విజయవాడ

ట్రాఫిక్‌కు అవరోధం లేకుండా వీధి విక్రేతలకు జోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 18: నగరంలోని వీధి విక్రేతలకు జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జోన్లను వర్తింపజేస్తూ, జోన్ల వారీగానే విక్రయాలు జరిగేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. గ్రీన్, రెడ్, అంబ్రిల్లా జోన్లుగా నామకరణం చేసిన స్ట్రీట్ వెండర్స్ కమిటీ సోమవారం విఎంసి కమిషనర్, కమిటీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత వీధి విక్రేతలను గుర్తించి వారికి తగు గుర్తింపు కార్డులను అందజేయడంతోపాటు వారి విక్రయాలకు జోన్లను కేటాయించి ఆ ప్రకారమే నిబంధనలకనుగుణంగా నడుచుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా సుమారు 4200 మందిని వీధి విక్రేతలను గుర్తించగా ఇప్పటివరకూ 2300 మందికి గుర్తింపు కార్డులను అందజేశారు. మిగిలిన వారిని కూడా గుర్తించి వారితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారన్న విషయంపై సమగ్ర సర్వే నిర్వహించి నమోదు చేయాలని కమిషనర్ నివాస్ సూచించారు. తోపుడుబండ్ల విక్రేతలతో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు గాను నగర వ్యాప్తంగా ఎక్కెడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలున్నాయన్న విషయంతోపాటు వారికి చూపించాల్సిన ప్రత్యమ్నాయ స్థలాలపై నగర పోలీస్ అధికారులతోపాటు నగర పాలక సంస్థ అధికారులు కూడా సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకునేలా గ్రీన్ జోన్, రెడ్ జోన్‌గా గుర్తించిన ప్రాంతంలో ఎటువంటి వీధి విక్రయాలను అనుమతించకుండా ఉండటంతోపాటు అంబరిల్లా జోన్‌లో పరిమిత రోజుల్లో నిర్దేశిత సమయంలోనే వీధి విక్రయాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషినల్ డిసి పి నాగరాజు, సిటీ ప్లానర్ బి శ్రీనివాసులు, ఇన్‌చార్జ్ సిఎంహెచ్‌ఓ డాక్టర్ బాబూ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ యుసిడి సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి, ఫ్రూట్స్ వెండర్స్ అసోసియేషన్, వెజిటబుల్ వెండర్స్ అసోసియేషన్ తదితర విక్రేతల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

‘స్వచ్ఛ’ రికార్డు భేష్!
బెంజిసర్కిల్, సెప్టెంబర్ 18: జిల్లా లో స్వచ్ఛతే సేవలో భాగంగా రికార్డు స్థాయిలో 5 లక్షల, 31వేల, 570 మంది విద్యార్థులు సబ్బుతో చేతులు కడుక్కొని వ్యక్తిగత పరిశుభ్రత పాటించారని కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15నుండి నిర్వహిస్తున్న స్వచ్ఛతే సేవలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో 10వ తరగతి వరకు చదువుతున్న 5 లక్షల, 31వేల, 570 మంది వి ద్యార్థులు భోజనాలకు ముందు సబ్బు తో చేతులు కడుగుకొని వ్యక్తిగత పరిశుభ్రత పాటించారన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని ఆయన తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో అంకితం అవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారని కలెక్టర్ తెలిపారు. విద్యార్థి దశ నుండే వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉంటే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా కాచి, చలార్చి వడపోసిన నీటిని మాత్రమే తాగే విధంగాను, విద్యార్థులకు అలవాటు చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన 33 శాతం అంటువ్యాధులు రాకుండా నివారించవచ్చునని సందేశాన్ని విద్యార్థులకు తెలిపే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.