంత్రి గంటా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజ్, వైస్ చైర్మన్ నరసింహారావు, సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్, తదితరులు పాల్గొన్నారు.