విజయవాడ

హోదా కోసం రహదారుల దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం శాంతియుతంగా, సంపూర్ణంగా విజయవంతమైంది. హోదా కోసం బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికి రహదారుల దిగ్బంధాన్ని నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు పలికి అధికంగా హాజరయ్యారు. పదో తరగతి పరీక్షల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, కేంద్ర ప్రభుత్వం కపట నాటకాలు కట్టిపెట్టి హామీలను అమలు చేయాలని ఉద్యమకారులు నినాదాలు చేశారు.
వైకాపా ఆధ్వర్యంలో...
నగరంలోని ఐదో నెంబర్ జాతీయ రహదారిలోని కనకద్గుమ్మ వారధి వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈసందర్భంగా వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఏపీ హోదా విషయంలో నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. బాబు ప్యాకేజీకి ఒప్పుకుని, జగన్ పోరాటం నేపథ్యంలో ప్రజల వ్యతిరేకత గమనించిన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు వైఖరితోనే ఏపీకి హోదా రావడం లేదన్నారు. నాలుగేళ్లుగా మోసం చేస్తున్న బీజేపీ, టీడీపీకి ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. అంతకు ముందు వైకాపా నేతలు నగరంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కార్యదర్శి ఆసిఫ్, నాయకులు దుర్గారావు, రామిరెడ్డితో పాటు వీఎంసీ వైకాపా కార్పొరేటర్ల తదితరులు పాల్గొన్నారు.
ఏపీసీసీ ఆధ్వర్యంలో..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గురువారం నిర్వహించిన జాతీయ రహదారులు దిగ్బంధన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. ఏపీసీసీ ప్రచార కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీతో పాటు నాయకులు ఇందిరా, జువేదాతో పాటు పలువురు పాల్గొన్నారు. వీరితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని, హోదా కోసం నినాదాలు చేశారు.
వామపక్షాల ఆధ్వర్యంలో...
ప్రత్యేక హోదా సాధన కోసం నిర్వహించిన జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. నగరంలోని కనకదర్గమ్మ వారధి వద్ద సీపీఐ, సీపీఎం, జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, పీ మధుతో పాటు సినీ హీరో శివాజీతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. హోదాను అడ్డుకుంటున్న ప్రధాని మోదీకి బుద్దిచెబుతామని హెచ్చరించారు. హోదా కోసం ఒక్కసారిగా ప్రజలు రహదారిపైకి రావడంతో నిలువరించడం పోలీసులకు కష్టమైంది.