విశాఖ

‘తెలుగు’కు పూర్వ వైభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 5: తేనెలొలుకు తెలుగు భాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశం జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జీవం పోసేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, రాష్ట్రంతో పాటు తెలుగు మాట్లాడే ప్రజలు అత్యధికంగా నివసించే ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక పాలనా పరంగా ప్రభుత్వం తరఫున జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు తెలుగులోనే జారీ అయ్యేవిధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఎఎస్ అధికారులు తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. తెలుగు సంస్కృతి, కళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే కృష్ణ, గోదావరి పుష్కరాల్లో రాష్ట్రంలో పలు సంస్కృతులు, కళలు ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి వెలుపల ఉన్న తెలుగు వారు భాషాభివృద్ధికి చేస్తున్న కృషిలో కొంతైనా తెలుగు ప్రజలు పాలు పంచుకోవాలన్నారు. పాఠశాలల్లో తెలుగు జాతి గర్వించతగ్గ కవులు, పండితులు, కళాకారులు, మహానీయుల కథలను వివరించాలన్నారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ భాష అంటే ప్రాణమిచ్చే ఇతర రాష్ట్రాలకు తీసిపోని విధంగా మన భాషాభిమానులు తెలుగును రక్షించేందుకు ఉపక్రమించాలన్నారు. ఇదే సందర్భంలో తెలుగు భాష సంకరమైపోయిందని, తెలుగు, ఇంగ్లీషు మేళవించిన ఉచ్ఛారణ ఆవేదన కల్గిస్తోందన్నారు. తెలుగు భాషను స్థిరీకరించేలా ప్రసార మాధ్యమాలు పనిచేయాలన్నారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగులో చదువుకుంటే ఇంకెక్కడా పనిచేయలేమన్న భయాందోళనలే భాషా నిర్లక్ష్యానికి కారమణమని అభిప్రాయపడ్డారు. అంతర్జాలంలో ఆంగ్ల భాషతో పాటే తెలుగు ఉండేలా సాంకేతికతను అందిపుచ్చుకునేలా చూస్తామన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ ద్వారా కళాకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసుందుకు జిల్లా కలెక్టర్లు, డిపిఆర్‌ఓలకు ఆదేశాలిస్తామన్నారు. రాష్ట్రంలో 6,500 మంది కళాకారులకు రూ.1,500 చొప్పున పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు మరణించి ఉన్నట్టైతే ఏర్పడే ఖాళీల్లో కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జెడ్పీ సిఇఓ జయప్రకాష్ నారాయణ, సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు.